ఆమె శకుంతల!
* * *
సూర్యుడు తలపైనుంచి ప్రక్కకు జారేడు. సూర్యకాంతికి సముద్ర జలాలు మెరుస్తున్నాయి. రివ్వున వీస్తున్న గాలికి ఇసుక రేణువులు లేచి పడుతున్నాయి. అంతవరకూ సముద్రం మీద వేట కొనసాగించిన పడవలు వెనక్కి తిరుగుతున్నాయి. గొడుగు క్రింద కూర్చున్న జంట వెళ్ళిపోయింది.
తల వంచుకుని కూర్చున్న అర్చనని కాసేపు తదేకంగా చూశాడు శివరావు. ఆమె గతం తెలుసుకున్న తరువాత అతనికి జాలి కలిగింది.
"ఇప్పుడెం చెయ్యదల్చుకున్నావ్?" అడిగాడు చనువుగా.
ఆమె సమాధానం చెప్పలేదు.
"నీ రూముకి వెళతావా?"
"నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుంది. మగవాళ్ళు వచ్చి తలుపు కొడతారు. నాకెవరూ లేకపోయినా గుట్టుగా బ్రతకాలని అనుకున్నాను. కాని నా జీవితం రోడ్డుపైకి వచ్చింది...."
ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు.
"మీ ఊరు వెళ్ళకూడదూ?"
తల అడ్డంగా ఊపి చెప్పింది.
"నా తండ్రి అమాయకుడు. ఏనాడూ మాకు కష్టం కలిగించలేదు. మాకు తక్కువ అవుతుందని కడుపునిండా తినేవాడు కాదు. బిడ్డల్ని చూసుకుని మురిసిపోయేవాడు. మమ్మల్ని చూస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఎన్నో ఆశలు కడలాడేవి. అలాంటి నా తండ్రికి నేను చెడిపోయానని తెలిస్తే తట్టుకోలేడు. నేను అనుభవించిన నరకాన్ని మనసులో దాచుకుని కన్నెపిల్లలా ఆయన ముందు తిరగాలి. ఎంతోమంది ముట్టుకున్న నా శరీరాన్ని నా చెల్లెలు కౌగలించుకొని పడుకుంటే భరించడం నా వల్ల కాదు...." ఆవేదనతో ఆమె గొంతు జీరబోయింది. గుండెను రంపంలా కొస్తున్న బాధ కన్నీళ్ళ రూపంలో తన్నుకొస్తుంది.
"ఇవన్నీ ఆలోచిస్తే ఎలా? మా ఇంటికి వెడదాం, ఆలోచించి ఏదోటి చెయ్యొచ్చు..." చెప్పాడు.
ఆమె సమాధానం చెప్పకపోవడంతో తిరిగి అడిగాడు.
"నీకు అభ్యంతరమా?"
"ఇప్పటికే మీకు ఋణపడి ఉన్నాను, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి..."
"బాధలు, కష్టాలు లేకపోతే అది జీవితమే కాదు. కొంత స్థిమితం చిక్కిన తరువాత ఏదోటి చెయ్యొచ్చు...." చెప్పి లేచాడు శివరావు.
* * *
ఉలిక్కిపడి లేచాడు శివరావు.
ఆలోచనలతో రాత్రి చాలాసేపు నిద్రరాలేదు. పక్కమీద వాలిన వెంటనే నిద్రపోవడం అతనికి అలవాటు. ఎప్పుడయినా మనసుకి ఆందోళన కలిగించే సంఘటన జరిగినప్పుడు మాత్రం నిద్ర వచ్చేది కాదు. అతని జీవితంలో అలా నిద్రపోని రోజులు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మనసు గాయపడి బాధని కలిగించిన రోజులే. మొదటిసారి ఎటువంటి బాధ కలగకపోయినా కేవలం ఆలోచనలతో ఆరోజు నిద్రపట్టలేదు. గడియారం గంటలు కొట్టడం వినపడుతూనే ఉంది. చివరకు ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు. మధ్యలో మెలుకువ రావడం వల్ల తలంతా భారంగా ఉంది.
లేచి వెళ్ళి చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుని గ్లాసెడు నీళ్ళు త్రాగి వచ్చి కూర్చున్నాడు. సిగరెట్ వెలిగించి ఆలోచించసాగేడు.
ఎంతగా అణుచుకుంటున్నా ఆలోచనలు ఆగడంలేదు. ఆలోచనలు వరదలా మెదడ్ని కదిలించేస్తున్నాయి. ఏమైందితనికి? ప్రశ్నించుకున్నాడు. ఏదో తెలియని భయం మనసుని ఆవరించింది. కుదుట పర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు.
ఊహకి, వాస్తవానికి మధ్య తేడా ఉంటుందని తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో చెయ్యాలని అనుకుంటాడు. కొన్నిటిని జీవిత లక్ష్యాలుగా భావిస్తాడు. వాటిలో కొన్ని సాధిస్తాడు. ఒక్కటి కూడా నెరవేర్చలేని మనుషులు ఎక్కడో కాని ఉండరు. జీవితంలో ఏదో సాధించాలని, ఎంతో సాధించాలని అనుకుని ఏమీ చెయ్యలేక ఉదాసీనంగా బ్రతికే మనుషులను వెదికితే వాళ్ళలో తను మొదటివాడు అవుతాడు.
ఆహారం కోసం అన్వేషించేవాడు అది దొరికిన తర్వాత విశ్రాంతి కోసం ప్రాకులాడటం మానవ సహజం. అతని జీవితం మాత్రం ఆహారం కోసం అన్వేషించటంలోనే ఉండిపోయింది. పన్నెండు సంవత్సరాల కాలం నిర్లిప్తంగాను, నిరాశాజనకంగానూ గడిచింది. తనలోని నిర్లిప్తత దూరం చేసుకోవడానికి ప్రయత్నించేకొద్దీ ఎక్కువ కాసాగింది. జీవితంలో పెనవేసుకున్న అసంతృప్తి ఇంకెంతకాలం భరించాలి? జీవితాన్ని ఇలాగే కొన సాగించాలా?
ఎందుకు?
తను ఇలా ఉండటం ఎవరికీ లాభం? కనీసం వాళ్ళయినా సంతోషిస్తున్నారా?
లేదు.
ఇప్పుడైనా తనకి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలి. ఇంతకాలం తనని బంధించిన శృంఖలాలు తెంచుకోవాలి. తను కూడా జీవితాన్ని అనుభవించాలి. అలా అనుకున్న మరుక్షణం అతని నరాలు ఉత్తేజితమయ్యాయి. హఠాత్తుగా మెదడులోనుంచి ఆలోచనలు మొత్తం మాయమయ్యాయి. పూనకం వచ్చిన వాడిలా లేచాడు. అతని చేతివ్రేళ్ళ నుండి జారిపడ్డ సిగరెట్ గమ్యం తెలిసిన దానిలా కాలుతోంది.
గబగబా తన గది కిటికీ దగ్గర నిలబడ్డాడు. కిటికీ రెక్కలు తెరిచి ఉండటం వల్ల గదిలో మంచంపైన పడుకున్న అర్చన కనిపిస్తోంది. రెండు చేతులతో కిటికీ ఊచలు పట్టుకుని చూశాడు. పైట తొలగి ఎత్తుగా కలిపిస్తోంది ఆమె ఛాతీ. క్రమంగా ఊచల్నిపట్టుకున్న అతని పిడికిళ్ళు మరింత గట్టిగా బిగుసుకున్నాయి. కళ్ళు ఎరుపెక్కాయి. తన జీవితంలోని అగాధమంతా ఆ గది గోడలో నిక్షిప్తమై తనకి అడ్డుగా నిలబడినట్టు కనిపించింది.
చప్పున కిటికీ దగ్గర నుండి కదిలి తలుపు తట్టాడు. మరోసారి తట్టిన తరువాత అర్చన తలుపు తీసింది. నిద్రనుండి మేలుకోవడం వల్ల ఆమె మొహం అమాయకంగా కనిపిస్తుంది. అంతవరకూ తీవ్రంగా ఆలోచించిన అతని మెదడు హఠాత్తుగా పనిచెయ్యడం మానేసింది.
"ఎందుకు పిలిచారు?" అడిగింది అర్చన.
"నాకు తోడుగా జీవితాంతం ఉంటావా?" గొంతు పెగల్చుకుని అడిగాడు.
విస్మయంగా చూసింది అర్చన. అతని మాటలు ఆమెకు అర్ధం కాలేదు.
"ఇలా అడిగానని నువ్వు మరోలా భావించకు. ఇంతవరకూ జీవితంలో నేను అనుభవించిన ఒంటరితనం ఇక భరించే శక్తి నాకు లేదు. బాగా ఆలోచించి చెప్పు. నా జీవితం నీ సమాదానంపైన ఆధారపడి ఉంది...." అన్నాడు ఉద్రేకంగా.
"మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు...." బలహీనమైన స్వరంతో అంది. తనకి తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేసింది.
"నీతో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నాను." స్థిరంగా అన్నాడు.
అర్చన తలవంచుకుంది. అతను చెప్పేది ఆమెకు పూర్తిగా అర్ధం కాలేదు. ఆమె సందిగ్ధంలో ఉండగానే శివరావు ఆమెని సమీపించి గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు.
"వదలండి...అరుస్తాను..." గింజుకుంటూ అంది.
ఆమె మాటలు అతను పట్టించుకోలేదు. మరింత బలంగా ఎముకలు చిట్లిపోయేటట్టు హత్తుకున్నాడు. ప్రక్కటేముకలు విరిగినట్టు, ఊపిరి ఆగి పోతునట్టు అనిపించిందామెకు. అతని చాతీపైన రెండు చేతులు వేసి వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది. అంగుళం కూడా కదపలేకపోయింది. కొలిమిలో కాలిన ఇనుపముక్కలా అతని శరీరం వేడిసెగలు విరజిమ్ముతోంది. మరోసారి వెనక్కి తోసింది. ఇద్దరూ గచ్చుమీద పడిపోయారు. ఆమెను వదలకుండా పట్టుకుని పెదాలు అందుకున్నాడు. పిచ్చిగా అతన్ని వెనక్కి తొయ్యడానికి చేతిని మెడకి అడ్డంగా వేసింది.
అర్చానకి సరిగ్గా అప్పుడోచ్చింది ఆలోచన.
ఎదురు తిరిగిన ఆడదాన్ని లొంగదీసుకోవడానికి మగవాడు పశుబలం చూపిస్తాడని రాజమ్మ కంపెనీలో తెలుసుకుంది. సరిగ్గా ఇప్పుడు శివరావు అదే చేస్తున్నాడు. నిజానికు అతని కోరికను తానెందుకు కాదనాలి? తనకి సహాయం చేసి ప్రతిఫలంగా శరీరాన్ని కోరుకుంటున్నాడు. శరీర, మలిన మవుతుందని అనుకోవడానికి తనేం పతివ్రత కాదు. ఇప్పుడు శివరావు అనుభవించడం వల్ల తనకి ప్రత్యేకంగా కలిగే నష్టం ఏమీ లేదు. గుండెల్లో గూడుకట్టిన చేదు జ్ఞాపకాల్లో మరోటి చేరుతుంది.
అంతే!
అర్చన ప్రతిఘటించడం మానుకుంది. అప్పటికే శివరావు వళ్ళు తెలియని కామంతో ఆమెను ఆక్రమించుకున్నాడు.
* * *
చివరగా క్యాష్ లెక్కబెట్టాడు శివరావు.
పన్నెండు రూపాయలు తక్కువగా ఉన్నాయి. ఆరోజు అన్యమనస్కంగా పనిచెయ్యటం వల్ల కొంతడబ్బు తక్కువొచ్చింది. పద్నాలుగు సంవత్సరాలనుండి ఆ ఉద్యోగం చేస్తున్నాడతను. కొద్దిపాటి చిల్లరకూడా ఎప్పుడూ తేడా రాలేదు. ఆ ఉద్యోగం వల్లనే అన్నం తినగాలుగుతున్నాననే స్పృహవల్ల డ్యూటీలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. కాని ఆ రోజు మాత్రం మూడు పాలప్యాకెట్ల ఖరీదు తేడా వచ్చింది. ఆలోచనల వల్ల మనసు స్వాధీనంలో లేదు.
