Previous Page Next Page 
యువత నవత పేజి 14

    కొందరు అసలు వినరు! కొందరు వింటారుగాని ఆచరణలో పెట్టరు.

    సుధ శక్తివంచన లేకుండా వాళ్లలో మార్పుకోసం ప్రయత్నిస్తూనే వుంది!

        *    *    *    *    *
   
    శాలిని బుర్ర వేడెక్కి పోతూంది.

    పావుగంటనుండి ఒక లెఖ్ఖ కరెక్ట్ ఆన్సర్ రాక ఆమెను ముప్పు తిప్పలు పెడుతూంది. ఎన్ని రకాలుగా చేసినా ఆన్సర్ రావడంలేదు! విక్రమ్ అనే స్టూడెంట్ నోట్స్ సగం అదే లెఖ్ఖతో నిండిపోయింది.

     "అసలు లెఖ్ఖే తప్పిచ్చినట్టున్నారు! లేదా ఆన్సరు తప్పుండాలి!"ఇహ బుర్ర పనిచేయడం ఆగిపోయాక  తేల్చింది శాలిని.

     "శర్మ మేష్టారి దగ్గరకెళ్లి చేయించుకురానా, టీచర్?" విక్రమ్ అడిగాడు.

    "లెఖ్ఖ తప్పుంటే ఆయనమాత్రం కరెక్ట్ ఆన్సర్ ఎలా తెస్తారు?"

    "ఒకసారి చూపించి తెస్తాను టీచర్! ఆయన చిటికెలో ఎలాంటి లెఖ్కఅయినా చేస్తారు!"

    "తనతోటి టీచరుతో తను లెఖ్క చెప్పించుకోవటమా?" శాలిని ఆత్మగౌరవం అందుకు ఒప్పుకోకపోగా "ఉండరా! నేనే చేస్తాను ఇంకో విధంగా!"అంది.

     లెఖ్క చేస్తున్నకొద్దీ గజిబిజిగా తయారై ఆన్సర్ దగ్గరికి అసలు వెళ్లడం మానేసింది.

     శాలిని మఖం చిరాకుతో నిండిపోయింది.

     ఇహ విక్రమ్ టీచరుగారి అనుమతికోసం చూడలేదు! లెఖ్ఖలు పుస్తకం పుచ్చుకొని రివ్వున పరిగెత్తాడు.

     "భగవాన్! ఆయనకా లెఖ్ఖ రాకుంటే నా పరువు నిలబడుతుంది?" అనుకొంది శాలిని.

     శర్మ పూర్తిపేరు రాధాకృష్ణశర్మ. అతడు మూడు సంవత్సరాల నుండి ఇదే బడిలో పనిచేస్తూ సంవత్సరం క్రితం బి. ఇ. డి.  ట్రైనింగ్ కి  వెళ్లి పదిహేను రోజుల క్రితం వచ్చాడు లెఖ్క నోట్స్ లో వేసి పంపడంకాక శర్మే విక్రమ్ వెంట  వచ్చాడు శాలిని లేచి నిలబడింది.

     "లెఖ్ఖ మీకు అర్దమయ్యేందుకు  మీ ముందే చేద్దామని వచ్చాను"

    "లెఖ్ఖక అస్సలు తప్పిచ్చారేమోనని నా అనుమానం!"

    "చూద్దాం!"

    "ఛెయిర్ లో కూర్చోండి!"

    "ఫర్వాలేదు! రెండు నిమిషాల్లో చేసిపోతాను. క్లాస్ సగంలో వదిలేసి వచ్చాను!"

    అతడు నిలబడివుండగా తను కూర్చోవడం బాగుండదని శాలిని కూడా నిలబడింది అతడికెదురుగా. చకచకా లెఖ్కచేస్తూన్న అతడి చేతి వేళ్లని చూస్తూ! తెల్లగా పొడుగ్గా, ధృఢంగా వున్న ఆ వేళ్ల కదిలకలోనే అతడెంత చురుకైనవాడో తెలిసిపోతూంది. లెఖ్క చూసే నెపంతో ముందికి వంగిన శాలిని కళ్లు అతడి చేతి వేళ్లను చూడడంతో ఆగిపోలేదు. నొక్కునొక్కులుగా వున్న అతడి నల్లని క్రాఫ్ నూ, అతడి తేలిక ముక్కునీ, సన్నగా వున్న మీసకట్టునూ అన్నిటినీ పరిశీలనగా చూస్తూంది అతడు తలకు పెట్టుకొన్న హెరాయిల్ ఏదో చాలా మంచి వాసనని ముక్కికి అందిస్తూంది.

     లెఖ్క ఎప్పుడయిపోయిందో శాలినికి స్పృహే లేదు.

     "అర్దమయిందా?"

    అన్న ప్రశ్నతో తత్తరపాటుతో తలెత్తింది.

     "ఆఁ ఆఁ.... అయింది." అందతి తడబాటుతో. అయితే లెఖ్కలో తప్పేం లేదన్నమాట.

     "ఆడలేక మద్దెల ఓటి అన్నారట వెనుకటికి మీబోటి వాళ్లెవరో!" శర్మ నవ్వాడు.

            *    *    *    *   

     "ఏ సబ్జక్ట్ అయినా ఈజీగా చెప్పొచ్చేమోగాని లెఖ్కలు అలా చెప్పేందుకు వీలుకాదు! దానికి చాలా ఏకాగ్రత అవసరం! ఆ సంగతి గుర్తు పెట్టుకొంటే మీరు ఏ లెఖ్క అయినా ఈజీగా చేసేయగలరు!" అని వెళ్లిపోయాడు శర్మ.

     "తనకి ఏకాగ్రత లేదని ఎలా తెలిసింది అతడికి? తన మనసు అతడు చేస్తూన్న లెఖ్కమీద కాక అతడి ముఖంమీదే వుందని ఎలా తెలిసి పోయింది?"

    ఆ రోజంతా పరధ్యానంగానే వుంది శాలిని.

     సుధ ఒకటి రెండుసార్లు ఏదో అడిగితే సరిగా జవాబివ్వలేదు.

     "ఏమిటంత పరధ్యానం? ఎక్కడుంది మనసు?" అడిగింది సుధ.

     "పరధ్యానం కాదు!శర్మ ధ్యానం:"

    "శర్మధ్యానం ఏమిటి?" అడిగింది ఆశ్చర్యంగా.

    "మనసులో తొలిసారిగా పడ్డ బొమ్మ చెరగదు కదూ?"

    "అవును! చెరగదు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS