Previous Page Next Page 
శ్రీ మహాభారతము పేజి 16

 

    భీష్ముడు తల్లికి చేతులు జోడించినాడు "అమ్మా! నిన్ను నా తండ్రి కొఱకు అడిగినపుడు నీ తండ్రికి ఒక మాట ఇచ్చినాను. బ్రహ్మచర్యం వహించినాను. సూర్యుడు తేజస్సును నీడలేదు. చంద్రుడు చల్లదనము వీడలేదు. అగ్ని ఉష్ణమును వీడలేదు. అవి వాటి సహజ గుణములు. అట్లే నేను బ్రహ్మచర్యము వీడలేను."
    "నాయనా! నీ దీక్ష నాకు తెలియనిది కాదు. నీవు లోకవంద్యుడవు . సకల ధర్మములు తెలిసన వాడవు. వంశారక్షణ చేయు మార్గము ఆలోచింపుము. ఒకదారి చూపుము." అర్ధించినది సత్యవతి.
    "అమ్మా! మనకు వచ్చినటువంటి క్లిష్ట దశలు పూర్వము కూడ వచ్చినవి. పూర్వులు వాటిని పరిష్కరించినారు. ఆ విధానము అవలంబించుట ధర్మము అగును" అని భీష్ముడు వివరించినాడు:-
    పూర్వము పరశురామునకు క్షత్రుయుల మీద కోపము వచ్చినది. అతడు క్షత్రియులను హతమార్చినాడు. అపుడు రాజవంశము నశించు దశ వచ్చినది. అప్పుడు బ్రాహ్మణులు రాజ్యభార్యలకు సంతానము ప్రసాదించినారు. ఇది ధర్మ మగును.
    పూర్వము దీర్ఘతముడను ఋషి ఉన్నాడు. అతడు గుడ్డివాడు. అతని భార్య ప్రద్వేషిణి. ఆమె అతనికి అనుకూలవతిగా ఉన్నది. ఆమెకు గౌతముడు మున్నగు అనేకమంది సంతానము కలిగినారు. సంతానము కలిగిన తరువాత ప్రద్వేషిణి భర్తను లెక్కచేయలేదు. అతని విషయమున కోపము పెంచుకొన్నది. దీర్ఘతముడు భార్యను అందుకు కారణము అడిగినాడు.
    "నాధా! మగవాడు భార్యను భరించును. అందువలన భర్త అయినాడు. ఆడది భరించబడును. అందువలన భార్య అయినది. మన విషయమున ఇది విపరీతము అయినది. నేను నిన్ను భరించుచున్నాను. చాలును. ఇంక భరించలేను. వేరొక ప్రదేశమునకు వెళ్ళుము" అన్నది.  
    ఆ మాటలు విన్నాడు దీర్ఘతముడు. కోపించినాడు. శపించినాడు.
    "స్త్రీలు కులవంతులు కావచ్చును. ధనవంతులు కావచ్చును. అయినను భర్తలు మరణించినపుడు వారు అలంకారము కోల్పోవుదురు మంగల్యము లేనివారయి ఉందురు. దీనవృత్తి కలిగి ఉందురు."
    అది విన్న ప్రద్వేషిణి కోపించినది. కొడుకులను పిలిచినది. తండ్రిని నదిలో వేసిరమ్మని చెప్పినది. కొడుకులు తండ్రిని తీసుకుని వెళ్ళినారు. కట్టెలు కట్టి నదిలో విడిచినారు.
    దీర్ఘతముడు నది వేగమునకు సాగిపోవుచున్నాడు. అతడు వేదాధ్యయనము చేయుచున్నాడు. బలి అను రాజు స్నానమునకు ఏటికి వచ్చినాడు. వేద ధ్వనులు విన్నాడు. దీర్ఘతముని రక్షించినాడు. రాజ సౌధమునకు తీసుకొని వెళ్ళినాడు. తనకు సంతానము లేదు, ప్రసాదించవలసినదని ప్రార్ధించినాడు. తన భార్య సుధేష్ణను దీర్ఘతమునకు అర్పించినాడు. ఆమెకు దీర్ఘతముని వలన అంగరాజు జన్మించినాడు.
    "అమ్మా! ఇవి పూర్వ వృత్తాంతములు. ధర్మ శాస్త్రములు ఈ పద్దతిని ఆమోదించినవి. విచిత్రవీర్యుని భార్యలకు సంతానము కలుగవలెను. అందుకు మనము ఒక మంచి బ్రాహ్మణుని ఎంచుకొనవలసి ఉన్నది" అన్నాడు భీష్ముడు.
    సత్యవతి భీష్ముని మాటలు విన్నది. ఆమెకు తన పూర్వవృత్తాంతము గుర్తునకు వచ్చినది. యౌవనము గిలిగింతలు పెట్టినది. తాను పరాశరుని నది దాటించుట, అతని వలపు, తాను అడిగిన వరములు, కృష్ణ ద్వీప సంగమము, వ్యాసుని జననము వివరించినది. తనను తలచినపుడు వత్తునని వ్యాసుడు వరమిచ్చినాడని చెప్పినది.
    "అమ్మా! నీవు ధన్యవు. వేదవ్యాసుని కన్నావు. వేదవ్యాసుడు బ్రహ్మతో సామానమయినవాడు. లోక వంద్యుడు. సచ్చరిత్రుడు. అతను కౌరవ వంశము నిలుపుటకు అందరు సమ్మతింతురు." అన్నాడు భీష్ముడు.
    సత్యవతి సంతసించినది. వేదవ్యాసుని మనసున తలచినది. వ్యాసుడు ప్రత్యక్షము అయినాడు.
    వ్యాసుడు నేలమేఘమువలె ఉన్నాడు. నీల పర్వతము వాలే మెరిసి పోవుచున్నాడు. శిరస్సు పర్వత శిఖరము. జడలు బంగారు తీవెలు వాక్యము వేదవాక్కు.
    వ్యాసుడు తల్లి ముందు నిలుచున్నాడు. సత్యవతి కలకాలమునకు కొడుకును చూచినది. ఆమె మనసు కరిగినది. పుత్ర వాత్సల్యము పొంగి పొరలినది. ముందుకు ఉరికినది. వ్యాసుని కౌగలించుకొన్నది. ఆమె వాత్సల్యము మనసు నిండి, గండి కొట్టి , కనుల నుండి ఆనంద భాష్పములయి ప్రవహించినది. వ్యాసుడు ఉక్కిరిబిక్కిరి అయినాడు. తల్లి కన్నీటిని తుడిచినాడు. మాతృమూర్తికి పాదాభివందనం చేసినాడు. తల్లీ కొడుకులు అనందసాగరమున తెలినారు. భీష్ముడు అది చూచినాడు. అతని కనులు చెమ్మగిలినవి. మనసు పోటమారించినది.
    భీష్ముడు వ్యాసునకు అర్ఘ్య పాద్యములు ఇచ్చినాడు. ఆసనము చూపించినాడు. వ్యాసుడు అసీనుడు అయినాడు. సత్యవతి పక్కనే కూర్చున్నది. సాగించినది.
    "నాయనా! నీవు ఎరుగని ధర్మమూ లేదు. నేను నీకు తల్లిని తల్లిని మించిన దైవము లేదు. నేను నిన్ను ఒక సత్కార్యామునకు నియమించుచున్నాను. నిర్వర్తించవలెను.
     నీకు తెలియని కధలు లేవు. నీవు చెప్పని ధర్మము లేదు. భీష్ముడు మహాత్యాగి. అతడు తండ్రి కొఱకు చేసిన త్యాగము అనితర సాధ్యము. అతడు బ్రహ్మచర్యము అవలంబించినాడు. రాజ్యమును వదులుకున్నాడు. జీవితమును వదులుకొన్నాడు. చిత్రాంగద, విచిత్రవీర్యులు మరణించినారు. భరతవంశము అంతరించనున్నది. నేను తల్లిని. నిన్ను ప్రార్ధించరాదు. అయినను అడుగుచున్నాను. నీవు దేవర న్యాయము అవలంబించుము. అంబికకు, అంబాలికకు సంతానము ప్రసాదించుము. ఇది నీ తల్లి కోరిక. తీర్చుట నీ ధర్మము" అన్నది.
    వ్యాసుడు తల్లి చెప్పినది విన్నాడు. అన్నాడు:-
    "అమ్మా! నీవు చెప్పిన కార్యము నిర్వర్తింతును. అది నా ధర్మము. అదికాక దేవరన్యాయము శాస్త్రసమ్మతము. అంబిక, అంబాలికలు ఒక సంవత్సరము వ్రతము అవలంబించిన మంచిది. పరిశుద్దులు అయినవారికి తేజోవంతమయిన, సంతానము కలుగును."
    సత్యవతి సంవత్సరము నిలువలేకపోయినది. ఆరోజుననే అంబికతో సంగమించవలెనని కోరినది. వ్యాసుడు అంగీకరించినాడు.
    సత్యవతి అంబికను ఒప్పించినది. బ్రాహ్మణులకు , దేవతలకు ఋషులకు మృష్టాన్నములు పెట్టించింది.
    ఆ రాత్రి అంబిక పాన్పుపై ఉన్నది. వ్యాసునికయి వేచి యున్నది. వ్యాసుడు వచ్చినాడు. ఆమె అంతకుముందు అతనిని చూడలేదు. హటాత్తుగా చూచినది. పొడవయిన గడ్డము, ఎర్రని కనులు - వ్యాసుని చూచినది దడుచుకున్నది.
    కన్నులు మూసుకున్నది. ఆ రాత్రి వ్యాసుడు అంబికతో సంగమించినాడు.
    తెల్లవారినది. సత్యవతి వ్యాసుని చూచినది. "అమ్మా! అంబికకు బలపరాక్రమములు గల పుత్రుడు పుట్టును. కాని ఆమె యందున్న రోషమువలన అతడు అంధుడగును" అన్నాడు.
    సత్యవతి వ్యాసుని మాటలు విన్నది. ఆమె మనసు ఏడ్చినది. అంబాలిక యందు మరొక పుత్రుని ప్రసాదించమని కోరినది. వ్యాసుడు అంగీకరించినాడు. ఆ రాత్రి అంబాలిక వ్యాసుని చూచినది. తెల్లబడి పోయినది. వ్యాసుడు సంగమించినాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS