Previous Page Next Page 
రాక్షసుడు పేజి 16


    "ఈ దేశంలో ఏమీ పనిచెయ్యని వాళ్ళ దగ్గరే ఎక్కువ ఆస్తీ, డబ్బూ వుంటాయి డాక్టర్ ఫాస్టస్" - అందామని, మళ్ళీ ఎందుకో వూరుకున్నాడు. మాటమార్చి "మనం చెబితే ప్రెసిడెంట్ వినవచ్చు. మన ఆశయం మంచిది. కాబట్టి మీరన్నట్టు యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని ఎదుర్కోటానికి దేశంలో పలుచోట్ల ఈ కార్యక్రమం మొదలు పెట్టవచ్చు. అదృష్టవశాత్తు ఆయన ఈ వూళ్ళోనే వున్నారు" అన్నాడు.

 

    "ఆయనకి తప్పకుండా మన ప్రతిపాదన నచ్చుతుంది అని నేననుకంటున్నాను. ఇది రాష్ట్ర సమస్య కాదు. దేశ సమస్య! దేశ ప్రజల సమస్య తీర్చటంపట్ల ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ ఉత్సాహం మరొకరికి ఉంటుందని నేననుకోను".

 

    అంతలో సింహం వచ్చాడు. "సారీ బాస్! ప్రెసిడెంట్ రేసెస్ కోసం వచ్చారట. టైమ్ వుండదు" అన్నాడు.

 

    "రేసెస్ కోసం ప్రెసిడెంట్ రావటం ఏమిటి?"

 

    "అవును. రేసులో గెల్చిన గుర్రానికి మా దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చి స్వయంగా బహుమతి ఇస్తారు. మీ దేశంలో సంగతి నాకు తెలీదు అన్నాడు సింహం వ్యంగ్యంగా.

 

    "గుర్రాలకీ గాడిదలకీ బహుమతులు ఇవ్వటం కన్నా ప్రెసిడెంట్ కి మంచినీటి సమస్య..." అంటూన్న అతడి మాటలు కట్ చేసి, "పోనీ ఆయనకి ఆ తరువాత ప్రోగ్రాం ఏమిటి?" అడిగాడు ఫాస్టస్.

 

    "అయ్యా! ఆ తరువాత ఆయన ఒక సినిమా చూస్తారు" నాటక ఫక్కీలో అన్నాడు సింహం.

 

    ఫాస్టస్ అదిరిపడ్డాడు. "సినిమా? హైదరాబాద్ వచ్చి ప్రెసిడెంట్ సినిమా చూడటం ఏమిటి?"

 

    "అయ్యా! ప్రస్తుతం దేశం దృష్టి మొత్తం ఈ సమస్యమీద కేంద్రీకరింపబడి వుందండీ! ఈ సినిమా విషయంలో ప్రొడ్యూసర్లూ, సెన్సార్ వాళ్ళూ హోరాహోరీ దెబ్బలాడుకుంటున్నారు".

 

    "దేని గురించి..."

 

    "పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్, హీరోయిన్ వేసుకున్న జాకెట్టు గురించి అండీ".

 

    "జాకెట్టు గురించా!"

 

    "చిత్తం! ఆ హీరోయిన్ తన మెడకు మూడు అంగుళాలు క్రిందగా వేసిన జాకెట్టు పట్ల సెన్సార్ వాళ్ళు తీవ్రమయిన అభ్యంతరం చెప్పారు. దాంతో ప్రొడ్యూసర్లు కోర్టుకి వెళ్ళారు".

 

    "కోర్టు ఏం చెప్పింది?"

 

    "హీరోయిన్ బీదది కాబట్టి తక్కువ గుడ్డతో జాకెట్టు వేసుకోవటంలో తప్పు లేదని చెప్పిందండీ హైకోర్టు".

 

    "దాని మీద సెన్సార్ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారా?"

 

    "మరి వెళ్ళక తప్పుతుందా అండీ? వెళ్ళారు".

 

    "సుప్రీంకోర్టు ఏమంది?"

 

    "రెండున్నర అంగుళాలయితే పర్వాలేదు గానీ మరీ మూడు అంగుళాలయితే సాంస్కృతికపరంగా దేశం పతనమయిపోతుందని జడ్జిమెంట్ ఇచ్చిందండీ".

 

    "మైగాడ్. అయినా ఇంత గొడవ ఎందుకు? ఆ కొద్ది సీన్ లు కట్ చేస్తే పోలా?"

 

    "అమ్మమ్మ! ఆ జాకెట్టేనండి సినిమాకు ప్రాణం. అందుకే ప్రొడ్యూసర్లు పార్లమెంటుకి అర్జీ పెట్టుకున్నారు. పార్లమెంట్ ఒక కమిటీని వేసింది. దానికి ప్రెసిడెంటు ఈ సినిమా చూసి తన నిర్ణయాన్ని తెలియచేస్తారు".

 

    "ఇంత చిన్న విషయం కోసం అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటాడా ప్రెసిడెంట్" అతడు కల్పించుకుంటూ అన్నాడు.

 

    "ఇంతకన్నా చిన్న విషయాలకోసం కూడా గతంలో మనం చాలా టైమ్ వేస్టు చేసుకున్నామండీ! తన పేపర్లో తనిష్టం వచ్చినట్టు వ్రాసుకునే పత్రికాధిపతిని అరెస్టుచేసి అసెంబ్లీకి తీసుకురావాలా వద్దా అని ప్రభుత్వమూ, సుప్రీంకోర్టు హోరాహోరీ కొట్టుకుంటూంటే నోట్లో వేలేసుకుని చప్పరిస్తూ ఆ వార్తలే చదివి, ఆ పేపరు బిజినెస్సే పెంచాము తప్ప, ఇంత చిన్న అతి స్వల్పమైన విషయం కోసం ఎన్ని అసెంబ్లీ అవర్స్, ఎన్ని పోలీస్ కమీషనర్ అవర్స్ వేస్ట్ అయినవి అని ఆలోచించలేదండీ. ప్రజల డబ్బు ఎంత వృధా అయిందీ లెక్క కట్టలేదండి. తరువాత అందరం ఈ విషయం మర్చిపోతామనుకోండి. అది వేరే సంగతి-"

 

    "ఊఁ ఇకచాల్లే..." అన్నాడు అతడు. "ఇప్పటికే ఒక విదేశీయుడి దగ్గర మన గురించి చాలాచెప్పాం" అనుకుని... ఫాస్టస్ వైపు తిరిగి, "మనం వెళ్దామా మళ్ళీ సాయంత్రం మనం మీరాల టాంక్ కి వెళ్ళాలి-"

 

    ఫాస్టస్ తలూపాడు. ఆఫీస్ నుంచి అతడిని హోటల్ దగ్గర దింపుతూ "సాయంత్రం వస్తాను" అని అతడు వెళ్ళిపోయాడు. ఫాస్టస్ తన గదితాళం రూమ్ దగ్గరే ఉందని తెలుసుకుని, లిఫ్ట్ ఎక్కి తన అంతస్తుకి వెళ్ళాడు. కారిడార్ లో నడిచి తన గది తలుపు తెరిచి, లోపల కూర్చుని వున్న వ్యక్తిని చూసి, స్థంభించిపోయాడు.

 

    సిగరెట్ కాలుస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు- ఇన్ స్పెక్టర్!

 

                                                            *    *    *

 

    ఫాస్టస్ ని చూడగానే లేచి నిలబడి "గుడ్మార్నింగ్ ప్రొఫెసర్..." అన్నాడు నమ్రతగా. ఫాస్టస్ మొహం పాలిపోయింది.

 

    కాళ్ళలో సత్తువ లేనట్టు కుర్చీలో కూలబడ్డాడు. అంతా అయిపోయిందనుకున్నాక, ఇన్ స్పెక్టర్ మళ్ళీ రావటంతో శరీరంలో శక్తినంతా ఎవరో లాగేసినట్టయింది.

 

    "మా డి.యస్పీ. మహా చాదస్తపు మనిషి ప్రొఫెసర్" అన్నాడు ఇన్ స్పెక్టర్ - "అన్నీ అనుమానాలే... ఆత్మహత్య చేసుకునే మనిషి కణత దగ్గిర తుపాకి పెట్టి కాల్చుకుంటాడు గానీ, గుండె దగ్గిర ఎందుకు పెట్టుకుంటాడు- మళ్ళీ ఎంక్వయిరీ చెయ్యి అన్నాడు. దాంతో ఇంకొకసారి రావల్సి వచ్చింది. సారీ".

 

    "ఫర్వాలేదు" అన్నాడు ఫాస్టస్.

 

    "రాత్రి ఆ భార్యాభర్తలు ఏమైనా ఘర్షణ పడ్డట్లు మీకు వినవచ్చిందా?"

 

    "లేదే. అయినా ఇవి సౌండ్ ప్రూఫ్ గదులు కదా!"

 

    "ఔను కదూ... ఔనౌను... కేవలం రిపోర్టు కోసమే" అంటూ నవ్వాడు... ఫాస్టస్ నవ్వలేదు. ఇంతలో కాఫీ వచ్చింది.

 

    "సారీ ప్రొఫెసర్. మీరు రావడం ఆలస్యం అవుతుందేమోనని స్వతంత్రం తీసుకుని నేనే ఒక కాఫీకి ఆర్డరిచ్చుకున్నాను-"

 

    "ఇట్సాల్ రైట్"

 

    ఇన్ స్పెక్టర్ కాఫీ అందుకుంటూ వెయిటర్ తో, "ఏమయ్యా, ఇంత ఖరీదైన హోటల్లో కూడా ప్రతీది శుభ్రంగా వుంచరా?" అని ఆగాడు. వెయిటర్ భయపడుతూ "ఏమయింది సార్" అన్నాడు.

 

    "ఈ తివాచి చూడు. టమోటా సాస్ పడ్డట్టుంది".

 

    వెయిటర్ నాలుక్కర్చుకుని "వెంటనే శుభ్రం చేయిస్తాను సార్" అన్నాడు వెళ్ళిపోతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS