Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 15


    "రాజూ!" బాధగా అంటూ రాజేశ్వరి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.


    "నువ్వు బతుకుతో రాజీపడగలవేమో కాని నేను పడలేను. నాకు నువ్వు లభించని పక్షంలో నేను అసలు వివాహమే చేసుకోను."   


    రాజేశ్వరి విరక్తిగా నవ్వింది.


    "అలా నవ్వకు రాజూ! నేను బాధపడుతుంది మన వివాహం గురించి కాదు."


    రాజేశ్వరి విస్మయంగా శరత్ ముఖంలోకి చూసింది.


    "నేను ఇంతకాలం పదిలంగా నివసిస్తున్నాననుకొన్న ఆ రెండంతస్థుల సిమెంట్ మేడ కేవలం గాజుమేడ అనీ, ఒకరాయి తగిలితే చాలు ఆ భవనం నా మీద విరిగిపడుతుందనీ, ఆ గాజుముక్కలు నా మనస్సులో లోతుగా గుచ్చుకుంటాయని తెలియదు."


    రాజేశ్వరి శరత్ ముఖంలోకి అయోమయంగా చూసింది.


    "ఇరవై రెండేళ్ళుగా తన హృదయంలోని మమతనంతా పంచి ఇచ్చి పెంచిన ఆ తల్లి నా తల్లి కాదు. నాకు నీడను ఇచ్చి, పెట్టి పోషించిన తండ్రి నా తండ్రికాదు."


    "శరత్" అయోమయంగా అన్నది రాజేశ్వరి.


    "ఏమిటి నువ్వంటున్నది? ఈ వివాహానికి ఒప్పుకోనంత మాత్రంచేత తల్లితండ్రుల్ని కాదంటావా?" ఆశ్చర్యం నుంచి పూర్తిగా బయటపడకుండానే అన్నది.   


    "నిజం రాజూ! వాళ్ళు నా తల్లిదండ్రులు కారు."


    రాజేశ్వరి నమ్మలేనట్టు చూసింది.


    "నమ్మకం లేదా? నాలో ప్రవహిస్తున్నది వాళ్ళ రక్తం కాదు నేనెవర్నో నాకే తెలియదు. ఈ సంగతి తెలిస్తే బహుశా మీ అమ్మా నాన్న ఈ వివాహానికి అంగీకరించరు" తనకు తనే చెప్పుకుంటున్నట్టు చిన్నగా అన్నాడు.


    "శరత్! ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నీకు మతిపోలేదు కదా?"


    "నా బాధ కూడా అదే. మతిపోతే ఈ బాధ ఉండేది కాదు. ఈ భయంకర సత్యాన్ని తెలుసుకొని కూడా మామూలుగా వుండగలుగుతున్నాను" శరత్ కంఠం గంభీరంగా వుంది.


    "అసలు ఏం జరిగిందో చెప్పు! ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నావ్?"


    "నిజమే రాజూ! నేను వారి కన్నబిడ్డను కాదు. నన్ను పెంచుకున్నారు."


    "ఎవరన్నారు?"


    "నాన్న!"


    "అబద్ధం! నువ్వు హరిజన బాలికను చేసుకుంటానంటే కోపంలో అన్నారేమో? పెద్ద అంతస్థులో వుండి ఉన్నతకులానికి చెందిన ఏ తండ్రి ఒక హరిజన పిల్లను కోడలుగా స్వీకరించలేడు. అంతే" విరక్తిగా అన్నది రాజేశ్వరి.


    "కాదు, నేను చెప్పేది నిజం. నాన్న ఆ మాట నాతో అనలేదు రాత్రి నా వివాహం విషయంలో అమ్మా నాన్న ఘర్షణ పడ్డారు. మా అమ్మ మీద కేకలు వేశారు. దిక్కూ మొక్కూ లేనివాణ్ణి కులంలేనివాణ్ణి తెచ్చి పెంచావ్. ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయని అరిచారు, అమ్మ ఒకటే ఏడుపు. నేను పక్కగదిలో పడుకున్నాను. ఆ కేకలకు మెలకువ వచ్చింది.  


    "నీకు కలవచ్చి వుంటుంది."


    "కాదు నిజం. ఇది వాస్తవం నువ్వూ, నేనూ, మనం కూర్చున్న బెంచీ, మన ఎదురుగా ఉన్న ఈ హుసేన్ సాగర్ ఎంత వాస్తవాలో నేను చెప్పేదీ అంతే వాస్తవం" ఆవేశంగా అన్నాడు శరత్.  


    రాజేశ్వరికి ఇంకా నమ్మకం కలగటం లేదు. శరత్ ను మతిపోయినవాణ్ణి చూసినట్టు కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగింది.


    "మరి మీ అమ్మా నాన్నా ఎవరు?"


    "తెలియదు. అదే నా బాధ. ఇరవై రెండేళ్ళుగా ఎవర్ని కన్న తల్లిదండ్రులు అనుకున్నానో వారు నా తల్లిదండ్రులు కారని ఆకస్మాత్తుగా తెలిసింది. నా జన్మ రహస్యం నాతోపాటు నీడలా పెరిగింది. ఇప్పుడు అది నన్ను వెక్కిరిస్తున్నది."


    రాజేశ్వరి మౌనంగా ఆలోచిస్తూ కూర్చుంది.  


    "నేనెవర్నో నాకు తెలియదు. ఇది ఎంత బాధకరమో నీకు తెలియదు."


    రాజేశ్వరి శరత్ చేతిని తన చేతిలోకి తీసుకొని గోముగా నిమిరింది.


    "దీనికి ఇంత బాధపడాలా? ఇప్పుడు నీకేం తక్కువయింది చెప్పు? వీళ్ళు నిన్ను కన్నబిడ్డలాగే పెంచారు. వీళ్ళే నీ తల్లిదండ్రులు."   


    రాజేశ్వరి మృదువుగా ఆర్ద్రకంఠంతో అన్నది.


    శరత్ మాట్లాడలేదు.


    "ఇక ఆ విషయం మర్చిపో."


    "ఎలా మర్చిపోగలను? ఈ భయంకర రహస్యం నన్ను నీడలా వెంబడిస్తూ వుంటే ఎలా మనశ్శాంతి వుంటుంది?"   


    "అయితే ఇప్పుడేం చేస్తానంటావ్?" అయోమయంగా చూస్తూ అడిగింది రాజేశ్వరి.


    "నా కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి. నవమాసాలు మోసి, కని, నన్ను ఎందుకు పరిత్యజించిందో తెలుసుకోవాలి. అంతవరకూ నాకు అన్నం సహించదు. నిద్రపట్టదు" ఉద్రేకంగా అన్నాడు శరత్.   


    రాజేశ్వరి శరత్ ముఖంలోకి జాలిగా చూసింది.


    "నన్ను చూస్తుంటే జాలివేస్తోందా? వద్దు! వద్దు! జాలిపడకు, అది నేను భరించలేను. జీవితమంతా రామనాధంగారి సానుభూతీ, జాలితోనే పెరిగాను,"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS