"అది వాళ్ళ స్వంతమైపోతుంది! ఎంత విచిత్రం!"
ఆలోచిస్తూ పడుకుంది తల్లి ఒడిలోంచి తలతియ్యకుండా, కావ్య! అలా పడుకుంటే ఆమె కేదో ఆనందం! ఎంతో తృప్తి.
నోట్ల కట్టలని కవరులో చుట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళారు, క్రాంతీ, విశ్వనాథంగారూ మగపెళ్ళివారింటికి.
అక్కడి దృశ్యాన్ని చూసి, నోటమాటరాక మూగబోయారిద్దరూ !
కళ్ళు చీకట్లు కమ్మాయి క్రాంతికి !
భూమి బద్దలయినట్టనిపించింది !
గుండెలో బాంబులు పేలినట్టయింది !
క్రాంతీ, విశ్వనాథంగారూ మతిబోయిన వారిలా చూస్తూ నుంచున్నారు !
10
"నేనీ పెళ్లి ఛస్తే చేసుకోను."
"వాళ్ళని చూస్తే అలా అనిపించడం లేదు. గిట్టనివాళ్లెవరైనా పుట్టించిన పుకార్లయి వుంటాయి. నిజానిజాలు తెలుసుకోకుండా, నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు" కామేశం తల్లి గొంతు.
"ఏమండీ! మీ అమ్మాయి చెడిపోయిందటగా! నిజమేనా ? అని మనం అడుగుతామా వాళ్ళు చెబుతారా? పదిమంది నడిగితే హైదరాబాదులో పదిమందీ ఇదే మాట అన్నారు. ఒకరంటే అబద్ధం చెబుతారు, ఇద్దరైతే అబద్ధం చెబుతారు. అందరూ అబద్ధాలే చెప్పరుకదా! నిప్పులేందే పొగెందుకొస్తుంది ?" కటువుగా అన్నారు సుబ్బారావుగారు.
"ఒక్కొక్కసారి నిప్పు అక్కడెక్కడో వున్నా, పొగమాత్రం ఇంకెక్కడో చుట్టేస్తుంది. ఈ పొగ చుట్టుకున్న చోట ఉక్కిరిబిక్కిరై పోతూ వుంటారు జనం. అలాగే...."
"సావిత్రీ ! వాడేం చిన్నపిల్లవాడు కాదు. అన్నీ తెలుసుకునే ఒచ్చుంటాడు".
వాళ్ళ మాటలు వింటూ బయటే నుంచుండిపోయిన క్రాంతి కళ్ళంట నీరు కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది.
విశ్వనాథంగారి మొహంలో నెత్తురుచుక్క లేదు.
కాసేపు తటపటాయించి, "బాబూ! లోపలికెళ్లి మాట్లాడదాం పద." అంటూ ముందుకు నడిచారు.
విశ్వనాథంగారిని చూసి మండిపడుతూ "ఏమండీ! ఇదేనా మీ మర్యాద ? ఈ సంబంధాన్ని మాకు తగుననే చూపించారా?" అన్నాడు.
"ఏం జరిగిందని మీరు బాధపడుతున్నారు? మీరూ వాళ్ళూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నాకే, అన్నీ ఒప్పుకున్నాకే ఇంతవరకూ ఒచ్చిందికదా! అబ్బాయి మీరడిగినంత కట్నమూ పుచ్చుకునే ఒచ్చాడు! ఇదుగో యాభై వేలు!" క్రాంతి చేతిలోంచి కవరు తీసుకుని, టేబులుమీద పెట్టేడు. డబ్బుకు గడ్డితినే వాళ్ళమనుకుంటున్నారా? మా అబ్బాయికి యాభై వేలు ఎవరైనా ఇస్తారు. మాకు కావలసింది డబ్బొక్కటే కాదు. దాంతోపాటు గుణం కూడా!"
"అమ్మాయి గుణవంతురాలు కాదనా మీ ఉద్దేశం ?"
"ఇంకా ఎందుకండీ బుకాయిస్తారు? రంకుతనం, దొంగతనం అట్టేకాలం దాగదు".
"సుబ్బారావుగారూ! మర్యాద యిచ్చిపుచ్చుకోవాలి. మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్డానికి, మేమేమీ మీకింద నౌకర్లం కాదు. రంకుతనం, దొంగతనం అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అబద్ధాలు చెప్పి పెళ్లి చెయ్యవలసిన అవసరం మాకు లేదు." అంతసేపూ మౌనంగా వాళ్ల మాటలు వింటున్న క్రాంతి ఇంక ఊరుకోలేకపోయాడు.
"అయితే మీ చెల్లెలు చెడిపోయిందన్నమాట అబద్ధమా ?"
"వార్త అబద్ధం కాదు! కానీ చెడిపోవడం నిజంకాదు! ప్లీజ్ నా మాట నమ్మండి! అనవసరంగా ఆమె మీద ఈ నింద పడింది! ఆ నిందే దాని ప్రాణం తీస్తోంది! నిజానికి నా చెల్లెలు ఎంతో మంచిది. ఎంతో తెలివైనది! సహృదయురాలు! సద్భావాలు కలది! చెయ్యని తప్పుకు శిక్షననుభవిస్తూ, నిందను మోస్తూ, నిరాశగా వుండి కుమిలిపోతూన్న ఆమె, పెళ్ళి కుదిరాక ఎంతో సంతోషంతో మామూలు మనిషయింది. ఆ నిందే దానిని వెంటాడకపోతే, ఈపాటికి ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి ఏ ఐ.ఏ.ఎస్. ఆఫీసరో అయ్యేది! నిజానికి నా చెల్లెలు త్యాగశీలి! ఎవరికో సహాయం చెయ్యబోయి, ఈ ప్రపంచం స్వార్ధంతో నిండిన విషవలయం అని తెలుసుకోలేక తను చిక్కుల్లోపడి ఋజువు చేసుకోలేని స్థితిలో తన జీవితాన్నే బలిచేసుకుంది. ప్రమాణం చేసి చెబుతున్నాను. నా చెల్లెలు నిర్దోషి. ఆమె ఏ తప్పూ చెయ్యలేదు. నిజంగా ఆమె చెడిపోయి వుంటే, ఆ సంగతి కూడా చెప్పి, దానికీ ఒప్పుకున్న వాళ్లతోటే పెళ్ళి జరిపించుండేవాళ్లం. అబద్ధాలు చెప్పి, కార్యాలు సాధించే రకం కాదు సార్ మాది? మీకు నమస్కారం చేస్తాను. మా చెల్లెలు నిర్దోషని నమ్మి, నా మాటలు సత్యమని నమ్మి, ఈ శుభకార్యాన్ని జరిపించండి!" రెండు చేతులూ జోడించి నమస్కరించి, ప్రాధేయపడుతూ చెప్పాడు క్రాంతి. దుఃఖంతో అతని గొంతు పూడుకు పోతూ వుంటే, మాట సరిగా రావడం లేదు. కళ్ళ నిండా నిండుకున్న కన్నీళ్లని, జేబు రుమాలు తీసి తుడుచుకున్నాడు.
ఇంటిల్లి పాదీ క్రాంతి చెప్పే మాటల్ని విని తలొంచుకు కూర్చున్నారు. సావిత్రమ్మగారు, కంటతడి పెట్టుకున్నట్టుగా అనిపించింది.
సుబ్బారావుగారు మాట్లాడలేదు.
టేబులుమీద వున్న కవరుని సుబ్బారావుగారి చేతిలో పెట్టమన్నట్టుగా సైగ చేశారు విశ్వనాథంగారు. క్రాంతి ఆ కవరుని సుబ్బారావుగారికి అందించబోయాడు.
"నో!....నో! మీరు చెప్పేది నిజమేకావచ్చు! కానీ, ఆ నిందలని మా ఇంటికీ మోసుకొస్తే వాటిని భరించే శక్తి మాకు లేదు. పైగా ఆ అవసరం కూడా మాకులేదు! మీరు మరో సంబంధం చూసుకోండి. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి. ముందుగానే ఈ విషయాలన్నీ వాళ్లతో చెప్పి, ఆ తరవాతే పెళ్ళి ఖాయం చేసుకోండి కానీ, అంతా ఖాయమైపోయాక, అప్పుడు అసలు విషయాలు చెప్పకండి. ఇప్పుడు మా పరిస్థితి చూడండి, ఎంత దారుణమో! ఊళ్ళో అందరికీ చెప్పేశాం పెళ్లి కుదిరిపోయింది అని! రేపోమాపో పెళ్లి పత్రికలు వేయించవలసిన ఈ సమయంలో,ఈ వార్త అందరికీ తెలిసి, ఈ పెళ్ళి ఆగిపోయిందీ అంటే, మాకు ఎంత అవమానంగా వుంటుందో ఆలోచించండి"
"సుబ్బారావుగారూ! మీరే అలా అంటే, ఒక ఆడపిల్లగా ఆమె బ్రతుకూ! ఆమెని కన్నవాళ్ల బ్రతుకూ ఏమౌతుందో ఆలోచించండి" అన్నారు విశ్వనాథంగారు.
"సంఘసేవ చెయ్యడానికీ, అందరి బ్రతుకులూ తీర్చిదిద్దడానికీ, మేమేమీ పనిలేకుండా కూర్చోలేదు, మాకా కోరికా లేదు. మా మానాన మమ్మల్ని ఒదిలేసి, మీరు మరో సంబంధం చూసుకోండి" ఖచ్చితంగా చెప్పేశారు సుబ్బారావుగారు.
"కామేశంగారూ! మనం యువకులం! ఇటువంటి సమస్యలని పెద్దవాళ్ల కన్నా మనమే జాగ్రత్తగా పరిష్కరించుకోగలం. నా చెల్లెలు చెడిపోలేదు. అందుకనే అర్ధం చేసుకొని ఆదరించమని అర్ధిస్తున్నాను" అన్నాడు క్రాంతి కామేశం దగ్గరికెళ్ళి, అతని చేతులు పట్టుకుంటూ.
"ఐ....యామ్....సారీ మిస్టర్ క్రాంతీ! ఇప్పటికే నా స్నేహితులు నవ్వుతున్నారు నన్ను చూసి. నా వల్లకాదు. కాన్సిల్....దిస్....మ్యారేజ్" అన్నాడు ముక్తసరిగా. ఖచ్చితంగా కామేశం. క్రాంతికి ఒళ్ళుమండి పోయింది! కోపం కళ్లల్లోకి చోటుచేసుకుందేమో ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయి! "యూ....ఇడియట్! ఆఫ్టరాల్ యాభై వేలకు అమ్ముడుపోవడానికి అడ్డురాని నీ సిగ్గు, ఒక అమాయకురాలిపైన పడ్డ అభాండాలను తొలగించడానికి, అడ్డుపడుతోందా? జీవితాన్ని అర్ధం చేసుకోలేని నీలాంటి పశువుని ప్రాధేయపడడం నాదే తప్పు" ఆవేశంతో ఊగిపోతూ కామేశం మీదకి చెయ్యెత్తాడు క్రాంతి.
అంతవరకూ ప్రశాంతంగా వున్న వాతావరణం, యుద్దభూమిలా మారిపోయింది!
సుబ్బారావుగారు పులిలాఅరుస్తూ, చెంపమీద చెళ్ళునకొట్టారు క్రాంతిని. "యూ....రౌడీ ఫెలో! నువ్వు ఇంజనీరువా ? మీది సంప్రదాయమైన కుటుంబమా ? నీ చెల్లెలు మహాపతివ్రతా ? నీ ప్రవర్తన చూస్తేనే అర్ధమయిపోయింది. నువ్వు చెప్పినమాటల్లో ఎంత నిజంవుందో ! నాకొడుకుమీద చెయ్యి చేసుకుంటావా ? ఎన్ని గుండెలురా నీకు ?
బలవంతంగానైనా, ఆ పిల్లని మా మెడకి కట్టాలని చూస్తున్నావా ? పోలీసోళ్లని పిలిపించి నిన్ను బొక్కలోకి తోయిస్తాను
ఏమనుకున్నావో సుబ్బారావంటే"! పళ్ళు కొరుకుతూ ముంగేసేలా చూశారు క్రాంతిని సుబ్బారావుగారు.
వాళ్ళిద్దరినీ వేరు చెయ్యడానికి మధ్యలో వెళ్ళి సతమతమయ్యారు విశ్వనాథంగారు.
ఆవేశంలో కామేశాన్ని కొట్టడానికి తను చెయ్యెత్తడం వల్లే ఇదంతా జరిగిపోయింది. తననొక రౌడీలాగా ఊహించుకుంటున్నారు సుబ్బారావుగారు. పొరపాటుకు చింతిస్తు సుబ్బారావుగారి కేసి చూశాడు క్రాంతి.
"మీరు, నా తండ్రి వంటివారు. ఆవేశంలో ఏదైనా అంటే నన్ను మన్నించండి. అది నా చెల్లెలు జీవితం నాశనమై పోతోందన్న బాధతోనే తప్ప, మరే ఉద్దేశ్యం తోటీకాదు. పరిస్థితులను అర్ధం చేసుకోండి. ఇంత వరకూ వొచ్చిన పెళ్ళి ఆగిపోయిందీ అని తెలిస్తే, నా చెల్లెలికింక పెళ్లే కాదు. ఇప్పటికే ఆమె నిందల పాలయింది. ఈ పెళ్ళి ఆపుచేస్తే ఆ నిందమాసిపోదు సరికదా మాయని మచ్చలా మిగిలిపోతుంది! నా చెల్లెలు పెంచుకున్న ఆశలని తుంచివేయకండి. నూరేళ్ళ ఆమె నిండు జీవితంలో చీకటిని నింపకండి." అతని పాదాలు పట్టుకుని పసిపిల్లాడిలా ఏడుస్తున్న క్రాంతిని భుజాలు పట్టుకుని లేవనెత్తారు విశ్వనాథంగారు. ఆయనకీ గుండె పిండేసి నట్టవుతోంది.
ఇదంతా లోపలి నుంచి చూస్తూన్న సావిత్రమ్మగారూ, ఆమె బిడ్డలూ కూడా కంట తడిపెట్టారు.
"మీరెంత డబ్బడిగినా ఇస్తాను. నా చెల్లెలి జీవితాన్ని కాపాడండి" కవరు తీసి సుబ్బారావుగారి చేతిలో పెట్టబోయాడు.
"చూడు బాబూ! నీ బాధ నాకర్ధం కాకపోలేదు. కానీ నేనేం చెయ్యగలను ? నాకూ ఇంకొక ఆడపిల్ల వుంది. 'చెడిపోయిన దాన్ని కోడలుగా తెచ్చుకున్నాడూ' అని నలుగురూ నన్నాడిపోసుకుంటూ వుంటే, నా బిడ్డకి పెళ్ళవుతుందా ?"
"నా చెల్లెలు చెడిపోలేదండీ ! ఈ మాట నేనెంత గట్టిగా చెబుతున్నానో, మామగారుగా మీరూ, భర్తగా మీ అబ్బాయీ కూడా చెబితే అందరూ నోరు మూసుకుంటారు. లోకులు కాకులు! ఒకరేమంటే అందరూ అదే పట్టుకు
కూర్చుంటారు. మనం మెత్తగా వుంటే మననే మొత్తుతారు. మనం మొత్తి మాట్లాడితే, వాళ్ళు మెత్తగా పడుంటారు. నా మొర ఆలకించండి! కాదనకండి, ప్లీజ్!" కామేశం చేతులు పట్టుకున్నాడు క్రాంతి. అతను క్రాంతి చేతులు విడిపించుకుంటూ "మీరు చెప్తున్నారు చెడిపోలేదు" అని కాని మేం చూశామా? అన్నాడు. క్రాంతికి అరికాలిమంట నెత్తికెక్కింది. అటూ ఇటూ చూసి, పక్కగదిలోంచి వీరి సంభాషణవింటున్న కామేశం రెండో చెల్లెలున్న గదిలోకి ఒక్క పరుగులో వెళ్లి తలుపులు మూసేశాడు. అనుకోని ఈ సంఘటనకి, ఆ పిల్ల లబోదిబోమని అరిచింది. ఇంటిల్లి పాదీ తలుపు గుద్దారు తెరవమని. ఒక అయిదు నిమిషాల తరవాత తలుపు తెరిచాడు క్రాంతి. సుబ్బారావుగారూ, కామేశం అతని మీదికి దుమికారు కొట్టడానికి. ఇద్దర్నీ చెరో చేత్తో ఒక్క తోపు తోశాడు. ఆవేశంతో కాలు కాలిన పిల్లిలా నురుగులు కక్కుతూ ఇప్పుడు నేనంటాను నేను మీ అమ్మాయిని చెరిచానని! ఆ పిల్ల నడగండి, కాదంటుంది, మీరేం చేస్తారు ?" అడిగాడు.
