Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 14

అబ్బ! వణికించే చలి
అందరూ నిద్రపోతున్నారు
అందరూ చచ్చిపోతున్నారు
అర్ధరాత్రి దాటిందని మోగిన ఒంటిగంట
మంటలా మొహాన్ని కొట్టింది

నే నిదివరకటి నేను కాను
నాకు విలువల్లేవు
నాకు అనుభూతుల్లేవు
చంపడం, చావడం
మీసం దువ్వటం లాంటి అలవాటయ్యింది.

కనిపించే ఈ యూనిఫారం క్రింద
ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరికత
బ్రిడ్జీ కింద నదిలాగ రహస్యంగా వుంది
వదలలేని మోసపు ఊబిలాగా వుంది
నేనంటే నాకే అసహ్యం
అందుకే మరీ మరీ చంపుతాను, మరీ మరీ తాగుతాను
ఇంకేం చేసినా ఎవరూ ఒప్పుకోరు.

ఇంక తెల్లవారుతోంది
దూరంగా ఆల్ఫ్స్ మీద మంచు దుఃఖంలా కరుగుతోంది
ప్రభాతం సముద్రం మీద వెండి నౌకలా ఊగుతోంది
తిరిగి ఎప్పుడు మన ఊరు వస్తానో!
నిన్ను చూస్తానో?
అందమైన తెల్లని నవ్వు నీ మెడలో
గొలుసు గొలుసులుగా కదిలినప్పుడు,
అదో విధమైన చెమ్మగిలిన చూపు
నెమలి రెక్కలా విప్పుకున్నప్పుడు
   
ఎన్నాళ్ళకి! ఎన్నాళ్ళకి!
కొన్నివేల మైళ్ళదూరం మన మధ్య
ఒక యుగంలా అడ్డుపడింది.
ఇంక సెలవ్ మైడియర్!
నిద్రవస్తోంది మత్తుగ నల్లగా
అడుగో సెంట్రీ
డేరాముందు గోరీలా నిలబడ్డాడు.
అదిగో యింకా
కార్పొరల బూట్స్ చప్పుడు
కడుపులో నీళ్ళు కదులుతూన్నట్లు
జాగ్రత్త సుమీ జాగ్రత్త
నువ్వూ, పిల్లలూ, బల్లులూ అందరూ.

మళ్ళీ జవాబు వ్రాయ్ సుమీ!
ఎన్నాళ్ళకో మరీ
సెలవ్! అబ్బా! చలి!
చలి గుండెల మీద కత్తిలా తెగింది.
నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది.

    *     *     *   
                    ---1943

        టులాన్

నిశ్శబ్దపు మెత్తని పరుపులపైన
నిదురించినది పట్టణమంతా
కొండ చివర ఎర్రని నక్షత్రం
రాలిపడింది సముద్రపు నీలంలో


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS