"నీకెలా తెలుసు?" ఈసారి ఆశ్చర్యపడడం శాలినివంతు అయింది
"ఎందుకు తెలియదు, మనిషి మనసులో మొదటిసారిగా పడేది అమ్మ బొమ్మ! అది చచ్చేదాకా చెరగదు!"
"నీ మొహం!"
"ఇంకెవరు?"
"వయసొచ్చి వలపు వాకిలి తెరుచుకున్న తరువాత తొలిసారిగా మనసు తెరమీదపడే బొమ్మ!"
"ఏమిటీ? కధ చాలా దూరం వచ్చిందే?" సుధ బుగ్గలు నొక్కుకుంది. ఏదో పాపం ఉద్యోగం వచ్చింది కదాని మీ అమ్మ వాళ్లు ఇక్కడికి పంపిస్తే నువ్వు చేసే నిర్వాకం ఇదా? ఇంతకీ కధ ఎంతదూరం వచ్చిందేం?"
"ఎంతదూరం రాలేదు. మొదలయిందంతే! అదీ వన్ వే ట్రాపిక్ లో!"
"పొడుపు కధ చెప్పినట్లుగా చెబితే నాకేం అర్దమై చస్తుంది? కాస్త అర్దమయ్యేట్టు చెప్పు! అర్దమయ్యాక నీ చెంపలు వాయగొడతాను! ఎందుకంటే, నిన్ను ఉద్యోగానికి రికమెండ్ చేసింది నేను కనుక! ఒక్క ఇంటిలో వుండి కష్టం సుఖం పంచుకొంటున్నాం కనుక! ఆ అధికారం నాకుంది.
"అదేం లేకపోయినా, బాల్య స్నేహితురాలివి కనుక ఆ అధికారం నీకెలాగూ వుంటుంది."
"ఉబ్బేయకు గాని సంగతి చెప్ప!"
"రాధాకృష్ణశర్మ అనిమాస్కూల్లో మాధ్స్ టీచరు! అతడిని ఒక్క మాటలో వర్ణించాలంటే కన్నె మనసును గిలిగింతలు పెట్టే రూపమని చెప్పాలి: అతడిని చూసిన మొదటిరోజే మనసులో, రోజు అతడు కనిపించినప్పుడల్లా గుండెలయ తప్పడంలాంటి వికారాలన్నీ మొదలయ్యాయి. ఈరోజు చాలా దగ్గరగా వొకరి ఊపిరి వొకరికి తగిలేంత దగ్గరగా వచ్చి నప్పటినుండి ఇహ నా మనసు నామాట వినడం మానేసింది?"ఎక్కడో స్వప్న లోకంలో తేలిపోతున్నట్లుగా చెప్పింది శాలిని.
"వయసొచ్చిన ఆడపిల్లను వంటరిగా వదిలితే, ఇదిగో - ఈ వికారాలు ఈజీగా లోబరుచుకొంటాయనే పెద్దవాళ్లు పిల్లల్ని వంటరిగా వదలడానికి వొప్పుకోరు: కాని, మనం దండెత్తుతాం వాళ్లమీద. "చదువు కొన్నాం, మానుంచి చెడ్డలు మేం నిర్ణయించుకోలేమా? అని! కాని వయసు మంచి చెడ్డ విచక్షణ అంతం చేయగలదని నిన్ను చూస్తుంటే తెలుస్తూంది:"
"సహజ పరిణామమే! దానికి నిగ్రహమనే ఆనకట్ట వేయకపోతే మనిషి జంతుధర్మంవైపు లాగబడతాడు కదా?"
"అసలు ఆ ఊహే మనసులోకి రాకుండా అరికట్టడం బ్రహ్మ కైనా సాధ్యంకాదు: యవ్వనం వున్నంత వరకు ఈ స్పందన వుంటూనే వుంటుంది. స్నేహితురాలివి కనుక మనసులో మాట చెప్పుకొన్నాను గాని నాకు నిగ్రహం లేదని ఈ వలపు భారంతో వెళ్లి అతడిని కౌగలించుకొంటానని ఎందుకను కొంటున్నావు? ఇంతేనా నువ్వు నన్ను అర్దం చేసుకొంది? శాలిని నొచ్చుకున్నట్టుగా అంది.
"ఇంతకీ అతడిది ఏ వూరు, ఏమిటి తెలుసా?"
"తెలియవు."
"కోపం వచ్చిందా?" శాలిని దగ్గరికి వచ్చి చేయి వేసింది సుధ.
"కోపం ఎందుకు?" శాలిని ముఖం త్రిప్పుకొంటూ అంది.
"మీ అమ్మలానో, నాన్నలానో కోప్పడ్డానని! ఇద్దరం స్నేహితులం, కలసి ఉంటున్నాం. ఒకరు రాంగ్ స్టెప్ వేస్తే ఇంకొకరికి సరిదిద్దే హక్కు వుంటుందని నా నమ్మకం."
"........"
"ఇంతకీ అతను బాచ్ లరేనా?"
"నేను తెలుసుకోలేదు? నేను ప్రేమిస్తున్నాను ఆయన్ని! అతడికి పెళ్లయిందా లేదా అని ఎవరిని అడగను?"
"అయితే నేను తెలుసుకొంటాలే!అతడు నీకు తగినవాడయితే మీ ఇద్దరి మధ్యన ప్రియదూతికను నేనవుతాను సరేనా!"
శాలిని క్షణంలో తన అలుకను మరిచిపోయినట్టుగా లేచివచ్చి సుధను కౌగిలించుకొని ఊపేస్తూ తన సంతోషాన్ని వ్యక్తంచేసింది.
రెండురోజుల తర్వాత ఊరు టూర్ ప్రోగ్రాం పెట్టుకు వెళ్లొచ్చిన సుధ,"బుద్దిలేకపోతేసరి! మనసు తెరమీద బొమ్మ చిత్రించుకొనే ముందు అతడికి పెళ్లయిందీ లేనిదీ తెలుసుకోవద్దా? అతడు నలుగురు బిడ్డల తండ్రి తెలుసా? అంది చీవాట్లు పెడుతూ.
