Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 15


    ఉత్పల తలదించుకుంది.

    "ఏమిటి మాట్లాడుకుంటారు. మీరా రెండు గంటలూ-"

    "ఏదో ఒకటి-"

    "ప్రతి రోజూనా-"

    "ప్రతిరోజూ కుదరదు, రెండు మూడు రోజులకొకసారి".

    "ఓ చిన్నపని చేసిపెట్టగలవా?"

    ఉత్పల ఉత్సాహంగా తలెత్తి "ఏమిటి? ఏదైనా సరే చెప్పండి చేస్తాను" అంది.

    "ఈ రోజు రెండు గంటలపాటు మీరేం మాట్లాడుకున్నారో- ఆ టాపిక్స్  అన్నీ మనసులోనే గుర్తు పెట్టుకో! తీరిగ్గా వున్నప్పుడు వచ్చి నాకు చెప్పు. జస్ట్ ఫర్ ఫన్-"

    ఉత్పల అల్లరిగా నవ్వి "ఓ.కే". అంది. "గుర్తు పెట్టుకోవటం కాదు, వ్రాసి తీసుకొస్తాను సరేనా" అని నవ్వేసింది.

    "ఏమీ అనుకోవుగా"

    "అనుకోను! చెప్పానుగా మీరు నాకు ఐడియాల్- షి అని! అదిగో తను ఎదురు చూస్తున్నాడు".

    అనూష కారు ఆపింది. ఉత్పల కారు దిగగానే ఆమె తిరిగి స్టార్ట్ చేసి కదిలిపోతూ దూరంగా నిలబడ్డ యువకుడివైపు చూసింది.

    వేరుశనగ పొట్లంతో నిలబడి వున్నాడు అతడు. రామబ్రహ్మం.


                                                     *    *    *

    నవంబర్ రెండు.

    అనూష లంచ్ పూర్తి చేసి తిరిగి పని ప్రారంభించబోతూ వుండగా  ఛైర్మన్  పిలుస్తున్నాడని కబురొచ్చింది.

    ఆమె లేచి ఆయన గదికి వెళ్ళింది. "ఇక్కడ కాదు మాడమ్, పండాసాబ్ బోర్డ్ రూమ్ లో వున్నారు" అన్నాడు కుర్రాడు. ఆయన అక్కడెందుకున్నాడా అనుకుంటూ వెళ్ళి బోర్డ్ రూమ్ తలుపు తోసింది.

    స్టాక్ హొం తాలూకు ఆరుగురు డైరెక్టర్లూ అక్కడ వున్నారు. అందరూ ఆమె వైపు చూస్తున్నారు. ఆమెకి ఒక రకమైన ఇబ్బంది ఫీలింగు కలిగింది.

    ఏదో జరిగింది! అది వాళ్ళ కళ్ళల్లో కనబడింది. పండా మొహంలో మందలింపు, రవ్వంత సానుభూతి......

    పొడవాటి బల్ల మధ్యలో ఒకే ఫైలు.....

    .... తను సంతకం పెట్టింది అంతకు రెండ్రోజుల క్రితం.

    "కమిన్ మిస్ అనూష. ఎందుకక్కడ నిలబడ్డారు?" ఒక డైరెక్టరు విసుగ్గా  అన్నాడు.

    ఆమె దగ్గిరకి రాగానే ఫైలు ముందుకు తోస్తూ "ఈ ఇండియన్ ఫాస్పేట్ షేర్లు కొంటామని సంతకం ఏ ఉద్దేశంతో పెట్టారు?" అని అడిగాడు.

    ఆమె దృష్టి ఫైల్లో కాగితం మీద పడింది. అందులో వరసగా రకరకాల కంపెనీల పేర్లున్నాయి. దేశంలోని వివిధ బ్రోకర్ల తరపున ఆయా ధరలకి స్టాక్ హొం కొనటానికి నిశ్చయించుకున్న షేర్ల వివరాలు.

    ఆమె చూపు 'ఇండియన్ ఫాస్పేట్ ' అనే చోట ఆగిపోయింది.

    40,00,000

    న...ల...భై.....ల....క్ష...లు.

    ఆమె తన కళ్ళని తానే నమ్మలేక పోయింది. క్రింద సంతకం చూసింది. తనదే.

    ఆమెకా షాక్ నుంచి తేరుకోవటానికి దాదాపు రెండు నిమిషాలు పట్టింది.

    బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లందరూ  ఆమె వంక అదోలా  చూస్తూన్నారు. వాళ్ళ  మనసుల్లో ఏముందో ఆమె వూహించగలదు! తనింత పని చేసిందీ అంటే- ఎవరితోనైనా కుమ్మక్కై వుండాలి. లేక నిర్లక్ష్యంగా వుండాలి!! ఈ రెండూ స్టాక్ హొం సహించలేని తీవ్రమైన విషయాలు.

    ఏది ఏమైనా తను చేరి మూడు నెలలయినా కాకముందే తనవల్ల సంస్థకి  ఇరవైలక్షల పైగా నష్టం వచ్చింది. తనే గానీ ఈ సంస్థ యాజమాని అయివుంటే అసలింత వివరణా సంజాయిషీ అడక్కుండా అలాచేసిన ఉద్యోగిని పనిలోంచి తొలగించి వుండేది.

    తల వంచుకుని దోషిలా నిలబడ్డ ఆమెని చూసి పండా, "నువ్వు బయట కూర్చో..... మళ్ళీ  పిలుస్తాం" అన్నాడు. ఆమె మ్లానమైన వదనంతో బయటకు నడిచి, వరండాలో వున్న కుర్చీలో కూలబడింది. దూరంగా  వున్న రిసెప్షనిష్టు ఆమెవైపు సానుభూతితో చూసింది. బోర్డ్ రూమ్ నుంచి బయటకు వచ్చే ఉద్యోగస్తుల మొహాన్నిబట్టి లోపల ఏం జరుగుతుందో గ్రహించే అనుభవం ఆ రిసెప్షనిస్ట్ కి పది సంవత్సరాల నుంచీ వుంది. అయితే, అనూషని అలా చూడడం మాత్రం అదే మొదటిసారి.

    కుర్చీలో కూర్చున్న అనూష ఆలోచన్లు పరిపరివిధాలపోతున్నాయి. మామూలు తెలివి, తెలివితేటలు మామూలు స్టాక్ ఎక్చ్సేంజి పరిజ్ఞానం వున్నవారికి ఇవేమి తెలియవు. కాని అనూషకున్న కామర్సు పరిజ్ఞానంలో సగం వున్నవాడెవాడైనా ఇండియన్ ఫాస్పేట్ ధర ఏ క్షణమైనా పెరుగుతుందని వూహిస్తాడు. దీనిక్కారణం తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్ళాలి.

    ఆఫ్రికా ఖండంలో చిన్న రాజ్యమైన "మొరాకో' భాస్వరపు ఉత్పత్తిలో ప్రపంచం ద్వితీయ స్థానంలో వుంది. దాదాపు ఇరవై సంవత్సరాలనుంచీ మొరాకో సుల్తాన్ కీ, సహారా ఎడారి స్థావరంగా పెట్టుకొని పోరాటం జరుపుతున్న విప్లవకారులకీ (S.A.D.R) మధ్య ఘర్షణ జరుగుతూ వుంది. 1982లో S.A.D.R.ని స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యంగా గుర్తించాలని ఇండియా మీద అల్జీరియా వత్తిడి తీసుకువచ్చింది. నిజానికి S.A.D.R స్వతంత్ర రాజ్యంగా ఎన్నో సంవత్సరాల్నుంచీ ప్రవర్తిస్తూనే వుంది. ఎన్నో దేశాలు దాన్ని గుర్తించాయి కూడా! కానీ, అలీన రాజ్య ప్రతినిధులుగా ఉన్నత స్థానంలో వున్న భారత- మొరాకో సంబంధాలనిపాడు చేసుకోవడం ఇష్టంలేక అప్పటి ఇందిరాగాంధీ S.A.D.Rని గుర్తించడం ఆలస్యంచేసింది. రాజీవ్ గాంధి పదవిలోకివచ్చాక- భారత దేశం అక్టోబర్ ఒకటో తేదీన S.A.D.R. ని గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. ఇది జరిగిన పన్నెండు గంటల్లోగా, అంటే అక్టోబర్ రెండో తారీఖు ఉదయం పది గంటలకు మొరాకో భారతదేశంతో శాశ్వతంగా సంబంధాలు తెగతెంపులు చేసుకుంది. మిగతా అన్ని దేశాలతో మామూలుగా వున్న మొరాకో, ఇంత హఠాత్ చర్య తీసుకుటుందని ఎవరూ  వూహించలేదు. మొరాకో రాయబారి 'లార్చీ మౌలినీ' ఈ విషయం వెల్లడించగానే- మొరాకో దేశపు భాస్వరంతో ఉత్పత్తి చేసే భారత కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. దాంతో అమెరికా (ప్రపంచపు ఉత్పత్తిలో మొదటి స్థానం) నుంచి ముడి పదార్ధం కొనే ఇండియన్ ఫాస్పేట్ షేర్ల ధర అనూహ్యంగా పెరిగిపోయింది.

   
                                  *    *    *

    "ఎవరూ వూహించలేదు" అన్న ప్రయోగం కేవలం రాజకీయాలకూ, సామాన్యులకూ మాత్రమే వర్తిస్తుంది. షేర్ల మార్కెట్ లో వున్నవారు అనుక్షణం వేయికళ్ళతో దేశ, ప్రపంచ, రాజకీయ , వ్యాపార, వాతావరణ ,వగైరా  వగైరా పరిస్థితుల్ని అత్యంత జాగరూకతతో పరిశీలించాలి. వివిధ పేపర్లు చదవాలి. అన్ని విషయాలు తెలుసుకుంటూ వుండాలి.

    అనూషకి ఇవన్నీ తెలుసు!

    స్టాక్ హొం జనరల్ మేనేజర్ గా ఆ షేర్లు భవిష్యత్తులో కొంటామని కలలో కూడా సంతకం పెట్టి వుండదు!

    కానీ పెట్టింది!!

    ఏమైంది తన కాక్షణం? కళ్ళెలా ముసుకుపోయాయి?

    ఆమె ఆలోచన్లనుంచి తేరుకుని  ద్వారంవైపు చూసింది. ఒక్కొక్క డైరెక్టరే బయటకు వస్తున్నాడు. ఇంతకు మందు చిరునవ్వుతో  పలకరించి సాగిపోయే  వారల్లా చూసీ  చూడనట్టు మొహం తిప్పుకుని వెళ్ళిపోవడం ఆమెకి అంకుశంతో పొడిచినట్టు అనిపించింది. అంతలో పండా నుంచి పిలుపొచ్చింది. ఆమె లోపలికి వెళ్ళింది.

    "కూర్చో" అన్నాడు. ఆమె నిశ్శబ్దంగా కూర్చుంది. చాలా సేపు మౌనంగా వుండి అతడు నెమ్మదిగా "డైరక్టర్లు చాలా కోపంగా వున్నారు" అన్నాడు.

    ఆమె మాట్లాడలేదు.

    "..చాలా సర్ది చెప్పాను. అయిష్టంగానే ఒప్పుకున్నారు".

    దేనికో ఆమెకి తెలుసు. తను జనరల్ మేనేజర్ పదవిలో కొనసాగటానికి.

    "..... ఇకముందు జాగ్రత్తగా వుండు."

    ఆ మాట చాలు. ఉన్నత పదవిలో వున్న అధికారికి అంతకన్నా పెద్ద తిట్లు చివాట్లు అక్కర్లేదు. ఇక ముందు జాగ్రత్తగా వుండు - అంటే ఇంకోసారి ఇలా జరిగితే నేనేం చెయ్యలేను- అన్న అర్థం  వుంది. ఆమె కృతజ్ఞత సూచించే కంఠంతో, "సారీ సార్. ఇక ముందు ఇలా జరగనివ్వను" అని అక్కణ్ణుంచి వచ్చేసింది.

    సీట్లో కూర్చుంది అన్నమాటే గానీ ఆమె మనసంతా అదోలాంటి శూన్యత ఆవరించింది. ఒక రకమైన ఒంటరితనం భయంకరంగా ఆమెని చుట్టు ముట్టింది. అంతకు ముందు ఆమె ఇలాటి పరిస్థితుల్లో చిక్కుకోలేదని కాదు. ఇంతకన్నా క్లిష్ట పరిస్థితుల్నే ఎదుర్కొంది. ఆ మాటకొస్తే ఒక స్థాయి దాటిన తరువాత ఇలాటి  చిక్కులు లేకపోతే అసలు జీవితమే లేదు. ఘర్షణ, ఎత్తులు- పై ఎత్తులు, ఓటమి గెలుపు ఇవే జీవితంలో థ్రిల్ ఇచ్చేవి. కానీ, ఇక్కడ సమస్య వేరు. తన నిర్లక్ష్యాన్ని తన తెలివితక్కువతనాన్నీ భూతద్దంలో పెట్టి చూపుతున్నట్టు వుంది తనిలా సంతకం పెట్టటం!

    ఛైర్మన్ మూడు నాలుగు మాటలకన్నా ఎక్కువ మాట్లాడలేదు. కానీ అవి చాలు- అతడెంత ఇరకాటంలో పడ్డాడో చెప్పటానికి!!

    ఆమె ఇంక ఆ గదిలో ఎక్కువసేపు వుండలేక పోయింది. సెక్రటరీకి చెప్పి ఇంటికొచ్చేసింది. ఇంటి కొచ్చాక అలా రావడం మరింత తప్పనిపించింది, ఇల్లు మరీ ఒంటరిగా వుంది.

    స్నానం చేస్తూ పదిహేడో ఎక్కం వల్లించుకుంది. రెండు వేల నలభై ఆరుని ఇరవైమూడుతో గుణించింది. ఒంటరిగా వున్నప్పుడు, ఏవో తోచనప్పుడు మనసులో ఇలా లెక్కలు చేసుకోవడం అలవాటు. కానీ ఏకాగ్రత కుదర్లేదు. ఇంతకు ముందున్నంత షార్ప్ నెస్ తగ్గిందేమో అన్న అనుమానం కలుగుతోంది. ఎవరితోనో ఒకరితో మాట్లాడాలి అనిపించింది. కానీ ఎవరున్నారు?

    అంత విచారంలోనూ ఆమెకి నవ్వొచ్చింది. ఎవరూ లేకపోవడం నిజం. ఎవరూ లేరు. ఇంత హడావుడి నుంచీ, తెలివితేటల విషవలయం నుంచి- అకస్మాత్తుగా కొద్దిసేపు రిలాక్స్ అవుదామంటే...... ఎవరూ లేరు!

    అంతలో ఆమెకి జానీ గుర్తొచ్చాడు. పుస్తకాల వెనుక పడేసిన విజిటింగ్ కార్డు దొరకటానికి పదిహేను నిముషాలు పట్టింది. అయినా వెతికి పట్టుకుని ఫోన్ చేసింది.

    దాదాపు అయిదు నిమిషాల తరువాత అప్పుడే నిద్రలేచినట్టు ఒక కంఠం విసుగ్గా "అల్లొ.....వ్" అని ఇట్నుంచి "హాల్లో" అని వినపడిన కంఠంలో తీయదనానికి మత్తుదిగిపోయినట్టు-

    "ఎవరూ అరుంధతీ?" అని వినిపించింది.

    "కాదు. నేనూ....."

    "ఓ నువ్వా కోమలీ".

    "సారీ...... నేను"

    "అర్థమయింది చెప్పకు. ప్రియంవదా".

    ఆమె కోపంగా "ఎవరు మాట్లాడుతున్నది?" అని అడిగింది.

    "ఫోన్ చేసినవాళ్ళు అది చెప్పడం మర్యాదనుకుంటాను".

    "నా పేరు అనూష".

    "అనూష. పేరు బావుంది. నా పేరు బిల్హణుడు".

    ఆమె అర్థంకానట్టు "వ్వాట్" అంది.

    "బి.....ల్హ..... ణు..... డు. అందరూ ప్రేమగా బిల్హణ్ అంటారు".

    "అంటే"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS