Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 15


    సీత గుమ్మంలో అడుగుపెట్టగానే, సుందరి పిల్లలిద్దర్నీ ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉండటం కనిపించింది. అప్పుడు సీత తన తల్లి సుందరమ్మతో, "అమ్మా! వీడు శ్రీనివాస్. వీడు వెంకటేశ్" అంది పిల్లలిద్దర్నీ ఒళ్ళోకి తీసుకుంటూ. "పిల్లలకి పేర్లు నువ్వే పెట్టేయడమే?! మీ మామగారు, అత్తగారు, పెద్దవాళ్ళేం చెప్తారో? అయినా పిల్లల్ని వదలి, ఇంత సేపు ఎక్కడికెళ్ళావే?" అని అడిగింది సుందరి. తల్లి ప్రశ్నను విన్నంతనే సీత సంతోషంతో, "దేవుడమ్మను చూశాను. గుడికెళ్ళాను" అని అంది.
    "ఎవరు ఏయే పేర్లు పెట్టినా, నా పిల్లల పేర్లు అవే" అంటూ పిల్లలను గుండెకు హత్తుకుంది సీత.
                                                   *    *    *   
    కాలం గడుస్తోంది. వెంగమాంబ భక్తితత్పరత రోజురోజుకి పెరుగుతోంది. అపర సరస్వతిలా గ్రంథరచన చేస్తోంది. అశుకవితలల్లుతోంది. భక్తి కావ్యరచనలో తలమునకలైపోయిన వెంగమాంబ తన్మయత్వంలో అలా అలా పోతుంటుంది. తనలో తాను మాట్లాడుకుంటుంది. దేవాలయానికి వెళ్ళి స్వామికి తనే అలంకరిస్తుంటుంది. రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా దేవుని ఆరాధిస్తూ, ఆ ఊరి లక్ష్మినృసింహాలయంలో ఉండిపోవడం ప్రారంభించింది.
    ఆమె ఆహారం గుడిలో పెట్టే నైవేద్యమే. దాహమైతే అక్కడి కొలను నీళ్ళే తాగుతుంది. దేవాలయ ధ్వజ స్తంభం ఎదురుగా నిలబడి నృత్యం చేస్తుంది. ఆ లక్ష్మినృసింహాలయం వెంగమాంబ నివాసమైపోయింది.
    గుడికి వచ్చే భక్తులు వెంగమాంబను పూజించడం, సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించడం చేస్తున్నారు.
    కానీ, అసూయపరులు వెంగమాంబను విమర్మించడం మానుకోవడం లేదు. ఆమె కులభ్రష్టురాలనీ, ఆమెను గుడిలోనికి రానివ్వకూడదని ప్రచారం మొదలెట్టారు.
    వెంగమాంబను రకరకాలుగా వేధించడం ప్రారంభించారు. ఆమె గుడిలో ఓ మూల కూర్చున్నప్పటికీ తరిమేయడం మొదలెట్టారు.
    వెంగమాంబ తనంతట తానుగా పూజలు చేయకూడదని పూజారులు ధ్వజమెత్తారు.
    అయితే వెంగమాంబ మాత్రం తన పట్టును వదలకుండా స్వామికి పూజలు చేస్తూనే ఉంది.
    అర్చకులు ఆమెను ఎలా బయటకు పంపాలో తెలియక తికమక పడుతున్నారు. "ఏం చేద్దాం?" అన్నాడు ఓ అర్చకుడు.
    "ఆడదానికి ఇంత అహంకారమా?" అన్నాడు మరో అర్చకుడు. ఇలా సమాలోచనలు జరిపిన మీదట వారికి ఓ ఆలోచన తట్టింది.
    "ఇనుప సంకెళ్ళతో ఆమెను బంధిద్దాం" అన్నాడొకడు.
    "సెబాష్, అదే సరైన పద్ధతి. ఇంతటితో దాని రోగం కుదురుతుంది" అన్నాడు మరొకడు ఉత్సాహంగా.
    ఈ  సంగతి ఎలాగో ఊరంతటికీ తెలిసిపోయింది.
    జనం గుడిని చుట్టుముట్టారు. అందరికీ ఏం జరుగుతుందో చూద్దామన్న కుతూహలం....
    వీళ్ళంతా ఆ భక్తురాలికి ఏం కీడు తలపెట్టనున్నారు? పూలహారం తీసుకుని గుడివైపుకు వస్తున్నా వెంగమాంబను చూసిన అల్లరి కుర్రాళ్ళు "ఏయ్.... వెళ్ళు.... తిరిగి వెళ్ళు" అని గొడవ పెడుతుండగా, ఆ దృశ్యాన్ని చూసిన కొంతమంది మాత్రం, "ఆమెకు ఏ ఆపదా కలగకుండా కాపాడు స్వామీ అంటూ చెంపలేసుకున్నారు.
    వెంగమాంబ చేతిలోని తులసిమాల కాంతులీనుతోంది. వెంగమాంబ  గుడిని సమీపించగానే ఇనుప సంకెళ్ళతో ఒక్క ఉదుటున ముందుకొచ్చారు అర్చకులు. సంకెళ్ళను చూసిన వెంగమాంబ, "నా కోసమేనా? ఇవిగో.... బంధించండి" అంటూ చేతులు ముందుకు చాపింది. అర్చకులామెను సంకెళ్ళతో బంధించారు. ఆ దృశ్యాన్ని చూసిన కొంతమంది కళ్ళు గట్టిగా మూసుకున్నారు. కొందరు భయంతో వణికిపోసాగారు.
    "నీ స్వామికి ఇప్పుడు పూజలు చెయ్" అంటూ అర్చకులు వెంగమాంబను వెక్కిరించారు.
    వెంగమాంబ ఫక్కున నవ్వింది.
    ఇనుప సంకెళ్ళు టక్కున విడిపోయాయి.
    ఒక్కసారిగా అక్కడున్నవారంతా వెంగమాంబ కాళ్ళపై పడ్డారు.
    అర్చకులు దూరంగా పారిపోయారు.
    "ఈ అబలకు ఇనుప సంకెళ్ళు తెంపుకునేంత బలమా?! ఈ వితంతువుకి ఇంత బలం ఎక్కడిది?" అని కొందరంటే, మరికొందరు, "సంకెళ్ళు తుప్పుబట్టి ఉంటాయి. అందుకే ఊడిపోయాయి" అంటూ గొణగసాగారు. ఇవేమీ పట్టని వెంగమాంబ వెంకటేశ్వరునిపై కీర్తనలు రాసుకుంటోంది. అర్చకులు ఆమె ఏం చేస్తుందన్న విషయాన్ని శ్రద్ధగా గమనించసాగారు.
    "ఇది గుడిలో కూర్చుని పాటలు రాస్తోంది" అని ఒకరు అరవగా, దేవస్థాన ద్వారాలకు తాళం వేసి ఉంచుదాం" అని మరొకరన్నారు. ఉదయం, సాయంత్రం పూట కాసేపు గుడి తలుపులను తీసి, ఆ తర్వాత మూసిఉంచుదాం" అన్నాడు మరొకడు. అర్చకులు ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకుని వెంగమాంబను కోవెలలోనికి రానివ్వకూడదని నిశ్చయించారు.
    తెల్లవారింది. వెంగమాంబ స్వామివారే సేవ కోసం పూలు కోసి చక్కగా మాల అల్లింది. గబగబా గుడిని సమీపించిన వెంగమాంబ ఆశ్చర్యానికి లోనైంది. గుడి తలుపులు మూసి ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన వెంగమాంబ నిశ్చలంగా నిలబడిపోయింది. "నా స్వామి! నాకు దర్శనమివ్వడా?!" అంటూ గుడి ద్వారంపై చేతులేయగానే, తలుపులు తమంతట తామే తెరచుకున్నాయి. దూరంగా నక్కి నక్కి చూస్తున్న అర్చకులకు ఏం జరుగుతుందో తెలియడం లేదు.
    వెంగమాంబ గుడిలోకి ప్రవేశించి పూజలు చేస్తోంది. అంతలో అర్చకులు ఆలయం లోపలికి ప్రవేశించబోతుండగా, గుడి తలుపులు "దభాల్న" మూసుకున్నాయి. అర్చకులు ఆశ్చర్యంతో, భయంతో కంపించిపోయారు. అయినా తమ పట్టువదలని అర్చకులు, వెంగమాంబ గుడి నుంచి బయటకు వస్తుండగా, తాళ్ళతో బంధించారు. ఇక, ఆమె ఒక్క అడుగు కూడా ముందుకేయలేదని భావించిన అర్చకుల మనోగతాన్ని భగ్నం చేస్తూ, వెంగమాంబను బంధించిన తాళ్ళు, దారపు పోగుల్లా తెగిపోయాయి.
    ఆ దృశ్యాన్ని చూసిన అర్చకులకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంగమాంబను రాళ్ళతో కొట్టడం మొదలెట్టారు. ఆ మహాభక్తురాలిపైకి విసిరేయబడిన ఒక్కొక్కరాయి, ఒక్కొక్క పుష్పంలా మారిపోవడంతో, ఆమెపై పూలవర్షం కురియసాగింది. ప్రతిగా రాళ్ళు విసిరిన అర్చకుల భుజాలు పచ్చిపుండులై కదలనివ్వకపోవడంతో, అర్చకులు వెంగమాంబను రకరకాల తిట్లతో దూషించసాగారు.
    చివరకు ఈ ఊరి విద్వాంసులు దగ్గరికెళ్ళిన అర్చకులు వెంగమాంబపై లేనిపోనివి కల్పించి చెప్పసాగారు. అయితే వెంగమాంబ భక్తి ప్రపత్తులను విన్నవిద్వాంసులు నోరు మెదపకపోవడంతో అర్చకులు వెనుదిరిగారు.
    ఇవేమీ పట్టించుకోని వెంగమాంబ భక్తిభావంతో నిరంతరం స్వామి ధ్యాసలో గడపసాగింది. పక్క ఊరుల నుంచి ఆమెను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఈ వ్యవహారంఅ అర్చకులకు భరింపరాని తలనొప్పిగా తయారైంది. వాళ్లు ఎన్ని పన్నాగాలు పన్నినప్పటికీ, వెంగమాంబ "భక్తి ముందు అవి నిష్ప్రయోజనమే అవుతున్నాయి. మాయాంధకారంలో మునిగిపోయిన ఆ అర్చకులు, పరమభక్తురాలైన వెంగమాంబను ఎటూ పోలేని పరిస్థితిలోకి నెట్టి, ఆమె చుట్టూ గోడ కట్టించారు.
    కానీ, భక్తసులభుడైన భగవంతుడు వీటన్నింటినీ చూస్తూ ఊరుకుంటాడా?!
    ఆ కట్టడం వెనుక పెద్ద బిలం ఏర్పడింది. ఆ బిలం ద్వారా వెంగమాంబ భగవన్నామస్మరణం చేస్తూ, తరిగొండను వదలి, వెంకటాచలారణ్యాన్ని చేరింది. ఏ భక్తులను , ఎక్కడకు , ఎందుకు పంపిస్తాడో...... ఆ భగవంతునికే ఎరుక!!
    అయితే, వెంగమాంబ ఆ రాతి కట్టడంలోనే ఉందనీ, ఈసరికి నీళ్ళు, ఆహారం లేక మల మల మాడిపోయుంటుందనీ అనుకుంటూ ఆనందించ  సాగారు  అర్చకులు. అంతటితో ఊరుకోకుండా ఆ కట్టడంలోకి రాళ్ళను విసిరేస్తుండటం, ఎంగిలి విస్తరాకులను విసిరేయడం, చెత్తా చెదారాన్ని విసిరేస్తూ, వెంగమాంబ రోగం ఈ దెబ్బతో కుదురుతుందని తమని తామె అభినందించుకో సాగారు. అయినా వాళ్ళ కసి తీరలేదు. ఒకరోజు చెత్తా చెదారాన్ని పోగుచేసి నిప్పుపెట్టారు. ఇంకేముంది? భగ్గున మంటలు లేచాయి. అంతటాపొగమయం, జనం పోగయ్యారు.
    "అయ్యో! భక్తురాలు మాడి మసైపోతోంది!!" అని కొంతమంది వాపోగా, మరికొంతమంది, "నిజమైన భక్తురాలైతే ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడదా?" అని ప్రశ్నించగా, ఇంకొంత మంది, "ఆవిడ పొతే మంచిదేలే! ఇంతటితో ఈ గ్రామానికి పట్టిన పీడ విరగడవుతుంది" అంటూ మెటికలు విరిచారు.
    అయితే కొంతమంది మాత్రం ఆ మహాభక్తురాలు అలా మరణించడం గ్రామానికి కీడని , శవాన్ని బయటకు తీసి దహన సంస్కారాలు జరపాలని నిశ్చయించి, అర్చకులను ఎదిరించి ఆ కట్టడాన్ని కూలగొడుతూ లోపల ఉన్నవాటిని బయటకు తీయసాగారు. ఆ వేడిని తట్టుకోలేక నీలు గ్రుమ్మరించారు. అయితే కట్టడంలో ఏమీ లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS