Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 17

ఈ రాత్రి
   
ఈ రాత్రి సామి దగ్ధమయింది
ఈ ధాత్రి నిస్తబ్దమై వుంది
హేమగాత్రి నీ చరణ మంజీరం
నిస్వనింపదు
నా లోపల ఆశామందరం
కిసలయింపదు

గాలిలోని ప్రకృతి యోగిలోగ రోగిలోగ
 మూల్గుతోంది
కాలు విరిగిన ముసలికుక్క దీనంగా
 మొరుగుతోంది
తరతరాల నిస్పృహ నన్నావరించుకొంది
 చర చరాలు తాకిన నీ మూర్తి ముడుచుకొంది

యుద్ధం మీద యుద్ధం వచ్చినా
   మనిషిగుండె పగలలేదు
మనిషి మీద మనిషి చచ్చినా
 కన్నుతుదల జాలిలేదు
నాగరికత మైలపడిన దుప్పటిలా నన్ను కప్పుకుంది
  నాకందని ఏదో రహస్యం
నన్ను వశం చేసుకుంది
   
పాముకోర డేగరెక్క ఈ కాలానికి చిహ్నం
పూలతేనె నెమలిరెక్క ఒక మిధ్యా ప్రమాణం
నా ప్రవృత్తి పసుపు వన్నెల పెద్దపులిలా పరచుకుంది
ఏదో విపత్ దూరంగా మబ్బులలో దాగివుంది

ఈ రాత్రి సామి దగ్ధమైంది
ఈ ధాత్రి నిస్తబ్దమైవుంది
హేమగాత్రి నీ చరణమంజీరం నిస్వనింపదు
నాలోపల ఆశామందారం కిసలయింపదు

    *   *   *       
                ---1944


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS