రాత్రి జరిగిన సంఘటన తల్చుకుంటుంటే తనమీద తనకే అసహ్యం కలుగుతోంది. అర్చనని ఇంటికి తీసుకొచ్చి అత్యాచారం చెయ్యడం తనకే నమ్మశక్యంగా లేదు. అటువంటి పశుప్రవృత్తి తనలో ఉందా? ఉదయం మానవత్వం మూర్తీభవించిన మనిషిలా ప్రవర్తించి చీకటిపడిన తరువాత మృగంలా దాడిచేసాడని ఆమె అనుకోదూ! తప్పకుండా అనుకుంటుంది. ఆమె అలా అనుకోవడానికి తన ప్రవర్తనే కారణం. నిస్సహాయురాలైన ఆడదాని మీద అత్యాచారం చెయ్యడం ఎంత తప్పు.
తను చేసిన పని క్షమించరానిది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఇంటికి వెళ్ళిన వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పాలి. అలా అనుకున్న తరువాత అతని మనసు కాస్త తేలికపడింది.
తక్కువ అయినా డబ్బు తన జేబులోంచి తీసి ఆ క్యాష్ కి కలిపాడు. పది నిముషాల్లో విశాఖ డైరీ వాళ్ళ వ్యాన్ వచ్చింది. బాక్స్ లు వ్యాన్ లో వేసి తనెక్కాడు శివరావు. కొన్ని బూత్ ల దగ్గర ఆగి సేల్స్ మాన్స్ ని ఎక్కించుకుని ఆఫీస్ కి చేరుకుంది వ్యాన్. కౌంటర్ లో క్యాష్ అప్పగించి బయటకొచ్చి సిటీబస్సు ఎక్కాడు. తన స్టాఫ్ లో దిగి ఇంటివైపు నడవసాగేడు.
రోడ్డు ప్రక్క మంగలిషాపు దగ్గిర కూర్చున్న ఓ వ్యక్తి వెళుతున్న శివరావుని నిశితంగా చూశాడు. ముందురోజు తను అక్కడ వరకూ అనుసరించిన వ్యక్తి అతనేనని రూడి చేసుకుని శివరావుకి కాస్త ఎడంగా నడవసాగేడు.
శివరావు ఇంటి దగ్గర ఆగి తలుపు తట్టాడు. అర్చన తలుపు తీసింది. శివరావు లోపలకు వెళ్ళిన తరువాత తలుపు మూసుకుంది.
ఆ దృశ్యం చూసి ఆ వ్యక్తి చప్పున వెనక్కి తిరిగాడు. అతను తొందరగా నడవసాగేడు. అతని కళ్ళు విజయగర్వంతో మెరుస్తున్నాయి. సగం మాత్రమే కాలిన బీడీని నోట్లోంచి తీసి రోడ్డు ప్రక్కకు విసిరాడు.
* * *
ఇంట్లోకి వెళ్ళిన శివరావు తలుపు గడియపెట్టి తలుపుకి ఆనుకుని అక్కడే నిలబడ్డాడు. చాప మీదనుంచి దిండుతీసి మంచంపైన వేస్తూ తలుపువైపు చూసింది అర్చన. శివరావు అక్కడే నిలబడి తన వంక చూడడం గమనించింది. సాలోచనగా ఆమె నొసలు ముడిపడింది.
"నన్ను క్షమించు" చెప్పాడు శివరావు.
"క్షమించడం దేనికి?" ఆశ్చర్యంగా అడిగింది.
"రాత్రి నేను పశువులా ప్రవర్తించాను...." చెప్పాడు బాధగా.
చిన్నగా నవ్వింది అర్చన.
"రాత్రి సంఘటన గతానికి చెందినది. గతం గురించి చింతించడం మొదలుపెడితే నా జీవితం మొత్తం చింతించడానికే సరిపోదు. తన అక్రమ సంబంధం నేను చూసానని తన ప్రియునితో నన్ను ఇక్కడకు పంపింది నా పిన్నమ్మ. అతను మత్తుమందు ఇచ్చి సెక్స్ అంటే తెలియని నన్ను అనుభవించాడు. నన్ను రాజమ్మకు అమ్మితే తన డబ్బు రాబట్టుకోవడానికి మగవాళ్ళ దగ్గర పడుకోబెట్టింది. పోలీసులు పట్టుకోవడానికి వస్తే నా అమాయకత్వం తెలిసిన శకుంతల వృత్తిలో నాకు సంబంధం లేదని పోలీసులతో చెప్పలేదు. నా కోసం ఎవరూ రారని, ఫైన్ తను కడితే నన్ను వృత్తిలోకి దింపవచ్చునని అనుకుంది. ఆమె కోసం వచ్చిన మీరు మమ్మల్ని పోలీసులు పట్టుకోవడం చూసి కోర్టుకొచ్చి నన్ను విడిపించారు. వ్యభిచారం చేసిన ఆడవాళ్ళందర్నీ మీరు విడిపించడం లేదు. నామీద జాలిపడి మానవతా దృష్టితో నన్ను విడిపించారని అనుకోవడానికి ఇప్పుడు నేను పల్లెటూరి పిల్లనుకాదు...." ఆగి శివరావు మొహం చూసింది అప్పటికే అతని మొహం పాలిపోయింది.
"మగవాడి గుణం రెండు రెళ్ళు నాలుగు లాంటిది. ఈ లెక్క ఎ కాలంలోను మారనట్టే ఆ గుణం కూడా మారదు. రాత్రి జరిగిన సంఘటనే తీసుకోండి. నన్ను బలవంతంగా నేలపైకి త్రోసారు. ఆ సమయంలో నా మానసిక స్థితి ఎలా వుందో మీరు పట్టించుకోలేదు. మగవాడి దృష్టిలో ఆడది మంచంపైన వేసుకునే పరుపులాంటిది. దానిని ఎప్పుడైనా, ఎక్కడైనా వేసుకుని పడుకోవచ్చు. ఆ పరుపుకి అనుభూతి, ఆలోచన ఉండదు" ఆమె గొంతుక్కి ఏదో అడ్డుపడినట్టు బొంగురుపోయి ఆగిపోయింది. గబ గబా అక్కడనుంచి ప్రక్కగాదిలోకి వెళ్ళిపోయింది.
శివరావు తల వాలిపోయింది. అర్చన మాటలు తగలాల్సిన చోట తగిలాయి. అతను నిస్సత్తువతో నేలపైన కూర్చుండిపోయాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు.
"లేచి స్నానం చెయ్యండి...." అర్చన వచ్చి పిలిచింది.
ఆమె చెయ్యి పట్టుకుని క్రిందకు లాగి అన్నాడు.
"కూర్చో...."
అతను ఆమె కళ్ళల్లోకి చూశాడు, ఆ కళ్ళల్లో బాధ గూడు కట్టుకుని ఉంది.
"నేను నీ పట్ల నేరం చేసాను. ఈ విషయాన్ని అంగీకరించడానికి నేను సిగ్గుపడను. దానికి ఎటువంటి శిక్ష విధించినా అనుభవించడానికి సిద్దంగా ఉన్నాను. నీ పట్ల తేలిక భావంతో ఈ నేరం చెయ్యలేదు. నీపట్ల కోరికతో నిన్ను విదిపించలేదు. నా ప్రవర్తనలో ఓ గాఢమయిన కోరిక ఉంది...."
* * * *
తల్లికి సీరియస్ గా ఉందని తండ్రి ఇచ్చిన టెలిగ్రాం అందుకున్నాడు శివరావు. అప్పటికి ఉద్యోగంలో చేరి సంవత్సరమే అయింది. అతను వెంటనే శెలవు తీసుకుని బయలుదేరాడు. ఊరు చేరుకొని గబగబా ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించింది తల్లి. ఆమెను చూడగానే శివరావు మనసు కుదుటపడింది. తెల్లారేసరికి ఇంటికొచ్చిన కొడుకుని చూసి తల్లి చిన్నగా నవ్వింది. తండ్రి తనని రప్పించడానికే ఆ టెలిగ్రాం ఇచ్చాడని గ్రహించాడు శివరావు.
"ఊళ్ళో రెండు సంబంధాలు ఉన్నాయి. ఈ నెల దాటితే సంవత్సరం వరకూ ముహూర్తాలు లేవు. రేపు మంచి రోజు. వెళ్ళి చూసొద్దాం..." శివరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ మాటలు చెప్పాడు తండ్రి.
సంబంధం చూడటానికే తనని పిలిచారని తెలుసుకున్నాడు. చిన్నతనం నుండి తండ్రి మాటకు ఎదురు చెప్పడం తెలియదు అతనికి. తల్లి దగ్గర చనువు ఎక్కువ్బ, ఏదైనా చెప్పాలంటే ఆమెకే చెబుతాడు.
"ఇప్పుడు తొందరేముంది నాన్నా?" చాలా నెమ్మదిగా అన్నాడు.
"తొందరంటావేమిట్రా? నీకు పాతిక సంవత్సరాలు దాటాయి. ఇంకా చంటాడ్ని అనుకుంటున్నావా?" అప్పుడే అక్కడకు వచ్చిన తల్లి అంది. ఆమె వైపు చురుగ్గా చూశాడు శివరావు. తండ్రి అక్కడ లేకపోతే నీకు సమాధానం చెప్పేవాడిని అనే భావముంది ఆ చూపులో.
"నేను ఉద్యోగంలో చేరి సంవత్సరమే అయింది. మరో సంవత్సరం ఆగితే ప్రొహిబిషన్ పిరియడ్ కంప్లిట్ అవుతుంది. మరో రెండు సంవత్సరాలయితే మనకున్న స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు...." గొంతులో వినయం నింపుకుని చెప్పాడు.
నవ్వాడు తండ్రి. సగటు మనిషి తన జీవితానికి ఓ లక్ష్యాన్ని నిర్ణయించుకుని దానివైపు అడుగులు వెయ్యడం అవసరమే. అయితే ఇల్లు కట్టడం వంటి పనులు చెయ్యడమంటే మామూలు విషయంకాదు. నెలకి ఐదువందలు ఆదాచేస్తే మూడు సంవత్సరాలకి పద్దెనిమిదివేలు అవుతుంది. ఆ డబ్బుతో ఇల్లు కట్టగాలడా? ఇప్పుడు పాతికవేలతో ఇల్లు కట్టగాలిగితే మూడు సంవత్సరాల తరువాత అదే ఇల్లు యాభైవేలతో కాని కట్టలేడు. ఈ తేడా గమనించని మనిషి జీవితాంతం శ్రమించినా తన లక్ష్యాన్ని సాధించలేడు. ఇటువంటి అసాధ్యమైన పనులు చెయ్యాలనుకోవడం వల్ల జీవితంలో కొంత సమయాన్ని నష్టపోతాడు.
"వయసు మీద పడుతోంది. ఎక్కువకాలం బ్రతుకుతామనే నమ్మకం మాకు లేదు. ఎక్కువకాలం బ్రతకాలని కూడా మేము అనుకోవడం లేదు. నీకు పెళ్ళి చేసేస్తే మా బాధ్యత పూర్తవుతుంది. మా ఇద్దరిలో ఏ ఒక్కరుపోయినా ఆ బాధ్యత పూర్తి చెయ్యలేం. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నాం." చెప్పాడు.
ఎప్పటిలా మౌనంగా ఉండిపోయాడు శివరావు. తను గట్టిగా ప్రతిఘటిస్తే వాళ్ళు బాధపడతారని గ్రహించాడు. తన పెళ్ళి గురించి అతనెప్పుడూ ఆలోచించలేదు. అందుచేత పిల్ల ఎలా ఉండాలనే అవగాహన లేకపోవడంతో అయోమయంగా ఉంది అతని పరిస్థితి. అతని మౌనం అంగీకారంగా భావించారు తల్లిదండ్రులు.
మరునాడు ఉదయం ఒక సంబంధం చూడటానికి వెళ్ళేరు. పిల్ల తండ్రి వాళ్ళని ఆదరంగా లోపలకు తీసుకెళ్ళాడు. అందరూ తనవైపు ఆసక్తిగా చూడటం శివరావు గమనించాడు. అమ్మాయి తండ్రి చూపిస్తున్న ఆదరణ, వినయం పెళ్ళిపట్ల శివరావుకి కలిగిన వ్యతిరేకతని తగ్గించింది. పిల్లని చూసిన తరువాత శివరావు తండ్రి అతన్ని బయటకు తీసుకొచ్చి అడిగాడు.
"పిల్ల బాగుంది కదూ?"
తల అడ్డంగా ఊపాడు శివరావు.
"ఎందుకని?" అడిగాడు తండ్రి.
కొడుకు తన అభిప్రాయంతో ఏకీభవించకపోవటం ఆయనకు కోపం తెప్పించింది. దానిని అణుచుకుని సౌమ్యంగా ఉండటానికి ప్రయత్నించాడు. నిజానికి భార్యాభర్తలకు పిల్ల బాగా నచ్చింది.
