మద్రాసులో ఒక చక్కటి పొదరిల్లు లాంటి కాటేజి అద్దెకి తీసుకున్నాడు భార్గవ. ఒక డ్రైవర్నీ, ఫియట్ కారునీ, ఆమెకోసం ఆ ఇంట్లో పెట్టాడు.
షూటింగ్ స్థలాలు చూడడానికని ఓ సారీ, షూటింగ్ కోసమేనని ఓసారీ, రకరకాల చోట్లకి తిరుగుతున్నారు రాగిణీ, భార్గవా! జనం చెవులుకొరుక్కుంటున్నారు. భార్గవ ఒక్కొక్కసారి రాత్రుళ్ళు రాగిణి ఇంట్లోనే వుండిపోతున్నాడు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది భార్గవ రాగిణిని పెళ్ళిచేసుకున్నాడనీ, వుంచుకున్నాడనీ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఈవార్త భార్గవ భార్యదాకా చేరినా ఏదో నచ్చజెప్పేశాడు. ఆరు నెలలలో పూర్తవుతుందన్న సినిమా, ఆరు నెలలకి ప్రారంభం కూడా కాలేదు. కానీ కొత్త చీరలు, కొత్త నగలూ, కట్టినన్ని కట్టీ, కొన్ని ఇంటికి పంపించేస్తోంది సరోజిని.
భరణి దగ్గరనుంచి ఉత్తరాలొస్తున్నాయి. అందులో తనకిప్పుడు ఆరో నెలనీ, పురిటికి అక్కడే వుందామనుకుంటున్నాననీ, వీలవుతే సరోజినిని పురిటి వేళకి రమ్మనమనీ రాసింది.
పురిటి సంగతి ఎలా వున్నా అమెరికా చూడొచ్చునన్న సంబరంలో ఉక్కిరి బిక్కిరైపోయింది సరోజిని. "నువ్వెళ్ళిపోతే ఇక్కడెవరుంటారు. కాశ్యప్ కి భరణినే ఇండియారి పంపమని రాస్తాను. ఇక్కడైతే నేను దగ్గరుంటాను" అన్నారు రామానుజంగారు.
"మీరుండి చేసేదేముంది?"
"సరోజినీ! నీలో ఇంత స్వార్థం వుందని, నిన్ను కట్టుకున్ననాడు తెలుసుకోలేకపోయాను. కట్టుకున్న భర్త విషయంలో, కన్న బిడ్డలవిషయంలో కూడా స్వార్థమేనా? నీకు కావలసినవి సాధిస్తావు. దొరకకపోతే బాధపడతావ్? తల్లితండ్రులు బిడ్డలని చేనుకి కంచెలా కాపాడేవారు కావాలికానీ, చేనుమేసే కంచెలా కాకూడదు." కోపం పట్టలేక అక్కడినుంచి వెళ్ళిపోయారు.
రాగిణి మద్రాసు వెళ్లాక ఒక్కసారి కూడా హైదరాబాదుకి రాకపోవడం, రాగిణి సినిమాలో చేరిపోయిందన్న వార్త పేపర్లో చదివి, డాన్సు ప్రోగ్రాములకోసం, ఎవ్వరూ రాకపోవడం, రాగిణిపై రకరకాల చిత్రసీమ వ్యాఖ్యానాలు నలుగురూ నాలుగు రకాలుగా అనుకోవడం సరోజినికీ లోలోపల భయంగానూ, బాధగానూ వుంది. అందుకే రామానుజంగారు ఏమన్నా నోరు మెదపలేదు.
ఆ వారం సినిమాపత్రికలన్నింటింలో 'రాగిణీ భార్గవ్ ల ప్రణయ జీవనం' అంటూ రాసిన రాతలు సరోజినిని కూడా కలవరపెట్టాయి. రామానుజంగారికి తల్లీ బిడ్డలనిద్దరినీ హత్య చెయ్యాలన్నంత కోపం వచ్చింది.
అంతలోనే పోస్టుమాన్ టెలిగ్రామొచ్చిందని చెప్పడంతో రామానుజంగారు గబ గబా వెళ్ళి, టెలిగ్రామ్ అందుకుని చించి చూశారు. అది అమెరికా నుంచొచ్చిన కేబుల్! కంగారుగా చదివారు. "భరణి డెలివర్డ్ ఎ మేల్ బేబీ..... మదర్ అండ్ చైల్డ్ ఆర్ సేఫ్, లెటర్ ఫాలోస్...... కాశ్యప్!"
రామానుజంగారి కోపం బుస్సుమని చల్లారిపోయింది. "ఏమేవ్! మనకి మనవడు పుట్టాడు. "పసి పిల్లాడిలా అటూ ఇటూ తిరుగుతూ గట్టిగా అరుస్తూ చెప్పాడు రామానుజంగారు.
"భరణికిప్పుడు ఏడో నెలకదండి! అంటే ఏడోనెల్లోనే పుట్టాడన్నమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. దానికేం చేతనవుతుంది. అయ్యయ్యో" అంటూ దీనంగా కూర్చుండిపోయింది.
"పాపం నువ్వు అమెరికా చూడకుండానే భరణికనేసింది! ఏం చేస్తావు, నీకా ప్రాప్తం లేదు!" వేళాకోళం చేశారు రామానుజంగారు.
"ఛీ పొండి! ఏడో నెల్లో పురుడొచ్చింది, ఎలా వుందో ఏమిటో అని నేనాలోచిస్తుంటే, అమెరికా గురించి ఆలోచిస్తున్నానంటున్నారు. అన్నీ ఇట్లాటి సూటిపోటీ మాటలే" దెప్పింది సరోజిని.
రామానుజంగారు టెలిగ్రామ్ ని ఒకటికి రెండుసార్లు చదువుకుంటూ, సరోజిని మాటలు లెక్కజెయ్యలేదు. "పోనీ ఇప్పటికైనా వెళ్ళి ఒక నెలరోజులుండి జాగ్రత్తగా నాలుగూ చూసిపెట్టి రావొచ్చు. దానికేం తెలుస్తుంది, పసిపిల్ల" అంది సరోజిని. ఆమెలో అమెరికాకి వెళ్ళాలన్న ఆశ పూర్తిగా చావలేదు.
నవ్వి ఊరుకున్నారు రామానుజంగారు. ఆ రోజంతా భరణి, కాశ్యప్ ల మాటలే దొర్లాయి.
మర్నాడు పూర్తి వివరాలతో కాశ్యప్ నుండి ఉత్తరం వచ్చింది. బాబుని చూసుకోవడం కోసం ఒక నర్సుని పెట్టామనీ, బాబూ, భరణీ కులాసాగానే వున్నారనీ, అత్తగారిని అనవసరంగా కంగారుపడొద్దని చెప్పమని రాశారు. బాబుకి "దినకర్" అని పేరు పెడుతున్నామనీ రాశారు. రామానుజంగారు. సరోజినీ ఎంతో సంతోషించారు.
* * * *
రాగిణి ఎప్పుడు ఏ ఊళ్ళో ఎక్కడుందో తెలీడంలేదు. సరోజిని మహా కంగారుపడిపోయింది. రామానుజంగారు అసలు ఆ ఊసే ఎత్తరు. సరోజిని ఏమైనా అంటే "దాని ఖర్మ..... నీ ఇష్టం" అంటారు. కనీసం ఆయన రాగిణికి ఉత్తరం కూడా రాయలేదు. శిల్పకి మాత్రం ఓపిగ్గా ఉత్తరం రాస్తారు. ఆ తర్వాత భరణికీ, కాశ్యప్ కీ రాస్తారు.
కాలచక్రంలో మరో నాలుగు మాసాలు గడిచిపోయాయి. సెలవులకి శిల్ప ఇంటికొచ్చింది.
ఈసారి ఆమెకి రామానుజంగారి స్నేహితులు..... కోటయ్యగారి మనవడు అవినాశ్ ఊటీనుంచి, హైదరాబాద్ వరకు రావడంలో వల్ల అతని కంపెనీ వుంది. అతను ఆ మధ్యనే అయిదో తరగతిలో చేరాడు. అతనొస్తున్నాడని తెలిసే...... ఆ బాబుతోనే శిల్పని పంపమని రామానుజంగారు సిస్టర్ ఫెర్నాండిస్ కి రాశారు. శిల్ప ఒస్తోందని తెలిసి భరణి అమెరికా నుంచి బొమ్మలూ, గౌన్లు, చాక్లెట్లు పార్శిల్ చేసింది. తనూ, కాశ్యప్ ఉన్న ఫోటో శిల్పకి చూపించమని పంపించింది. శిల్పకి అన్నింటికన్నా నచ్చిన బహుమతి ఆ ఫోటో దాన్ని తన పుస్తకంలో దాచుకుంది. ఆ ఫోటోని కనీసం రోజకొక్కసారైనా ముద్దెట్టుకుంటుంది.
"అమ్మా! పెద్దక్క లేదేమీ? ఎప్పుడొస్తుంది" అంది ఒక రోజున శిల్ప.
"అక్క పెద్ద యాక్ట్రస్ అయిపోయింది. అక్క యాక్ట్ చేసిన సినిమా ఒక నెలలో వచ్చేస్తుంది." అంది. తను అడిగిన ప్రశ్నకి సమాధానం అది కాదని తెలుసు. రాగిణి యాక్ట్ చేస్తోందంటే శిల్పకెందుకో నచ్చలేదు.
ఒకరోజు డ్రాయింగ్ రూంలో ఒక మూలగా సరోజిని పెట్టిన ఆల్బమ్ చూసింది శిల్ప. అంతే! రాగిణిని ఆ వేషంలో, ఆ బట్టల్లో చూస్తే అసహ్యం అనిపించింది- 'అక్కకి సిగ్గులేదూ! ఇట్లాంటి ఫోటోలు ఎవరైనా చూస్తుంటే సిస్టర్ ఫెర్నాండిస్ కేకలేస్తుంది. అట్లాంటిది అక్క ఇట్లాంటి ఫోటోలు ఎందుకు తీయించుకుంది? అనుకుంటూ పెట్టేసింది ఆల్బమ్ ని తీసినచోటే!
శిల్పకి ఆ రాత్రి బ్రహ్మాండమైన సందేహం వచ్చింది. "అమ్మా రాగిణి అక్క పెళ్ళెందుకు చేసుకోలేదు భరణి అక్కలాగా?"
ఆ ప్రశ్నకి సరోజినికి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు.
"అక్క సినిమాల్లో నటిస్తోంది కదా? అందుకని పెళ్ళిచేసుకోలేదు" అంది.
"ఈసారి ఊటీ నుంచొచ్చి తెగవాగుతోంది శిల్ప" అంది రామానుజంతో సరోజిని.
"అవును! రాగిణి బ్రతికుండా చచ్చిపోయిందా? వెళ్ళి ఇన్నాళ్ళయింది ఒక్కసారి ఇంటికి రాలేదు. భరణి పెళ్ళికి రాలేదు. కనీసం యిప్పుడు తన బిడ్డ సెలవుల్లో ఇంటికి వస్తుందని తెలుసుకదా! దాన్ని చూడ్డానికైనా రావడానికి తీరుబడి చిక్కలేదా? అలాంటప్పుడు ఆ బిడ్డని కని, ఎందుకు భూమ్మీద పారేసినట్టు? తల్లి బ్రతికుండి తల్లినని చెప్పుకోక, తండ్రెవరో చెప్పక..... ఎందుకా పిల్లని దిక్కులేనిదానిలా పెంచడం? అంతకంటే ఆ పిల్ల కడుపులో ఉన్నప్పుడే తీసి పారేస్తే పోయేది! అన్ని పాపాల్లో ఇదొకటి." అతని కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి కోపాగ్నితో.
సరోజిని మౌనంగా కూర్చుంది.
శిల్ప ఈ మాటలు విందేమో అవతలి గదిలోంచి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ వెక్కిళ్ళు విని, సరోజిని రామానుజంగారు అక్కడికి పరుగెత్తారు. వెక్కి వెక్కి శిల్ప ఎందుకు ఏడుస్తుందో తెలీక ఖంగారుగా, "ఎందుకమ్మా ఏమయింది?" అంటూ లాలించారు. "పడ్డావా?", "దెబ్బ తగిలిందా" వంటి ప్రశ్నలన్నింటికీ అడ్డంగా తలూపింది శిల్ప లేదని.
అలా ఏమీ చెప్పకుండా ఏడ్చి ఏడ్చి అలసిపోయిన శిల్ప నిద్రలోకి జారుకుంది.
ఒకవేళ శిల్ప తమ మాటలు విందేమోనన్న అనుమానం ఇద్దరికీ ఒచ్చింది. శిల్పని తలచుకొన్న కొద్దీ హృదయం ద్రవించిపోతుంది. ఆ సంఘటనతో రామానుజంగారికి బి.పి. పెరిగిపోయింది. శిల్పకి కూడా జ్వరం పట్టుకుంది. డాక్టరు, మందులు, ఇంట్లో పనులూ...... అలసిపోతోంది సరోజిని. రాగిణిని వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇప్పించింది. దానికి సమానంగా ఆమె, వెంటనే తాను రాలేకపోతున్నందుకు బాధ పడుతున్నానని, అయిదు వేలకి డ్రాఫ్టు పంపుతున్నానని, మరో పదిహేను రోజుల్లో షూటింగు పూర్తయిపోతే, డబ్బింగొక్కటే వుంటుందనీ ఆ తరువాత మిగతా డబ్బుతోసహా హైదరాబాదు వచ్చేస్తున్నాననీ రాసింది.
