"ఆ చెప్పండీ ఏమిటో? అంటూ లేచి కూర్చున్నది. ఆమాత్రం దేవీప్రసన్నత చాలు ఇంక భయం లేదు. ఏదో విధంగా మాయజేయలేకపోనా అన్న ధీమా కలిగింది.
"తాంబూలం ఇచ్చావు కావేం ఇవ్వాళ?"
"మీరు నన్ను అడిగారా?"
"రోజూ అడిగితే ఇస్తున్నావా?"
"అడగండి అమ్మ అయినా పెట్టదు?
"అమ్మ విషయంలో అంతేనేమోకాని పెళ్ళాం ఐన మనిషి అడగకుండానే, పెట్టాలె అల్లాగ భర్తకు కావలసిన వన్నీ ఇస్తూ, భర్త సేవా పరాయణురాలైన స్త్రీలే పతివ్రతలు అడక్కుండా, భర్తకు ఎన్నో వస్తువులు ఇచ్చినట్లు నిదర్శనాలు వున్నాయి పురాణాల్లో! తెలిసిందా?"
"పురాణాల్లోనా?" అన్నది ఆవిడ ఎంతో సందేహిస్తున్న దానివలె, ఆ మాట నొక్కి నొక్కి పలుకుతూ.
'నేనూ, గట్టిగా నొక్కి పలుకుతూ పురాణాల్లో కావాలంటే ఒకటి రెండు నిదర్శనాలు నీకు చూపగలను,సరా?' అన్నాను.
'అన్నీ చూపారులెండి అన్నది ఈసడింపుతో'
అల్లాగేం? అరుంధతి వుంది చూశావూ అరుంధతి! ఆవిడ ఏం జేసింది అనుకొన్నావూ?
'ఆ, ఏం జేసిందే?' అంటూ మా ఆవిడ నాపై తమలపాకుల ఈనె విసరింది.
'ఏమి చేసిందంటే......చెపుతా__ఒక మారు ఆవిడ భర్తా.....ఆవిడ భర్త ఎవరూ చెపుమా! వెధవ జ్ఞాపకశక్తి ఇల్లాగ ఏడుస్తున్నది!' అని విసుక్కున్నాను.
తనకు మహ తెలిసినట్లే నవ్వింది ఆవిడ నవ్వి ఆమె భర్తా అండీ? ఆమె భర్త ఒక ముని, అనిఠకీమని చెప్పేసింది.
ఆయనే ఆయనే, ఆమునీ ఒక రోజున ప్రాతఃకాలముననే స్నాన సంధ్యాది కృత్యముల నిర్వహించి __'
'నిర్వహించి, సహించి ధైర్యము వహించి!!......చాల్లేండి ఊరుకోండి, మీ కవిత్వమూ, మీరూనూ!!'
'మరి అల్లాగే, అడ్డం రావటం? చివరంటా? చెప్పనిస్తావా ? వింటానని వాగ్దానం చేశావు జ్ఞాపకం వుందా?'
'మరచి పోలేదు. పొరపాటున వింటానూ అన్నాను. బుద్ధిలేక అన్నాను క్షమించండి.'
'క్షమించటాలు లేవు-వినాలిసిందే.'
'వినాలిసిందే? కానీండి ఇదొక రకం శిక్ష'
"ఏమైనా అనుకో. విను మరి ప్రాతఃకాలకృత్యములు నిర్వహించి, అపళంగా అడవికి పోయి పెద్ద ప్రొద్దుతపస్సు చేసెను.
"ఏమిటీ వాలకం? ఇపుడో పురాణకాలక్షేపమా! నాకు నిద్రవస్తోంది మీకేం! ఎంతసేపైనా మేల్కొనగలరు! కానీండి.
"విను మరీ, తపస్సు చేసి ఆముని ఇంటికి వచ్చేశాడు."
"మహ గొప్పపని జేశాడు. ఇంటికొచ్చి భోజనం చేశాడు అంతేనా!
"కాదు_కాదు. అంత శీఘ్రంగా భోజనం చేస్తే....ఆమె పాతివ్రత్యం ఏమి కనబడుతుంది .నేను చెబుతానన్న విషయం ప్రాతివ్రత్యాన్ని గురించి కాదూ !
"కానీండి తొందరగా."
"ఆ ఘోర తపస్సు వలన ఆయన శరీరం వేడెక్కి ఆయనకు ఎక్కువగా దాహం అయింది. కాని దాహం అని ఆయన అడగనూ లేదు. చేత్తో సంజ్ఞ చేయనూ లేదు. అరుంధతి ఆయనకు దాహం అవుతూన్న దన్న సంగతి గ్రహించి, అమృతంలాంటి చల్లటినీరు కమండలంలో పోసి తాగమంది. చూశావా, అల్లాగ.....భార్య భర్తకు అడగకుండా ఎన్నో సపర్యలు చేయాలె. ఇప్పుడు ఈ వెధవ తమలపాకుల కోసం నేను నోరు జేసుకొని ఆడగాలేం!" అన్నాను.
"ఏమి కల్పనండి! ఇవిగో తమలపాకులు."
అని చుట్టిన చిలకలు నాకు అందిచ్చింది. అదివరకే నోట్లో వక్కలున్నాయి. తమలపాకులు వెళ్ళి పోయినాయి నోట్లోకి; నములుతూ మళ్ళీ ప్రారంభించాను.
4
"సరే, ఇప్పుడు అసలు సంగతికి వస్తాను. ఇప్పుడు నేను హంపీ....వెళ్ళినా, నీవు వస్తానన్నా అక్కడి తమాషాలు చూద్దామనే కదా?"
"ఆ, కాదు. అవునా, కాదా?"
"సరే కానీండి" అన్నది. అవుతానని కానీ_కాదని కానీ అనదే ఆవిడ ! ఎట్లా అంటే ఏమి ఒప్పుకొన్నట్లు అవుతుందోనని ఆమె భయం. అంత తెలివిగలది ఆవిడ, నేను మళ్ళీ మొదలు పెట్టి.
"ఇప్పుడు నేను వెళ్ళుతాను హంపీ, వెళ్ళి..."
"తిరిగివస్తాను. ఇక్కడ నేను బిక్కు బిక్కుమంటూ కూర్చోవాలె. మీరు హాయిగా హంపీలో తమాషాలన్నీ చూస్తూ వుంటారు! అంతేకాదూ?"
"అల్లాగ......ఆశుకవిత్వం అల్లేస్తే ఎల్లాగ చెప్పూ? కొంచెం ఓపికపట్టి వింటే సంగతంతా మనవి చేస్తాను."
"మీరు లక్ష చెప్పండీ....మీతో నేను ప్రయాణంకాక మానను."
"అల్లా అనబోకు, నీవు రాకుండా....అక్కడి తమాషాలన్నీ నీవు చూచేలాగున నేను చేస్తాను సరేనా?"
"ఏం జేస్తారూ? బొమ్మలు చూపిస్తారా?"
"బొమ్మలు చూపించడమే కాకుండా, ప్రతి భవనాన్ని గురించీ, ప్రతి దేవాలయాన్ని గురించీ నీకు చక్కగా వర్ణించి చెబుతాను. దేవాలయం ఎంత యెత్తో, ఎంత విశాలమో, ఎన్ని గోపురాలున్నవో, అక్కడి శిల్ప వైభవం ఎటువంటిదో అంతా చక్కగా వర్ణిస్తాను, దారిలో రైలు ప్రయాణం, కొండలమీదుగా వెళ్ళటమూ, కొండలలో నుంచి త్రవ్విన సొరంగాలలో నుంచి రైలు జర్రున పాములాగ పరుగెత్తటమూ మొదలైన ప్రతివిషయమూ నేను చక్కగా వర్ణించి చెబుతాను సరేనా?
ఆ నవ్వుతూ వున్న మా ఆవిడ ముఖం చూచి నాకు మళ్ళీ అఖండమైన జయం కలిగిందని మహా ఆనందం కలిగింది. కృష్ణదేవరాయల తూర్పు-పడమరల దిగ్విజయాలే జయాలు. నా భార్యపైన నాకు కలిగిన అఖండ జయాలే జయాలు!! కాని నా అఖండ జయాన్ని గురించి మాత్రం కీర్తించే వందిమాగధులూ లేరు. కవులూ లేరు. కాని జయం మాత్రం అఖండమైంది.
ఆవిడ నవ్వి అన్నదీ, "సరే, అల్లాగే, మీరు వెళ్ళి చూచివచ్చి, వర్ణించి నన్ను సంతోషపెట్టండి. నేనూ అ పద్ధతినే అవలంభిస్తాను. మీకు మట్టుకు అన్నం పెట్టను. పిల్లలూ నేనూ వండుకు తింటాము. కూరలూ పచ్చళ్ళూ పిండివంటలతో సహా భోజనం చేస్తాము. మీకు వాటిని వర్ణించి చెబుతాను. మెత్తగా రుబ్బిన పిండితో, నేతితో వండిన గారెలు కరకర తిన్నామనీ, నేతిలో వేయించిన బంగాళాదుంపలు కూరా అవీ, తిన్నామని చెబుతాను! అల్లాగే పచ్చళ్ళూ, వాటి రుచులూ, రంగూ, కమ్మదనమూ, సువాసనా, అన్నిటి గురించి వర్ణించి చెబుతాను. మీరు మట్టుకు వస్తూ పడుకోండి" అన్నది.
పొడిచింది ఓ పోటు! ఎల్లాగ దీనికి సమాధానం ? కాకపోతే మొండిగా వెడతానని బయలుదేరాలె, బయలుదేరానో ఒక పెద్ద గుడ్డలమూట, అయిదు పెట్టెలూ ఆముదపుసీసా బయలుపడ్డవన్న మాటే! అల్లాగ చేయటం తెలివితక్కువతనం-కాబట్టి.
