శ్వేతకి మమ్మీని కనుగొనే దారిని వివరించే బ్రాహ్మీమయమయిన అమృతక్షరాలున్నాయి. కాని అవి సరిగా అర్ధం కావటం లేదు. చిలుము తినివేయటంతో కొన్ని అరిగిపోయాయి. కొన్ని చిల్లులు పడి అదృశ్యమయినాయి.
వాటి గురించి తపనతో తీవ్రమయిన ఆలోచనలకు గురి అవుతుండగా తలుపు తట్టిన చప్పుడైంది. లేచి వెళ్ళి తలుపు తీసింది జ్యోతి. ఎదురుగా ఒక యువతి ప్రత్యక్షమయింది. సూర్యకాంతి మానవాకృతి దాల్చినట్లు ధవళకాంతులు విరజిమ్ముతున్న వస్త్రాలతో, మల్లెపూవులాంటి శరీర ఛాయతో, అలౌకికమయిన చూపులతో తెల్లని చిరునవ్వు నవ్విందామె. నిలువెల్లా మెరుపులా కన్పించే ఆ దావల్యానికి కన్నులు మిరుమిట్లు గొలిపినాయి జ్యోతికి. "ఎవరు నీవు?" అని అడిగింది. "నా పేరు శ్వేతకి " అంటూ జల తరంగిణుల మ్రోగుతున్న మధుర మధుర కంఠస్వరంతో బదులు చెప్పిందా ధవళమూర్తి.
5
ఆమె చూపులు సమ్మోహన శక్తితో నిండిన తూణీరాల్లా ఉన్నాయి. ముఖం స్ఫూర్తివంతంగా , ఉజ్వలంగా , కాంతితో నిండారి ఉంది. చేతులు సున్నితంగా పట్టుకుంటే కందిపోతాయేమో ననిపించేలా ఉన్నాయి.
ధవళవర్ణం చీర నమ్మలేనంత కాంతితో మెరుస్తోంది.
కుచ్చిళ్ళ చాటున పాదాలు నేల మీద తాకుతున్నాయా, లేదా అన్న విచికిత్స కలిగిస్తూ సుతారంగా అడుగు ముందుకు కదల్చింది ఆమె. ఆ చొరవకు ఆశ్చర్యంతో రాటలా అయింది జ్యోతి.
ఆనవాగతురాలి చూపులు తన సర్వ శక్తులనూ వశీకరించుకుంటూన్నాయేమో అనిపించింది. అందుకు తోడూ తన పేరు శ్వేతకి అని చెప్పటంతో జ్యోతి గుండెలు దడదడలాడినాయి. ఏ శ్వేతకి ఈమె?
అటువంటి పేరు పురాణాలలోనో, కొన్ని సాహస్రాబ్దాలనాడో ఉంటే ఉన్నదేమో! కాని ఈ మధ్య తానెన్నడూ వినలేదు. తాను తామ్రపత్రాలపై అన్వేషించే సమాధి గుహ తాలుకూ ప్రేతాత్మ పేరు కూడా శ్వేతకి అన్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఆమెకు జ్ఞాపకం వచ్చిన మరుక్షణమే దవడ కండరాలు బిగుసుకున్నాయి.
అరుణ ధరాలు వడవడ వణికినాయి.
ఆ ప్రేతాత్మ యిలా వచ్చిందా? రావటం సాధ్యమేనా అని అయోమయంలో పడి ఆలోచించసాగింది జ్యోతి.
"సోదరీ! ఎందుకలా చూస్తావు. నీ కనుల ఎదుటే నిలిచిన కలను. పగటి కలను. సోదరీ! నీలాగే నేను ఒకప్పుడు ఈ కృష్ణావేణీ సలిలధారలతో జీవితాన్ని నిలుపుకున్న ఈ ప్రాంతాల ఇంటి ఆడపడుచును.
నన్ను చూసి రవంతయినా భయపడకు. నీ సహాయాన్ని అర్ధించి వచ్చినాను. నన్ను కాపాడు" అన్నదామె. కమనీయ జలతరంగిణియే పలుకుతున్న కంఠస్వరంతో.
మిగిలి వున్న గుండె దిటవు కాస్తా దిగజారిపోయింది. జ్యోతి ఆమె మాటలు వింటూ ఆమె వంక రెప్పవేయక చూడసాగింది.
"సోదరీ నాతొ పలుకవా? మాట్లాడవా?" అంటూ హెచ్చరించినది శ్వేతకి. తెల్లని చిరునవ్వు చెరగలేదు.
జ్యోతి ఏదో మాట్లాడాలనుకుంది . కాని అది సాధ్యపడలేదు . పెదవులు తడారినాయి. నాలుక పిడచ కట్టుకు పోయింది.
"పోనీలే! నీవు మాట్లాడలేవు. నేనే మాట్లాడతాను విను. నీవు నా గురించి తపన పడుతున్నావు. ఎలాగయినా నేను శయనించిన సమాధి గుహ ఆనుపానులు తెలుసుకోవాలని తహతహలడుతున్నావు.
కాని అది ఎంత ప్రమాదకరమయిన సాహసమో ఆలోచించలేక పోతున్నావు కదా! ఆ నిష్టురాలన్నింటినీ నీవు భరించలేవు. ఆ ప్రయత్నం మానుకోమని చెప్పేందుకే నేను వచ్చాను" అన్నది శ్వేతకి. జ్యోతికి ఆ సంభాషణలో అర్ధమేమిటో అవగాహనకు రాలేదు. ఈ పని తనవల్లనే కావాలని శ్వేతకి ఆత్మరూపం కోరుతుందని, అందుకే ఆనాడు లాంచి లోనూ, ఈ మధ్య ప్రొఫెసర్ శ్రద్దాదేవి ఇంటి లోనూ రక్తపాతం సంభామయిందనీ చెప్తోంది ప్రొఫెసర్! కాని ఈనాడు అనూహ్యమయిన రీతిలో ప్రత్యేక్షమయిన ఈమె ఈ ప్రయత్నం చేయవద్దని వారిస్తోంది.
ఈ రెండు వాదనల మధ్య సమన్వయం కుదరక రవంత కలవరపాటున పడింది జ్యోతి.
అయినా సడలిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంది. దిగజారి పోతున్న మానసిక శక్తులను సమీకరించుకుంది.
"సోదరీ! తప్పో, ఒప్పో నేనొక నిర్ణయానికి వచ్చేశాను. ఆ నిద్ణయం వెనుక మా తాతల తండ్రుల జీవితాశయాలు అంతర్లీనమయి వున్నాయి. వారి ఆశయాలను నెరవేర్చటమే నా బ్రతుకులోని అర్ధంగా భావించుకున్నాను.
అందువల్ల నా నిర్నయాన్నించి దూరం కావాలని నేనుకోరను. ఎవరో తెలియని నీవు నా నిర్ణయాన్ని మార్చాలని చూడటం వృధా ప్రయాస అనుకుంటాను " అన్నది జ్యోతి మనో దృతిని ప్రదర్శిస్తూ. కాని అప్పటికే ఆమెకు నవనాడులు కృంగిపోతున్నాయి. పెదాలు పొడిపొడిగా అయినాయి. నాలుక మొద్దు బారిపోయి మరింత మాట పెగిలిరావటమనేది అసాధ్యమయింది.
జ్యోతి మాటలను శ్రద్దాసక్తులతో విన్న శ్వేతకి పెద్దగా నవ్వింది. ఆ దరహాసపు కాంతుల వల్ల గది అంతా దీపాలు వెలిగినట్లు అయిపొయింది. గాజు పలుకలు బ్రద్దలవుతున్నట్లు, చిన్ని చిన్న రాళ్ళ పైకి జలపాతం దూకుతున్నట్లు శభ్ద మయింది.
ఉలికి పడి చూచింది జ్యోతి.
శ్వేతకి చూపులు మరింత తీక్షణమయినాయి. మొదలే ఉజ్వలంగా వున్న ముఖముద్ర మరింత ఉజ్వలమయింది. ఆ ముఖ కాంతిలో కరుణ, దయ, పాప భీతి, మటుమాయమైనాయి. పగబట్టిన కన్నె త్రాచు బుస కొట్టినట్టుగా దీర్ఘతరమయిన నిట్టుర్పు విదిచిందామే. నేత్రాలు సువిశాలమయినాయి. సూర్యకాంతి లో మండుతున్న మందార వర్షంలా అయినాయి. ఆ అరుణాంచితమయిన సువిశాల నేత్రాలతో తీక్షణంగా జ్యోతి వంక చూచింది శ్వేతకి.
జ్యోతి ఆ చూపుల ధాటికి మనసు నిలువరించుకోలేక వడవడ వణికిపోయింది. కన్నులు తిరిగినట్లు అయింది.
"అల్పమయిన మానవ శరీరంలో మ్రగ్గిపోతున్న దానవు. నన్ను ఎదిరించి నిలువరించుకో గల ననుకుంటున్నావా? ఎంత కించపరచుకున్న ఆలోచన యిది?
ఈ శ్వేతకిని కాదని ఎలా సాహసించగలవో చూస్తాను. తులువా ఒక్క క్షణంలో నీవు నేలమీద పడిపోతున్నావు. నీకు ఈ లోకమంతా చీకటిమయం అయిపోతోంది. నన్ను ఎదిరించగలిగిన శక్తులన్నీ నీలో అంతరించిపోతున్నాయి ......." అంటూ ఏవేవో మాట్లాడసాగింది శ్వేతకి.
జ్యోతి మనోద్రుతి అంతా ఒక్కసారి నీరుకారిపోయింది. ఆమె మన్హ పటలం మీద శ్వేతకి అంటున్న మాటలే ముద్రిత మవుతున్నాయి . తనను తాను మరచిందామె.
శ్వేతకి మాట్లాడుతున్న మాటలు అక్షరాలా నిజమవుతున్నాయి. ఆమెకు ప్రపంచమంతా చీకటి మయంగా అయిపోయినట్లు అనిపించసాగింది. ఇప్పుడు ఏమీ కనిపించడంలేదు. చివరకు శ్వేతకి కూడా కన్పించడం లేదు.
శారీరకమయిన శక్తులన్నీ క్షీణిస్తున్నాయి. నిలుచున్న చోటు దబ్బున నేల మీద పడి'పోయిందామే.
