Previous Page Next Page 
గెస్ట్ హౌస్ పేజి 15

"ప్రభూ...ఏమైంది..." అంటూ నచికేత ప్రభు చూపించిన వైపు చూశాడు.
సరిగ్గా అప్పుడే రామయ్య వాకర్ శవం ముందు నిలబడి...తీక్షణంగా ఆ శవాన్ని చూస్తూ...

                                         9
"గో...గో...గో..." రామయ్య గొంతులో కమాండింగ్ వుంది.
తీక్షణంగా వాకర్ వేపు చూస్తున్నాడు.
వాకర్ లేచాడు...
ఒక్కో అడుగు బరువుగా వేస్తూ వె..ళ్లి..పో..తు..న్నా..డు...
రామయ్య వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయాడు...

                                        * * *
"ఏమయిందక్కడ?" ప్రభు చూపించిన వైపు చూసి అక్కడ ఏమీ లేకపోవడంతో అడిగాడు నచికేత.
అక్కడ ఏమీ లేదు.
"అదీ...అదీ..." ప్రభుకు ఇంకా వణుకు తగ్గలేదు.

                                     * * *
సినిమా చూసి ఓ రెస్టారెంట్ లో డిన్నర్ తీసుకొని ఇంటిదారి పట్టారు.
ఎవరి ఆలోచనల్లో వారున్నారు.
ప్రభుకు తను కాన్వాస్ లో చూసిన దృశ్యమే గుర్తొచ్చింది. కాన్వాస్ లో లాన్ కనిపించడం...సిమెంట్ బెంచీమీద వాకర్ కూచొన్న తీరు...
అసలా కాన్వాస్ లో దృశ్యం ఎలా మారిపోయింది. ఇదంతా తన భ్రమా...అదే నిజమైతే తను నచికేత ఇంటినుంచి రోడ్డుమీదకి వచ్చాక, లాన్ లో సిమెంట్ బెంచిమీద వాకర్ శవం ఎలా కనిపించింది.?
ఎడతెగని ఆలోచనలు అతడ్ని చుట్టుముట్టాయి.
విలియమ్స్ కూడా తీవ్రంగానే ఆలోచిస్తున్నాడు.
తను ప్రభుని, ప్రభు మాటల్ని తీసి పారేశాడు.
మరి ఇప్పుడు జరుగుతున్నదేంటి?
రామయ్య మొహం నీలం వర్ణంలోకి మారడం తను స్వయంగా చూసేడు.
రామయ్యని చూడాలంటేనే వణుకు పుట్టేలా వుంది.
నచికేత ఆలోచనలు మరోలా వున్నాయి.
చాలా రోజుల తర్వాత ఇవ్వాళ ఇంటికి వెళ్తున్నాడు. ఇన్నాళ్లూ ఏ పీడకలలూ తనకు రాలేదు. ఈరోజు ఏమవుతుందో.
ఏ ఆలోచనా లేకుండా నడుస్తున్నది సూర్యనారాయణ సూరజ్ లే.
అలాంటి అనుభవం తమకు ఎదురవుతుందని అప్పుడు ఆ ఇద్దరికీ వూహమాత్రపు ఆలోచన కూడా రాలేదు.

                                                               * * *
అర్దరాత్రి ఇంట్లో అన్ని గదుల్లో లైట్లు ఆరిపోయి వున్నాయి. ఒక్క స్టోర్ రూమ్  లో తప్ప.
నచికేత తన గదిలో ఆదమరచి నిద్రపోతున్నాడు.
సినిమాకు వెళ్ళి రావడంతోనే బద్దకంగా అనిపించింది. పాలుతాగి హాయిగా నిద్రపోతున్నాడు.
గోరువెచ్చటి పాలు తాగి...తాగిన పది నిముషాలకే నిద్రలోకి జారుకున్నాడు.
తనకు ఇచ్చిన పాలలో రామయ్య నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడనే విషయం నచికేతకు తెలిసే అవకాశం లేదు.
నచికేత మెలకువగా ఉంటే తన పనికి ఆటంకం అని రామయ్యే నిద్రమాత్రలు పాలల్లో కలిపి ఇచ్చాడు.
నచికేత నిద్రలోకి జారుకున్నాడని తెలిసాక అన్ని గదుల్లోని లైట్లు ఆఫ్ చేసి స్టోర్ రూమ్ లోకి నడిచాడు.
గదిని ఎవరో వాడడంలేదు. రామయ్యే ఓ వాస్తు శాస్త్రజ్ఞుడ్ని తీసుకువచ్చాడు. ఆ వాస్తు వేత్తకు వున్నది మిడిమిడి జ్ఞానమే...ఆ విషయం రామయ్యకూ తెలుసు. తెలిసే అతడ్ని తీసుకువచ్చాడు.
అతడు దిక్సూచితో రకరకాల యాంగిల్స్ లో చూసి ఓసారి కళ్ళు మూసుకున్నట్టు నటిస్తూ...ఓ క్షణం దీర్ఘంగా నిట్టూర్చి...
"హు...లాభంలేదు..." అంటూ నచికేత పేరెంట్స్ ఇచ్చిన ఫీజువాపసు ఇవ్వబోయాడు.
అదేమిటని ప్రశ్నించకుండానే...
"ఈ ఇంట్లో ఆ స్టోర్ రూమ్ అసుభాన్ని సూచిస్తోంది...ఆ గదిని పడగొట్టాలి. అలా ఆ గదిని పడగొట్టినప్పుడు ఖచ్చితంగా కిచెన్ కు తలుపు ఉండకూడదు..." అలా తన నోటి దూలతో బెదరగొట్టాడు.
వెంటనే రామయ్య కలుగచేసుకుని "స్వామీ...దీనికి విరుగుడు మీరే చెప్పాలి...గదులు కూలగొట్టడం లాంటిది లేకుండా ఏదైనా శాంతి చెప్పండి..." అని అడిగాడు.
మళ్ళీ కళ్ళు మూసుకుని తెరిచి ఆ తర్వాత కళ్ళు చిట్లించి...
"ఈ స్టోర్ రూమ్ ని ఎటువంటి పరిస్థితుల్లో తెరవకూడదు...సూర్యకాంతినిగానీ, వెలుతురుగానీ ఈ గదిలో అస్సలు పడకూడదు. శాశ్వతంగా ఈ గదిని మూసి ఉంచాలి..." అని చెప్పాడు.
ఇంటిల్లిపాది ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజే ఆ స్టోర్ రూమ్ కు తాళం వేశారు. దాని తాళం చెవి రామయ్య తన దగ్గర పెట్టుకున్నాడు.
ఆ తర్వాత వాస్తు శాస్త్రజ్ఞుడిలా నటించిన అతడికి రామయ్య ఐదు వందల రూపాయలు ఇచ్చాడు.
ఆ రోజునుంచి రామయ్య ఆ స్టోర్ రూమ్ ని తన వ్యక్తిగతమైన పనులకు ఉపయోగించుకుంటూ వచ్చాడు...

                                                            * * *
స్టోర్ రూమ్ తలుపుతీసి లైటు వేయలేదు రామయ్య.
తడుముకుంటూ కుడివైపు వెళ్లి, షెల్స్ లోవున్నా క్యాండిల్ తీశాడు.
తన జేబులోనుంచి అగ్గిపెట్టె తీసి అగ్గిపుల్ల వెలిగించి క్యాండిల్ వెలిగించాడు.
స్టోర్ రూమ్ తలుపు మూశాడు.
క్యాండిల్ వెలుతురులో ఆ గది స్పష్టంగా కనిపిస్తోంది.
ఓ ప్రక్క పాడుబడిన సామానులు వున్నాయి.
గది మధ్య మాత్రం నీట్ గా వుంది.
ఎడుమవైపు తిరిగాడు. అక్కడ టేబుల్ మీద ఐదు క్యాండిల్స్ ఐదు రంగుల్లో వున్నాయి. ఆ క్యాండిల్స్ ని తీసి గది మధ్యన పెట్టాడు.
ఐదు క్యాండిల్స్ వెలిగించాడు.
మూలనవున్న అల్మారా దగ్గరకి వెళ్లాడు. ఆ చెక్క అల్మారా తలుపు తీసి అందులో మంచి పొడవాటి గౌను బయటకు తీసేడు.
నల్లటి పొడవాటి ఆ గౌనుమీద ఎరుపురంగు పట్టీలు అడ్డంగా నిలువుగా వున్నాయి.
ఆ గౌను వేసుకున్నాడు రామయ్య.
మోకాళ్లమీద కూచున్నాడు.
తలని ఓసారి కుడివైపు, మరోసారి ఎడమవైపు తిప్పి తర్వాత స్ట్రయిట్ గా ఆ క్యాండిల్స్ వైపు తిప్పి...
"బిత్రోచి...నేను నీ దాసనుదాసుడ్ని. ఈ ప్రపంచంలో నేను చెడును ఇష్టపడతాను. చెడు చేయాలని అనుకుంటాను. చెడు తలపులు చేస్తాను. మనుషుల రక్తాన్ని అతి ప్రీతిగా కోరుకుంటాను. నీకత్యంత ప్రీతిపాత్రమైన పనులన్నీ చేస్తాను. నన్ను ప్రతీక్షణం స్వార్ధంవైపు నడిపించు. నీకు సేవ చేసుకునే అవకాశం కలిగించి...క్లిమో...గ్లిమో...శ్లుమో...
ఈ దాసుడి రక్తాన్ని స్వీకరించు.
రామయ్య కళ్ళు అదోలా మెరుస్తూ ఎ..ర్ర..బా..రి..పో..తూ..వున్నాయి.
క్యాండిల్స్ వెలుతురు ఆ గదిని ఆక్రమించుకుంది. క్యాండిల్స్ మధ్యలో సూదిలాంటి వస్తువు వుంది.
దాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
ఆ నున్నటి సూదిలాంటి సాధనాన్ని కొవ్వొత్తి వెలుతురులో ఓసారి చూసి...ఒక్కో కొవ్వొత్తి వెలుతురులో...ఒక్కో క్షణం పాటు సూదిని వుంచాడు.
తర్వాత కుడిచేతిలోకి ఆ సాధనాన్ని తీసుకొని, ఎడమచేతి చూపుడు వేలి లోపలికి ఆ సాధనాన్ని గుచ్చాడు.
ఒక్కోసారి రక్తం ఫౌంటేన్ లా చిమ్మి మొదటి కొవ్వొత్తి మీద పడింది. ఆ కొవ్వొత్తి వెలుతురులో మార్పు వచ్చింది.
వెంటనే బొటనవేలుతో ఆ సాధనాన్ని గుచ్చి రెండవ కొవ్వొత్తి మీద పెట్టాడు. మూడు చుక్కల రక్తం ఆ కొవ్వొత్తి మీదపడింది.  
అలా ఎడమ చేతికి వున్న ఐదు వేళ్లతో ఆ సాధనాన్ని గుచ్చి ఐదు కొవ్వొత్తుల మీద తన రక్తాన్ని అర్పించాడు.
ఆ తర్వాత...(ఎడిట్...ఎడిట్...)
(క్షుద్ర దేవతలు చెడు చేసేవాళ్లని...క్షుద్రమైన ఆలోచనలు చేసేవాళ్లని ఇష్టపడతాయి. బిత్రోచికి ఇష్టమైన రక్తాన్ని ఐదు విధాలుగా అర్పించే విధానమే 'క్షుద్రోచ్'. నిజానికి ఈ ప్రయోగం ఉందో లేదో...ఇలాంటి ,మంత్ర విద్య గురించిన సమాచారం క్షుద్రోచ్...ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియ తాలూకు పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడంలేదు. కేవలం దీన్ని కాలక్షేపంగా చదివి వదిలేయాలనే ఆలోచనతోనే దీనికి సంబంధించిన విషయాన్ని వదిలేస్తున్నాను.
అయితే సింగపూర్ లో ఇలాంటి ప్రయోగం చేసే శాల్తీ ఒకతను...అతని పేరు 'యుమియో' వున్నాడట. అతడ్ని పరిచయం చేస్తానని కాబ్ డ్రైవర్ అంటే వద్దన్నాను. ఇలాంటి విషయాల గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. నవలలోని టెంపో కోసమే అవసరమైన మేర నాకు తెలిసిన సమాచారం వాడుకోవడం జరిగిందని గమనించాలి-రచయిత్రి)

                                        * * *
రామయ్య కళ్ళు రక్తవర్ణంలోకి మారాయి.
అయిదు రకాలైన వెలుగులు ఆ అయిదు క్యాండిల్స్ నుంచి వెలువడుతున్నాయి.
"నా క్షుద్రోచ్ ని స్వీకరించావా బిత్రోచి...ఈ దాసను దాసుడు నీకు బానిసగానే వుంటాడు..." అంటూ ఒక్కక్షణం కళ్ళు మూసుకుని ఆ తర్వాత కళ్ళు తెరిచి లేచాడు.
అప్పుడు సమయం అర్దరాత్రి పన్నెండు గంటల ముప్పయినిముషాలు. నెలలో ప్రతి మూడవ ఆదివారం అర్దరాత్రి రామయ్య క్షుద్రోచ్ ప్రక్రియను నిర్వర్తిస్తాడు.
అయిదు క్యాండిల్స్ తీసి టేబుల్ మీద పెట్టి తన నల్లగౌను తీసి చెక్క అల్మారాలో పెట్టి ఆ గదిలోనుంచి బయటకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో...

                                      * * * 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS