Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 16


    రాజేశ్వరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏదో అనాలనుకుంది. కాని కంఠం పెగల్లేదు.


    "నేను అనాధనో, అక్రమ సంతానాన్నో తెలుసుకోవాలి" గొణుగుతున్నట్టు అన్నాడు శరత్.


    "ఎందుకు అంతగా బాధపడ్తావ్? ఆ విషయం తెలుసుకోవటానికి ఏమంత కష్టం? మీ అమ్మగారిని అడుగు."


    "ఆమెను అడగలేను. అడక్కపోతే తెలుసుకోలేను. అదే నా బాధ."


    "పోనీయ్, మీ నాన్నను అడుగు."


    "అడిగాను."


    "ఏమన్నారు?"


    "ఆయనకు కూడా తెలియదు."


    "ఆయనకు తెలియకుండా ఎలా వుంటుంది?"


    "నిజంగానే తెలియదు."


    రాజేశ్వరి ఆశ్చర్యంగా చూసింది.


    "నిజం రాజూ! ఆయనకు తెలియదు."


    శరత్ రాజేశ్వరికి తండ్రి చెప్పిన విషయం చెప్పాడు.


    రాజేశ్వరి కళ్ళు చెమ్మగిల్లాయి.


    మనసులోనే సుశీలమ్మకు నమస్కరించింది.


    "శరత్! మీ అమ్మ నిజంగా దేవత. నిన్ను ఎక్కడనుంచి తెచ్చిందో, ఏ పరిస్థితుల్లో తెచ్చిందో, ఎవరి బిడ్డవో భర్తకు కూడా చెప్పలేదు. అంటే నువ్వు తన కన్నబిడ్డ కాదు అనే భావాన్ని ఆమె సహించలేకపోయింది. చనిపోయిన బిడ్డే నిజంగా తిరిగి వచ్చాడనే ప్రేమతో పెంచుకొని నిన్ను పెంచింది."   


    రాజేశ్వరి ఆగి శరత్ ముఖంలోకి చూసింది.


    శరత్ తల వంచుకొని వుండటంవల్ల అతని ముఖంలో భావాలను చూడలేకపోయింది.


    "ఆ మమతామయిని బాధ పెడ్తావా? ఆమెను దూరంచేసి, నిన్ను కనిపారేసిన స్త్రీని వెతుక్కుంటూ వెళ్తావా?"


    "సుశీలమ్మే నాకు తల్లి, ఆమెను దూరం చేసుకోలేను."


    "మరి?"


    "కాని నన్ను కన్నతల్లిని నేను చూడాలి. ఆమె ఇప్పుడు ఏ పరిస్థితిలో వుందో చూడాలి."


    "చూసి ఏం చేస్తావ్?"


    "ఇప్పుడే ఎలా చెప్పగలను?"


    "ఆమెను చూస్తే నీకు మనశ్శాంతి లభిస్తుందా?"


    "అలాగే అనుకుంటున్నాను."


    "నువ్వీ ప్రయత్నం మానడం మంచిది. ఆమె కన్పించకపోవచ్చు. అంతకు కన్పించినా నీ మనసు మరీ బాధపడవచ్చు."


    శరత్ రాజేశ్వరి కళ్ళలోకి చూశాడు.


    "కన్నబిడ్డల్ని ఎందుకు పారేస్తారో నీకు తెలియదా! ఎన్నో కథలు వింటున్నాం!"


    శరత్ ముఖం చిన్నబుచ్చుకున్నాడు.


    రాజేశ్వరి మళ్ళీ అన్నది.


    "మీ అమ్మను ఎవడో మోసంచేసి వుంటాడు. నిన్ను పెంచే దారిలేక ఎక్కడో పడేసి వుండవచ్చు. ఆ తర్వాత ఆమె ఎక్కడకు చేరి బ్రతుకుతోందో! ఈ సమాజం ఒక్కసారి పొరపాటు చేసిన స్త్రీని, దెబ్బతిని కిందపడ్డ కాకిని కాకిమూక పొడిచినట్టు పొడుస్తుంది. అది భరించలేక ఏ చీకటి బజార్లలోకో....-"


    "రాజూ!" శరత్ దాదాపు అరిచినట్టే అన్నాడు.


    "ఉద్రేకపడకు. తాపీగా ఆలోచించు, ఆమె ఏ బ్రోతల్ హౌస్ లోనో...."


    "రాజూ!" శరత్ నిలువెల్లా వణికిపోయాడు. బలవంతంగా కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు.


    "మాకు తెలిసిన ఒక అమ్మాయి ఇలాంటి పనే చేసింది. తర్వాత కొంతకాలం పడుపు వృత్తిచేసి బ్రతికిందట. ఇప్పుడు శరీరం ఓపిక పోయి, జబ్బులతో పుచ్చిపోయి బస్ స్టాండులో అడుక్కుతింటూ వుందట. మా నాన్నగారికి ఒకసారి కన్పించిందట. ఆమె గుర్తులేదు తను ఫలానా అని చెప్పుకొని ఏడ్చిందట" అని ఆగి శరత్ ముఖంలోకి చూసింది.   


    ఆ విద్యుద్దీపాల కాంతిలో శరత్ ముఖం కందిపోయి కన్పించింది. కళ్ళలో ఎర్రజీరలు కన్పించాయి. పెదవులు వణుకుతున్నాయి.  


    ఏదో మాట్లాడాలన్న ప్రయత్నం ఫలించలేదు.


    గుప్పెళ్ళు బిగించి ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోసాగాడు.


    శరత్ రూపం చూసి జంకింది.


    "శరత్! ఉద్రేకపడకు. తాపీగా ఆలోచించు. వినడానికే అలా బాధపడుతున్న నువ్వు, ఆమెను నిజంగా ఆ పరిస్థితుల్లో చూడటం సంభవిస్తే భరించగలవా? అందుకే ఈ ప్రయత్నం మానుకోమన్నాను" రాజేశ్వరి కంఠం ఆర్ద్రతతో నిండిపోయింది.


    ఉద్రేకాన్ని అనుచుకొనే ప్రయత్నంలో పళ్ళు కరుచుకున్నాక గవదల ఎముకలు పైకి లేచాయి.


    "శరత్! నిన్ను బాధపెడ్తే క్షమించు!" వ్యథాపూరిత కంకణం అన్నది రాజేశ్వరి.


    శరత్ ఎడంచేతి బొటనవేలూ, నడిమివేలుతో కణతలు పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు.


    రాజేశ్వరి శరత్ కేసి జాలిగా చూసింది.


    దీర్ఘంగా నిట్టూర్చింది.


    ఏమైనా సరే శరత్ ను ఈ ప్రయత్నం నుంచి విముక్తుణ్ణి చేయాలి. అందుకు అతని మనసు నొప్పించక తప్పదు.    


    "శరత్!"


    శరత్ ముఖంమీది నుంచి చేతిని తీసి కళ్ళు తెరిచాడు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS