Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 14


    "ప్లీజ్ ఇప్పుడేమీ అడక్కు. అలా టాంక్ బండ్ కేసి వెళ్దాం మనసేమీ బాగాలేదు."


    అర్థం అయింది! నీ మనసెందుకు బాగాలేదో బాగా అర్థం అయింది. బయటికి వెళ్ళాక నువ్వు చెప్పబోయేదేమిటో అర్థం అయింది చాలు. ఇక వెళ్ళు. ఏమీ చెప్పనక్కర్లేదు. మీ అమ్మ నాన్న ఈ వివాహానికి అంగీకరించలేదనేగా నువ్వు చెప్పబోయేది? నువ్వు మీ అమ్మ నాన్న మాట కాదనలేకపోతున్నావు!" గట్టిగా అరిచి అరిచి అనాలనుకుంది రాజేశ్వరి. కానీ పెదవులు కదల్లేదు.  


    రెప్పవెయ్యకుండా శరత్ ముఖంలోకి చూస్తూ నిల్చుండిపోయింది.


    "ప్లీజ్! అలా చూడకు. అసలే నా మనసు బాగాలేదు. ఒక విషయం చెప్పాలని వచ్చాను. బయటికి వస్తావు గదూ?" ప్రార్థిస్తున్నట్టు అడిగాడు శరత్.


    "పద!" అంటూ బయలుదేరింది.


    రాజెశ్వరి ఇంటినుంచి టాంక్ బండ్ చాలా దగ్గర. దోమలగూడ నుంచి టాంక్ బండ్ కు నడకసాగించారు.


    ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు.


    రాజేశ్వరికి గట్టిగా ఏడవాలని వుంది. అభిమానం అడ్డున వుంది.


    తను బేలగా బయటపడకూడదు. లోపల ఎంత బాధవున్నా పైకి నిబ్బరంగా వుండాలి అతను చెప్పింది చిరునవ్వుతో వినాలి.


    శరత్ మీద కోపంగా వుంది. మనిషికీ మనిషికీ కులాల పేరు మీద దూరాన్ని సృష్టించిన వాళ్ళను శపించాలని వుంది.


    రాజేశ్వరి మౌనంగా నడుస్తూ వుంది.


    ఇద్దరూ టాంక్ బండ్ మీద వున్న బెంచీ మీద కూర్చున్నారు.


    అస్తమిస్తున్న సూర్యబింబం ముత్తయిదువు నొసటి కుంకుమ బొట్టులా వుంది.


    పడమటి ఆకారం జేగురు రంగు పులుముకొని, శోభనం రాత్రి పెళ్ళి కూతురి చెక్కిలిలా వుంది.


    టాంక్ బండ్ మీద అప్పుడే వెలిగిన దీపాలు వెలతెలా పోతున్నాయి.


    కొందరు వంటరిగా పోగొట్టుకున్నదేదో వెతుక్కుంటున్నట్లు  రైవింగ్ పట్టుకొని నీళ్ళలోకి చూస్తున్నారు.


    భార్య - భర్తలు పిల్లలతో నడుస్తూ సంసార కష్టసుఖాల్ని గురించి మాట్లాడుకుంటున్నారు.


    జంటలు జంటలుగా ప్రేమికులు ప్రపంచాన్నే మరిచిపోయినట్టు  కబుర్లు చెప్పుకుంటూ బెంచీలమీద కూర్చుని వున్నారు.


    శరత్, రాజేశ్వరీ కూడా ప్రేమికులే! కాని వాళ్ళ చుట్టూ ఇంద్రధనుస్సు రంగులు లేవు? కళ్ళలో కలలు లేవు! గుండెల్లో వున్నది మధుర స్పందన కాదు, భయంతో కూడిన అదురు!


    ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. శరత్ కు ఎలా సంభాషణ ప్రారంభించాలో అర్థం కావడం లేదు.


    రాజేశ్వరికి చిరాకు వేసింది.


    "ఎందుకు శరత్ అలా వున్నావు?"


    శరత్ సమాధానం ఇవ్వలేదు! వెంటనే ఏం చెప్పాలో తెలియని వాడిలా వుండిపోయాడు!


    రాజేశ్వరి అభిమానం దెబ్బతిన్నది!


    "మీ అమ్మా నాన్న మన వివాహానికి అంగీకరించలేదు కదూ?"


    ఆమె కంఠంలోని పదునుకు చివ్వున తలతిప్పి చూశాడు శరత్!


    అప్పటికే సూర్యుడు కొండలచాటుకు ముఖం దాటేసుకున్నాడు!


    ఆకాశంలోని జేగురురంగు బూడిదరంగుగా మారింది.


    టాంక్ బండ్ మీది విద్యుద్దీపాలు కాంతిరేఖల్ని విరజిమ్ముతున్నాయి.


    "నాకు తెలుసు శరత్! ఇలాగే జరుగుతుందని!" రోషంగా అంది రాజేశ్వరి!


    "అదికాదు -" అంటూ ఆగిపోయాడు!


    "అవును! నాకు తెలుసు మీ అమ్మగారు ఒప్పుకోలేదు! నువ్వు ఆమెను కాదని...."


    "మా అమ్మ దేవత! ఆమెకు కులాల పట్టింపు లేదు. పైగా నా వివాహానికి ఆమె అడ్డుగా నిలవదు."     


    "మీ నాన్నగారు వప్పుకోలేదా? గుర్తుందా ఒకసారి అన్నావు. నాన్న వప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మ అంగీకరిస్తేచాలని. ఇప్పుడు మరి ఇంత దిగాలు పడిపోయావేం?" రాజేశ్వరి కంఠం తీవ్రంగా వుంది.  


    "నాన్నకూడా అంగీకరించాడు."


    రాజేశ్వరి ఆశ్చర్యంగా శరత్ ముఖంలోకి చూసింది.


    "మరి?" ప్రశ్నార్థకంగా చూసింది.


    శరత్ ఆలోచిస్తూ కూర్చున్నాడు.


    తల్లిదండ్రులు ఇద్దరూ అంగీకరించారు అంటున్నాడు. మరి ఎందుకింత దిగులుగా వున్నాడు? వాళ్ళతో ఘర్షణ పడ్డాడేమో? వాళ్ళేమయినా షరతులు పెట్టారేమో? ఒక హరిజనుల పిల్లను ఇంట్లోకి తీసుకురావడానికి ఇష్టపడలేదేమో! ఒక మాట చెప్పడానికే ఇంత బాధపడుతున్నాడే.


    "ఏం జరిగింది శరత్? ఎందుకంత దిగులుగా వున్నావు?"


    శరత్! ఏదో చెప్పాలని పెదవులు కదల్చబోయి ఆగిపోయాడు.


    "శరత్! నా గురించి నీకు బాగా తెలుసు. నేను నిన్ను ప్రేమించాను. నిజమే. ఏ కారణంవల్లనైనా నన్ను వివాహం చేసుకోకపోతే జన్మంతా ఏడుస్తూ కూర్చోను. ఆత్మహత్య చేసుకోను. బ్రతుకు రాజీ పడగలను. మానసిక స్థయిర్యం నాకుంది. మీవాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించకపోతే ఈ వివాహం జరగదు." అభిమానం దుఃఖం నేను ముందంటే నేను ముందు అని ఆమె కంఠంలో పోటీపడ్డాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS