Previous Page Next Page 
నా కథవింటావా పేజి 14


    "ఈ రోజున తన పెళ్ళికోసం, ఇన్నేళ్ళ నుంచీ దాచుంచిన  డబ్బంతా ఒక్కసారి ఊడ్చిపెట్టినట్టు 'హరీ' అంటూంటే  ఏమీ చెయ్యలేని  నిస్సహాయస్థితిలో  తనున్నందుకు, తనమీద తనకే  జాలేసింది. ఆడదిగా పుట్టినందుకు మొట్ట మొదటిసారిగా  తనని తాను నిందించుకుంది.
    తనూ ఆ అబ్బాయిలాగే  డిగ్రీ  పుచ్చుకుంది. పెళ్ళి జీవితంలో తనకెంత  అవసరమో అతనికీ అంతే అవసరం. అయినా తన పెళ్ళికి  తనను కన్న వాళ్ళకి బాధలూ, కర్చులూ! అతనిని  కన్నవాళ్ళకి అదనంగా డబ్బు! ఆనందం! ఈ వ్యవస్థ ఎందుకిలా  తయారయింది ? ఎందరు ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ సమస్యకు  బలైపోతున్నారు ? బాబోయ్ ఆడపిల్ల ? అని, ఆడపిల్లని కన్న  తల్లిదండ్రులు గుండెలు  బాదుకునే స్థితి ఎందుకొచ్చింది ?
    ఇప్పుడు వరకట్నం, అప్పుడు కన్యాశుల్కం! ఆ రోజుల్లో కూడా ముసలీ ముతకా, కాసులు కుమ్మరించేసి  కన్నెపిల్లల్నెత్తుకు  పోయేవారు. పెళ్ళి పేరుతో  అదొక  పవిత్రమైన  వ్యభిచారంగా ఉండేది ! వరకట్నమైనా, కన్యాశుల్కమైనా, విధవా  సంప్రదాయాలు, బాల్యవివాహాలూ, సతీ సహగమనాలూ, అన్నీ కూడా, ఆడబ్రతుకుకి  ప్రాణ  సంకటాలుగానే  మిగిలిపోయాయి ! ఆమె కన్నీటికి దోహదం  చేశాయి ! ఎందుకిలా  ఎవరు దీనికి బాధ్యులు ?
    ఒక పక్క ఆడవాళ్ళని అపరకాళి అంటూ, ఇల్లాలిని ఇంటికిదీపం అంటూ, ఆడపిల్ల లక్ష్మి అంటూ, మరో పక్క  ఈ ఆంక్షలు పెట్టి, కట్టుబాట్లు విధించి, సంప్రదాయాల చట్రంలో బిగించి, ఆమె బ్రతుకును బుగ్గిచేస్తున్న వ్యవస్థ నేమనాలి? ఇది పోయేదెలా ? ఎలా ? ఏ హక్కులూ, చట్టాలూ ఈ బూజు పట్టిన  వ్యవస్థని మార్చలేవు. ప్రతి స్త్రీ మానసికంగా  ఎదగాలి ! ఆర్ధిక సమానత్వాన్ని సాధించాలి ! తన కాళ్ళపైన తను నిలబడగలిగే  ఆత్మస్థైర్యాన్ని  సంపాదించుకున్ననాడు, తాను  పురుషుడికి ఏ మాత్రమూ  తీసిపోదని  నిరూపించుకున్ననాడు, సిసలైన సమానత్వాన్ని పొందగలుగుతుంది. తన జీవితాన్ని  తానే చక్కబెట్టుకో గలుగుతుంది. అదొక్కటే మార్గం! ఆలోచిస్తూ  తనని తాను మర్చిపోయిన కావ్య తల్లి తన రెండు భుజాలూ పట్టుకుని  తట్టి, మాట్లాడించే దాకా, ఈ లోకంలోకి రాలేదు.
    "ఏమాలోచిస్తున్నావమ్మా ! ఎన్నిసార్లు  పిలిచినా  పలకలేదు. అబ్బాయి నీ కిష్టమే అన్నావు కదూ ! అందుకే  ఎంత కట్నమైనా  సరే, వాళ్ళడిగినంతా  ఇచ్చేసి, ఈ పెళ్లి చేయించాలనుకుంటున్నాం! చెప్పు తల్లీ! నా దగ్గర దాచకుండా, నిజం చెప్పు." తల నిమురుతూ  లాలిస్తూ  అడిగింది తల్లి.
    తల్లి మొహంలోకి  చూసింది కావ్య! ఆ మొహంలోని సంతోషం, తృప్తీ, తనిదివరలో  ఎప్పుడూ చూడలేదనిపించింది. ఆమె ఆప్యాయతకి, తను పెదవి విప్పలేకపోతోంది ! ఎన్నో చెప్పాలని  మనసు ఆరాటపడుతున్నా, ఏమీ చెప్పొద్దని, అంతరాత్మ  ఘోషిస్తోంది.
    మనసుకీ  మమతకీ  మధ్య పోరాటం !
    ఆశయాలకీ  జీవితాలకీ  మధ్య  ఈ చెలగాటం !
    కావ్య నవ్వి ఊరుకుంది.
    "చెప్పమ్మా ! నీ కిష్టం లేని పని, నేనుగానీ, అన్నయ్యగానీ, ఎన్నడూ తలబెట్టం. చెప్పు." అంది లాలనగా.
    "నా కిష్టమే ! కానీ, నా కోసం ఉన్న డబ్బంతా  ఈ పెళ్ళికి ఖర్చు పెట్టేసి మీరు బాధపడడం, నాకిష్టం లేదు. కట్నం  పేరుతో  ఇంత పెద్దమొత్తాన్ని  చెల్లించడం  నాకిష్టం లేదు." అంది మెల్లగా, తలొంచుకుని, కళ్ళల్లోని  నీళ్ళు తల్లికి కనబడకుండా  జాగ్రత్తపడుతూ.
    సీతాదేవి పెద్దగా  నవ్వింది.
    ఆ నవ్వులో  హేళన లేదు! పిచ్చి ప్రేముంది !
    ఆ నవ్వులో  బాధలేదు! వెల కట్టలేని  తరగని  సిరుల  ఆప్యాయతుంది ! ఆనందం వుంది !
    "పిచ్చిపిల్లా ! బ్యాంకులో ఉద్యోగం! రాను రాను హోదా  పెరుగుతుందే కానీ తరగదు .నలుగురున్న  కుటుంబం. పెద్దగా  బాధ్యత లేమీ లేవు. మరికాళ్ళకీ ఇంకో పిల్ల పెళ్ళికుందికదా ! ఆ మాత్రం కట్నం ఈ రోజుల్లో మూతి మీద మీసమున్న  ప్రతివాడూ  తీసుకుంటున్నాడు. అయినా ఆ గొడవ నీకెందులే ! నేనూ  అన్నయ్యా   చూసుకుంటాం. మాకు మాత్రం నీ పెళ్ళయి పోయాక బాధ్యత లేమున్నాయి ?లే! లేచి స్నానం చేసిరా ! కావాలంటే అలా తిరిగిరావొచ్చు." అంటూన్న తల్లికి ఇంక సమాధానం చెప్పలేకపోయింది  కావ్య! తన కన్నతల్లి తృప్తి కోసం. తన అభిప్రాయాలని తుడి చెయ్యడానికే నిశ్చయించుకుంది. తన వ్యక్తిత్వాన్ని  మరిచి పోయింది. తన ఆలోచనలకి  తాళంపెట్టి సమాధి చేసింది. నవ్వుతూ  తల్లిని పసిపిల్లలా  కౌగిలించుకుంది.
    "పిచ్చిపిల్లా !" అని తల్లి  తనని  చిన్నపిల్లను చేసి మాట్లాడుతుంటే  తృప్తిగా నిట్టూర్చి, బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళింది కావ్య !
                                   *    *    *
    మర్నాడే తాంబూలాలు  పుచ్చుకున్నారు. పెళ్ళికొడుకుకి, బట్టలూ, వుంగరం ,రెడిమేడ్ షాపులోనే కొనేశారు.
    వాళ్ళూ  కావ్యకి పట్టుచీరా, ప్రధానపుటుంగరం  పెట్టారు. ప్రధానం జరిగిపోయాక, తేలికగా  ఊపిరి పీల్చుకుంది  సీతాదేవి! పెళ్ళిముహూర్తం కూడా తొందరలోనే  పెట్టించాలని  కోరింది. "మీరు సిద్ధమైతే మాకేమభ్యంతరం?" అన్నారు మొగపెళ్ళివారు.
    "అమ్మా ! పెళ్ళయిపోయేదాకా మనం ఈ ఊళ్ళోనే  మకాం మార్చేస్తే  బాగుంటుందేమో! పెళ్ళి ఈ వూళ్ళోనే, చేస్తే కూడా  మంచిది" అన్నాడు క్రాంతి.
    "అవునురా! అసలు  మనకి  అక్కడమాత్రం  ఎవరున్నారు ? ఆ అబ్బాయికి కూడా ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ ఒచ్చేసేయట ! అమ్మాయి  పాదం చాలా మంచిదీ! పెళ్ళి చూపులవగానే, ట్రాన్స్ ఫర్ కూడా అయిపోయిందీ, అని వాళ్ళు  పొంగిపోతున్నారు. ఈ వూళ్ళో  వుంటే, దానికి దగ్గర్లో  వుంటాం. నీకింకొక్క  ఆర్నెల్ల  చదువుంది. ఎలాగో లాగించేశావా అంటే, ఉద్యోగం ఇటువైపే  చూసుకోవచ్చు! నాకూ అక్కడి జ్ఞాపకాలకి  స్వస్తిచెప్పి, ఇక్కడ కొత్త జీవితం ప్రారంభించాలనుంది. శేషజీవితమంతా  కనకదుర్గమ్మ  కాళ్ళదగ్గరే  గడపాలనుంది. విశ్వనాథంగారితో  చెప్పి, ఇక్కడే ఏదైనా  ఇల్లు చూడమని  చెప్పు బాబూ!" అంది సీతాదేవి.
    ఆమె ఆలోచనకూడా  సరైనదే  అనిపించింది క్రాంతికి. విశ్వనాథంగారు, హైదరాబాదు  వెళ్ళిపోతూ, తన ఆఫీసు వారితో  చెప్పి వెళ్ళారు, ఏదైనా  ఇల్లు చూసి పెట్టమని.
    రెండు రోజుల్లో గాంధీనగర్ లో దొరికింది. చిన్నగా చూడముచ్చటగా  వున్న ఇల్లు, ఇరుగు పొరుగూ బాగానే వున్నారు. భయమేమీలేదు. అద్దె కట్టేసి  పాలు పొంగించేసింది సీతాదేవి !
    క్రాంతి ఒక్కడే వెళ్ళి, అక్కడ ఇల్లు ఖాళీ చేసేసి వస్తానన్నాడు. ముందు అందరూ వెళ్ళాలనే అనుకున్నా, డబ్బుదండగ తప్ప! వెళ్ళి మళ్ళీ రావలసిన  అవసరం కనిపించలేదామెకి. అందుకే క్రాంతి ఒక్కడే బయలుదేరివెళ్ళి, నాలుగు రోజుల్లో  సామాన్లతో సహా తిరిగొచ్చాడు. తన పుస్తకాలూ, బట్టలూ, ఒక ఫ్రెండింట్లో పెట్టుకున్నాడు. వాళ్ళింట్లో పెయింగ్ గెస్టుగా  వుండటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
    పెళ్ళి పనులు చకచకా  జరిగిపోతున్నాయి. ఒకరోజు  బట్టల షాపింగు! ఒకరోజు నగల షాపింగూ! ఇలా రోజూ ఏదో ఒకటి. తిరుగుతూనే వున్నారు బజారుకి.
    సీతాదేవి అన్నయ్యలు వెయ్యో  రెండువేలో  సాయం చేస్తామని రాశారు. అంతకన్నా  మించి వాళ్ళకి శక్తిలేదని రాశారు.
    అసలు ఏమీ  అవసరం లేదనీ, పెళ్ళికొచ్చి  నాలుగక్షింతలు  వేసి, ఆశీర్వదించి   వెళితే చాలనీ  రాసింది సీతాదేవి.
    కావ్య  కోరుకున్న  చీరా, కోరుకున్న  నగా  చిటికెలో  తయారు చేయిస్తున్నారు.
    తనకోసం  డబ్బంతా  వాళ్ళలా   ఖర్చు పెట్టడం ఇష్టంలేక ఒద్దంటే  బాధపడేది  తల్లి!
    చిన్నబుచ్చుకునేవాడు అన్నయ్య!
    అందుకనే  కిక్కురు మనకుండా, కీలుబొమ్మలా  ఏం చేస్తే అది చేసేది వారి తృప్తికోసం, వారి ఆనందం
కోసం!
    "అద్దె ఇల్లయినా  మనమే వుంటున్నాంగా! సున్నాలూ, రంగులూ  వేయించాలి" అంటూ ఇల్లంతా  సున్నం కొట్టించి రంగులు వేయించింది. ఇంట్లో అంతా  తెల్లని పెయింటుతో ముగ్గులు వేయించింది !
    వారం రోజుల నుంచీ, కావ్యకి కొన్న చీరలకీ లంగాలూ, బ్లౌజులూ కుట్టి పెట్టింది.
    "అమ్మా! ఏంటమ్మా! ఇప్పుడే ఇలా అలసిపోతే  ఎలా ? అయినా ఆ బట్టలన్నీ  ఇప్పుడే కట్టుకుంటానా ఏంటి? మామూలుగా కావలసినవాటికన్నా   ఎక్కువే కొన్నాం. వాటన్నిటికీ  ఫాలుకుట్టి, లంగాలు కుట్టి, జాకెట్లు కుట్టి, క్షణం తీరికలేకుండా  వుంటున్నావ్" కోపాన్నభినయించింది కావ్య !
    "నా చిట్టితల్లికి ఏలోటూ రాకూడదు. చేతి రుమాలుకోసం కూడా  ఎవ్వరినీ  చెయ్యిజాపి అడక్కూడదు. అదేనమ్మా నాకు తృప్తి. నీకు ఏ లోటూ రాకూడదు" అంటూ కావ్యని  కౌగిలించుకుని, బుగ్గలమీద ముద్దులు కురిపించింది. "నన్ను మరీ పసిపిల్లని చేసేస్తున్నావ్ మమ్మీ" అంది కావ్య, తల్లి ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని.    
     "నువ్వెంతదానివయినా, నీకు పిల్లలు  పుట్టాకకూడా, నాకు పసిపాపగానే  కనబడతావమ్మా. అసలు నాకు నువ్వెప్పుడూ  చిన్నపిల్లవే కదా !" నవ్వేసేది. ఆ నవ్వులు మల్లెలు విరిసినట్లుండేవి  కావ్యకి!
    ఆ నవ్వులు  తన మనసుకి  తగిలి గిలిగింతలు  పెట్టినట్టుండేవి ! తల్లి ఒడిలో  పడుకుని, ఆమె అలా గలగలా  నవ్వుతూ  మాట్లాడుతూ  ఉంటే  ఆ మాటల్లో  ముత్యాలు  మూటగట్టుకుంటూ  అవ్యక్తమైన  ఆనందసాగరంలో  మునిగిపోయేది  కావ్య !
    క్రాంతి బ్యాంకు నుంచి డబ్బు  తీసుకొచ్చాడు యాబై వేలు. కొత్త రూపాయల కట్టలని  చూస్తే కళ్ళు జిగేలుమన్నాయి కావ్యకి!
    అది తన తండ్రి  సంపాదన! అది తన తండ్రి కష్టార్జితం! దాన్ని ఇన్నేళ్ళూ భద్రంగా  దాచిపెట్టి, పెట్టారు. ఈ రోజు ఆ మొత్తాన్నంతా, తన కోసం  బయటికి  తీశారు. దానిమీద  ముగ్గురికీ  హక్కుంది. కానీ, అన్నయ్యా అమ్మా వాళ్ళ హక్కుల్ని  తనకోసం  వొదులుకుంటున్నారు.
    అది  తనదీ కాదు! తెల్లారేటప్పటికి, తమ గడపదాటి, మరొక గుమ్మంలోకి  పోతుంది !


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS