మొదటిసారిగా సరోజినికీ రాగిణి మీద కోపం డబ్బంటే అసహ్యం కలిగింది. కానీ ఏం చేస్తుంది? స్వయంకృతాపరాధం!
మరో వారానికి కోలుకున్నారు రామానుజంగారూ, శిల్ప. ఆ రోజు ఒక వారపత్రిక కవరు పేజీ మీద అర్ధ నగ్నంగా వున్న రాగిణి బొమ్మచూసి, ఆ పుస్తకాన్ని గిరవాటు వేశారు రామానుజంగారు. "ఛీ!" అంది శిల్ప అందరూ వినేలాగా. సరోజినికి అసహ్యంగానే అనిపించింది. కానీ పైకి ఏమీ అనలేక నిట్టూర్చి ఊరుకుంది!
శిల్ప మాత్రం ఆ పుస్తకాన్ని ముక్కలు ముక్కలుగా చింపి పారేసింది. ఎందుకనో ఆ పిల్ల సరోజినితో సరిగా మాట్లాడ్డం మానేసింది. "అమ్మా" అని పిలవడం కూడా మానేసింది. ఇవన్నీ గమనిస్తూనే వున్నారు సరోజినీ, రామానుజంగారూ! కాని...... పెరిగే వయస్సునీ, ఎదిగే మనుస్సునీ, కదిలే ఊహలనీ ఆపే శక్తి ఎవరికుంది? మనసులోనే కుమిలిపోతున్నారు.
భరణి దగ్గరనుంచి ఉత్తరం ఫోటోలు వచ్చాయి. దీనూ బోర్లా పడుకుంటే గుడ్డల్లేకుండా ఒకటీ, నీళ్ళు పోస్తుంటే ఒకటీ, కాశ్యప్ ఎత్తుకుని ఆడిస్తుంటే ఒకటీ, భరణి పాలు పడుతుంటే ఒకటీ, ఇలా..... ఎన్నో ఫోటోలు పంపించింది! అవన్నీ ఎంతో మురిసిపోతూ చూసింది శిల్ప. భరణి అంటె ఆ చిన్నారి మనసులో ఏదో ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. రాగిణి మీద అసహ్యం రెండింతలయ్యింది.
ఆ రోజు రాత్రి సరోజిని పక్కన పడుకున్న శిల్ప లేచి అవతల గదిలోకి వెళ్ళి లైటు వేసుకొని కూర్చుంది. సరోజినికి మెలుకువ రాలేదు గానీ దీపానికి రామానుజంగారు లేచారు. శిల్ప ఏం చేస్తోందా అని మెల్లగా వెళ్ళి చూశారు. భరణి, కాశ్యప్, దీనూ ముగ్గురూ వున్న ఫోటోని తదేకంగా చూస్తోంది. రామానుజంగారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ పసిహృదయం పడే ఆరాటం అర్థం చేసుకున్న అతని గుండె తరుక్కుపోయింది. శిల్పని లేవనెత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుని "ఏం చేస్తున్నావమ్మా" అన్నారు ఆర్ద్రతనిండిన కంఠంతో.
"మరి...... రాగిణి అక్క నాకు అమ్మయితే భరణి అక్క ఏమవుతుంది?"
"పిన్నమ్మ! అంటే పినతల్లి. పిన్నీ అనొచ్చు!"
"హస్ బెండు?"
"చిన్నాన్న. లేకపోతే బాబాయి! ఎలాగయినా పిలవచ్చు!"
"మరి ఈ బాబు?"
"తమ్ముడు!"
"తమ్ముడా!"
"తమ్ముడా!" ఆనందంతో శిల్ప కళ్ళు మెరిశాయి.
"మీరు మమ్మీస్ డాడి కదా? నాకు గ్రాండ్ ఫాదర్ అవుతారు కదూ?"
షాక్ కొట్టినవాడిలా కొయ్యబారిపోయారు, రామానుజంగారు.
"ఎవరు చెప్పారమ్మా నీకు?"
"అమ్మ నాకు గ్రాండ్ మా అవుతుంది కదూ?"
"..........."
"చెప్పండి గ్రాండ్ పా!"
"అవును!" అన్నారు మెల్లగా చేసేది లేక, శిల్పకి అంతా తెలిసిపోయిందనీ రూఢి అయిపోయింది.
"గ్రాండ్ పా! నాకు మీరు, గ్రాండ్ మా, పిన్నమ్మా, చిన్నాన్న, తమ్ముడంటే ఇష్టం" అంది.
"ఊ!" చిన్నగా నవ్వారు రామానుజంగారు. "తమ్ముడు కూడా ఇష్టమేనా? నువ్వు తమ్ముణ్ణి చూడనేలేదే" అంటూ.
"ఫోటో చూశానుగా! క్యూట్ గా వున్నాడు!" రామానుజంగారు శిల్పని గుండెలకి హత్తుకుంటూ చెంపలు ముద్దెట్టుకున్నారు."
"బట్ గ్రాండ్ పా! నాకు మమ్మీ అంటే అసహ్యం" అంది.
రామానుజంగారి నోట మాట రాలేదు.
"రాగిణి అక్కమ్మా! మమ్మీ అంటే నీకిష్టమే కదూ?" అన్నారు.
"ఊహు! ఇప్పుడిష్టం లేదు."
"తప్పమ్మా అలా అనకూడదు! ఎందుకిష్టం లేదు?"
"గ్రాండ్ పా! మమ్మీ వేసుకున్న ఆ డ్రెస్సులు చూశారా? నాకు అసహ్యం! నేనంటే అమ్మకి ఇష్టంలేదు! అందుకే నాకు అసహ్యం" అంది 'అసహ్యం' అనే పదాన్ని నొక్కి చెబుతూ!
మెలకువ వచ్చి వీళ్ళ సంభాషణంతా చాటుగా వింటున్న సరోజిని కన్నీళ్ళు ఆమె గుండెల్ని తడిపేశాయి. తనే ఈ తప్పు చేసిందనీ, రాగిణీ జీవితం తనవల్లే పాజయిందనీ అంతరాత్మ ఘోషించింది. పిచ్చిదానిలా ఏడుస్తూ పక్కమీద వాలిపోయింది.
రామానుజంగారు శిల్ప చేతిలోని ఫోటోలు తీసుకుని "పొద్దుపోయింది రామ్మా పడుకుందాం" అన్నారు.
"గ్రాండ్ పా! ఇంకొక్క మాటడగనా?" అంది కొసురుతున్నట్టు మొహం పెట్టి!
"అడుగమ్మా!" అన్నారాయన!
"మరి మా డాడీ ఏరీ?"
నిర్ఘాంతపోయారాయన, నిరుడు సెలవుల కొచ్చిన శిల్పకీ, ఈ సెలవుల్లో వచ్చిన శిల్పకీ ఉన్న తేడా భూమ్యాకాశాలకున్నంత! అనుకున్నారు.
"చెప్పండి గ్రాండ్ పా!"
"నాకు తెలీదమ్మా ఎక్కడున్నారో?" ఉదాసీనంగా అయిపోయింది. అతని కంఠం.
"చెప్పండి గ్రాండ్ పా!"
"నిజంగా నాకు తెలియదు. ఆనాటినుంచీ మళ్ళీ చూడలేదు. ఎక్కడున్నాడో! ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు."
"ఏనాటి నుంచీ?......" పెద్దవాళ్ళలా ఆ పిల్ల అడుగుతున్న ప్రశ్నలకు ఆశ్చర్యపోతున్నారాయన. వెంటనే తేరుకుని "శిల్పా! నువ్వు చిన్న పిల్లవమ్మా! ఆ కథంతా ఇప్పుడొద్దులే!" అన్నారు.
శిల్ప ఆలోచనలో పడింది. 'ఆ కథ! అంటే చాలా పెద్ద కథన్న మాట!' ఊరుకుంది.
