Previous Page Next Page 
గెస్ట్ హౌస్ పేజి 14

ఎందుకంటే సరిగ్గా వాకర్ శవాన్ని పాతిపెట్టి మూడు రోజులు అయ్యింది. అందులోనూ దుష్టశక్తులున్న వ్యక్తి వా...క...ర్...

                                       * * *
ప్రభు తన కొచ్చిన కల చెప్పడంతో సూరజ్, సూర్యనారాయణ పగలబడి నవ్వారు. విలియమ్స్ నవ్వాపుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. నచికేత మాత్రం సీరియస్ గా ఆలోచిస్తూ వుండిపోయాడు,
ఈ వారం రోజులూ నచికేత ఓ హోటల్ లో వున్నాడు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కు మంచి పెయింటింగ్ వేయటానికి ట్రయ్ చేశాడు.
ఇంట్లో ఏకాగ్రత కుదరడంలేదని, కలలు తనని వెన్నాడుతున్నాయన్న ఫీలింగ్ తో హోటల్ లో ఓ రూమ్ తీసుకొని ఉండిపోయాడు. ఏ డిస్ట్రబెన్స్ లేకుండా హాయిగా అనిపించింది నచికేతకు. సెవెన్త్ ఫ్లోర్ లో ఉన్న ఆ రూమ్ లో కిటికీలో నుండి బయటకు చూస్తుంటే వ్యూ   తో అందంగా వుంది. రాత్రుళ్లయితే మరింత అందంగావుంది. మినుకు మినుకు మంటూ లైట్స్, అప్పుడప్పుడూ తిరుగుతున్న వాహనాలు   ఎంతో అందంగా, హాయిగా అనిపించింది ప్రాణానికి. నిశ్శబ్ద వాతావరణం మరింత విశ్రాంతి నిచ్చింది. పదిరోజులు పడుతుందనుకున్న  యింటింగ్ వారం రోజులకే పూర్తయింది. సూర్యనారాయణ, సూరజ్ ఎవరిదో మ్యారేజ్ వుంటే దగ్గరలోని   ల్లెటూరుకి వెళ్లారు. విలియమ్స్ చెన్నయ్ లో పని వుందని వెళ్లి ఆ రోజే తిరిగి వచ్చాడు.
వారం రోజుల తర్వాత అందరూ కలుసుకున్నాడు.
"అయితే నువ్వా ప్రొఫెసర్ గారి దగ్గరకి వెళ్లడం లేదూ..." అడిగాడు సూరజ్...
"మూడ్నాలుగు రోజులుగా వెళ్లడంలేదు. రేపు వెళ్తాను" చెప్పాడు ప్రభు.
"నీకు నచికేతకు పట్టుకున్న 'కలలజబ్బే' పట్టుందన్నమాట..."
నవ్వుతూ అన్నాడు విలియమ్స్.
"అంత ఈజీగా తీసి పారేయ్యొద్దు" ప్రభు అన్నాడు.
"ఛా...మరే...మాకు తెల్వదు కదా...ఎనీవే...నా క్రాస్ నిన్ను రక్షించింది...కదూ..." అన్నాడు విలియమ్స్.     
"కాదు ఆంజనేయుడి తాయెత్తు రక్షించింది" అన్నాడు సూర్యనారాయణ.
"వాడ్డూయూ మీన్..." కోపంగా అడిగాడు విలియమ్స్. నచికేత జోక్యం చేసుకున్నాడు.
"క్రాస్ అయినా తాయెత్తు అయినా మహత్తు ఒక్కటే. ఆ దేవుళ్ళు అంతా ఒక్కటే...మధ్య మనం ఎందుకు గొడవపడ్డం..."
నిజమేనన్నట్టు నచికేతతో కలిసి అతనింటికి వెళ్లారు. ప్రభుకు రామయ్యని చూస్తేనే వంట్లో...వణుకు పుడుతోంది.
రామయ్య మొహంలో అదోలాంటి పైశాచికత్వం కనిపిస్తోంది. రామయ్య ప్రభువైపు చూశాడు.
రామయ్య కళ్లలోకి చూడ్లేక తల తిప్పుకున్నాడు ప్రభు. అందరూ లోపలికి వెళ్లారు. నచికేత హోల్ లో వేసిన పెయింటింగ్ ని ఇంటికి తెచ్చాడు. కాన్వాస్ స్టాండ్ కు బిగించాడు.
"మార్వలెస్..." అన్నాడు ఆ పెయింటింగ్ వంక చూస్తూ సూర్యనారాయణ.
"నచీ...యూ ఆరే జీనియస్...ఫెంటాస్టిక్ గావుంది..." మనస్పూర్తిగా అన్నాడు సూరజ్...
"వెల్ కమ్ మై ఫ్రెండ్" భుజం తట్టాడు విలియమ్స్...
ప్రభు నచికేత చేతిని ప్రశంసాపూర్వకంగా నొక్కి వదిలాడు.
"ఈ పెయింటింగ్ ని మనం ఎగ్జబిషన్ లో పెట్టడమే ఆలస్యం...జనం విరగబడి వేలం పాట పాడేసి కొంటారు..." విలియమ్స్ చెప్పాడు.
చాలా అద్భుతమైన పెయింటింగ్. అరణ్యం...మధ్యలో ఓ జలపాతం...కొండల మధ్యనుంచి కిందకి దూకుతోన్న జలపాతం పలుచటి వస్త్రాలతో ఉన్న స్త్రీ మీద పడుతున్నాయి.
ఆ స్త్రీ దేవతా స్త్రీలా వుంది. తన మీదకి దూకే జలపాతాన్ని చూస్తూ రెండు చేతులు పైకెత్తి తన్మయత్వంగా చూస్తుంది.
అందమైన భంగిమలో వుంది.
అక్కడ దగ్గరలోనే ఉన్న రెండు జింకపిల్లలు ఆ జలపాతం వంక చూస్తున్నాయి. చాలా అద్భుతంగా పెయింట్ చేశాడా దృశ్యాన్ని నచికేత.
"నచీ...ఇంత మంచి పెయింటింగ్ వేసినందుకు మాకు మంచి పార్టీ ఇవ్వాలి..." అన్నాడు విలియమ్స్.
"ష్యూర్...ఈవినింగ్ పిక్చర్ కు వెళ్దాం...రాత్రి డిన్నర్ ఓకేనా?" అడిగాడు నచికేత.
"దట్స్ గుడ్..." అన్నాడు సూర్యనారాయణ.
ప్రభు మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు. నచికేతకు ఆనందంగా వుంది. ఈ వారం రోజులూ...పెయింటింగ్ మీదే దృష్టి నిలిపాడు. ఏ మాత్రం తన ఆలోచనలను మరోవైపు మరల్చలేదు.
తనకొచ్చే కలలు, వాటి తాలూకు భయాలు...అసలేమీ ఆలోచించలేదు.
ఇప్పుడు నచికేతకు రిలాక్డ్స్ గా వుంది.
రామయ్యను ఉప్మా చేయమని పురమాయించాడు నచికేత. ఫ్రెండ్సంతా కబుర్లలో పడ్డారు.
ప్రభు దృష్టి అంతా నచికేత వేసిన పెయింటింగ్ మీదే వుంది.
"ఏయ్...ప్రభూ...ఏంటీ,,,? ఇంకా ఆ 'డెడ్ బాడీ' మూడ్ నుంచి బయటకు రాలేదా? నువ్విలానే భయపడుతూ వుంటే ఈపాటికి అది నచికేత ఇంటికి వచ్చి నీ కోసం బయట లాన్స్ లో వెయిట్ చేస్తూ వుంటుంది" అంటూ జోక్ చేశాడు విలియమ్స్.
అతను సరదాగానే అన్నా ఎందుకో చిన్న గగుర్పాటు లాంటిది కలిగింది ప్రభుకు.

                                      * * *
రామయ్య వేడి వేడి ఉప్మాను ప్లేటులో సర్ది తీసుకువచ్చాడు. అందరూ టిఫెన్ చేసి, ఫిల్టర్ కాఫీ తాగి సినిమాకు వెళ్లడానికి లేచారు.
"రామయ్యా...రాత్రి నాకోసం ఏమీ చేయవద్దు..." చెప్పాడు నచికేత.
అందరూ బయటకు నడుస్తూంటే ప్రభు ఒక్కక్షణం వెనక్కి తిరిగి పెయింటింగ్ వైపు చూశాడు.
పెయింటింగ్ లో మార్పులు అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెయింటింగ్ మారిపోతోంది. కళ్ళు నులుముకుని మరీ చూశాడు. రొజెక్టర్  ద్వారా స్క్రీన్ మీద బొమ్మలు కదిలినట్టు...అరణ్యం...చెట్లు...కొండలు...జలపాతం...ఇవన్నీ మా...రి...పో...తూ...
పెయింటింగ్ లో లాన్స్ కనిపిస్తోంది. అది నచికేత యిల్లే...లాన్స్ లో సిమెంట్ బెంచిమీద కూచుని వాకర్ శవం...తన..
వై...పే...చూ...స్తూ...
ప్రభు భయంతో బిగుసుకుపోయాడు.  
"ఏయ్...ప్రభూ...వాట్ హేపెండ్..." అడిగాడు నచికేత ప్రభు అలానే స్టాంపులా నిలుచుండిపోడం చూసి...
"అది...అది..." అంటూ పెయింటింగ్ వైపు చూపాడు. చాలా మామూలుగా వుంది పెయింటింగ్...జలపాతం...స్త్రీని అంతా యాజిటీజే...
"ఏయ్ ప్రభు..ఏమైంది?" సూరజ్ అడిగాడు.
"పెయింటింగ్ లో నాకు వాకర్ కనిపించేడు"
పగలబడి నవ్వాడు విలియమ్స్ "వాకర్?"
"అవును...బయట లాన్స్ లో సిమెంట్ బెంచిమీద కూచుని నా వైపు చూస్తున్నాడు."
సూర్యనారాయణ నవ్వి "ఇందాక విలియమ్స్ జోక్ చేశాడుగా. ఆ భ్రమలో ఉండిపోయుంటావు" అన్నాడు.
"కాదు...నిజంగా చూశాను." అంటూ బయటకు పరుగెత్తి లాన్స్ లోకి వెళ్లి సిమెంట్ బెంచివైపు చూశాడు. ఎవరూ లేరు.
"నేను చెప్పానుగా...అంతా భ్రమ...ఊర్కే అనవసరంగా అలా ఊహించేసుకుంటూ ఉండకు" సూర్యనారాయణ అన్నాడు.
ఐదుగురూ బయటకు వచ్చాక విలియమ్స్ నుదురు కొట్టుకున్నాడు.
"ఏంటీ...మళ్ళీ ఏమన్నామరిచిపోయారా?" నచికేత అడిగాడు.
"అవును...గాగుల్స్...నేనే తెచ్చుకుంటాన్లే..."అంటూ నచికేత గదిలోకి వెళ్లాడు...గాగుల్స్ నేలమీద పడివున్నాయి. విలియమ్స్ కిందకి వంగి గాగుల్స్ తీసుకున్నాడు.
అప్పుడే ఆ గదిలోకి వచ్చి రామయ్య కాన్వాస్ స్టాండ్ వైపు తీక్షణంగా చూశాడు.
ఒక్క క్షణం కాన్వాస్ స్టాండ్ అటూ, ఇటూ కదిలి విలియమ్స్ తలమీద ప..డ..బో..తోం..ది. విలియమ్స్ కాన్వాస్ స్టాండ్ తనమీద పడబోతున్న శబ్దం విని లేవబోయాడు.
సరిగ్గా అప్పుడే నచికేత గొంతు వినిపించింది.
"విలియమ్స్ తలమీద పడబోయిన కాన్వాస్ స్టాండ్ అంతే వేగంగా వెనక్కి వెళ్లి మామూలు పొజిషన్ లోకి వచ్చింది.
విలియమ్స్ గాగుల్స్ తీసుకుని కాన్వాస్ స్టాండ్ వైపు చూశాడు. అలాగే వుంది.
"ఇదేంటి...తనక్కూడా విపరీతమైన భ్రమలు కలుగుతున్నాయా?" అనుకుంటూ ముందుకు నడిచి, గుమ్మానికి అడ్డంగా నిలబడ్డ రామయ్యని చూశాడు ఆశ్చర్యంగా...
రామయ్య మొహం నీలం రంగులో ఉండడం గమనించాడు. మెల్లి మెల్లిగా నీలం వర్ణంలో నుంచి మామూలు రంగులోకి వస్తూ వుంది.
తన ప్రమేయం లేకుండానే విలియమ్స్ వెన్నులోంచి చిన్న వణుకు లాంటిది వచ్చింది.
వడివడిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ ఐదుగురూ ఇళ్లు దాటి రోడ్డుమీదకి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో లాన్స్ లో సిమెంట్ బెంచిమీద కూచోని వుంది వాకర్ శవం.
ఆ తల వెనక్కి తిరిగి ఆ ఐదుగురి వంక చూసింది.

                                    * * *
రోడ్డు మీదకి వచ్చారు ఆ అయిదుగురు.
"ప్ర...భూ..ఏ...య్...ప్ర...భూ..."  
ఎవరో తనను పిలిచినట్లు అనిపించేసరికి ప్రభు తల వెనక్కి తిప్పాడు.
ఆ పిలుపు నచికేత ఇంట్లో నుంచి వస్తుందని అర్ధమైంది. లాన్స్ సిమెంట్ బెంచిమీద కూచోని వున్నాడు వాకర్ అతని ఆలోచనని నిజం చేస్తూ...వాకర్ తల తనవైపు తిరిగి ఉండడం గమనించాడు. వాకర్ శవం తనవైపే చూస్తోంది. ప్రభు గట్టిగా నచికేత చేయి పట్టుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS