"ముందు మీరీ ప్రమాదంలోంచి తప్పుకుంటారు. తరువాత సంగతి తరువాత చూద్దాం. ఆయన బాగా తాగివున్న సంగతి తెలిసిందే. పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ నాకు శిక్ష పడదు ఘర్షణలో మరణించాడని చెపుతాను".
అతడు వెంటనే జవాబు చెప్పలేదు. ఆమే తిరిగి అంది. "శవం ఈ గదిలో వున్నా కూడా నేనెలాగూ అరెస్ట్ చేయబడతాను. అయితే నాతోపాటూ మీరూ అంతేకాక అప్పుడు మనిద్దరి మీదా కేసు మరింత బలంగా వుంటుంది. కేసు సంగతి అలా వుంచండి. పరువు, ప్రతిష్ఠల సంగతి? కోర్టులో జనం ముందు మనిద్దరం దోషులుగా నిలబడి..." ఆపైన ఆమె మాట్లాడలేకపోయింది. అతడు మిగతాది అర్థం చేసుకోగలడు. ఎందుకో అతడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బహుశా కృతజ్ఞతా భావంతో కాబోలు! కానీ వాటన్నిటికీ సమయం లేదు. ఒక నిశ్చయానికి వచ్చినట్టు కదిలి ఆమె దగ్గరగా వెళ్ళాడు. "సరే... మీరు చెప్పినట్టే చేద్దాం" అన్నాడు వంగుతూ. ఇద్దరూ చెరోవైపు పట్టుకొని శవాన్ని లేపారు. ఆమె తలుపుతీసి కారిడార్ లోకి చూసింది. వరండాలో ఎవరూ లేరని నిశ్చయించుకొన్నాక ఇద్దరూ ఎదుట గదిలోకి ప్రవేశించి, అక్కడ పడుకోబెట్టారు.
అంతా సరిగ్గా వున్నదని నిశ్చయించుకొన్నాక అతడు వెనుదిరిగాడు. తలుపు తెరుస్తూ ఆమెతో, "... ఈ రోజు మీరు చేసిన త్యాగం నా జీవితంలో మర్చిపోను. ఆపదలోకి తోసేసి నేను తప్పుకుంటున్నాను అన్న భావం మత్రం నన్ను జీవితాంతం బాధ పెడుతుంది. ఈ సమయంలో మీ పక్కనుండి ఓదార్చలేకపోతున్నందుకు క్షమించండి" అని తలుపు దగ్గిరగా వేసి తన గదివైపు నడిచాడు.
గదిలో పడుకున్నాడన్న మాటే గానీ, ఎంతసేపటికీ నిద్రపట్టలేదు. జరిగిందంతా కనులముందు రీలులా తిరుగుతూంది. తన గదిలో... ఈ గదిలో కొన్ని నిముషాలముందు హత్య జరిగిందనీ- అదీ తనే చేశాడనీ నమ్మశక్యం కాకుండా వుంది. తను చంపిన మనిషి శవం పక్కగదిలో వుందన్న ఆలోచన నిద్ర పట్టనీయటం లేదు. అది ఘర్షణే కావొచ్చు- మరణం ప్రమాదవశాత్తూ కావొచ్చు. కానీ హత్య హత్యే.
లేచి పక్కగదిలో ఏం జరుగుతూ వుందో చూడాలని అనిపించింది. ఆమెనలా శవంతో వదిలిపెట్టి రావడం దారుణమనిపించింది. క్షణాల్లో కోర్కె పెరిగి, తలుపు తీసుకుని ఎదుటి గదివైపు నడిచాడు. ఆ తలుపు తీసి లోపలి దృశ్యం చూసి కదిలిపోయాడు.
ఆమె, భర్త శవం మీద పడి ఏడుస్తూంది.
అప్పటివరకూ ఒక కర్తవ్య నిర్వహణ కోసం బలవంతంగా ఆపుకున్నట్టు, ఇక ఆ గదిలో ఓదార్చేవాళ్ళు ఎవరూలేక, తనివితీరా ఏడవటానికి వీలు దొరికినట్టు ఆమె రోదిస్తూంది. అతడు తాగుబోతు అయివుండవచ్చు. ఆమెని జీవితాంతం నిర్లక్ష్యం చేసి వుండవచ్చు. అయినా అతడామె భర్త! ఆమె భారత స్త్రీ!
ఫాస్టస్ కళ్ళు చెమర్చాయి. కొన్ని సంఘటనలు జీవితంలో జరక్కపోతే యెంత బావుణ్ను! అతడు శబ్దం కాకుండా తలుపు దగ్గిరగా వేసి వెనుదిరగబోతూ వుండగా, కారిడార్ లో శబ్దం వినిపించింది. ఇన్ స్పెక్టర్ వస్తున్నాడు! ఫాస్టస్ చప్పున తలుపు వేసేసుకున్నాడు.
* * *
ఆ రాత్రి అతడికి నిద్రలేదు. బయట ఏం జరుగుతూ వుందో తెలీదు. సౌండ్ ఫ్రూఫ్ గది అవటం వల్ల బయట జరిగేది వినిపించటం లేదు. పక్కమీద అటూ ఇటూ చాలాసేపు పొర్లాడు. తెల్లవారుఝామున ఎప్పుడో నిద్రపట్టింది. ప్రొద్దున్న ఎనిమిది అవుతూండగా బయట కాలింగ్ బెల్ మోగింది. బద్ధకంగా లేచి వెళ్ళి తలుపు తీశాడు.
బయట ఇన్ స్పెక్టర్ వున్నాడు.
రాత్రి నిద్రలో మర్చిపోయిన దృశ్యాలన్నీ ఒక్కసారి కెరటంలా వచ్చి తగిలాయి. అతడి వెన్నులోంచి చలిపుట్టింది. అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి "రండి" అన్నాడు.
"క్షమించాలి, ప్రొద్దున్నే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు" అన్నాడు ఇన్ స్పెక్టర్ లోపలికివచ్చి కూర్చుంటూ. ఫాస్టస్ మాట్లాడలేదు.
"ఎదుటి గదిలో ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు".
ఆత్మహత్య అనేసరికి ఫాస్టస్ ఉలిక్కిపడ్డాడు. అతడి ఉలికిపాటును వేరే విధంగా అర్థం చేసుకున్న ఇన్ స్పెక్టర్, "మీరేమీ కంగారుపడకండి. కేవలం యెదుటి గదిలో మీరున్నారు కాబట్టి ఫార్మల్ గా మిమ్మల్ని ప్రశ్నించటానికి వచ్చాం. అయిదు నిముషాల్లో పని ముగించుకుని వెళ్ళిపోతాను" అన్నాడు. అతడు వినటం లేదు. ఆత్మహత్య అన్న దగ్గరే అతడి ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి.
"ఒకప్పుడు బాగా డబ్బున్నవాడు అతడు. భార్యతో సహా ఈ హోటల్ లో దిగాడు. కొంత ఆస్తి భార్య పేరున వుంది. అతడికి విపరీతంగా తాగే అలవాటుంది. తన ఆస్తంతా తాగుడికి ఖర్చు పెట్టాడు. అలాగే గానీ తాగుడు కొనసాగిస్తే చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పడంతో అతడి భార్య అతడిని అనుక్షణం కనిపెట్టుకుంటూ కట్టడి చేసింది. డ్రింక్ లేకపోయిన ఇరిటేషన్ తో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న అతడు గానీ మిమ్మల్ని కలిశాడా?"
ఫాస్టస్ ఆలోచించాడు. అబద్ధం చెప్పటం ఎందుకు? తరువాత ఏ వెయిటర్ అన్నా అతడు తన గదిలోకి రావటం చూశానని చెబితే కష్టం. "నిన్న నా గదికి వచ్చాడు" అన్నాడు.
ఇన్ స్పెక్టర్ వ్రాసుకున్నాడు. "దేనికి సర్"
"ఏదైనా డ్రింక్ వుంటే యిమ్మని-"
ఇన్ స్పెక్టర్ మంచి పాయింటు పట్టుకున్నట్టు "నేను చెప్పాను కద్సార్.ఈ మందుకి అలవాటుపడ్డ వాళ్ళకి ఒక నీతి నియమం అంటూ వుండవు. ఫారినర్ అని కూడా చూడకుండా వచ్చి అడుక్కున్నాడన్న మాట" అన్నాడు. ఫాస్టస్ మాట్లాడలేదు.
దాదాపు పావుగంటసేపు ప్రశ్నలు వేసి రిపోర్టు వ్రాసుకుని ఇన్ స్పెక్టర్ వెళ్ళిపోయాడు.
ఫాస్టస్ కి చిన్నపిల్లవాడిలా ఆనందంతో గంతులు వేయాలనిపించింది. ముసలి ప్రొఫెసరు తన జీవితంలో యెన్నడూ అంత టెన్షన్ అనుభవించలేదు. అన్నిటికన్నా ఆనందకరమైన విషయం ఏమిటంటే, అమాయకురాలైన ఆ ఇందులో అనవసరంగా దోషి కాలేదు.
6
ప్రొద్దున్న పదింటికి 'అతడు' వచ్చి తలుపు తట్టే సమయానికి ఫాస్టస్ తయారై వున్నాడు "గుడ్మార్నింగ్" అంటూ లోపలికి వచ్చాడు అతడు.... "రాత్రి బాగా నిద్రపట్టిందా?"
ఫాస్టస్ తలూపి అప్రయత్నంగా నవ్వాడు.
"ఏమిటి ఈరోజు చాలా ఉత్సాహంగా వున్నట్టు కనబడుతున్నారు?"
"ఏం లేదే"
"మా యీ ప్రాంతం మీకు నచ్చినట్టుంది".
"చాలా నచ్చింది. ఇక్కడ ప్రమాదాలు వెంట్రుక వాసి వరకూ వచ్చి తప్పిపోతాయనుకుంటా".
