Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 16


    ఆయన సమాధానం చెప్పలేదు. కనీసం తలెత్తి కూడా చూళ్ళేదు. మరో నిముషం సమాధానం కోసం చూసి మరోసారి "సర్ నేను వెళ్ళోస్తానండీ! రేపు మళ్ళీ వస్తాను" అన్నాడు మెల్లిగా.

    రాసుకుంటూనే తల ఆడించాడు ఆయన. మెల్లిగా బయటికి వచ్చేశాడు. రోడ్ మీదికి వచ్చి బస్ స్టాప్ దగ్గర ఉన్న కిళ్ళీ కొట్టుదగ్గర కూల్ డ్రింక్ తాగాడు. డబ్బులిస్తూండగా బస్ లోంచి దిగింది దీప. తలవంచుకుని తిన్నగా ప్రొఫెసర్ గారి ఇంటివైపు వెళ్ళిపోయింది.

    మర్నాడు లేట్ గా వెళ్ళాడు ప్రొఫెసర్ గారు బర బరా రాసేసుకుంటూ ఉండగా అతను ఎదురుగా కూర్చొని ఉండగా, మెల్లిగా లోపలికి వచ్చింది దీప. తిన్నగా వచ్చి అతని పక్క కుర్చీలో కూర్చుంది.

    ఓరకంట చూసాడు మోహన్. దగ్గర్నుండి చూస్తుంటే మరింత అందంగా ఉంది. ఈవిడని ఎదురుగా నిలబెడ్తే క్లోరో ఫాం ఇవ్వకుండానే ఆపరేషన్ చేసెయ్య వచ్చు డాక్టర్లు డే లైట్లో బాంక్ రాబరీకి వెళ్ళే దొంగలు ఈవిడని వెంటబెట్టుకు  వెళ్తే బాంబులు, రివాల్వర్స్ లేకుండానే పని చక్క బెట్టుకోవచ్చు. బిజీ సెంటర్ కి ట్రాఫిక్ ఐలెండ్ మీద ఈ అందాల బొమ్మని నిలబడితే జనాభా సమస్య రెండ్రోజుల్లో తీరిపోతుంది.

    ఓరకంట ఒక్కసారి చూసి అందంగా నవ్వేసి న్యూక్లియర్ బాంబులు మనకొద్దు అంటే ప్రపంచానికి బెడద ఉండదు.

    ఒక్కసారి ఇటు చూస్తే బాగుండు పలకరింపుగా నవ్వి పరిచయం చేసుకుందాం అనుకున్నాడు. కానీ  దీప మాత్రం ఇతన్ని గమనించకుండా మరో కాగితాల ఫైల్తీసుకుని అందులో బరాబరా రాసేయటం మొదలు పెట్టింది.

    తోమిదిన్నర దాకా యిద్దరూ తలెత్తకుండా రాసేశారు. ఆ తరువాత లేచి నవ్వుతూ పలకరించాడు పృధ్వి.

    "మోహన్ మీట్ మై అసిస్టెంట్ మిస్ దీపిక. వెరీ ఇంటలిజెంట్ అండ్ డీ సెంట్ గాళ్" అని పరిచయంచేశాడు. వినయంగా నమస్కరించాడు అతను.

    "దీపా హీఈజ్ మిస్టర్ మోహన్ ఏదో పనుండి వచ్చాడట" అన్నారు.

    పలకరింపుగా నవ్వింది దీప. నా జన్మ ధన్యం అనుకున్నాడు" మోహన్.

    అలవాటు ప్రకారం ప్రూట్ జ్యూస్ తాగాక "యిప్పుడు చెప్పు! ఎందుకొచ్చేవు?" అని ప్రశ్నించారు పృథ్వి.

    ఏం చెప్పాలో అర్థంకాలేదు మోహన్ కి. ఒక్క క్షణం ఆలోచించి "నాకు ప్రోఫెసర్లంటే బోలెడంత గౌరవం అండీ మా తాతగారికి ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ వుండేవారు ఆయన గురించి తాతగారు ఎప్పుడూ చెప్తూ వుండేవారు. ప్రొఫెసర్లతో స్నేహం చేస్తే ఎంతో లాభం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అంటూవుండేవారు. అప్పట్నించి నాకూ అలా ప్రొఫెసర్ గారితో పరిచయం చేసుకోవాలని కోరిక యిలా తీరింది. మొన్న ఈ దారిన వెళ్తూ బోర్డు చూసి  యిలా వచ్చాను.

    హుందాగా తల  పంకించేరుఆయన ఓ అలాగా! చాలా సంతోషం. మరి పరిచయం అయిందికదూ! ఇహ వెళ్ళిరా!" అన్నారు.

    గతుక్కుమన్నాడు మోహన్. అదిలోనేహంసపాదు వెంటనే తెలివి తెచ్చుకుని.

    "అది కాదుసార్! మొదట్లో మీతో పరిచయం మాత్రమే  చాలనిపించింది. కానీ   మిమ్మల్ని చూశాక  మీతో స్నేహం చేయాలనిపిస్తోంది. కాబట్టి నేను రోజూ యిలాగే వస్తానండీ! అన్నాడు.

    కొంచెం చిరాగ్గా  చూశారాయన. "చూడబ్బాయ్!ఐయాం వెరీ బిజీ  పర్సన్. ఏదో ఓ రోజుకి అంటే  ఫర్వాలేదు గానీ రోజూ నిన్ను ఎంటర్ టెయిన్  చెయ్యాలంటే  ఇటీజ్ ఇంపాజిబుల్  ఫర్ మీ!" ఖచ్చితంగా చెప్పేశాడు.

    మరింత కంగారుపడ్డాడు మోహన్. "అది కాదు సార్! నేను మిమ్మల్ని ఏమీ డిస్ట్రబ్ చెయ్యను.మీ పనికి అడ్డురాను. పైగా మీకేదయినా సాయం కావాలంటే చేసి పెడతాను. నా తీరిక సమయాల్లో మీదగ్గర కాలక్షేపం చేస్తాను."

    మెచ్చుకోలుగా చూశాడు ఆయన. "దెన్ ఇట్సాల్  రైట్. నీ వయసులో కుర్రాళ్ళు సీనిమాలూ శీ కార్లూ  అంటూ కాలక్షేపం చేస్తారు. కానీ నువ్వు నాతో స్నేహం చేయ్యాలని చూస్తున్నావు. యిది నిజంగా చాలా మంచి  విషయం. నా స్నేహంవల్ల చాలా నేర్చుకోగలవు నువ్వు. దీపిక కూడా ఇంతే  కేవలం ఉత్సాహంతో నా దగ్గరకు  రావడం  మొదలుపెట్టింది. చాలా తక్కువకాలంలో షి లెర్నడ్ ఎలాట్" అన్నారు.

    "నాక్కూడా యెంతో ఉత్సాహంగా వుంది సార్ మీరు సాయంచేస్తే నేనుకూడా యెంతో నేర్చుకుంటాను" అన్నాడు.

    "ఓ.కే రేపట్నించీ నువ్వుకూడా రా!" అన్నారు. మహాదానందంగా అంగీకరించాడు మోహన్.
   
    అమ్మయ్య యిలా  నడిస్తే చాలు. త్వరలోనే మరి కాస్త ఎడ్వాన్సు అయిపోతే పందెం గెల్చే ఛాన్సెన్ వున్నాయి అనుకున్నాడు.

    వారంరోజులుగడిచాయి. మోహన్ పృధ్విగారి దృష్టిలో మంచి కుర్రాడనిపించుకున్నాడు. "యూ ఆర్  ఎ  బైట్ బాయ్. యు విల్ డెఫినేట్లీ కమ్ అప్" అనేవారు పదేపదే.

    కానీ మోహన్ కి మాత్రం ప్రొఫెసర్ గారి  తత్వంగానీ, ఆయన పరిశోధనగానీ  ఏ మాత్రం అంతుబట్టలేదు.

    అసలాయన తీరేవేరు. ఆయనచేసే మెయిన్ రీసెర్చ్ వేరు. అదేమిటో ఆయనకీ, ఆయన స్టూడెంట్ దీపికకీ మాత్రమే తెలుసు.

    అదిగాక మినీ పరిశోధనలు బోలెడు. చిన్నా చితకా పరికరాలూ, పనిమూట్లూ బోలెడు కనిపెట్టాడాయన. వాటన్నిటి డ్రాయింగులూ, నోట్సూలూ ఆయన దగ్గర భద్రంగా వున్నాయి.

    ప్రస్తుతం ఓ కొత్తరకం లైట్ కనిపెడుతున్నారు అది కిరోసిన్ ఆయిల్ పనిచేస్తుంది. పగలుపూట దాని మీద వంట చేసుకోవచ్చు. రాత్రిపూట లైట్ గా వాడుకోవచ్చు. ఓ నెల్రోజులుగా దానితో నే తంటాలు పడుతున్నారాయన.

    దాని యొక్క ఉపయోగాన్నీ ప్రయోజనాన్నీ మోహన్ కి వివరించి చెప్పారు. కానీ అతని కేం అంతుబట్టలేదు. "పల్లెల్లో ఈ లైటు బ్రహ్మడంగా ఉపయోగిస్తుంది. విలేజెస్ దేర్  విల్ బి నో కరెంట్ ప్రజలు ఈ లైటు ఒహటి కొనుక్కుంటే చాలు. పగలు వంట చేసుకోవచ్చు. రాత్రిపూట లైటు వెలిగించుకోవచ్చు....అన్నారు.

    మరయితే రాత్రిపూట వంటా?" అని డౌట్ వచ్చింది అతనికి కానీ బయట పెట్టలేదు. దీపిక చాలా సీరియస్ గా  ఈ లైటుమీద నోట్సు తయారుచేసింది. "ఈ  పరికరానికి పేరేం పెడదాం?" అడిగారాయన.

    "అనసూయ" అంది దీపిక.

    "గుడ్ అన్నారాయన ఆనందంగా.

    వారం రోజులు గడిచిపోయాయి. ప్రస్తుతం ప్రొఫెసర్ గారు దీపికా వాళ్ళ బిందెల రీసెర్చ్ చేస్తున్నారు.

    పదిహేనురోజుల నిరంతరం శ్రమ అనంతరం వాటి ఆచూకి కనిపెట్టగలిగారు ఆయన.

    మోహన్ సాయం తీసుకుందాం అనుకున్నారు. అందుకే ఆ రోజుపొద్దున ప్రూట్ జ్యూస్ తాగాక అతనిని వెంటబెట్టుకుని తోటలోకి తీసుకెళ్ళి బెంచీమీద కూర్చోబెట్టారు. తనూ పక్కనే కూర్చున్నారు.

    "అతను నీవల్ల ఒకసాయం కావాలోయ్ నాకు!" అన్నారు.

    చెప్పండిసార్. చేసేస్తాను" హామీ ఇచ్చాడు.

    "సరే నువ్వు సాయంత్రం ఆరు గంటలకల్లా నా దగ్గిరికి వచ్చేయ్. మనం ఇద్దరం కల్సి ఓ దగ్గరికి వెళ్ళాలి!" అన్నారు.

    ఎక్కడికండీ?"

    "చెప్పను. నువ్వడక్కు, నేను రమ్మన్న చోటికిరా" నేను చెప్పినపని చెయ్యి అంతే" శాసించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS