Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 15

 

    "ఎడపక పంచెనాతడొక యేలినవాడని; పూన్కికాడవై
    పొడవగ బోయే దీవు నొక పోటరిమూటన? నీకు నక్కడన్
    మృదు డొక యెల్లిదుం డకట! మెచ్చక సింగపూవేటలాడగా
    గదగెద; దిట్టయైన దుదిగా కెడ నింద్రుడు నీవు దక్కుటే?
    శివ తపోభంగం అంటే మీకంత తేలికగా కనిపించిందా? ఆయనగారు - ఆ దేవతల రాజు అజ్ఞాపించేవాడా? అయన అనుజ్ఞ శిరసావహించి శివ తపోభంగానికి సిద్దపడిన పోటుబంటువా నీవు? శివుని మీదకు పోవటం సింహం గుహలో కాలుపెట్టినట్లే, ఈ పాడుబుద్ధి పుట్టటం ఇంద్రునికీ, నీకూ ఏ మాత్రం మంచిది కాదూ."
    తన నెచ్చెలి పలుకులకు పచ్చ విలుతుడు బదులు పలుకలేదు. వినీవిననట్లు మౌనం నటించాడు. రతీదేవి పతి మౌనాన్ని సహించలేక పోయింది. నయానా భయానా చెప్పినా అయన వినడని గ్రహించింది. యుక్తియుక్తంగా పలికి మన్మధుని ప్రయత్నాన్ని నిరోధించాలని తలచినది. మళ్ళీ ఇలా ప్రారంభించింది.
    
        "అ నాకంబున గల య
        మ్మానిను లందఱును నీకు మన మిడి యున్నన్
        దాని సహింపక సురవిభు
        దీ నెపమున జమపదలచి యీ పని పంచెన్.
    త్రిలోక సుందరులైన మీ చక్కదననికి మక్కువపడి స్వర్గలోకంలోని అప్సరసలు అందరూ మీమీద కన్నువేసి ఉన్నారన్న సంగతి తెలుసుకున్నా డా దేవేంద్రుడు! ఆ కాంతలంతా మిమ్మల్ని ప్రేమించటం చూడలేక సురెంద్రుడు ఎలాగైనా మిమ్మల్ని చంపించాలని ఈ కుయుక్తి పన్నాడు. మాయమాయలు చెప్పి మిమ్మల్ని మహేశ్వరుని పైకి ఉసిగొలిపాడు. ఇందుకు ఏ మాత్రం సందేహం లేదు. ఏమంటారా -

        నిను జూచిన కన్నుల సుర
        వనితలు దను జూడకున్న వాసవు డలుకన్
        జని చానని పంచిన జా
        జనునే? యాతని చలంబు సాధ్యము గాగన్.

    మిమ్మల్ని చూచిన కన్నులతో ఆ అన్నులమిన్నలు తన్ను చూడటం లేదని ఆ ఇంద్రుడు లోలోపల కుళ్ళుకుంటున్నాడు. ఆ కసితోనే మిమ్మల్ని ఉసిగొల్పి ఈ దుస్సాహసానికి ప్రేరేపించాడు. ఇదుగో చూడండి. ఈ చుప్పనాతి సురరాజు చంపించటం కోసమే రప్పించాడనుకొండి. మీరు వెనుకా ముందూ చూచుకోకుండా దూకతమేనా? ఏం పిచ్చివారండీ . ముక్కోటి దేవతల ముందు ఆ టక్కరి దేవేంద్రుడు మిమ్మల్ని పెద్దచేసి పొగడి ఈ పనికి ప్రోత్సహించాడు. ప్రాణంతకమైన ఈ దుస్సాహానికి మీరు నడుం కట్టారు. నోటికి వచ్చినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ మీ సహసోక్తులు ఏ మాత్రం క్షేమం కరాలు కావు. మీరు ఇంత పనికి పూనుకున్నారన్న సంగతి వింటే మీ జననీ జనకులైన లక్ష్మీ నారాయణులు మెచ్చుకోరండీ- నొచ్చుకుంటారు.

        త్రిదశులు విల్చి పంపుడొక తెజముగా గొని దేవదేవు నె
        ల్లిదముగ జేసి యింతగొని లేవడలేచెడు; ప్రాణగొడ్డ మా
        డెదు; మది నోటకండ సెడి దేప్పరికంబులు సేసే; దిట్టి క్రౌ
        వ్విదములూ దక్కు; మీ పలుకు విష్ణుడు లక్ష్మీయు విన్నమెత్తురే!
    ఉత్తములైన తనయులు తల్లిదండ్రులకు ఇష్టం లేని పని చేయరు. జననీ జనకులకు కష్టం కలిగించే పని చేయటానికి ఏ కుమారుడూ అంగీకరింపడు."
    వివేకవతి అయిన రతి మన్మధుని తల్లిదండ్రుల పేరెత్తి నిరోధింపచూచింది. కాని ఇందుకు కూడా మన్మధునిలో చలనం కనిపించలేదు. రతి మళ్ళీ మొదలు పెట్టింది.
    "స్వామీ! ఆ పరమేశ్వరుడు , ఆ పాలక్షుడు, ఆ హరుడు ఆగ్రహంతో ఒక్కమాటు అవలోకిస్తే ఆ క్షణమే అఖిల లోకాలూ భస్మీపటలం అవుతాయి. అటువంటి ఉగ్రమూర్తి పైకి, మీరు అనాలోచితంగా లంఘించబోతున్నారు. పెద్ద చేపలను అంతకంటే పెద్ద చేపలు గుటుక్కున మింగుతాయి."
    అప్పటికీ మదనుడు బెదరలేదు. రతి పతి మౌనాన్ని భరింపలేక మళ్ళీ గట్టిగా హెచ్చరిస్తున్నది.
    
        "కను కిట్టిన నిట్టిక నమ
        లిన విధమున దేవతావళికి బూనితి నే
        నని రుద్రు నుఱక పైజని
        చెనయుట శిఖిశిఖల మిడుత సేనయుట గాదే?
    కండ్ల కామెర్ల వాడు ఇటుకరాయిని పటపట కొరికి నమిలిన విధంగా ఉంది. మీరు ఆ రుద్రుని తపస్సు భగ్నం చేయాలనుకోవటం! అంతేకాదు మిడుత మిడిసిపడుతూ దీపం పైకి దూకినట్లుగా ఉన్నది."
    ఈ చివర మాటలను మదనుడు సహించలేకపోయినాడు. రతి తనమీది ప్రేమాతిశయంతో తన ప్రయత్నాన్ని అడ్డుకొంటున్నదని ఊహించాడు. రతికి ధైర్యం చెప్పటం కోసం ఇలా అన్నాడు -\
    "నా పూలబాణాలు తగలగానే పార్వతీ పరమేశ్వరుల మనస్సులు కరిగి నీరవుతాయి. అన్యోన్యం ఆకర్షించుకుంటాయి. ఇందుకు ఏ మాత్రం సందేహం లేదు. ఈ ముల్లోకాలలో ఎవరికీ సాధ్యం కాని కార్యం నేను నిర్వహిస్తాను. నా శరలాఘవంతో అ పార్వతీ పరమేశ్వరులను ఏకం చేస్తాను. నా శరపరంపరలకు తిరుగు లేదు. ఇదుగో చూడు ప్రియసతీ! ఈ త్రిలోకాలలో నా ఆజ్ఞకు తిరిగు లేదని నీకు తెలుసు. అన్నీ తెలిసి నన్నెందుకు సందేహిస్తున్నావో నాకు తెలియటం లేదు. ఆ భుజంగ భూషణుడిని ఒక పెద్ద వీరాధివీరుడుగా భావించి నన్ను భయపెడుతున్నావు." అన్నాడు మన్మధుడు.
    హద్దు మీరి పలుకుతున్న పతికి పరమేశ్వరుని ప్రభావాన్ని వెల్లడిస్తూ ఇలా పలికింది రతి:

        'అతని శరాసనంబు గనకాచల, మిక్షుశరాసనంబు నీ ;
        కతనికి నమ్ము పాశుపత , మంటిన గందేడు పూవులమ్ము నీ ;
        కతడు పురాపహరి, విరహతురా పాంధజనాపహారీ నీ;
        వతనికి నీకు హస్తిమశకాంతర మెమ్మేయి నెన్ని చూచినన్"
    ఈ పద్యంలో రతి దేవి మహాదేవునికి, మన్మధుని కీ ఉన్న తారతమ్యాన్ని సోదాహరణంగా వెల్లడించింది.
    "శివదేవునికి, నీకూ ఎనుగుకూ దోమకూ ఉన్నంత తేడా ఉన్నది. అయన ధనుస్సు మహా మేరు పర్వతం. మరి నీ ధనుస్సు చెరుకుగడ. అయన అమ్ము పాశుపతం. మరి ముట్టుకుంటే వాడిపోయే పూవుటమ్ములు నీవి. అయన అపార పరాక్రమోపేతులైన త్రిపురాసురులను హతమార్చాడు. ఇక నీవో విరహంతో క్రుంగి కృశించే అమాయిక నాయికా నాయకుల మీదికి ఒంటికాలితో దూకుతావు. అయన హరుడు. నీవు మరుడవు. ఆ దేవదేవుడయిన శివుడెక్కడ? నీవెక్కడ?"
    రతి పలుకులకు మన్మధుడు ఉలుకలేదు. పలుకలేదు. వివేకవతి అయిన రతి మరొక్కమాట పచ్చవిలుతుని హెచ్చరిస్తూ ఇలా అంటుంది -
    "మీరు పుష్పబాణులు. మీ బాణాలు శివభక్తుల హృదయాలనే కదిలించలేవే! మరి అటువంటి సుకుమార సుమశరాలతో పరమశివుని తపస్సు భంగపరచాలని భావించటం  ఎంత వెర్రి తనం! అదీకాక అబలను, ఆడదాననైన నేను లేని కోపం తెచ్చుకొని కొంచెం కనులేర్రచేసి చూస్తె గడగడ వణికిపోతారే! అటువంటి మీరు , ఆ నిటలాక్షుని చటుల కరాళ క్రోధాగ్ని జ్వాలలకు ఎదురొడ్డి ఎలా నిలువగలరు?"
    ఇన్ని విధాలుగా ప్రభోధించినా తన పలుకులు మన్మధుడు లక్ష్య పెట్టలేదని గ్రహించిన ఆ యిల్లాలు మహాదేవుని మహత్యం ముందు మన్మధుని అల్పత్వానికి అద్దం పడుతుంది ఈ క్రింది పద్యంలో.

        "కొని బాలురైనను దిని పిప్పి యుమిసెడు
                    చెరకు విల్లని నమ్మి చేతబట్టి
        మెలతల తల వెంట్రుకల బొంది కందేడు
                   నలరు పుష్పము లమ్ములని తలంచి
        తలిరాకులైన గదల్ప నోపని మంద
                    పవనుండు నొక పెనుప్రావు గాగ
        సబలలు సోపిన నాకాశమున బారు
                     నల శుకములు మూలబలము గాగ

        నెంత వేసవి ముట్టిన నెండ గమరు
        నను వసంతుండు దగు సహాయంబు గాగ
        కాకి పిలల్ల కోడు పికములు పోటు
        మగలుగా నుగ్రుపై బోవదగునే మదన?

    రామ! రామ! పసిపిల్లలు విరిచి ముక్కలు చేసుకొని తినే చేరుకుగడను విల్లుగా పట్టుకుని, కాకి పిల్లలను చూచి తోకముడిచే కోకిలలనూ గోరంకలనూ వెంట బెట్టుకుని, తలిరాకులను సైతం కదల్చలేని మలయాన్నిలాన్నీ ఎండకు కంది కమిలిపోయే వసంతున్ని నమ్ముకుని పూవుటమ్ములతో దేవదేవుడయిన మహాదేవుని జయించాలనుకోవటం ఎంత అవివేకం?' అంటుంది రతి.
    ఇప్పటికీ మన్మధుని మానసంలో మార్పు రాకపోవటంతో అంతకాంతకుడయిన పురాంతకుని అవక్రపరాక్రమాన్ని అభివర్ణించి ఆత్మనాదున్నీ భయపెట్టాలని ప్రయత్నించుకుంది రతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS