చీకటి కుంపటిలో అస్పష్ట భవిష్యత్తు
రాజుకుంటున్నది రవ్వలు రవ్వలై చుక్కలు ముక్కలై
"నాలుగు కొట్టింది చర్చిగంట
నిదురించే 'టులాన్' పట్టణపు గుండెలో
పగిలింది జర్మను శతఘ్ని..."
ఒక్కొక్కటి ఒక్కొక్కటి యుద్ధనౌకలు
ఒరిగి ఒరిగి సముద్ర నిర్ణిద్ర జలతరంగ భుజంగ
సరీరంభమ్ములలో సురిగిపోయినవి
బలి యిచ్చిన ప్రాణదీప్తి
జలధి గర్భాతరిత బడబాగ్నిలో కలిసి
శిఖలపఱచి, నాలికలు తెరచి, నాట్యమాడింది.
'టులాన్' భూమిమీద
ప్రజల వేడి కన్నీళ్ళ వాన వాగులై పారింది
ఒహో టులాన్! ఒహో టులాన్!
మరపురాని స్మృతిపై ఒరిగిపొమ్ము
మా బ్రతుకులలో కారుచిచ్చు కలవై, అలవై.
*
అది నవంబరు పండ్రెండవ తేదీ
దెబ్బతిన్న ప్రెంచి దేశం విప్పిచూపిన రక్తపు మరకల ఛాతీ
మండి మండి బాడబమై సాగిన రేగిన అవజ్ఞా జ్యోతీ.
నిశ్శబ్దపు మెత్తని పరుపులపై
నిదురించెను పట్టణమంతా
కొండచివర ఎర్రని నక్షత్రం
రాలి పడింది సముద్రనీలంలో
చీకటి కుంపటిలో అస్పష్ట భవిష్యత్తు
రాజుకొంటున్నది రవ్వలు రవ్వలై చుక్కలు చుక్కలై
నాలుగు కొట్టింది చర్చిగంట
నిదురించే టులాన్ నగర హృదయంలో
పేలింది జర్మన్ శతఘ్ని
శత్రు యంత్ర లోహ చక్రపదఘట్టనలో
పండీకృత ధరాతలం వేనవేలు
అవమానపు నెరదలలో ఆక్రోశించింది
చలువరాల గోరీలలో
మాతృధాత్రి మట్టి పొరలలో
మణగిన మృతవీరుల గుండెలలో
ఆ సమయంలో
డార్లన్ పెటెయిన్ లావెల్ మొదలగు నాయకులందరూ
అధికారపు చీకటిలో గొంతు విరిగిన గుడ్లగూబలు
'నాజీ నాజీ నరహంతకు' లను కేకలు
సముద్రపు గుండెలలో తిమింగలములవలె తిరిగినవి
'జై ఫ్రాన్సు జై' అను ధ్వానమ్ములు మ్రోగినవి.
* * *
* అదే గీతిక మరో రూపంలో
గుండెకింద నవ్వు
చేతిలో కలం అలాగే నిలిచిపోయింది
చివరలేని ఆలోచన సాగిపోయింది
ఏదో రహస్యం నన్నావరించుకుంది
అపుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది
