"చిరముగ నొల్వుబడ్డ నరసింహుని కంటెను బెద్డవే ? శిరం
బురలగ నాటువద్ద జలజోద్భవు కంటెను బెద్డవే? పెనుం
గరిగొన గాల్పువద్ద జముకంటేను బెద్డవే? నీవు విశ్వసం
హరు నురకెత్తిపోయి కలహంబున నోర్వగ నీ యలంతియే?"
హిరణ్యకశిపుడున్నీ చీల్చి చెండాడి అగ్రహావేశంతో మైమరచి ప్రచండ తాండవం చేస్తున్న వీరనరసింహమూర్తిని శరభావతారం ధరించి ఒక్క పంజాదేబ్బతో నేల కరిపించాడే! నాకూ ఐదు శిరస్సులున్నాయని అహంకారంతో విర్ర వీగుతున్న విధాత తల తన కొనగోటితో గిల్లివేశాడే! కండ కావారంతో గర్వాంధుడయి మిడిసుపడుతున్న కాలయముడిని నిలువునా కాల్చి భస్మం చేశాడే! ఆ నరసింహమూర్తి కంటే, ఆ బ్రహ్మదేవుడికంటే, ఆ యమధర్మరాజు కంటే నీవు మొనగాడివా?
అసలా పరమేశ్వరుని ప్రళయకాల మహారౌద్రమూర్తి దరిదాపులకు పోవటం నీకు సాధ్యమౌతుందా?
"హరికంకాళము చేతిముద్ర; దివిజేంద్రాస్థుల్ సుభూషావళుల్;
గరళం బభ్యవహార; మంతకతసుక్షారంబు మైపూత; పం
కరుహసీన శిరఃకపాల మురభిక్షాపాత్రగా విశ్వసం
హరు వర్తించు మహావ్రతోపహతి సేయంబూన నీప్రాప్తియే?"
అంటూ మహా ప్రళయకాలంలో ప్రపంచమంతా భస్మీపటలమైపోయినప్పుడు ఆ విశాల శ్మశానంలో కాలి బూడిదైన ఇంద్రాది దేవతల ఎముకలే భూషణాలుగా ధరించి, విభూతిధారియై, విశ్వవిరాడ్రూపంతో విశ్రుంఖల విహారం చేస్తున్న ఆ మహారుద్రుని రౌద్రస్వరూపాన్ని కన్నులకు కట్టేటట్లు చేసి తన ప్రాణవల్లభుని ప్రాణాలను కాపాడుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది. భయపెడుతుంది. ప్రార్ధిస్తుంది. ప్రాధేయపడుతుంది. తన పూవింటి దొరను చిచ్చరకంటివాని కంటి మంటల నుంచి కాపాడుకోవాలని తహతహలాడుతుంది. ఉక్తులతో ఉపమానాలతో ఉదాహరణలతో ఉపదేశాలతో తన మనోనాధుని నిరోధించాలని చూస్తుంది. ఈ సందర్భంలో రతీదేవి ఓర్పూ, మాట నేర్పూ, అనురక్తీ దైవభక్తీ అభివ్యక్తమౌతాయి.
రతి పలుకులలోని యధార్ధాన్ని గ్రహించిన పంచబాణుడు కొంచెంగా సంచలించి, మళ్ళీ నిగ్రహించుకొని, అనన్య సామాన్యమై అవిలంఘనీయమైన తన కామ శక్తి మహత్యాన్ని వెల్లడించి రతిని సమాదానపరుస్తాడు. ఎంతటి ధైర్య స్థైర్య శౌర్య గంబీర్యవంతుడయినా ఎంతటి మంత్రతంత్రవేత్త అయినా, ఎంతటి మహానుభావుడయినా మహాదేవుడయినా తన కామశక్తికి లోనుకాక తప్పదంటాడు. చంద్రకిరణ స్పర్శకు చంద్రకాంత శిలల మాదిరిగా తన శక్తికి ఎంత కర్కశ హృద్యమైన కరిగి ద్రవించి స్రవిస్తుందంటాడు. ఇది తనకు బ్రహ్మదేవుడిచ్చిన వరమంటాడు. పార్వతి కూడా పరమేశ్వరుని సన్నిధిలో పరిచర్యలు చేస్తున్నది. కనుక తన ప్రయత్నం ఫలిస్తుందనీ, తనకు విజయం తధ్యమనీ రతికి ధైర్యం చెప్పి ఒప్పిస్తాడు. ఎట్టకేలకు రతి అంగీకరించుతుంది.
పూర్వాపరాలను సమన్వయించి చూచినప్పుడు రతి హృదయం మనకు అర్ధమవుతుంది. జగత్కంటకుడయిన తారకాసురుని సంహారం కోసం కుమార సంభవం అత్యావశ్యకం. అందుకు ఉమామహేశ్వరుల సమాగమం జరిగి తీరాలి. ఇది విధి నిర్ణయం. విశ్వశ్రేయోదాయకమైన ఈ దైవకర్యానికి తాను అడ్డురాకూడదు. తన పతిదేవుడయిన కామదేవుని పూవుటమ్ములు పార్వతీ పరమేశ్వరుల హృదయాలను ఏకం చేస్తాయి . మన్మధుని ప్రయత్నానికి మహాదేవుడు సంతోషిస్తాడు - అనుకున్నది ఆ యిల్లాలు.
సతీసమేతుడయి రాతీశ్వరుడు పరమేశ్వరుని తపోవనానికి బయలుదేరాడు.
వసంతుడు ముందు నడిచాడు. శివ తపోవనమంతా నవనవోన్మేషంగా విరాజిల్లింది.
పొన్నలు పూచే; బొన్నలోగీ బూవకముందర బూచె గోగు, లా
పొన్నలు గొండగొగులును బూవకముందర బూచె బూరువుల్;
పొన్నలు గొండగొగులును బూరువులున్నొగి బూవకుండగా
మున్న వనంబునం గలయ మోదుగు లోప్పుగబూచె నామనిన్
మన్మధుడు విల్లెక్కు పెట్టి సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. రతి మతిలో ఇలా భావిస్తున్నది -
"కామినులు లేక లోకుల
గాముని కేట్లగు మనోవికారుల జేయన్?
గాముక నికరము లేకయు
కామినులను జనులనెట్లు గలిపింపనగున్!"
ఇలా అనుకుంటూ ఉండగానే పర్వత రాజపుత్రి పరమశివుని సన్నిధికి వచ్చింది!
కరవీరరచిత నూపురములు చేలువొంద
గాంచన పుష్పమేఖలలు గట్టి
పున్నాగమయహారములు పెట్టి నవకర్ణి
కారశోభిత కటకములు వేలుగ
గేసర రాజీవ కేయూరములు దొడి
రాజీవ కర్ణపూరము లమర్చి
తిలకాభినుత హేమతిలకంబు లుప్పొంగ
జంపక మాలికాసమితి దాల్చి
మధులతాంతమయ విమండన మండిత
లైన కన్యకాచయంబు నడుమ
బొలిచె నద్రితనయ పుష్పిత జంగమ
లతల నడిమి కల్పలతయు బోలె.
శైలబాల చంద్రకళాధరుని ముందు నిలిచింది. మరుడు గురి చూచి సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు . ఇంకేముంది!
ఆ లసితస్మితస్య లలితామల కోమల చంచలాలసా
లోల విశాల సంస్పురిత లోచనదృష్టి రసప్రవాహ మం
దోలిన పర్వి వెల్లిగొన యెక్కట గ్రక్కున ముంచి మీదికిన్
దేలగ నెత్తే జుట్టె హరు ద్రిప్పుల బెట్టె మనోజు దుబ్బగాన్.
ఇదే మంచి సమయం అనుకున్నాడు మన్మధుడు. పరమశివుని హృదయాన్ని పరవశింపచెయ్యటానికి అలరమ్ములు విరజిమ్మాడు. ఈ సన్నివేశాన్ని నన్నెచోడ మహాకవి సుమనో మనోజ్జంగా చిత్రించాడు.
నగరాజతనయ పన్నగ రాజధరు మ్రోల
నిలుచుడు మదను డేటలవి నిలిచె
నెలనాగ గరిబొమల్ వొలయింప నెత్తురు
జిత్తుజు డించు విల్లెత్తుకొనియె
హరిజాక్షి లసదపాంగాలోకనము నూలు
కొలుపుదు నమ్మరి గొలిపె మరుడు
పతి నెరనూర బార్వతి సూచు నురుచూడ్కు
లాడుడు నలరమ్ములాడె; నీశు
గంతు డేయదొడగె నంత నీశ్వరునకు
నచలవృత్తి జలుపు నాత్మవిమల
యోగభావ మేడపి రాగోత్కటంబున
గౌరీయందు నిలిపె - గన్ను మనము.
అకులిత హృదయుడయిన హరుడు తన మనోవికరానికి కారణమేమిటా అని నలువైపులా తిలకించాడు. "నవతమాలలతాతతి నడుమ" పుష్పచాపధరుడయిన మరుడు గోచరించాడు.
పరమేశ్వరుడు ఫాలనేత్రం తెరిచాడు -
నిటలాక్షవహ్ని గడు ను
త్కటమై తరతరమ మీద గప్పిన మదనుం
డిట యట మెదలగ నేరక
పటుతర శిఖి శిఖల గాలి భస్మం బయ్యెన్.
అంతా ఒక క్షణంలో జరిగిపోయింది. దివునికి ఎప్పుడు కోపం వచ్చిందో ! ఎప్పుడు నొసటి కన్ను తెరిచాడో! ఎప్పుడు అసల జ్వాల వెలువడిందో! ఎప్పుడు మన్మధుడిని దహించాడో!
కవి కొపించేనో! గానక
మును గోపించెనో! మహోగ్రముగ నుగ్రుడు సూ
చిన గాలెనో! చూడకయట
మును గాలెనో నాగ నిమిషమున సరి గాలెన్.
ఆ భయంకర దృశ్యాన్ని చూచి రతి తల్లడిల్లి మూర్చిల్లింది. తెప్పరిల్లి లేచి చూచేసరికి తన ప్రాణేశ్వరుడు కన్పించలేదు. పురుషాకృతిలో ఉన్న భస్మ పుంజం కన్పించింది. ఆమెకేమీ అర్ధం కావటం లేదు. తన మనోనాధుడు పరమశివుని పాలనేత్ర జ్వాలా మాలికలో కాలిపోయినాడా? భయపడి పారిపోయినాడా? అయినా తనను ఒంటరిగా వదలి ఎలా వెళతాడు? మరి ఈ భస్మరాశి ఎక్కడిది? అని పరిపరివిధాల భావించింది. చుట్టు ప్రక్కల పొదల నడుమ వెదకింది. ఆకుల చిత్తంతో మ్రాకుల మధ్య అన్వేషించింది. పతి జాడ తెలియక పలవించింది.
