Previous Page Next Page 
ముక్తేవి భారతి కథలు పేజి 15


                                     మనసుతీరని మాతృత్వం
    శారద ఎంతసేపని అలా ఆ గదిలో కూచోగలదు? నూతి దగ్గర పనుంది. దొడ్డిగుమ్మంలో పని చూసుకోవాలి. బట్టలు ఆరవేయాలి.
    అతను అలాగే చూస్తున్నాడు కన్నార్పకుండా!
    ఇది ఈరోజు విషయం కాదు. ఇప్పటికి వారం రోజులుగా అనుభవిస్తోంది శారద.
    అతను ఇంటివాళ్ళబ్బాయి స్నేహితుడు. ఆ గదిలోకి అద్దెకు వచ్చాడు. శారద నూతిదగ్గర ఏ పనికి వెళ్ళాలన్నా అతని గది ముందు నుంచే వెళ్ళాలి. అతనక్కడున్నాడని తప్పించుకు తిరగటమెట్లా? అయినా ఎందుకు తిరగాలి?
    అసలా చూపేమిటి, ఏదో వెతుక్కుంటున్నట్లు! చిన్నవాడే అయినా పోకిరి వేషాలు!! - శారద గది తలుపు దభీమని వేసి వచ్చింది లోపలికి.
    ఆవేశంలో, కోపంలో ఎన్నో చేయాలనుకుంటాం, కానీ చివరికి ఒక్కటీ కార్యరూపం దాల్చదు. అంతే! తప్పు చేసిన దానిలా వెనక్కి తిరిగి వచ్చేసింది శారద.
    'ఛీ, దిక్కుమాలిన తిరుగుడు ఉద్యోగం, నెలకు ఇరవై రోజులు కొంపలోనే వుండరు' - భర్త చేస్తున్న 'టూరు' ఉద్యోగం, నెలలో ఇరవై రోజులు తన ఒంటరితనం, శూన్యంగా ఉండే ఆ యిల్లు - ఏమిటో అన్నీ ఒక్కసారి ఆమె మనసుని కలచివేచాయి. ఆమె కళ్ళల్లో నీరు నిండింది. కాని, అతని-చూపు, ఆమె కళ్ళముందు నుంచి కదలనే లేదు.
    ఆయన రాగానే ఆ అబ్బాయి సంగతి చెప్పాలి. వీలయితే ఆ గది ఖాళీ చేయించాలి!
    రామారావు భోజనం పూర్తి చేశాడు. తువ్వాలుతో చేయి తుడుచుకుంటూ ఆ గదిలోకి వెళ్ళాడు.
    వాణ్ణి పలకరించి రాకపోతే యేమి శారద నసుక్కుంటూ, పళ్ళు కొరుక్కుంటూ, కోపంగా పనంతా పూర్తి చేసేసింది.
    'అతను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడట .... పాపం, దొరికితే బావుండు. కుర్రాడు' రామారావు పొద్దుటి పేపరు తిరగేస్తూ అన్నాడు.
    రోజూ కన్నా ముందే తెల్లవారింది ఆ రోజు శారదకి .... అతను వస్తాడు.... కాఫీ తాగుతూ దిక్కులు చూస్తాడు.... తనకేసి చూస్తూ కప్పు క్రింద పడేస్తాడు.... నేను అతని వికారపు చేష్టలు తెలిసి కూడ, పొరపాటు లాగ అనుకొంటూ, ఆ విరిగిన కప్పు ముక్కల్ని జాగ్రత్తగా, మళ్ళా ఆ అబ్బాయి కాలికి గ్రుచ్చుకోకుండా ఎత్తి పారెయ్యాలి. మళ్ళా ఇంకో కప్పు కాఫీ అతని బల్లముందుంచాలి. అబ్బ, ఇంతకన్నా కఠిన శిక్ష ఇంకేం కావాలి తనకు! పాలు కుంపట్లో పొంగిపొర్లాయి.
    'అరే ... అతన్నిర మ్మన్నాను కదూ, ప్రొద్దున్నే లేపద్దూ నన్ను.... రామారావు పడక గదిలోంచి బయటకొచ్చాడు.
    అతను కుర్చీలో పెద్ద మనిషిలా కూర్చున్నాడు. కాఫీ ఫలహారం మొహమాటం లేకుండా పూర్తిగా తీసుకున్నాడు. శారద ఒళ్ళు భగ, భగ మండిపోయింది.... ఎందుకా నటన!
    ఇంతకీ ఆ చూపుకి అర్థమేమిటో!
    'తనని ప్రేయసిగా ఊహించుకొని కలలు కనటం లేదుకదా ఈ అబ్బాయి-' శారదకి నవ్వొచ్చింది తన ఆలోచనకి, ఎందుకయినా మంచిదని అబ్బాయి వినేలా 'రాత్రికి ఈయన వస్తే బావుండు .... నాకు జ్వరం తగిలింది కూడాను' అంది కొంచెం గట్టిగానే_
    కానీ ఆ మాట విని కూడ ఆ అబ్బాయి నూతి దగ్గర కొచ్చిన శారద కేసి చూడటం మాననేలేదు!
    చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది శారద. ఈమాటు అతనలా చూస్తున్నపుడు తనే వెళ్ళి పలకరిస్తే సరి. తప్పేముంది? అతనిని ఎలా పలకరించాలో, ఏమేమి ప్రశ్నించాలో అన్నీ ఒకటికి నాలుగుసార్లు రిహార్సల్ వేసుకుమరీ గుమ్మం ముందుకు వెళ్ళింది శారద.
    అనుకోకుండా ఆ రాత్రే వచ్చాడు రామారావు. శారదకి కొండంత బలం వచ్చింది. భోజనం చేసిన తర్వాత అసలు విషయం చెప్పడానికి నిశ్చయించుకొంది శారద.
    'పక్క గదిలో....ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు కూచుని. బుద్ధిమంతుడిలా వున్నాడు....' అన్నాడు రామారావు భోజనానికి కూచుంటూ.
    శారద ఉలిక్కిపడింది.
    'ఆఁ....' పరాకుగా అంది.
    'అచ్చు మా రాజులాగా వున్నాడు.'
    'ఎవరూ__'
    'మా పెద్దనాన్న కొడుకు రాజు లేడూ అచ్చంగా ఆ పోలికలో ఉన్నాడు యీ కుర్రాడు' అన్నాడు రామారావు.
    'ఏమో....నాకే పోలికా కనిపించడంలేదు' శారద ఏదో విసుగ్గా అంది.
    "పాపం - మంచి ఉద్యోగం యిప్పించాలి" రామారావు మళ్ళా అన్నాడు.
    'అంత జాలెందుకు. మరిప్పించండి పోనీ' లోపల కోపాన్ని దిగమింగుకుంటూ అంది శారద.
    'తప్పకుండా....ఆ సంగతి అతనితో చెప్పా కూడ' శారద గుండె ఆగినంత పనయింది. దీర్ఘంగా నిట్టూర్చింది చేసేది లేక.
    'అసలు విషయం.... రేపు పొద్దున్న అతన్ని కాఫీకి రమ్మన్నాను' రామారావు నెమ్మదిగా శారద కేసి చూస్తూ ఆవులిస్తూ అన్నాడు.
    శారదకు నిజంగానే ఏడుపొచ్చింది. తనకు ఇష్టంలేని వ్యక్తికి, తను అసహ్యించుకుంటున్న వ్యక్తికి తెల్లవారేసరికి కాఫీ, టిఫిన్ తయారుచేసి యివ్వాలి. చేయను అనే స్వతంత్ర్యం లేదు తనకు! ఛీ ఆడబ్రతుకు!! తను పూర్తిగా ఓడిపోయినట్లు నిస్పృహతో నీరసంగా నిద్రపోయింది శారద ఆ రాత్రి. తెల్లవారింది. అతను రామారావుతో మాట్లాడి.
    "థాంక్యూ....' నవ్వుతూ మెట్లు దిగాడు.
    'విషపునవ్వు' __ శారద గట్టిగా మనసులో తిట్టుకుంది.
    రామారావుని గడియారం తొందర పెట్టింది. రెండు మెతుకులు నోట్లో వేసుకొని ఆఫీసుకి వెళ్ళిపోయాడు ఇల్లంతా ఖాళీగా వుంది ఎందుకో! ఆ గదిలో అతను.... ఈ గదిలో శారద!
    నాలుగు నెలల క్రితం సగం అల్లి ఆపిన స్వెట్టరు బయటికి తీసింది శారద. ఆలోచనలతో ఆవేదనతో అల్లిక ముందుకు జరుగలేదు. స్వెట్టరు అక్కడే వదిలేసి నిద్ర కుపక్రమిద్దా మనుకుంది శారద.
    వీధి తలుపు చప్పుడైంది.
    అతను!
    శారద కొయ్యబారిపోయింది.
    క్షణంలో ధైర్యాన్ని గంభీర్యాన్ని తెచ్చుకొని 'రండి లోపలకు' అంది గుమ్మం తలుపు తీస్తూ. అతను లోపల కొచ్చాడు.
    'నేను వెళ్ళిపోతున్నాను .... నాకు చిన్న ఉద్యోగం ఉందని రమ్మని మా స్నేహితుడు వైర్ చేశాడు.... ఆయనతో చెప్పండి' అన్నాడు .... అతను తల దించుకునే మాట్లాడుతున్నాడు. అదేమిటి! శారద కీమాటు నవ్వొచ్చింది....ఎందుకో జాలేసింది!
    'మీ అమ్మగారు ఎక్కడున్నారు' అంది శారద నిశ్శబ్దం భరించలేక.
    అతను ఒక్కసారి ఆమె ముఖంలోకి భయంగా చూచాడు. ఒక్క క్షణం ఆగి అన్నాడు :
    'దగ్గర ఊళ్ళోనే .... మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ మీలాగే వుంటుంది. కానీ ఆవిడ హృదయం....' అతని కళ్ళు చెమర్చాయి - అతను తన తల్లిని గురించి ఏదో ఏదో చెప్పాడు.... ఎన్నో సంగతులు.... అతనికీ, అమ్మకీ పడదు. అందుకే ఇంట్లోంచి వచ్చేశాడు. 'చేతనయితే బ్రతుకుతాను. లేకపోతే....' అతని కళ్ళలో నీళ్లు నిలిచాయి.
    శారద అతని ముఖంలోకి చూడలేకపోయింది.
    అతను నెమ్మదిగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు.
                                                 *    *    *
    మమతెరుగని మనసులా....
    అర్థంలేని ఆలోచనలా....
    శూన్యంగా, వికారంగా, వెక్కిరింపుగా, విసుగ్గా వుంది ఆ రోజు సాయంత్రం శారదకి.
    అతని మాటలు నెమరువేసుకొంది శారద. అతనన్నాడు__తనలో తల్లి పోలికలున్నాయని....పోలిక లేనా, హృదయం కూడ అంతేనేమోనని భయపడ్డానన్నాడు.
    నిజమే. అతని మనసు ఎంతగా గాయపడకపోతే తల్లినుండి దూరంగా వచ్చేస్తాడు!!
    మనిషినిపోలిన మనుష్యులుంటారు! .... హృదయాన్ని పోలిన హృదయాలుంటాయేమో మరి!
    అతనన్నాడు 'మీరే చెప్పండి. మీకూ ఉన్నారుగా పిల్లలు__మీరూ తల్లిగదా!!' అని నా ఇంట్లో వున్న రఘు నా పిల్లాడనుకుంటున్నాడా!!....
    తనా చెప్పడం!!
    తనేమీ చెప్పకుండా అతను ప్రశ్నించినపుడు నీళ్ళునిండిన కళ్ళను అతను చూడకుండా పమిటతో ఒత్తుకొంది!! తనకా అదృష్టమేది!
    అతని ముఖం చూడలేకపోయింది-
    ఏదో తప్పు చేసినట్లు,
    పాపం అనుభవిస్తున్నట్లు,
    ఏదో పోగొట్టుకొన్నట్లు,
    అలాగే శిలలా నిలబడింది శారద. అతను పోతున్న దిక్కే చూస్తూ!
    అతని చూపుకి - అర్థం పూర్తిగా తెలిసింది....
    కానీ,
    అతనికి మావారు ఉద్యోగం పొద్దున్నే ఇప్పిస్తే ఎంత బావుండేది.... అతను ఈ ఇంట్లోనే ఉండిపోతే.... ఉండిపోతే, ఈ ఇంటికి పెద్దకొడుకులా, ప్రేమగా, గారాబంగా, గౌరవంగా చూసుకోదూ తను!!....
    శారద ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ గది గుమ్మం ముందు నిల్చుంది. అతను వదలి వెళ్ళిన గది శూన్యంగా వెక్కిరించింది శారదను....
    నీళ్ళునిండిన కళ్ళతో, మనసుతీరని మాతృత్వాన్ని తల్చుకొంటూ అక్కడే ఆ గది మెట్లమీదే కూలబడింది శారద.*


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS