Previous Page Next Page 
తరిగొండ వెంగమాంబ పేజి 14


    ఊరి పెద్దలకు  స్వాములవారి రాక ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే, ఇంతవరకు ఎవరి మాటను లక్ష్యపెట్టని వెంగమాంబకు స్వామివారి చేత బుద్ధి చెప్పించాలని నిర్ణయించారు. వెంగమాంబ ప్రవర్తన గురించి స్వామివారికి  వ్రాతపూర్వకంగా అర్జీ ఇచ్చారు. మరి  కొందరు వెంగమాంబ వలన  జరుగుతున్న క్రమశిక్షణా రాహిత్యాన్ని స్వామివారికి విన్నవించారు. వెంగమాంబ గురించి చెప్పినవాళ్ళలో మంచికన్నా చెడునే ఎక్కువగా చెబుతుండడాన్ని స్వాములవారు గమనించారు.
    ఇలా చర్చనీయాంశమైన వ్యక్తిగా వున్న ఆ వితంతువును తప్పక చూడాలనుకున్నారు స్వాములవారు. తన మాట మీదున్న గౌరవంతో ఆమెలో మార్పు రావచ్చనుకున్నారు స్వాములవారు. ఊరి జనం కూడా స్వాములవారు చెబితే ఆమె వింటుందని నమ్మడం మొదలెట్టారు. ఒకరోజు వెంగమాంబను పిలుచుకు రమ్మని తన భక్తులను ఆజ్ఞాపించారు స్వాములవారు ఈ దెబ్బతో వెంగమాంబ మదమణుగుతుందని కొంతమంది గ్రామపెద్దలు సణగడం మొదలెట్టారు.
    స్వాములవారి భక్తులు వెంగమాంబ ఇంటికెళ్ళారు. "అమ్మా! తమరిని శ్రీ శంకరాచార్య పరంపరాచార్యులవారు చూడాలని అంటున్నారు - మిమ్మల్ని   వెంటనే పిలుచుకు రమ్మన్నారు" అంటూ వినయంగా చెప్పారు ఆ భక్తులు. వారి వైపు చూసిన వెంగమాంబ, "అన్నం తిన్న తర్వాత వస్తానని చెప్పండి స్వాములవారికి" అంది. ఆ మాటలు విన్నవారు కొయ్యబారిపోయారు. ఎవరూ ఏనాడూ చెప్పని సమాధానం ఆమె నోటివెంట రావడం వారికి ఎంతో ఆశ్చర్యమనిపించింది. "మీరు వెళ్ళండి" అందామె వారితో.
    స్వామి భక్తులు వెంగమాంబ మాటలను చెప్పగానే అక్కడున్నవారంతా ఆశ్చర్యపడ్డారు. కొంతమంది మగపుంగవులు మాత్రం "ఆడదానికి ఇంత అహంకారమా!?" అంటూ మండిపడ్డారు. మళ్ళీ కబురు పెట్టించారు. స్వాముల వారు వెంటనే రమ్మంటున్నారని ఆదుర్దా పెట్టారు. వారి కబురును విన్న వెంగమాంబ మరలా తాపీగా "మీరు వెళ్ళండి. నేనొస్తా" నంది. వారు ఏం చేసేది లేక తిరుగు ముఖం పట్టారు. "చూసారా స్వామి! దాని నిర్లక్ష్యం" అంటూ కొంతమంది స్వామితో అన్నారు.
    అంతలో చేతిలో కొబ్బరికాయతో స్వాములవారిని దర్శించుకునేందుకు వచ్చింది వెంగమాంబ. ఆమె ఆచార్యుల వారి సింహాసనానికి ఎదురుగా వచ్చి  నిలబడింది. ఓ పక్కగా నిలబడమని చెప్పారు అక్కడివారు. ఆ సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామిని ధ్యానిస్తూ నిలబడిన వెంగమాంబకు భగవద్దర్శన ప్రాప్తియై, పరవశంతో అలానే నిలబడింది. అక్కడున్న పండితులంతా ఆమెను స్వామికి నమస్కరించామని ఆజ్ఞాపించారు. వారి మాటను చెవికెక్కించుకోని రోజులు లేవు" అంటూ కొంతమంది మెటికలు విరిచారు. కానీ, వెంగమాంబ స్వాములవారికి నమస్కరించలేదు. అలా ఆమె నమస్కరించకపోవడం, స్వామిని అవమానపరచినట్లేనని కొంతమంది గొణగసాగారు.
    ఈ తతంగాన్ని గమనిస్తున్న శ్రీ శంకరాచార్య పరంపరాచార్యులవారు వెంగమాంబను చూసి, "అమ్మా! నీ వెందుకు నమస్కరించడంలేదో చెప్పు!" అని అడిగారు. వెంటనే వెంగమాంబ, "ముందు మీరు ఆ సింహాసనం పైనుండి లేచిరండి. ఆ తర్వాత నమస్కరిస్తాను" అని చెప్పింది. ఆ మాట విని స్వాముల వారు విస్తుబోయారు. అయినప్పటికీ ఆమె అలాగని, ఎందుకంటున్నదో తెలుసుకుందామనుకుని ఆ సింహాసనంపై నుంచి లేచి ఓ పక్కగా నిలిచారు. అక్కడున్న పెద్దలు స్వాములవారి ఔదార్యానికి ఆనందపడి, వెంగమాంబవైపు 'ఇకనైనా నమస్కరించవా?' అన్నట్లు చూశారు. వెంగమాంబ  మౌనంగా ఆ సింహాసనం వైపు చూసి నమస్కరించింది. మరుక్షణమే ఫెళఫెళారావాలతో పెద్ద ప్రళయం సంభవించినట్లుగా, ఆ సింహాసనం అగ్ని జ్వాలలతో దగ్ధమైపోయింది. భూమ్యాకాశాలు ఏకమైనట్లుగా ఓ పెద్ద ధ్వని. అక్కడున్న వారంతా భయంతో తలొక దిక్కుకు పారిపోయారు.
    స్వాములవారు వెంగమాంబవైపు చూస్తూ, "ఆహా! ఈ తల్లే కదా నన్ను కాపాడింది! లేకపోతే ఆ సింహాసనంతో పాటు తనూ భస్మీపటలం కావలసిందే కదా! ప్రాణరక్షణ చేసిన ఈమె గొప్పదానాన్ని గురించి తెలియని మూర్ఖులు ఈమెపై దుష్ప్రచారం చేస్తున్నారు" అని అనుకున్నారు స్వాములవారు. ఆమె సాక్షాత్తు భగవదంశమేనని భావించి, స్వామివారు ఆమెను స్తుతిస్తూ, ప్రదక్షిణ, నమస్కారాలు చేశారు. " ఓ  తల్లీ! వేంకటేశ్వరస్వామిని నీ హృదయంలో భద్రపరచుకున్న భక్తశిఖామణివి నీవు. ముల్లోకాలల్లో పూజార్హురాలివి. నీ మహాత్మ్యము తెలియని ప్రజలు, నీ గొప్పదనాన్ని గుర్తించలేరు. నీ భక్తి తత్పరతను గుర్తించలేని నా అవివేకాన్ని మన్నించు" అంటూ స్వాములవారు వెంగమాంబను ప్రాధేయపడుతుండగా, అక్కడున్న వాళ్ళంతా ఆమె కాళ్ళపైబడి నమస్కరించారు.
    "స్వాములవారు అక్కడున్న వారందరికీ ప్రవచనం చేసారు. పొగతో కప్పబడిన నిప్పులా, మబ్బుతో కప్పబడిన సూర్యునిలా, ఈ భక్తశిఖామణిని మీరు గుర్తించలేరు. ఆమె మహాజ్ఞాని, యోగి, బ్రహ్మవేత్త, భక్తివైరాగ్య సంపన్నురాలు. ఆమె పవిత్రురాలు. ఎవరూ ఆమెను నిందించవద్దు. ఆమెను నిందించినవారు తాము చేసిన పుణ్యకర్మలను పోగొట్టుకుంటారు." ఆచార్యుల వారి ప్రసంగం విన్న వారంతా తలలు దించుకున్నారు. తమ తప్పులు క్షమింప మణి వెంగమాంబను వేడుకున్నారు.
    స్వాములవారి ఆజ్ఞానుసారం ఆ గ్రామమంతా అలంకరింపబడింది. వెంగమాంబను గౌరవిస్తూ గొప్ప విందును చేసారు స్వాములవారు. అప్పుడు అందరూ  వెంగమాంబను కీర్తించినవారే. అక్కడ వేంకటేశ్వరుని స్తుతించారు. వేంకటేశ్వరుడు భక్తులపాలిట కల్పవృక్షమని, కలియుగ నారాయణుడని స్తుతించారు. స్వామివారు వెంగమాంబను గౌరవించడంతో ఆ ఊరి వారంతా ఆమెను శరణు వేడారు.
    ఆ సమయంలో వెంగమాంబ ఆచార్యుల వారిని  కీర్తిస్తూ ఓ కీర్తిన పాడింది.
    శంకరాచార్య గురుని సన్నుతింపరే
    నిష్కళంక పరమయోగ మభ్యసింపరే
    స్థూల సూక్ష్మ కారణముల మూలమరయరే
    లలితనీల తోయదముల నిలచి మెఱయరే..        ||శంక||
          మూడు రెండు దాటి పైన మేడ చేరరే
          పొడిమిగను ముక్తికాంత దోడుమరయిరే        ||శంక||
    చక్కగా త్రివేణి నడుమ జలకమాడరే
    చొక్కముగను వెలుగుచున్న చుక్కగాంచరే        ||శంక||
         పన్నుగా శ్రీతరిగొండపతిని గాంచరే
         పరమునెన్నుకొనుచు బ్రహ్మ పదము చేరరే        || శంక ||
    అని ఆదితాళం వేస్తూ వెంగమాంబ గొంతెత్తి పాడగానే జనమంతా పరవశించిపోతూ ఆమెకు నమస్కరించారు. వెంగమాంబ మందహాసం చేసి, "స్వామీ! మీ మాట ప్రకారం నేను శిరోజాలు తీసేస్తాను. కానీ, తిరిగి అవి మొలవకుండా చూడగలరా?" అంది. ఆ ప్రశ్నకు స్వామివారు మౌనం వహించారు.
    స్వాములవారు తరిగొండ వదలి వెళ్ళిపోతూ, అక్కడున్న భక్తులకు మరొక్కసారి చెప్పిన మాట అందరి మనసుల్లో నాటుకుంది. "వెంగమాంబ పుణ్యాత్మురాలు. ఆమె వాక్కు పవిత్రం. ఆమె వరపుత్రిక. ఆమెను నమ్ముకుని, ఆరాధించండి" అంటూ స్వాములవారు చెప్పిన మాటలు భక్తుల మనసుల్లో నాటుకుని, వెంగమాంబపై గౌరవాన్ని పెంచాయి.
                                                     *    *    *
    వీథి గుమ్మంలో నిలబడ్డ సీత తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆ సౌందర్యరాశిని అలానే గుడ్లప్పగించి చూస్తుండిపోయింది. వెంగమాంబ దేవాలయానికి వెళుతోంది. ఆమెను చూసిన సీత, "ఈమె నిజంగా భగవత్ స్వరూపమే. ఆ కాంతి, ఆ రూపం.... అచ్చం అలిమేలు మంగమ్మలా ఉంది." అంటూ తలుపు తీసుకుని బయటపడింది. సీత తన కళ్ళని తాను నమ్మలేకపోతుంది.
    "ఇదుగో..... వెంకమ్మా!" సీత వెంగమాంబ వెంటబడింది. గబగబ నడుచుకుంటూ వెళ్తున్న వెంగమాంబ వెనక్కి తిరిగి చూసి, "నువ్వా....సీతా?" అని పలుకరించి, సీతను తనతో పాటు గుడికి తీసుకెళ్ళింది. వెంగమాంబ వెంట గుడికి నడిచి వెళ్తున్న సీత, తన జన్మ ధన్యమైపొయిందనుకుంటూ పరవశించి పోయింది.
    "నీ పిల్లలు...." అని వెంగమాంబ పలగ్గానే సీత సంతోషంతో "ఒక్కసారి నా పిల్లలకు నీ ఆశీస్సులియ్యావా?" అంది వినయంగా.
    "ఇక్కడ్నుంచే ఆశీస్సులివ్వాలా? లేక ఇంటికి రావాలా?" అని అడిగింది వెంగమాంబతో పాటు గుడి మెట్లపై కూర్చుంది. వెంగమాంబ దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతోంది. అలానే చాలా పొద్దుపోవడంతో సీతకు భయమేసింది.
    "పసిగుడ్డలను వదిలేసి ఇంతసేపూ ఇక్కడున్నాను. పాలు....."ఆ ఆలోచన రాగానే సీత పాలిండ్లు పొంగాయి. వెంగమాంబకు నమస్కరించి గబగబా బయలుదేరింది. అప్పుడు వెంగమాంబ, ఇదిగో సీతా! ఒకడి పేరు శ్రీనివాస్, ఇంకొకడి పేరు వెంకటేశ్. నువ్వు శ్రీనూ, వెంకూ అని పిలుచుకో. పేర్లలో ఏముంది? ఇద్దరూ ఒక్కటే. ఈ పేర్లన్నీ మనకోసమే. వెళ్ళు. పిల్లలకు పాలివ్వు. వెళ్ళు" అనడంతో, సీత పరుగు పరుగున ఇంటికి చేరింది.                                               


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS