"ఏం అలా అడిగారు?"
"ఏం లేదు"
"ఇక్కడ ప్రమాదాలు వెంట్రుక వాసివరకూ రావుగానీ, నిజమైన కష్టాలు లేవు కాబట్టి మా ప్రజలు వెంట్రుకంత ప్రమాదాన్ని చూసికూడా ఏనుగంత ఊహించుకొని భయపడతారు".
"అంటే?"
"అంటే, టాంక్ బండ్ బ్రద్దలైందని రూమరు వస్తే గోల్కొండ ఎక్కేవరకూ మనసు కుదుట పడకపోవటమన్నమాట".
ఫాస్టస్ విపరీతంగా నవ్వాడు. ఆగి, తల్చుకుని మళ్ళీ నవ్వాడు. నవ్వుతూనే అతడి మాటలు అర్థం చేసుకున్నట్టు అన్నాడు- "దేశంలో బాగా శాంతి నెలకొని వున్నప్పుడు ఆ 'శాంతి' తమకి ఎంత సుఖాన్నిస్తుందో దాన్ని తామెంతగా దుర్వినియోగపర్చుకుంటున్నామో ప్రజలు గుర్తించరు".
'అవును' అనుకున్నాడు అతడు మనసులో
ఏ అమెరికన్ బాంబరో, రష్యన్ మిసైలో నగరపు నడిబొడ్డున బాంబువేస్తే అప్పుడు అర్థమవుతుంది మా ప్రజలకి- అసలు కష్టమంటే ఏమిటో... చెమటలు కక్కుకుంటూ మాట్నీ క్యూల్లో నిలబడ్డ బిగుతు పంట్లంగాళ్ళూ, ఫంక్షనొస్తే చాలు పట్టుచీరెల ప్రదర్శన చేద్దామనుకునే ఆడవాళ్ళూ, గోనె సంచుల్లో సామాను సర్దుకొని, పిల్లల్ని వీపు వెనుక కట్టుకుని ప్రాణభయంతో ఒక చోట నుంచి మరొక చోటుకి వలస వెళ్ళవలసి వచ్చినప్పుడు అర్థమవుతుంది శాంతి విలువ. శాంతే మనిషిని సోమరిని చేస్తుంది. దేశం ఒక కొరియాగా మారినప్పుడు, దేశం ఒక క్యూబా అయినప్పుడు ఆ హీరోషిమా శిధిలాల్లోంచి పునర్నిర్మిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు.
అతడి ఆలోచన్లని చెదురుస్తూ ఫాస్టస్ "టాంక్ బండ్ అంటే గుర్తొచ్చింది. మనం పరీక్ష ప్రారంభించవలసిన మొదటి ప్రదేశం అదేగా" అన్నాడు.
"అవును. బయల్దేరదామా? అందుకే వచ్చాను"
ఇద్దరూ హోటల్ మెట్లు దిగుతూంటే అతడు అన్నాడు. "మనం ఇప్పుడు చూడబోయే ఈ టాంక్ బండ్ నీళ్ళు తాగటానికి పనికిరావు, కానీ ఈ నీటి ప్రభావం చుట్టుప్రక్కల చాలా 'బావుల' మీద వుంది. ఈ ప్రదేశాల్లో బీదవాళ్ళు చాలామంది ఈ నూతుల నీళ్ళే తాగుతారు. ఇదిగాక మలేరియా, ఫైలేరియా మొదలైన వ్యాధులు రావటానికి కారణం కూడా ఈ సాగర్ లోకి వచ్చి చేరే మురికి నీరే..."
ఫాస్టస్ తలూపాడు. ఇద్దరూ పార్టికోలోకి వచ్చారు. ఎదురుగా ఎయిర్ కండిషన్డ్ కంటెస్సా మెరుస్తూంది. "రండి". ఇద్దరూ కూర్చున్నారు. అతడు డ్రైవ్ చేయసాగాడు.
"నీ కారెందుకు? ప్రభుత్వం కారు పంపదా?"
కారణం అతడికీ తెలీదు. ప్రభుత్వపు రెడ్ టేపిజం గురించి చెప్పటం ఇష్టంలేక "ఈ రోజు అందరూ హడావుడిగా వున్నారు. ప్రెసిడెంట్ నగరానికి వస్తున్నాడు" అన్నాడు.
కారు టాంక్ బండ్ వైపు వెళుతూంది. అతడు ఫాస్టస్ కి ఒక పుస్తకం ఇస్తూ, "మా లిమ్నాలజీ డిపార్ట్ మెంట్ వాళ్ళు తయారుచేసిన రిపోర్టు ఇది" అన్నాడు. ఫాస్టస్ దాన్ని తీసుకొని ఒకసారి తిరగేసేడు. క్షణాల్లో అతడి మొహం సీరియస్ అయింది. మరింత శ్రద్ధతో దాన్ని చదవసాగాడు.
ఆ తరువాత వాళ్ళు టాంక్ బండ్ పరిసరాల్నీ మిగతా వాటినీ చూస్తున్నంతసేపూ అతడు గంభీరంగానే వున్నాడు.
తిరిగి వస్తూంటే ఫాస్టస్ అతడితో అన్నాడు. "ప్రపంచం మొత్తం మీదా వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న మాట నిజమే. కానీ నీటికి సంబంధించినంత వరకూ చాలా దేశాలు శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఈ రిపోర్టు చదువుతూ ఉంటేనే వళ్ళు గగుర్పొడుస్తూంది. ఈ స్టాటిస్టిక్సేగానీ నిజమైతే దీన్ని పరిశీలించటానికి విదేశాల నుంచి నేను రానక్కర్లేదు. మీరే యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని ఎదుర్కోవలసినంత దారుణంగా వుంది పరిస్థితి. మీరు ఎందుకు ఇంతకాలం ఏ చర్యా తీసుకోలేదు?"
"ఎందుకంటే, మా ఆస్పత్రులలో రోగులు పెరగటంవల్ల మా ఓట్లకి గానీ రాజకీయ పార్టీలకు గానీ వెంటనే వచ్చే ఇబ్బంది ఏదీ లేదు కాబట్టి".
కొంచెం సేపు నిశ్శబ్దం.
"నేను మీ దేశ ప్రెసిడెంట్ ని కలుసుకోవాలి" వున్నట్టుండి అన్నాడు ఫాస్టస్.
అతడు డ్రైవ్ చేస్తూనే తలతిప్పి "ఎందుకు" అని అడిగాడు ఆశ్చర్యంగా.
"నీటికన్నా ఎక్కువగా కలుషితమైపోయిన ఈ రాజకీయ నాయకులతో లాభం లేదు. ప్రెసిడెంట్ స్వయంగా పూనుకోవాలి. కనీసం ఈ ఒక్క నగరపు నీటిని నేను సూచించిన పద్ధతులలో సంస్కరించమని చెపుతాను. దాంతో ఆస్పత్రి కొచ్చే మామూలు రోగుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. నాకా నమ్మకం వుంది. దాంతో ప్రజలకి దీని అవసరం తెలిసి అంచెలంచెలుగా మిగతా పట్టణాలకి ఈ పద్ధతుల్ని వ్యాప్తి చెయ్యాలని వాళ్ళే వత్తిడి తీసుకువస్తారు..."
"తీసుకురారు"
"ఎందుకు తీసుకురారు?" ఆశ్చర్యంగా అడిగాడు ఫాస్టస్. వాళ్ళ కారు ఆగిపోయింది. వరుసగా ముందు ఆటోరిక్షాలూ, బస్సులూ ఉన్నాయి.
"ఏమయింది?"
"ట్రాఫిక్ జామ్!" అన్నాడతడు. "నగరంలోకెల్లా విశాలమైన రోడ్డు. మనముందు ఆగి ఉన్నది సిటీబస్! రోడ్డు ఇరుగ్గా ఉన్నచోట బస్ స్టాపు పెట్టకూడదన్నది తలలో మెదడున్న ఎవడైనా ఊహించగలిగే చిన్న విషయం. దాదాపు పది సంవత్సరాల నుంచీ ఈ బస్ స్టాపు ఇక్కడే ఉంది. పావుగంటసేపు ఇలా ట్రాఫిక్ జామ్ లో నిలబడతారుగానీ, ఈ విశాలమైన రోడ్డులో బస్ స్టాపుని ఒక వెయ్యిగజాలు ముందుకి జరపటంవల్ల ఈ ఇబ్బందిని అధిగమించవచ్చునని ఒకరికీ తోచదు. ఇది ఇక్కడే కాదు. మా దివ్యమైన నగరంలో చూడవచ్చు. కానీ తనకేదైనా లాభం ఉంటే తప్ప ఏ నాయకుడూ దీని గురించి పట్టించుకోడు".
తన మొదటి ప్రశ్నకు సమాధానం దొరికినట్టు, ఫాస్టస్ నెమ్మదిగా అన్నాడు- "ఇప్పుడర్థమైంది. ప్రజలు మంచినీటి గురించి ఎందుకువత్తిడి తీసుకురారో".
ఇద్దరూ కొంచెంసేపు మౌనంగా ఉన్నారు. అంతలో అతడన్నాడు- "మీరు ముఖ్యమంత్రి ఆహ్వానం మీద విదేశాల నుంచి వచ్చారు. ఎంతో సానుభూతితో, ఇక్కడి పరిస్థితిని దేశాధినేత దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. మనం ఆయన్ని కలుసుకునే ప్రయత్నం చేయటంలో తప్పు లేదు. అపాయింట్ మెంట్ దొరుకుతుందేమో చూస్తాను" అని తన ఇంటి దగ్గర కారాపాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. సింహానికి చెయ్యవలసినపని చెప్పి "కూర్చోండి" అన్నాడు.
ఎంతో ఖరీదైన వస్తువులతో అందంగా అలంకరించబడి వున్న ఆ హాలుని చూస్తూ ఫాస్టస్ ఆశ్చర్యపోయాడు. కేవలం టేబిల్ మీదున్న ఆష్ ట్రే కొన్ని వేలు ఖరీదు చేస్తుంది.
"మీ తండ్రి ఏం చేస్తుంటారు?"
"చెయ్యటమా? ఏమీ చెయ్యరు?"
ఫాస్టస్ ఆశ్చర్యంగా, "మరింత ఖరీదైన వస్తువులు- ఆస్థి..." అన్నాడు.
