పడుతూలేస్తూ పరుగులిడే మహాప్రజ
పిలుస్తూ బెదురుతూపోయే కన్నుగవ
కాలి సంకెలల ఘలంఘల వినబడే రొద
ఏమీ తోచక భయంతో కళ్ళు మూశాను
అపుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది
ఆకు ఆకునీ రాల్చింది కడిమిచెట్టు
రేకు రేకునీ తొడిగింది మొగలి మొక్క
రెప్పరెప్పనీ తడిపింది కన్నీటి చుక్క
యెందుకో యీ ప్రాణిప్రాణికీ విభేదం
ఎరగని నా మనస్సు నాలోనే చెదిరింది
అపుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది
వెళ్ళిపోయే చీకటిని వదలలేక వదిలే తార
వదిలిపోయే జీవితాన్ని వీడలేక వీడిపోయే లోకం
కాలుజారి పడిన కాలపు పాడు నుయ్యిలో కనబడిన శూన్యం
కాలు కదిపిన చలువరాల సౌధంలో వినబడిన నిశ్శబ్దం
అపుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది
ఆకాశపు వొంపులోన ఆర్ధ్ర వెనుక నీ నవ్వు
పాతాళం లోతులలో ప్రతిధ్వనించింది సాగింది
అంధకారపు సముద్రానికి అవతల వొడ్డున నీ రూపం
అందుకోలేని నా చూపుకి ఆశ ఆశగా సోకింది
రా! ప్రశ్నించే నా మనస్సులో నీ చల్లని చేతితో నిమురుకో
రా! నా కనురెప్ప మాటుగా నీ మెరపు వీణ మెల్లగా మీటుకో
కమ్ముకుంది నాలో భయంతో కలసిన ధైర్యం
ప్రవహించింది నాలో తీరలేని రజిత నదం
ఇపుడే ఇపుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది.
* * *
---1944
