Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 15


    "కాంతం అల్లాగే అనటం? పతివ్రతలు అల్లాగా అంటారా చెప్పు కాంతం?"

    "ఎందుకనరూ?"

    "నీకు పురాణాలు సరిగ్గా తెలియవు_నారదుడి మాట విన్నావుగదా?"

    "వినకపోవాలిసిందే?"

    "విన్నావుగదా. ఆయన పెళ్ళాం ఏం చేసిందో తెలుసునా? ఆయన త్రిలోకసంచారి. అంటే తన ఇష్టంవచ్చిన దేశానికల్లా వెళ్ళి వస్తుండే వాడు. ఇల్లాగ దేశ దిమ్మరి అయి అమరపురమూ, బ్రహ్మపురమూ మొదలైన గొప్ప గొప్ప పురాలకూ, దేవేంద్ర, భూలోక, సువర్లోక, స్వర్గలోకాలకూ, ఆయన తరచు వెడుతూ ఉండేవాడు. ఆయన భార్య ఒక్కసారి అయినా, రొసరొసలాడటం కాని, నేను వస్తానని అనటం కానీ అన్నదనుకొన్నావా? లేదు? ఎప్పుడూ ఒక్కసారి అయినా ఆమె అల్లాగ అన్నది కాదు!! అల్లాగ మహాపతివ్రతలాగ ఉండాలె నీవు. తెలిసిందా?

    "అవునవును చాల్లెండి, మీకల్పనా మీరున్నూ...అసలు నారదుడికి భార్య లేదంటారే?"

    "ఎవరు చెప్పారు నీకు ?"

    "ఎవరు చెప్పేదేమిటి? నాకు తెలియదా? మొన్న గుళ్ళో మాఘపురాణం చదువుతూ ఉన్నప్పుడు కూడా ఆమాటే విన్నాను." 

    "ఇంతేకదా మా ఘపురాణం వ్రాసేకాలం నాటికి ఆయనకు వివాహం కాలేదు. దాని తరువాత ,మత్స్య, కూర్మ. వరాహాది పురాణాలు వ్రాసారు. వాటిలో ఆయన భార్య సంగతి అంతా ఉంది. ఈ సంగతి మొన్న మొన్నదే కనిపెట్టారు. ఆయన భార్య పేరు మత్స్యగంధి అని కూడా తెలుసుకున్నారు."

    "ఛా ఛా ఊరుకోండి! మీ కవిత్వమూ మీరూనూ!!"

    "పోనీ, అటువంటి పతివ్రతలు లేరంటావా?"

    "ఎటువంటి?"

    "అల్లాగ పతి ఎక్కడికైనా, ప్రయాణం, అయిపోతుంటే వెంటబడి వస్తానూ అని అననివాళ్ళు."

    "ఉహు."

    "అల్లా అననివాళ్ళు లేరు."

    "లేరూ? ఎవ్వరూ లేరూ."
    "లేరు. ఎవ్వరూ లేరు." అని నదురు - బెదురూ లేకుండా అన్నది.

    "పోనీ" ద్రౌపది పతివ్రతేనా? ఆమె ఏమి చేసిందీ? అర్జనుడు ఏదో గుర్రాన్ని తీసుకొని దేశాలమీదికి పోతే ఇంట్లో పడుందా లేదా? లక్ష్మణుని భార్య ఊర్మిళ పన్నెండు ఏండ్లూ ఇంట్లోనే పడుండి నిద్రపోయిందా? మరి అదీ సంగతి," 

    "ఊరుకోండీ. ఒక్క సంగతి మీకు తెలియదు. శ్రీరాముని వెంటబడి సీత అడవులకు వెళ్ళిందా? సావిత్రి మొగుడి వెంటబడి యమలోకందాకా వెళ్ళిందా? చూశారా, గొప్ప-గొప్ప పతివ్రతలంతా అంతే! భర్తను వదలి ఒక్క నిమిషం ఉండరు.

    "సరే ఏం చేస్తాము! నీమాటే నిజమని ఒప్పుకొంటాను, ఇంకో విషయం ఏమిటంటే నువ్వు వాళ్ళకంటే గూడా గొప్ప దానివి!!"

    "నేనేం గొప్పదాన్నీ...అని అనటం లేదు" అన్నది కాంతం మూతి ముడుచుకుని.

    "అ!హఁ ! హఁ ! హఁ !! నీవు నిజంగా వాళ్ళందరి కంటె కూడా చాలా గొప్పదానివి!! వాళ్లు మొగుడి వెంట ఒంటరిగా పడ్డారు, నీవు అయిదుగురు పిల్లలతో వెంటబడుతున్నావు!!"

    "అవును, నేనూ మహాపతివ్రతనే" అన్నది అమితపెంకెగా.

             *
    అంతే చివర సంగతి చెప్పేస్తాను. మా భార్యగారి మహాపతివ్రతా మహత్యం వల్ల నా ప్రయాణం ఆగిపోయింది...

                                      * * *      
   
                           
బద్ నసీహత్
           
    "ఇవ్వాళ ఇంత పెందరాళే వచ్చేశారేం" అంటూ మా ఆవిడ నాకెదురుగా వచ్చి తలుపు తీసింది,

    "యకాయకీని వచ్చేశాను" అంటూ లోపలికి అడుగుపెట్టి "కాఫీ ఏమైనా వుందా" అని అడిగాను.

    "ఆ, ఉంది. రెడీగా వుంది. మరేం, మీ కోసం ఎవరో పెద్దమనిషి వచ్చారు. పైన ఆఫీసుగదిలో కూర్చున్నారు ఆమటా అని" చెప్పింది మా ఆవిడ.

    సరే అనుకొని, నేను గదిలోకిపోయి కోటూ చొక్కా విడిచి, ముఖం కడుక్కొని, లుంగీ కట్టుకొని, పైన తువాలా వేసికొని, పై కెళ్ళాను వచ్చిందెవరో చూద్దామని.

    ఆ కూర్చున్న పెద్దమనిషి కాస్త వయస్సు మళ్ళిన వాడులాగున్నాడు. ఉంటే యాబై ఏండ్లు వుండవచ్చు. కాని శరీరం ముడతలుపడ్డ ముసలి కాదు. యౌవనశేషం యింకా అమాయకుడులాగా చాలా సౌమ్యుడులాగా కనిపించాడు.

    నన్ను చూసీచూడ్డంతోటే ఆయన లేచి నమస్కారం చేశాడు. "తమరు ఎవరో నాకు జ్ఞాపకం లేదండీ, క్షమించాలె" అన్నాను నేను.

    ఆయన కుర్చీలో కూర్చుంటూ అన్నాడు_'అయ్యా మీకు నేను పరిచయుడ్నీ కానూ, నన్ను మీ రెప్పుడూ చూడనూ లేదు. మాది అసలు విజయనగరం. నా పేరు సన్యాసిరాజు, మేము రాజుపేటలో కాపురం ఉన్నాము, తమ దర్శనార్ధమై వచ్చాను అని.

    "అయ్యో, అంత పెద్దమాట ఎందుకండీ, నేనెంతటి వాడ్నీ" అన్నాను నేను నవ్వుతూ.

    "అల్లాక్కాదండోయ్, తమకు మా ప్రాంతాల్లో మా చెడ్డ పేరుందండోయ్" అన్నాడు ఆయన తమాషా విజయనగరం యాసతో.

    "చెడ్డపేరాండీ?" అన్నా నేను వింతగా చూస్తూ.

    నేను ఇల్లాగ అనటం జూచి ఆయన నొచ్చుకొని క్షమించాలండి, చెడ్డపేరూ అంటే మహదొడ్డ పేరుందని మనవి చేస్తున్నాను" అన్నాడు.

    "అల్లాగనాండీ" అని ఒక చిరునవ్వు నవ్వి నేనూరుకొన్నాను. ఆయన మళ్ళీ ఇలాగ అన్నాడు. "తమ కథలూ గట్రా చదివి మేము ఊ, ఆనందిస్తూ ఉంటామండి మా చెడ్డ తమాషాగా ఉంటాయి సుమండీ"

    ఈ మాటలువిని, సంతోషించి, నేను ఊరుకొన్నాను. ఓ నిమిషం అయిన తరువాత ఆయన నావంక జూస్తూ మళ్ళీ అన్నాడూ_"తమర్ని తమ కాంతాన్నీ, తమ సంతానాన్నీ చూచి ఆనందించాలనే ఉద్దేశంతో ఇలా వెళ్ళి పోవచ్చానండీ" అని.

    "ఏదో తమకు మా యందు అలాగ అభిమానం కలిగింది" అని నేను అంటూ వుండగానే ఆవిడగారు వచ్చింది, వెండి పళ్ళెంలో నాల్గు కాల్చి నెయ్యి రాసిన అప్పడాలు పెట్టుకొని, చేత్తో ఫ్లాస్కు పట్టుకొనీ, ఆవిడకు చూడటంతోనే నేనన్నానూ_"అదిగో రానే వచ్చారు. ఆవిడేనండి కంతాయమ్మరావుగారు" అని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS