కవిరాజ శిఖామణి రతీదేవి
ప్రతిభా సంపన్నులైన మహాకవులు నవనవోన్మేషమైన శేముషీ విశేషంతో తమ తమ కావ్యాలలోని పాత్రలకు ప్రాణం పోస్తారు. ఈ విధంగా ఆ కృతులలో ఆకృతి ధరించిన ఆయా పాత్రలు కన్నులముందు కదలుతూ పాఠకుల హృదయ ఫలకాల పయి చెరగని ముద్ర వేస్తాయి. అటువంటి సజీవ పాత్రలలో ప్రధానంగా చెప్పుకో దగ్గది నన్నేచోడ కవీంద్రుని "కుమార సంభవం" లోని రతీదేవి.
శివకవులలో పేరెన్నిక గన్నవాడు నన్నెచోడ కవిచంద్రుడు. ఈయన సువర్ణలేఖిని తేనెలూరే జాను తెనుగులో ముద్దుముద్దుగా దిద్ది తీర్చిన మహాకావ్యం కుమార సంభవం.
కుమార సంభవం అనగానే కాళిదాస మహాకవి పేరు గుర్తుకు వస్తుంది. కాని నన్నెచోడుని కుమార సంభవం కాళిదాస కవీంద్రుని సంస్కృత కుమార సంభావానికి అనువాదం కాదు. ఇది స్వాతంత్య కావ్యం. సహృదయ హృద్యంగమంగా అనంతర ప్రబంధవాజ్మయానికి మార్గదర్శంగా నిర్మింపబడిన పన్నెండు ఆశ్వాసాల ప్రబంధ రాజం నన్నెచోడుని కుమార సంభవం.
నన్నెచోడ కవిచంద్రుడు అవతరికలో తననూ తన కావ్యాన్నీ ఈ విధంగా పాఠకులకు పరించయం చేసుకున్నాడు-
రవికులశేఖరుండు కవిరాజ శిఖామణి కావ్యకర్త స
త్కనిభువి నన్నెచోడుడటె కావ్యము దివ్యకధన్ గుమార సం
భావమటే సత్కధాదిపతి భవ్యుడు జంగమమల్లికార్జునుం
చలితార్ధ యోగధరుడట్టెడవి వినం గొనియాడ జాలదే!
ఈ పద్యంలో నన్నెచోడుడు తన్ను రవికుల శేఖరునిగానూ, కవిరాజ శిఖామణిగానూ, కావ్యకర్తగానూ, సత్కవిగానూ, తన కృతిభర్త జంగమ మల్లికార్జునదేవునిగానూ పేర్కొన్నాడు.
ఇరువది యొక్క వేల గ్రామాలకు అధీశ్వరుడై పాకనాటి ప్రభువై విరాజిల్లిన "చోడబల్లి" అనే చోళరాజు తన తండ్రి అనీ, అయన పట్టపురాణి శ్రీసతి తన కన్నతల్లి అనీ ఈ క్రింది పద్యంలో చెప్పుకున్నాడు నన్నెచోడుడు-
'అరినరపాలమౌళి దళితాంఘ్రియుగుండగువాడు, పాకనా
డిరువదియొక్క వేయిటి కదీశుడునా జను చోడబ్లలికిన్
జిరతరకీర్తి కగ్రమహిషీతిలకం బన హైహయాస్వయాం
బరశాశిరేఖయైన గుణభాసిని శ్రీసతికిం దనూజూడన్."
ఈ రాజకవి తన కుమార సంభవ మహాకావ్యంలో మన్మధుని ప్రియసతి అయిన రతిని వినయవతిగా, వివేకవతిగా, సౌజన్యవతిగా, చతురమతిగా, ఆదర్శయువతిగా, అనురాగవతిగా, పతివియోగాన్ని సహించలేని ఉత్తమ సతిగా చిత్రించాడు.
అది వైకుంఠం ఆ నగరంలో మన్మధుని మణిమయసౌధం. ఆ సౌద ద్వారంలో పతికోసం నిరీక్షిస్తున్నది రతి. ఆ కాంత ఏకాంతంగా తన కాంతుని రాకకై వేయి కళ్ళతో పతీక్షిస్తున్నది. ఆ ప్రతీక్షణంలో ప్రతిక్షణం ఒక దినంగా తోస్తున్నది ఆ హరిణేక్షణకు.
***
దక్షయజ్ఞంలో దక్షయాణి తనువూ చాలించి పర్వత సార్వభౌముడైన హిమవంతునికి కూతురుగా జన్మించింది. సతీవియోగాన్ని సహింపలేని మహేశ్వరుడు హిమవత్పర్వత సానువుల మీద ఆశ్రమం నిర్మించుకుని నిశ్చల తపోదీక్షలో నిమగ్నుడవుతాడు. హిమవంతుడు తన గారాబుకుమారి అయిన గౌరిని పరమశివునికి పరిచర్యలు చేయటం కోసం వినియోగిస్తాడు. సఖీసమేత అయిన పార్వతీ శివదేవునికి సేవ చేస్తూ ఉంటుంది.
అదే సమయంలో తారకాసురుడు బ్రహ్మదేవుని వల్ల వరాలు పొంది అపక్ర పరాక్రమోపెతుడై ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తాడు. ఇంద్రుని పైకి దండెత్తి స్వర్గసంపదలను దోచుకుంటాడు. సాధుజన సంహరకుడూ, సకల భువన మరకుడూ అయిన తారకుని అత్యాచారాలకు తట్టుకోలేక తల్లడిల్లిన దేవేంద్రాదులు బ్రహ్మ దేవునితో మొర పెట్టుకుంటారు.
బ్రహ్మదేవతలను ఓదార్చి తారకాసుర సంహారానికి ఉపాయం ఉపదేశిస్తాడు. పార్వతీ పరమేశ్వరులకు జన్మించిన కుమారుడు తప్ప, మరెవ్వరూ తారకుణ్ణి సంహరింపలేరనీ, పరమేశ్వరుడు హిమగిరిపై తపోనిష్టలో ఉన్నాడనీ, శివ తపోభంగం కావించి పార్వతీ పరమేశ్వరులను పరస్పరం అనురాక్తులయ్యేటట్లు చెయ్యాలని , ఈ మహాకార్యం మన్మధునికి మాత్రమే సుసాధ్యమనీ, ఇందు నిమిత్తం పంచశరుణ్ణి ప్రార్ధించి పంపమనీ ప్రబోదిస్తాడు బ్రహ్మదేవుడు.
అబ్జసంభవుని అజ్ఞానుసారం అమరెంద్రుడు మన్మదుడిని ఆహ్వానిస్తాడు. శివతపోభంగానికి ప్రోత్సహిస్తాడు. మన్మధుడు మహాదేవుని తపోనిష్టను భగ్నం చేసి, అయన మానస్సును అనురాగ మాగ్నం చేసి, పార్వతి యందు లగ్నం చేస్తానని ఇంద్రసభలో ప్రతిజ్ఞ చేస్తాడు. శచీకాంతుడు రతికాంతుని పలుకులకు ఆనందించి కర్పూర తాంబూలం అందించి వీడ్కోల్పుతాడు.
ఇక్కడ మన్మధుని ప్రియసతి రతి తన సతి ఇంకా రాలేదేమా అని తహతహ లాడుతున్నది. అ లతాంగి క్షణం కూడా తన ప్రియుణ్ణి విడిచి ఉండలేదు. అతడు కూడా అంతే. ఆమె అదురుగుండెతో బెదురు చూపులతో తన హృదేయేశ్వరుని రాకకు ఎదురు చూస్తున్నది. చూచి చూచి కళ్ళు వాచిపోతున్నాయి. ఎంతసేపటికి మన్మధుని జాడలేదు. అంతకంతకు ఆమె అంతరంగం చింతాక్రాంత మవుతున్నది. అన్నీ అపశకునాలే గోచరిస్తున్నాయి. కుడికన్ను అదురుతున్నది. కుడిభుజం కంపిస్తున్నది. గుండె దడదడ కొట్టుకుంటున్నది. ఆమె మనస్సు ఏదో కీడు శంకిస్తున్నది.
ఇంతకూ ఆ అమరేంద్రుడు అంత అకస్మాత్తుగా ఎందుకు ఆహ్వానించినట్లు? పిలచినదే తడవుగా ఈయన వెళ్ళాడు. ఎంతసేపయినా తిరిగి రాలేదు. అక్కడ ఏమి జరుగుతున్నదో! ఆ ఇల్లాలు తల్లడిల్లి పోతున్నది. పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేక పోతున్నది.
ఇంతలో మదనుని మకరకేతనం అల్లంతదూరాన ఆకాశంలో తళతళ మెరిసింది. మన్మధుని రధం కనిపించింది. అలికుల గానాలూ, కోకిలల కలకూజితాలూ, చిలుకల జిలిబిలి పలుకులూ వినిపించాయి. అమ్మయ్య! అయన వస్తున్నాడు.
రత్రి ప్రాణాలు కుదుటపడ్డాయి. గబగబా ఎడురుపోయింది. "ఏమండీ! ఎంత సేపయింది మీరు వెళ్ళి/ ఇంత ఆలస్యం చేశారేం? ఇంతకూ ఆ దేవతల రాజు అంత తొందరగా రమ్మని మిమ్మల్నీ ఎందుకు పిలిపించారు? అక్కడ ఏమి జరిగింది? చెప్పండి" అంటూ తరిమి తరిమి అడిగింది.
తన దేవేరి తత్తరపాటూ , మాటలలోని తడబాటూ మన్మధుడు గ్రహించాడు. ఆమె ముఖలక్షణాలు చూడగానే ఆమె హృదయంలోని ఆందోళన మన్మధునికి అర్ధమయింది. రతిని దగ్గరకు తీసుకొని చిరునవ్వు నవ్వుతూ రతిపతి ఇలా అన్నాడు.
"బెదురుచు నంతరంగమున భీతికి గండవడంబు సుట్టి ప
ల్కేదు; పోరపోచ్చేమున్ వెఱవు గేనము జేయ్వులకోలినెత్తువె
ట్టెదు, పడి మోవియుం గరువడిల్లేదు నీమది నింత దల్లడం
జోదపు డిదేమి కారణమో యుగ్మలి! నా కేఱిగింపు మేర్పడన్.
నీ అధరం కంపిస్తున్నది. నీ గుండెలు కొట్టుకుంటున్నాయి. నీవు చాలా భయపడుతున్నావు. నీ భయాన్నీ, నీ తత్తరపాతునీ దాచిపెట్టి ఏదో తెచ్చిపెట్టుకొని మాట్లాడుతున్నావు. ఎందుకీ కలవరపాటు?"
మన్మధుని ఓదార్పు మాటలకు రతికొంత తెప్పరిల్లింది.
"మరేమీ లేదండీ! నాకు చాలా అపశకునాలు కనిపించాయి. నింగిమీద, నేలమీద అంతటా అగుపించిన ఆ నిర్నిమిత్తాలైన దుర్నిమిత్తాలకు నా హృదయం కలత చెందింది. దానికేం గాని మీరు వెళ్ళి వచ్చిన కార్యం ఏమిటో వేగిరం చెప్పండి" అన్నది రతి.
"అబ్బే! పెద్ద విశేషం ఏమీ లేదు. హిమగిరి మీద పరమశివుడు తపస్సు చేస్తున్నాడుగా. అయన తపస్సు భంగం చేయమని దేవేంద్రుడు నన్ను కోరాడు. అదెంత పని ! అలాగే చేస్తానని అంగీకరించి వచ్చాను. "ఇంతే" అన్నాడు మన్మధుడు.
పతి పలుకులు విని రతి ఉలిక్కిపడింది. ఆమె గుండెలు మరింత కొట్టుకోసాగాయి. ఆమె ఉల్లం తల్లడిల్లింది.
"ఏమండీ! అంతమాట ఎలా చెప్పారు? ఎంత సాహసానికి ఉపక్రమించారు? ఆ పరమేశ్వరుడు మన కులదైవం . త్రిలోకారాధ్యుడు. పరమ యోగేశ్వరుడు. సర్వేశ్వరుడు బ్రహ్మదేవుని శిరస్సు కొనగోటితో చిదిమినవాడు. దండధరుని గుండెలు పగులదన్నినవాడు. త్రినేత్రుడు. ప్రళయయాగ్నిరుద్రుడు. అటువంటి పరమేశ్వరుని తపోభంగానికి మిమ్మల్ని నియమించాడా ఆ ఇంద్రుడు! మహానుభావులను అవమానించటం మరణానికి హేతువని ఆ మహెంద్రునికి తెలియదా? ఒకవేళ అయన చెప్పినా ఆ పనికి మీరు ఎట్లా ఒప్పుకున్నారండీ?" అని భర్తను మందలిస్తూ రతి ఇలా అంటుంది.
