ఈ సూర్యనమస్కారంలో పన్నెండు ఆసనాలున్నాయి. పన్నెండు మంత్రాలు ప్రణామాసనం నుంచి భుజంగాసనందాకా వెళ్ళాక మళ్ళీ వెనక్కి రావాలన్న మాట. ఏం వింటున్నావా? ఏకధాటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్యలో అల్లుడివైపు చూసి ఆగిపోయాడు.
మఠం వేసుకుని కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు మోహన్.
"నీకూ మీ నాన్న నిద్రమత్తు పోలికే వచ్చిందిరా! వాడూ అంతే. ఆఫీసులో ఏదయినా ఫంక్షన్ రావడం భయం ఆ పెట్టిన కాస్తా తినేసి హాయిగా గుర్రెట్టి నిద్రపోయేవాడు.
ఫంక్షన్ సంగతి సరే ఓరోజు ఆఫీసులో లంచ్ తరువాత నిక్షేపంగా నిద్రపోతుంటే మా సెక్షన్ సూపరెంటెండెంట్ వచ్చినిద్రలేపాడు. పోనీ అప్పటికయినా లేచాడా వెధవ! "ఉండవే నీదో గోల!" అని మీ అమ్మను విసుక్కున్నట్లే విసుక్కుని పక్కకి తిరిగేసరికి బాలెన్స్ తప్పి కుర్చీలోంచి కిందపడిపోయాడు" మిత్రుడి లీలలు చెప్పుతూ నవ్వారు సూర్యంగారు.
నిద్రలోనే నవ్వేసాడు మోహన్.
"ఆ! ఇక లేచి నిలబడు!" అంటూ తనుకూడా లేచి నిలబడి ప్రాక్టికల్ గా చూపించటం మొదలు పెట్టాడు ఆయన అశ్వసంచాలనాసనం దగ్గరకు వచ్చేసరికే విసుగేసింది మోహన్ కి.
"ఇక చాల్లే మామయ్యా! ఇంక శవాసనం వేసేద్దాం!" అన్నాడు.
చేస్తున్న పని మానేసి సీరియస్ గా చూశాడాయన. "నిన్నటినుంచి చూస్తున్నాను. క్షణానికోసారి శవాననం వేద్దాం అంటున్నావ్ పోనీ అదయినా తిన్నగా వేస్తావా అంటే నిశ్చింతగా నిద్రపోతావు. ఇలా అయితే లాభం లేదురా అబ్బాయ్!" అని కోప్పడేసి అన్ని ఆసనాలూ వేయించాడు.
ఎలాగయితేనేం ఆ ఘట్టం ముగిసింది. ఆఫీసుకి వెళ్ళడానికి రోజూకంటే కాస్త ముందుగానే బయలుదేరాడు. బస్టాప్ కి వెళ్ళి అక్కడ కాపలా వేశాడు. మరో అరగంట తర్వాత వచ్చింది. దీపిక. జాగ్రత్తగా అనుమానం రాకుండా ఆవిడని ఫాలో అయ్యాడు. బస్ దిగి కొంతదూరం నడిచి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయింది.
వెంటవెళ్దాం అనుకునికూడా వాచీ చూసుకొని ఆఫీసు టైం అవడంవల్ల వెనక్కి తిరిగాడు. రేపు రావాలి. ఆ ప్రొఫెసరుగారితో పరిచయం చేసుకోవాలి. ఆ పరిచయం దీపికతో పరిచయానికి దారితీస్తుంది. ముందు పరిచయం అంటూ జరిగితే తరువాత విషయం ఆలోచించవచ్చు అనుకున్నాడు.
ఆ ప్లాన్ ప్రకారం మర్నాడు ఎనిమిదింటికే బయలుదేరి తిన్నగా ఇంటికి వెళ్ళాడు.
ఇంటిచుట్టూ పాతకాలం గోడ. గేటుకి బాగా లోపలాగా ఇల్లు. గేటుకూడా పాతకాలందే. గేటుమీద కుడి వైపున బోర్డు దానిమీద "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డు చూశాడేగాని ఇలాంటి బోర్డు ఎక్కడా చూడలేదు.
గేటుకి ఎడమవైపున "గేటు తీసినవారు మూసి వెళ్ళవలెను" అని రాసి వుంది. ఆ బోర్డుకి మీదుగా లెటర్ బాక్స్ కుక్కలు లేవు బోర్డుకి మీదుగా యజమాని పేరు డా|| పృథ్వి, ఎం, ఎస్సీ ప్రొఫెసర్.
ఒక్కక్షణం గాభీరంగా వున్న ఆ ఇంటివైపు చూసి కాస్త సంకోచంతో మరికాస్త మొహమాటంతో గేటు తీశాడు.
కిర్రుకిర్రు మంటున్న గేటు శబ్దానికి బయటికివచ్చారు. ప్రొఫెసర్ గారు. తీక్షంగా అతనివంక చూసి చరచర గేటు దగ్గరికి వచ్చారు.
"హు ఆర్యూ? వై ఆర్యూ ప్లేయింగ్ విత్ ది గేట్?" అని గద్దించారు.
"ఐయాం నాట్ ప్లేయింగ్ సార్! ఐయాం ట్రయింగ్ టు క్లోజిట్!" బెదిరిపోయి సమాధానం చెప్పాడు మోహన్.
"ఓ! అని తలపంకించి, ఈ గేటిలా బార్లా తీసేస్తే వెయ్యటం కష్టం. రెండో మనిషి సాయం కావాలి" అంటూ లోపలికెళ్ళిపోయిన గేటుని తీసుకొచ్చారు. మోహన్ ఇవతలి గేటుని తీసుకెళ్ళాడు. రెండూ కలిపి గడియ వేసేశాడు ప్రొఫెసర్ గారు.
"ఇప్పుడు చెప్పు యెవర్నువ్వు?" అని అడిగారు.
"నా పేరు మోహన్ అండీ! ప్రొఫెసర్ గారి కోసం వచ్చాను" అన్నాడు గేటివతల నిలబడి.
"అలాగా నా కోసంవస్తే మరి బయటికెళ్ళి పోయావేం?" అడిగారు.
"కావాలని బయటికి రాలేదండీ. గేటు వేసే ప్రయత్నంలో ఇవతల వుండిపోయాను."
"ఓ!" అంటూ గేటుతీశారు ప్రొఫెసర్ గారు. ఆ సందులోంచి దూరిపోయాడు మోహన్.
"ఐయాం పృధ్వి!" పరిచయం చేసుకున్నా రాయన.
పరీక్షగా ఆయన వంక చూశాడు మోహన్. ఏభై అయిదు అరవై మధ్య ఉంటుంది వయసు. బుర్ర ముగ్గు బుట్టలా పండిపోయింది. జుట్టు బోలెడంత ఉంది. కానీ తైల నంస్కారం ఎరగనట్లు ఉంది. ఆ తల్లో దువ్వెన పెట్టి ఎన్నో ఏళ్ళు దాటి ఉండవచ్చు.
మంచి పొడగరి. నస్యంరంగు సూట్, గళ్ళషర్టు నల్ల రంగుటై. బూడిదకొట్టుకుపోయిన బూట్లు.
సీరియస్ గా ఉన్న మొహంలో తీక్షణంగా మెరుస్తున్న కళ్ళు, కళ్ళజోడు.
చూడ్డానికి కొంచెం ఫన్నీగా ఉన్నా మోహన్ కు మాత్రం గౌరవం కలిగింది. వినయంగా చేతులు జోడించాడు.
"మేగాడ్ బ్లెస్ యూ!" ఆశీర్వదించాడు ఆయన.
"కమాన్" అని లోపలికి తీసుకు వెళ్ళారు. లోపలికి అడుగు పెట్టగానే ముందుగది డ్రాయింగ్ రూమ్ నాలుగు పేము కుర్చీలు ఒక ఈజీ ఛేయిర్.
"చూడు మిస్టర్ ఇది నా స్టడీ అవర్. ఐవిల్ హేవ్ టూ గోటూ మై లైబ్రరీ! విల్ యూ వెయిట్ హియర్?" అడిగాడు ఆయన.
అసలు మోహన్ ఆర్ట్సుస్టూడెంట్ సైన్స్ తో గానీ సైంటిస్ట్సుతో గానీ ఏ మాత్రం పరిచయం లేదతనికి. ఇప్పుడీ ప్రొఫెసర్ గారితో పరిచయం అతనికెంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఆయనతో పాటు లోపలికి వెళ్ళి ఆ లైబ్రరీ చూడాలనిపించింది.
ఆ మాటే ఆయనతో చెప్పాడు. మెచ్చుకోలుగాచూశారాయన. "కమాన్!" అని లోపలికి తీసుకెళ్ళారు. "దిసీజ్ మై లైబ్రరీ! నువ్వు ఏమైనా కావాలనుకుంటే తీసి చదువుకో. లేకపోతే మాట్లాడకుండా కూర్చో ఏ మాత్రం చప్పుడు చెయ్యకు. నాకు డిస్ట్రబెన్స్ గా ఉంటుంది" అనేసి సీరియస్ గా వెళ్ళి తన సీటులో కూర్చున్నారు.
పెద్ద హాలు. హాలులో రెండు వైపులా గోడలకి ఆనించి పెట్టివున్నాయి ఎట్టయిన యినుప రేక్ లు. ఇరువైపులా ఉన్న ఆ ఇరవై రెక్స్ లో ఒకదానిలో పుస్తకాలు, మిగిలిన వాటినిండా పట్టుకుంటే పడిపోయేట్లు పేపర్లు....పైల్స్ వాటినిండా దుమ్మూ ధూళీ దూది బేళ్ళ లాగా కట్టిన పాత పేపర్లు. యెదురుగా మధ్యలో పెద్ద టేబుల్. దానిమీదకూడా బోలెడన్ని ఫైళ్ళు ఆ బల్లకి ఇటు వైపు రెండు కుర్చీలు అటువైపురివాల్వింగ్ ఛేయిర్ దాంట్లో కూర్చుని బరబరా రాసేసుకు పోతున్నారు ప్రొఫెసర్ గారు.
కుతూహలంగా లైబ్రరీని పరిశీలించి మెల్లిగా పిల్లిలా నడుస్తూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు మోహన్. కాసేపు నిశ్శబ్దంగా కూర్చునేసరికి విసుగేసింది అతనికి అదీగాక ఆఫీస్ కి టైం కూడా అయిపోతుంది. కాసేపు సంకోచించిమెల్లిగా లేచి నిలబడి "సర్" అన్నాడు.
