Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 15


    అది చూడగానే అభిషేకన్ కళ్ళు కుట్టాయ్. కడుపు మండింది. పైత్యం ప్రకోపించింది. దానివైపు గుర్రుగా చూశాడు.
    "రేయ్ ముత్తేశే" అన్నాడు పోస్టరు లోని హీరో వైపు విలన్ లా చూస్తూ "రేయ్ పైత్తేకారీ! దొంగామూతి పెట్టి ఏం చూస్తున్నావురా? మా యం.జి.ఆర్. కాళ్ళ నడుమ నుంచి ఇటు నుంచి అటూ, అటు నుంచి యిటూ , ఇటు నుంచి అటూ పదిసార్లు పోర్లినా అయన యాక్టింగ్ నీ కెక్కడ వస్తుందిరా! రేయ్ సోంబేరీ!" అని తిట్టి, ఇంకా తిక్క తగ్గక, అటూ యిటూ చూసి, రోడ్డుమీద వున్న ఒక పెద్ద కంకర్రాయి తీసి పోస్టరు మీదకు విసరబోయాడు.
    అలాంటి పనులన్నీ అతను చిన్నప్పుడు వాళ్ళ వూళ్ళో చేసినవే. అతను మనిషి పెద్దవాడయ్యాడు గానీ, పిల్లచేష్టలు ఇంకా పోలేదు.
    అతను రాయి అనుకుని చేత్తో అందుకున్నది రాయి కాదు. పెడ ముద్ద. చీకట్లో అది అతనికి సరిగ్గా కనబడలేదు. ఆ పెడ అతని చేతి కంతా అంటింది.
    వికారంగా మొహంపెట్టి "చ్చో చ్చో చ్చో" అన్నాడు అభిషేకన్.
    అతను అలా అనగానే , అప్పటిదాకా గోడమీదికి కాలెత్తి బిజీగా తనపని తను చేసుకుపోతున్న ఒక ఊరకుక్క ఉరికి వచ్చి, వెనక నించి అతని కాలిని నాకింది అభిమానంగా.
    హటాత్తుగా కాలుకి చల్లగా తగిలేసరికి అభిషేకన్ పై ప్రాణాలు పైనే పోయాయి.
    గాల్లోకి గెంతి "అమ్మో!" అని వెర్రి కేక పెట్టాడు.
    ఆ కేకకి కుక్క బెదిరిపోయి భౌయ్యిమని మొరిగింది.
    వెంటనే లుంగీ పైకి ఎగకట్టి , స్పేస్ షటిల్ కన్నా వేగంగా దూసుకుపోయాడు అభిషేకన్.
    కుక్క వెంటపడింది.
    ఆ గందరగోళంలో , అభిషేకన్ జేబులోనించి ఒక ఐదు పైసల నాణెం బయటకు దూకి గుండ్రంగా దొర్లుతూ రోడ్డుప్రక్కన వున్న చెత్తకుండీ దగ్గరకు వెళ్ళిపోయింది.
    రెండువేల గజాల దూరం వెనక్కి తిరిగి చూడకుండా పరీగెత్తాక ఆగి, రొప్పుతూ చూశాడు అభిషేకన్.
    ఆ కుక్కకి ఇంతకంటే మంచి కాలక్షేపం మరేదో దొరికినట్లుంది అది ఎక్కడో ఆగిపోయింది.
    కుక్క గండం తప్పిందని రూడి అయ్యాక అప్పుడు గుర్తొచ్చింది అభిషేకన్ కి ......దార్లో పడిపోయిన అయిదుపైసల నాణెం.......
    అతనికి గుండె కలుక్కుమంది.
    వెనక్కు తిరిగివచ్చి , తను పోగొట్టుకున్న ఆ ఐదుపైసల నాణెం కోసం వెదకడం మొదలెట్టాడు అభిషేకన్. అవును! ఇక్కడే! ఈ బారు పక్క సందులో వున్న చెత్తకుండీ దగ్గరే తన ఐదు పైసలు పడిపోయింది.
    అక్కడ వెదకడం మొదలెట్టాడు. ఐదుపైసలు దొరకలేదు. ఐదుపైసలే గదా అనిగానీ, పోనీ అదయినా దొరకలేదు కదా అని గానీ అతను వెదకడం మానేయ్యలేదు.
    పైసలకీ, అతని ప్రాణాలకీ లంకె వుంది.
    రెండేళ్ళ క్రితం అతనిదో ఐదు పైసలు పోయింది. అతనికి బాగా గుర్తు.
    అది గుర్తొచ్చినప్పుడల్లా అతని గుండెలో గునపం గుచ్చినంత బాధ కలుగుతుంది.
    మళ్ళీ ఇప్పుడు ఇంకో ఐదు పైసలు!
    గుడ్లెంబడి నీళ్ళు కక్కుకుంటూ చెత్తకుప్పంతా తెగ వెతికేస్తున్నాడు అభిషేకన్.
    అప్పుడు తగిలింది అతని కాలికి ఏదో మెత్తగా చూశాడు. ఎవరో మనిషి! చీకట్లో అస్పష్టంగా కనబడుతోంది అకారం అభిషేకన్ గుండె ఆగిపోయినట్లయింది.
    ఆ ప్రయత్నంగానే అతని గొంతులోనింఛి కీచుమని కేక ఒకటి వెలువడింది. అటువైపే వెళుతున్న ఒక కారు ఓనరు ఆ కేక విని కారు ఆపాడు సడెన్ బ్రేకుతో. అభిషేకన్ చెప్పింది విన్న తర్వాత కారు హెడ్ లైట్స్ కుండీ వైపు ఫోకస్ చేశాడు అతను.
    కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ లైట్ల కాంతిలో అప్పుడు స్పష్టంగా కనబడింది అభిషేకన్ కి ------

    చలన రహితంగా పడివున్న ఉదయార్కర్ శరీరం!

                                    *     *    *    *

    అయిదవుతుండగా ఎడిటరు దగ్గర వున్న ఫోన్ రింగ్ అయింది.
    కమీషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర నించి ఫోన్.
    "హలో ఎడిటర్ జీ గుడ్ మార్నింగ్!" అన్నాడు కమీషనర్.
    "హలో! ఉదయార్కర్ జాడ ఏమన్నా తెలిసిందా! అన్నాడు ఎడిటరు ఆదుర్దాగా.
    కమీషనరు అపాలజెటిక్ గా అన్నారు. "ఇంతవరకూ లేదు. గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం మేము. మీరు చెప్పిన బ్యూటీ క్లినిక్ కి మా వాళ్ళని పంపించాను.
    "ఆ ఇద్దరు లేడీస్ ఉన్నారా?"
    "ఇద్దరేమిటి! అయిదారు లేడీస్ ఉన్నారు. అక్కడ ఉత్త లేడీస్ కాదు లేడీ డాక్టర్స్. అది క్లినికే గానీ బ్యూటీ క్లినిక్ కాదు. ఇరవై నాలుగు గంటలూ తెరిచి ఉండే నర్సింగ్ హోమ్! వెరీ రెస్పక్టబుల్ ఎడిటర్ జీ! ఆర్ యూ ష్యూర్ దట్ యూ గివెన్ ద కరెక్ట్ అడ్రస్!"
    "ఐయామ్ వెరీ ష్యూర్!" అన్నారు ఎడిటరు.
    అది విని కాసేపు మౌనంగా ఉండిపోయాడు కమీషనరు. తర్వాత అనుమానం ధ్వనిస్తున్న గొంతుతో అన్నాడు. "సరే మా ప్రయత్నాలు మేం చేస్తూనే ఉంటాం. ఉదయార్కర్ వేర్ అబౌట్స్ తెలియగానే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఉంటాను ఎడిటరు జీ!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS