Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 17


    ముఖంలోని నరాల బిగువు కొంత సడలించి, ఉద్రేకాన్ని కొంత వరకు అదుపులోకి తెచ్చుకున్నాడు.  


    'నేను వినడానికి సిద్ధంగా వున్నాను ఏం చెబుతావో చెప్పు!' అన్నట్టు రాజేశ్వరి ముఖంలోకి చూశాడు శరత్.


    అతని చూపులోని చురుకుతనాన్ని ఎదుర్కోలేక తలదించుకుంది రాజేశ్వరి.


    "ఊఁ చెప్పు! నువ్వు చెప్పదలచుకున్నదంతా చెప్పు. వినడానికి సిద్ధంగా వున్నాను" అన్నాడు శరత్ నిర్లిప్తంగా.


    "శరత్...." అంటూ ఆగింది రాజేశ్వరి.


    "ఫర్వాలేదు చెప్పు. నేనేం బాధపడను. ఆలోచిస్తాను."


    రాజేశ్వరి రిలీఫ్ గా గాలి పీల్చుకుంది."


    "నన్ను అపార్థం చేసుకోకు. నిన్ను ఈ ప్రయత్నం నుంచి విముక్తుణ్ణి చెయ్యడానికి ప్రయత్నించడంలో నా స్వార్థం కూడా వుండి వుండొచ్చు. అది నువ్వు నాకు దూరం అవుతావనే భయంకొద్దీ...." రాజేశ్వరి కంఠం బొంగురు పోయింది.


    శరత్ పెదవుల మీద విరిగిన పాలలాంటి నవ్వు ఓ క్షణం కదిలి ఆగిపోయింది.


    "నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నీ తల్లిని కలుసుకుంటావో. ఎటువంటి మానసిక వ్యధకు గురి అవుతావో అనే భయం కూడా వుంది. నన్ను అపార్థం చేసుకోవు గదూ?"  


    "లేదు, చెప్పు రాజూ! నీవేం చెప్పదల్చుకున్నావో పూర్తిగా చెప్పు. నేనేం అపార్థం చేసుకోను."


    రాజేశ్వరి ఓ క్షణం ఆలోచించింది. మెల్లగా తనకు తానే చెప్పుకుంటున్నట్టు చెప్పింది.


    "మన సమాజం ఆడపిల్ల ఏ క్షణిక వ్యామోహంతోనో, అమాయకత్వంతోనో చేసిన తప్పును క్షమించలేదు. పురుషుడికి ఒక నీతిని, స్త్రీకి మరో నీతినీ ఉగ్గుపాలతో రంగరించి పోసిన ఈ జాతి, తప్పుచేసిన ఆడదాన్ని పిచ్చికుక్కను తరిమికొట్టినట్టు, తరిమి తరిమి కొడుతూండటం ఎందర్ని చూట్టం లేదు? ఎన్ని కథలు వినడం లేదు?"


    అంతవరకూ చెప్పి శరత్ ముఖంలోకి చూసింది.


    శరత్ ముఖం గంభీరంగా వుంది.


    ఆ ముఖంలో ఉద్రేకం లేదు.


    ఆ చూపుల్లో. ఆ ముఖంలో వున్నది ఏదో రాజేశ్వరికి తెలియదు.


    "ఊఁ! చెప్పు! ఆగావేం?" అన్నాడు శరత్.


    శరత్ కంఠంలో కూడా ఎలాంటి భావమూ కన్పించలేదు.


    "నువ్వు ఎలాగో మీ తల్లిని చూస్తావనుకో. అప్పుడు ఆమె బ్రోతల్ హౌస్ లోనో కన్పిస్తే? లేక...."   


    "ఊఁ.... లేక....?" నిర్లిప్తంగా రిపీట్ చేశాడు.


    "ఏ బస్ స్టాండులోనో అడుక్కుంటూ కనిపిస్తే?"


    "అవును. కన్పించవచ్చును. ఏ బ్రోతల్ హౌస్ లోనో. ఏ బస్ స్టాండులోనో అడుక్కుంటూ కన్పించవచ్చును. నాకు కావాల్సింది ఆమె కన్పించడమే!" ఆ ముఖంలో, ఆ కళ్ళల్లో, ఆ కంఠంలో ఏదో ఎరుగలేని నిర్ణయం తోచింది రాజేశ్వరికి.


    రాజేశ్వరి గుండెల్లో ఏదో భయం ప్రవేశించింది.


    శరత్ ముఖంలోకి దీనంగా చూసింది.


    "శరత్ శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు.


    "శరత్!"


    "ఊఁ...."


    "ఒకటి అడగనా?"


    "అడుగు!: కళ్ళు తిప్పకుండానే అన్నాడు.


    "ఆమె ఆ పరిస్థితుల్లో నీకు కనిపిస్తే ఏం చేస్తావ్?"


    శరత్ చివ్వున తలతిప్పి రాజేశ్వరి కళ్ళలోకి చూశాడు.


    "కొడుకుగా నేను చెయ్యవలసినదంతా చేస్తాను."


    "అంటే?" రాజేశ్వరి విస్మయంగా ప్రశ్నించింది.


    "అంటే అది కూడా చెప్పాలా? కొడుకు తల్లి దీనస్థితిలో వుంటే ఆదుకుంటాడు" శరత్ కంఠంలో తీవ్రత వుంది.  


    "నీ దగ్గిర తెచ్చి పెట్టుకుంటావా?"


    "తల్లి బిడ్డదగ్గర ఉండక ఇంకెక్కడుంటుంది? ఆమె ఏ పరిస్థితుల్లో వున్నా. దానికి ఆమె బాధ్యురాలు కాదు, ఈ సమాజం! ఈ వ్యవస్థ! ఆవేశంగా అన్నాడు శరత్.


    రాజేశ్వరి కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది.


    "మరి ఈ అమ్మ.... నిన్ను.... తను కనకపోయినా.... పసిగుడ్డుగా తెచ్చి, నీ మలమూత్రాలను భరించి.... కన్నబిడ్డకంటే మిన్నగా పెంచిన ఈ అమ్మను ఏం చేస్తావ్?" అంటూ శరత్ ముఖంలోకి లోతుగా చూసింది.


    అంతవరకూ శరత్ ముఖంలోవున్న గాంభీర్యాన్ని, ఉద్రేకాన్నీ వెనక్కు నెట్టి విషాదం అలుముకుంది.


    అతని కళ్ళలో దిగులు చోటు చేసుకుంది.


    ఓ క్షణం మౌనంగా వుండిపోయాడు.   


    "ఈ అమ్మకు మనసుంది. మానవత్వం వుంది. మమత ఉంది. నా మనసునూ, పరిస్థితుల్నీ అర్థం చేసుకోగల వివేకం ఉంది" అని ఓ క్షణం ఆగి మళ్ళీ చిన్నగా అన్నాడు.


    "ఈమెకు మరో కొడుకు వున్నాడు. గౌరవించి ఆదరించే భర్త వున్నాడు. సమాజంలో అంతస్తు వుంది. గౌరవం వుంది. అన్ని సుఖాలూ.... మనిషికి.... గౌరవంగా.... సుఖంగా జీవించడానికి కావాల్సిన అన్ని హంగులూ వున్నాయ్...." అంటూ యిక మాట్లాడటానికి ఓపిక లేనట్టు ఆగిపోయాడు.


    రాజేశ్వరి ఆలోచిస్తూ వుండిపోయింది.


    శరత్ కూడా మౌనంగా కూర్చున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS