Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 15

    ఈ విషయం కార్చిచ్చులాగా వ్యాపించింది. వింత చూద్దామని, నిజమోకాదో తేల్చుకుందామని, స్వయంభూ సాలగ్రామాన్ని దర్శించుకుని తరిద్దామని, ఇలా రకరకాల కారణాలతో ఇరుగుపొరుగులు వచ్చి చూచి పోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానిస్తున్నారు.
    "లక్ష్మీ నరసమ్మ, అహోబిలపతి ఎంత అదృష్టవంతులో"
    "ఇంతకీ ఈరాయి సాలగ్రామమేనంటారా?"
    "సాలగ్రామం అయినా, ఈ నృసింహసాల గ్రామం ఏమిటి?"
    "అయినా పాలు తోడు పెట్టినప్పుడు చూసుకోవద్దూ?"
    "పాలదాలిలోంచి తెచ్చి తోడుపెట్టేలోపు కుండలో ఏమైనా పడిందేమోనని అనుమానం ఎందుకు వస్తుంది?"    
    కొంతమంది గుసగుసలుగా, కొంతమండి కాస్తగట్టిగానూ మాట్లాడుతూ ఉంటే, కాస్త రణగొణధ్వనిగానే ఉంది. ఆ గందరగోళాన్ని అధిగమించి మంద్రగంభీర స్వరం వినిపించింది. అన్ని శబ్దాలూ సద్దుమణిగాయి.
    "భక్తులారా! మీ నిర్మల భక్తికి నేను సంతోషించాను. మిమ్మల్నందరినీ రక్షించటం కోసమే నేనీ 'తరికుండ'లో ఆవిర్భవించాను. మీరు కూడా ఈ ప్రాంతాన్ని స్థిరనివాసంగా చేసుకోండి. నన్ను భక్తిశ్రద్ధలతో సేవించుకోండి, మీ కష్టాలన్నీ కడతేరుతాయి."
    అందరికీ మరో అద్భుతాన్ని చూచినందుకు సంభ్రమాశ్చర్యానందాలు ముప్పిరిగొన్నాయి. చేతులు జోడించటం, చెంపలు వేసుకోవటం తప్ప ఏమీ చేయలేకపోయారు. కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. నెమ్మదిగా తేరుకొని లక్ష్మీనరసమ్మ, అహోబిలపతి దంపతులని పొగుడుతూ తమతమ ఇళ్ళకి బయల్దేరారు.
                                   * * *
    ఊరంతా అట్టుడికిపోతున్నట్టగా చెప్పుకుంటున్న విషయాలని గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు రామానాయుడు. ఎక్కడినుంచో నెమ్మదిగా సింహగర్జన వినిపించింది. అది క్రమంగా పెద్దదైంది. భయంగా కళ్ళుమూసి తెరిచేసరికి ఎదురుగా ప్రసన్నంగా గర్జిస్తున్న సింహం. చేతివేళ్ళగోళ్ళముందు వెలాతెలాపోతున్న రత్నాభరణాలు, పీతాంబరం. అప్రయత్నంగా నమస్కరించాడు రామానాయుడు. ఆ గర్జన మాటలుగా రూపుకట్టింది.
    "వత్సా! నేను ఆహోబిలపతి ఇంట వెలిశాను. మీ రక్షణభారం నాదే. కొత్త ఆలయాన్ని నిర్మించు. ప్రతిష్ఠాది సేవలన్నీ నీవు నిర్వర్తించవలసిన బాధ్యతలే. నీకు శుభం కలుగుతుంది.
    "స్వామీ ధన్యుడిని. మీ చిత్తానువర్తిని. కాని,..."
    ఎక్కడో కోడికూసిన ధ్వనికి మెలకువ వచ్చింది.
    "అయ్యో! ఇదంతా కలా! ఎంత దివ్యమంగళ విగ్రహం! కలలోనైనా చూచే అదృష్టం కలిగినందుకు జన్మధన్యమైనట్టే! స్వామి ఆజ్ఞ నిర్వర్తిస్తే జీవితం సార్థకమౌతుంది. స్వామిసేవ చేసుకుంటూ జీవితం ఇక్కడే గడిపితే సరిపోతుంది. తిరిగి రాయదుర్గం పోవలసినపనేముంది, జీవిత పరమార్థం ఇక్కడ లభిస్తుంటే?..."
    తన స్వప్నాన్ని గురించి పెద్దలకు చెప్పాడు.
    చెప్పింది కలలోనైనా, ఆజ్ఞను అమలు జరపవలసిందే! అన్నారు విన్న పెద్దలు. అహోబిలపతితో పాటు రామానాయుడు కూడ ధన్యుడని వేనేళ్ళ పొగిడారు.
    గుడికట్టటం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఉన్నచిన్న పాడుబడ్డ గుడిని పునరుద్దరించాలా? దానిని వదలి కొత్తది నిర్మించాలా? ఇలా ఎవరికి వారు కొత్తవి నిర్మించుకుంటూ వెడితే పాతవాటిని చూచెదెవరు? అవి ధూపదీపవైవేద్యాదులు లేక ఈసురోమంటూ ఉంటే స్థాపించినవారి వంశానికి, జాతికి, దేశానికి పురోగతి ఎలా ఉంటుంది? జీర్ణదేవాలయ ఉద్ధరణే మంచిది అని నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఉన్న సొమ్ము దేవాలయ పునరుద్ధరణకి సరిపోతుందా? సరిపోకపోతే? తనకి పిచ్చికాకపోతే, అటువంటి ఆలోచన రావటమేమిటి? ఈ పనికి తనని సాధనంగా ఎన్నుకున్న పరమాత్మ సాధన సంపత్తిని సమకూర్చడా?...
    అంతే! దైవజ్ఞులని పిలిచి ముహూర్తం పెట్టించాడు. అనుకున్న సమయానికే పని ప్రారంభించాడు. పడిపోయిన గోడని సరిచెయ్యాలని పునాదులదగ్గర తవ్వుతుంటే పలుగు తాకిడికి పెద్దధ్వని వచ్చింది. ఏమిటా అని చూస్తే పెద్ద ఇనప్పెట్టె. పదిమంది కలిసి కష్టపడి పైకి తీసి, తలుపు తెరిచి చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలిపే ధనపు రాసులు, బంగారం, నగలు. రామానాయుడు ఆనందానికి అంతులేదు.
    ఏ మాత్రం లోటులేకుండా, వెనకాడకుండా పెద్ద గోపురం, మంటపం, ప్రాకారం అన్నీ ఘనంగానే నిర్మించాడు. మూలవిరాట్టుగా లక్ష్మీనృసింహస్వామిని ప్రతిష్ఠింపచేశాడు. విగ్రహానికి ఎడమవైపు అక్కడే తరికుండలో వెలసిన నృసింహసాలగ్రామాన్ని స్థాపించాడు. దేవుడి విగ్రహాలకి నగలు కొనవలసిన అవసరం లేకుండా, నిధితోపాటే ఎన్నో నగలు కూడ లభించాయికదా! ఆనాటి నుండి పత్తిమిట్ట గ్రామం తరికుండ నరసింహక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. క్షేత్ర స్వామి స్వయంభువు. శక్తిమంతుడు, మహత్తు చాలా గొప్పది అని చుట్టుపట్ల ఎంతో కీర్తి పొందింది. మహానుభావులు, భక్తులు, యోగులు జన్మించటానికి తగిన పవిత్ర క్షేత్రంగా రూపొందింది. 'తరికుండ కాలక్రమంలో 'తరికొండ', 'తరిగొండ' అనే రూపాలు పొందింది. కానాల నుండి అహోబలిపతి వచ్చి స్థిర పడేనాటికి తరిగొండపేరు రూఢి అయింది.
    తరిగొండ లక్ష్మీనృసింహస్వామి సత్యమున్న దైవం. ఏవైన తగాదాలు వస్తే ఆ స్వామి సన్నిధిలో "సత్యప్రమాణాలు" చేయించే అలవాటు ప్రబలింది. ఆ ప్రమాణాలని ప్రభుత్వంవారు న్యాయస్థానాలు కూడ ఆమోదించటం విశేషం. న్యాయాధికారులే వాదిప్రతివాదులను ఈ స్వామి సన్నిధికి పంపే ఆచారం కూడ నెలకొన్నది.

    శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి శక్తి ఎంతటిదంటే ఆ గ్రామంలో ప్రహ్లాద నాటకం ప్రదర్శించటానికి భయం - హిరణ్యకశిపు వేషధారి బ్రతికిబట్టకట్టడని.
                               * * *
    పొరుగూరి పిల్లతోపాటు అందరూ శ్రద్ధగా విన్నారు. అందరికీ ఇది కొత్త విషయం. పొరుగూరి అమ్మాయి పన్నెండేళ్ళది, అన్నది వెంకమాంబతో
    "చాలా బాగా చెప్పావు. నువ్వు గ్రంథాలు రాస్తావా?"
    "ఇంకా రాయలేదు. పెద్దయ్యాక రాస్తాను."
    "ఏం రాస్తావు?"
    "ముందుగా ఇప్పుడు మీకు చెప్పిందే రాస్తాను. తరవాత నా మిత్రుడు కృష్ణుడి గురించి రాస్తాను, వెంకటేశ్వరస్వామి గురించి కూడా రాయాలి. శివుడిగురించి కూడా రాయాలి తెలుసా!"
    "ఇవన్నీ ఎట్టా రాస్తావు?"
    "గురువుగారి దగ్గర నేర్చుకుంటాను. ఆయన చెప్పలేక పోతే నా నేస్తం ఉన్నాడుకదా!"
    "ఎవరు?"
    "కృష్ణుడు"
    "ఎవరికైనా కృష్ణుడు స్నేహితుడౌతాడా? ఆయన దేవుడు కదా!"
    "ఆయన దేవుడే! కాని నాకు సఖుడు కూడా!"
    మిత్ర బృందానికి వెంకమాంబ గురించి తెలుసు గనక పట్టించుకోలేదు. కాని కొత్త అమ్మాయికి వింత. తనకన్న ఎంతో చిన్నది. ఎంత బాగా చెపుతోంది? ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళతో, తమ ఊరెళ్ళి అక్కడి వాళ్ళతో వెంకమాంబ గురించి చెప్పింది.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS