స్వింగు డోరు తెరచుకుని, చనువుగా లోపలికి వచ్చేశాడు ఒక వ్యక్తీ. అతను ప్రఖ్యాత రచయిత ప్రేమ్ కుమార్.
అతన్ని చూడగానే, "రండి ప్రేమ్ కుమార్! కూర్చోండి" అన్నాడు ఎడిటరు.
ప్రేమ్ కుమార్ కుర్చీలో వెనక్కి జేరగిలబడి సౌక్యంగా కూర్చుని సిగరెట్ అంటించి , యాష్ ట్రే దగ్గరికి లాక్కున్నాడు. చాలా కాన్ఫిడెంట్ గా కనబడతాడు అతను. అది నిజంగా కాన్ఫిడేన్సో , లేక తన కాంప్లెక్సు ని కప్పిపుచ్చుకోవడానికి అతను అలా ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తాడో ఎవరికీ తొందరగా అంతుబట్టదు.
"అంత లేటయిందాకా ఆఫీసులోనే ఉండిపోయారేం! నేను రెస్టారెంట్ లో డిన్నర్ తీసుకుని వెళుతుంటే మీ కారు కనబడింది. ఒకసారి పలకరించి పోదామని వచ్చాను. ఏమిటి హడావుడి? సెట్ ప్రింటింగ్ కి వెళ్ళాలా?"
"అవును. అదే హడావుడి" అన్నాడు ఎడిటరు.
సిగరెట్ పొగపీల్చి వదులుతూ ఎడిటరు వైపు చూశాడు ప్రేమ్ కుమార్ ---------"కొత్త సీరియల్ అనౌన్స్ చేసేశారే?"
"అవును. ఎమర్జెన్సీగా చెయ్యాల్సి వచ్చింది"
"ఏమిటి సబ్జెక్టు?"
ఎడిటరు చిన్నగా నవ్వాడు. "తినబోతూ రుచి అడగడమెందుకు చదువుతారుగా?"
ఆ మాట వినగానే ప్రేమ్ కుమార్ మొహంలో కాంతి తగ్గింది.
"చదువుతానా! ఇంకా నేనే ఆ సీరియల్ రాస్తాననుకుంటున్నాను."
ఎడిటరు ప్రశ్నార్ధకంగా చూశాడు.
"ఎందుకలా అనుకుంటున్నారు?"
"అదేం ప్రశ్న! ఈ మేగజైను కి నేను వెన్నుముక లాంటివాడిని. ఈ మేగజైను నిలబడుతోంది నా వల్లే! కాదా?" అన్నాడు హాస్యంగా అంటున్నట్లు.
కానీ అతని చూపులు సీరియస్ గా వున్నాయి.
ఏదో అనబోయి, మళ్ళీ మనసు మార్చుకున్నాడు ఎడిటరు. "ఈ సీరియల్ ఉదయార్కర్ చేత రాయిద్దమనుకుంటున్నాను."
షాక్ తగిలినట్లు చూశాడు ప్రేమ్ కుమార్.
"ఉదయార్కరు చేతా! వెరీ ఫన్నీ! ఎందుకలా?"
"ఉదయార్కర్ కి ఇలాంటి సబ్జెక్ట్స్ మీద చాలా ఇంటరెస్ట్ వుంది. ఇంతకు ముందే ఇలాంటి విషయాల మీద చాలా డీప్ గా స్టడీ చేశాడు అతను."
"అంటే నేను చెయ్యలేదనీ, చెయ్యలేననీ మీ ఉద్దేశ్యమా? సీ యు కెన్ నాట్ ఇగ్నోర్ . మీ జస్ట్ లైక్ దట్! నన్ను నిర్లక్ష్యంచేసి ఇంకెవరికో ఇంత ఇంపార్టెంట్ సీరియల్ అప్పగించలేరు మీరు. మర్చిపోకండి! మీ మేగజైన్ నావల్లే పైకి వస్తోంది. ఈ సీరియల్ రాయడానికి రైట్ వున్న రిటర్ని నేనొక్కడినే! ఆ మాట ఎవరూ కాదనలేరు!"
అతనివైపు తదేకంగా చూశాడు ఎడిటరు. కొద్దికాలం క్రితం తన దగ్గరకు వచ్చి సీరియల్ వేసుకోమని ప్రాదేయపడిన మనిషేనా ఇతను! రెండు సీరియల్స్ వేసి అతన్ని రచయితగా నిలబెట్టగానే ఎంత మారిపోయాడు! కానీ ఆ భావాలని బయటికి ప్రదర్శించలేదు ఎడిటరు. నిర్వికారంగా అన్నాడు -
"ఐ యామ్ వెరీ సారీ ప్రేమ్ కుమార్! ఈ విషయం యిప్పటికే డిసైడ్ అయిపొయింది. ఇంక దాన్ని గురించి మాటాదేందుకేమీ లేదనుకుంటాను"
చటుక్కున లేచి నిలబడ్డాడు ప్రేమ్ కుమార్. అతని మొహం కందగడ్డలా ఎర్రబడింది. "మీ ఇష్టం! అలాగే కానివ్వండి చూద్దాం?"
"గుడ్ నైట్ ప్రేమ్ కుమార్" అన్నాడు ఎడిటరు.
ప్రేమ్ కుమార్ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
ప్రేమ్ కుమారు వెళ్ళినవైపెకొద్దీ క్షణాలు చూస్తూ వుండిపోయి, తర్వాత పోలీసు కమీషనరు కి రింగ్ చేశాడు ఎడిటరు.
"హౌ అర్ర్యూ ఎడిటర్" అన్నాడు కమీషనరు లైన్లో కి రాగానే. అప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలవుతోంది. అంత రాత్రివేళ తనకి నిద్రాభంగం కలిగినందుకు అయన విసుక్కోలేదు. ఆయనకి ఎడిటరుతో మంచి పరిచయం ఉంది. "చూస్తున్నా మీ వీక్లీ! కొత్త సీరియల్ ఏదో సెన్సేషనల్ అనౌన్స్ చేసినట్లున్నారే" అన్నాడు నవ్వుతూ.
"దానికంటే సెన్సేషనల్ మరొకటి వుంది" అని, పొద్దున ఇద్దరు స్త్రీలు తన దగ్గరికి రావడం, వాళ్ళ ఫంక్షన్ కి తనని ఇన్వయిట్ చెయ్యడం, తను ఉదయార్కర్ ని పంపడం, ఉదయార్కర్ జాడ తెలియకుండా పోవడం ..........అన్నీ వివరంగా చెప్పాడు ఎడిటరు.
శ్రద్ధగా విన్నాడు కమీషనరు.
"ఓకె. ఎడిటర్ జీ! ఐ విల్ అస్క్ మై బాయ్స్ టూ సెర్చ్ ఫర్ ఉదయార్కర్. డోంట్ వర్రీ!"
థాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేశాడు ఎడిటరు.
ఉదయార్కర్ కోసం ఆందోళనతోనే ఆ రాత్రి అంతా గడిచిపోయింది.
* * * *
అప్పటికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. మసక చీకటిగానే వుంది.
అశోక్ నగర్ లోని ఒక ఇంట్లోనుంచి నల్లటి శాల్తీ ఒకటి బయటికి వచ్చింది.
అతడు అభిషేకన్. పాల పాకెట్ తేవడానికి గాను అందరికంటే ముందే ఆబగా లేచి బయలుదేరాడు అతను.
నాలుగు రోడ్ల కూడలి దగ్గిరికి రాగానే టక్కున ఆగిపోయాయి అభిషేకన్ కళ్ళు. అక్కడ వున్న ఒక సినిమా పోస్టరు మీద పడ్డాయి అతని కళ్ళు.
విజయవంతంగా నూటయాభై రోజులు ఆడిన ఒక తెలుగు సినిమా తాలూకు పంచరంగుల పోస్టరది.
