అయ్యగారికి దణ్ణం పెట్టు
రాజారావు ఈరోజు చాలా తీరిగ్గా వున్నాడు. ఈ మధ్యకాలంలో ఇంత శ్రద్ధగా పేపరు చదవలేదెప్పుడూ. మొదటి పేజీనుంచి చివరి పేజీ దాకా చదవటం అయిపోయింది .... ఇంకేం చేయాలీ! - పేపరు పక్కన పడేసి పైప్ నోట్లో పెట్టుకున్నాడు - బెడ్ రూములో వున్న అద్దం శుభ్రంగా నిగనిగలాడుతోంది - నిజంగానే తను అందంగా, ఠీవిగా వుంటాడు. రాజారావు అద్దంలోకి మరోసారి చూసుకున్నాడు. దట్టమైన మీసాలు సరిచేసుకున్నాడు. ఒత్తుగావున్న రింగురింగుల జుట్టు ముఖంపై పడకపోయినా అలవాటుగా వెనక్కి తోసుకున్నాడు. చిత్రం ఏమిటో కాని, గొప్ప జాతకుడు తను అని అందరూ అనుకోటం మాత్రం ఎక్కువైంది - అయినా తను ఎంత కష్టపడితే ఇంతవాడయ్యాడో ఎందరికి తెలుసు?!
ఇతరుల దయాధర్మాలపైన ఆధారపడి రోజూ ఒక రింట్లో తిండి తిన్నాడు కొన్నేళ్ళు. ఒకరు కొనిపెట్టిన పుస్తకాలు చదువుకున్నాడు. మరొకరు కట్టిన పరీక్షఫీజుతో పరీక్ష రాశాడు- ఆ రోజులు ఇప్పుడు తల్చుకోడు తను. తల్చుకుంటే భయం!! - నిజానికి తనకెన్ని భయాలుంటే ఒకప్పుడు - పెళ్ళిచేసుకోవాలంటే, పెళ్లాం పిల్లల్ని పోషించలేననే భయం, ఆరోగ్యం ఎందుకయినా పాడయితే డబ్బు ఖర్చుచేసి వైద్యం చేయించుకోలేనుకదా అని భయం, చుట్టాలు తనని హేళన చేస్తున్నారనే భయం, తన పాతబడ్డ చెప్పులు, వెలిసిపోయిన చొక్కాలు చూసి అమ్మాయిలు నవ్వుతున్నారనే భయం....అబ్బో! ఎన్నెన్ని భయాలను తట్టుకుని తను నిలబడ్డాడూ?!__
రాజారావు అలా అద్దంలో చూసుకుంటుండగానే - భయం, బాబోయ్-నల్లని జుట్టులో ఎక్కడో రెండు తెల్లవెంట్రుకలు మెరిసాయి - ఠక్కున పీకిపారేశాడు. రాజారావుకి ఒక్కసారి నవ్వొచ్చింది. ఫోను మోగింది - 'హలో, ఆ - మరిచిపోలేదు. సాయంత్రం పంపించేస్తాను' - రిసీవర్ పెట్టేశాడు....ఓ సాంస్కృతిక సంస్థకి పదివేలు విరాళం ఇస్తానన్నాడు తను - అదీ ఆ ఫోను!! - రాజారావు ఎన్నో సంస్థలలో జీవిత సభ్యుడు.... కొన్నిటికి పోషకుడు- ఎందరికో, ఎన్నో సందర్భాలలో డబ్బు సాయం ఏదో విధంగా చేస్తూనే వుంటాడు - తనని చూసుకుని తనే గర్వపడే సంఘటనలు ఎన్నో తన జీవితంలో - అన్నిటికీ మూలం డబ్బేనా?! ఆ, ఖచ్చితంగా - రాజారావు నోట్లో వున్న పైప్ పక్కన పెట్టాడు.
"ఊ, రా - ఏమిటి సంగతి" ఎదురుగా వున్న నవీన్ వైపు చూస్తూ అన్నాడు.
"డాడీ - " - అలా తండ్రి గదిలోకి వచ్చి, తండ్రితో ఏదైనా చెప్పటం, తండ్రిని అడగటం చాలా తక్కువసార్లు చేస్తాడు ఆ అబ్బాయి.
"కారులో పెట్రోలుకి డబ్బు-" నసిగాడు నూనుగు మీసాల నవీన్, రాజారావు ఏకైక కుమారుడు.
"అమ్మనడిగి తీసుకో-"
"అమ్మ నిద్రపోతోంది-"
"లేస్తుందిగా, వెయిట్ చెయ్యి-"
నవీన్ వెంటనే వెళ్ళిపోయాడు గదిలోనించి.
నల్లటిమీసాలు, గుండ్రటి బుగ్గలు, ముద్దుగా, బొద్దుగా వున్నాడు అబ్బాయి. రాజారావు ఆ అబ్బాయి వెళ్ళినవైపే చూస్తున్నాడు - కారు, పెట్రోలు - పాకెట్ మనీ, - ఐదువందలు ఖరీదుచేసే చొక్కా, వెయ్యి రూపాయిల పాంటు - ఇంకా - ఏమేమిటో, - "ఈ బెల్టు" ఎంతరా నవీన్? ఓ రోజు అడిగాడు, 'మూడువందల యాభై' అన్నాడు అబ్బాయి. అది గుర్తొచ్చింది రాజారావుకి ఇప్పుడు - మూడువందల యాభై రూపాయలతో తను ఎన్నెన్ని నెలలు గడిపాడు!! మూడువందల యాభై రూపాయలతో తను కొత్త సంసారం పెట్టుకున్నాడు కాదూ - మూడువందల యాభై రూపాయల బెల్టు తన కొడుకు కొనుక్కున్నాడు ఈ రోజు - రాజారావుకి ఒక్కసారి అప్రయత్నంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి - ఇప్పుడు తన జాతకం తిరిగిందని, తను గొప్పవాడనీ సంఘం అంటోంది - నిజమే!! తన సంపాదనపై ఎంతమంది ఆధారపడ్డారో తెల్సుకుంటే ఆనందమే కాదు, గర్వంగా లేదూ?!
"మీ చేత్తో బోణీ చేయండి సార్" అంటాడు దణ్ణం పెట్టి పాన్ దుకాణం తెరుస్తున్న వెంకటయ్య. దణ్ణం పెట్టడం ఆలస్యం, తను జేబులోంచి డబ్బు తీసిస్తాడు.
"మీ పేరే మొదట రాస్తాం సార్, మీరేక్కువ చందా యివ్వాలి" - దణ్ణం పెట్టి, పుస్తకం ముందు పెడతాడు దసరా నవరాత్రులు జరిపే లీడరు రాజయ్య. వెంటనే తను చెక్కు రాసి యిచ్చేస్తాడు.
ఇంతెందుకు, నాలుగురోజులనాడు "నాన్నగారి కాళ్ళకి దణ్ణం పెట్టు" అంది ఇందిర నవీన్ పుట్టినరోజునాడు. వంగి దణ్ణం పెట్టడం ఇష్టంలేదు అబ్బాయికి. పాంటు నలిగిపోతుంది మరి!
రెండు రోజులనాడు, బోనాల పండుగనాడు, "అయ్యా కాలికి మొక్కు" నాలుగేళ్ళ పిల్లని పాదాలపై పడేసింది బాలమ్మ, పనిమనిషి.
ఈ దణ్ణాలతో ఇంత అనందం వుందా?! వుండేవుంటుంది - లేకపోతే - రాజారావు మెదడులో ఉన్నట్టుండి ఒక మెరుపు మెరిసినట్టయింది - పెదాలపై చిన్న నవ్వు విసిరింది - అవును, ఎందరో నాకు దణ్ణం పెట్టాలి - ఎందుకు పెట్టరూ - పెడతారు - అలాటి వాళ్ళుండబట్టే ఇలాటి తను గొప్పవాడయిపోయాడు - రాజారావు గుండెల్లో గర్వం ఒక్క నిమిషంలో నిండిపోయింది - సంపాదిస్తున్నాడు తను!! విపరీతంగా, అతిగా, పిచ్చిగా - అవును, తనకి ఎందుకు దణ్ణం పెట్టరూ!! - రాజారావు పడగ్గదిలోంచి బయటకొచ్చాడు - అప్పుడే ఆ గదిలోకొస్తోంది ఇందిర. "ఇందూ"....ఎంతో ఆప్యాయంగా అన్నాడు.
"ఉండండి - అసలే టైము అయిపోయింది" - ఇందిర లిప్ స్టిక్ టచ్ చేసుకుంటోంది.
"ఈరోజు ఎక్కడికీ వెళ్ళద్దు ఇందూ - హాయిగా ఇంట్లో కబుర్లు చెప్పుకుందాం" - రాజారావు ఇందిర చీరకొంగు చేత్తో పట్టుకున్నాడు.
"వేంకటగిరి చీర - ఊరికే నలిగిపోతుంది - ప్లీజ్ - మీరు కూడ రండి, ఫిలిమ్ ఫెస్టివల్ కి" ఇందిర సిగపిన్నులు సరిచేసుకుంటూ అంది.
"ఈరోజు మానేయ్"-
ఇందిర రాజారావు కౌగిలి వదిలించుకుంది. కదలిపోతున్న కారు కేసి చూస్తూ, బాల్కనీలో నిలబడ్డాడు రాజారావు.
ఇందిర - పదోక్లాసు పాసుకాలేదు - కేవలం అందంగా వుందని తను అడిగి మరీ పెళ్ళి చేసుకున్నాడు. ఇందిర తండ్రి బట్టలకొట్లో పద్దు రాసేవాడు. రెండు గదుల ఇంట్లో కాపురాముండేవాడు - ఆ ఇందిరేనా ఈ ఇందిర! - కారులేకపోతే కూరలు కొనటానికి వెళ్ళదు - ఏరోజూ ఐదారువందలు తక్కువ కాని చీర తప్ప మరోటి కట్టదు - కాలం ఎంత చిత్రమైందో! - రాజారావు ఇరవైయ్యేళ్ళనాటి గతంలోకి పూర్తిగా వెళ్ళి పోయాడు - ఆ బాల్కనీలో అలానే నిలబడ్డాడు - ఎంతోసేపు - ఎంతసేపో! గడియారం పదకొండు గంటలు కొట్టింది - ఎండగానే వుంది బయట.
సందుచివర పిల్లలందరూ మూగి ఏదో అల్లరి చేస్తున్నారు - కోతి పిల్లని ఆడిస్తున్నారు - పిల్లలు కోతిపిల్లచుట్టు మూగారు. "అయ్యాగారికి దణ్ణంపెట్టు" అరుస్తున్నాడు కోతి యజమాని. దణ్ణాలు పెడుతోంది. పైసలు వాడు ఏరుకుంటున్నాడు - పల్లీలు, బిస్కట్లు, జామకాయలు కోతిపిల్లపైకి విసురుతున్నారు పిల్లలు. కోతి గబగబా ఏరుకుతింటోంది.
రాజారావు చూస్తున్నాడు.... 'అయ్యాగారికి దణ్ణం పెట్టు' పైకి చూసి అన్నాడు కోతి యజమాని.
'పైకి తీసుకురా' -
ఆమాట అనటమే ఆలస్యంగా మెట్లమీద నుంచి పైకి వచ్చాడు కోతి యజమాని వీరాసామి.
"కిందయితే బాగా ఆడుతుందయ్యా" అన్నాడు. 'ఫరవాలేదులే - ఇక్కడే ఆడించు' - రాజారావు కోతి పిల్లవంకే చూస్తున్నాడు.
అయ్యగారికి మళ్ళీ మళ్ళీ దణ్ణం పెట్టింది కోతిపిల్ల. కర్ర భుజాన వేసుకుని గొడ్లుకాసింది. మొగ్గలేసింది. వీరాసామి భుజమెక్కి కూచుని తలలో పేలు తీసింది. రాజారావుకి చాలా నవ్వొచ్చింది- ఎన్ని ఆటలు నేర్చిందో.
వీరాసామి వంక చూసాడు రాజారావు - మాసిపోయిన గడ్డం, లోతుకుపోయిన కళ్ళు, మాసిపోయిన చొక్కా....
వీడు దీన్ని పోషిస్తున్నాడా?!
దాని సంపాదనంతా అది తింటుందా? దాని కడుపునిండాక, అంతా వీడిదేగా - దాని సంపాదన వెనక స్వార్థం, అహం, గర్వం ఇవేమైనా వున్నాయా!! - రాజారావు జేబులోంచి డబ్బు తీసి వీరాసామి చేతిలో పెట్టాడు. అయ్యాగారికి దణ్ణం పెట్టాడు.
ఎండ చాలా తీక్షణంగా వుంది. రాజారావు అన్నాడు:
"ఈరోజు ఇంక ఎక్కడా తిరగకు - చాలా ఎండగా వుంది - ఆ మెట్లగదిలో పడుకో - ఇది వుంచుకో" - వీరాసామి నోటు చూసి విస్తుపోతూ, మెట్లగదిలోకి కోతిపిల్లతో వెళ్ళిపోయాడు.
తన డబ్బుకోసం తనని ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు ఎందరో వున్నారు....ఈ వృద్ధుడు వీరాసామి ఈ కోతిపిల్లనాడిస్తూ ఎంత కాలం పొట్ట పోషించుకుంటాడు? తనే వాడికి, వాడి కోతిపిల్లకి కూడా తిండిపెట్టగలడు, వసతి యియ్యగలడు, ఒక ప్రాణి తన డబ్బువలన నిజంగా సంతోషపడితే తనకు ఎంత తృప్తి!! - రాజారావు మనసులో నిశ్చయించుకున్నాడు.
ఈ వీరాసామిని ఇక్కడే వుండమంటాను .... అంతేకాదు, ఊరికే అన్నం పెడతాను, బట్టలిస్తాను, కావాలంటే ఆ చిన్న గదిలో ఫాను బిగిస్తాను....చల్లని మంచి నీళ్ళకి ఏర్పాటు చేస్తాను. అన్నీ ఊరికేనే! మంచి భోజనం, మంచి వసతి .... ఇంకేం కావాలి ఎవరికైనా .... అయినా ఎవరిస్తారు వాడికి గది ఊరికే, తను కనక ఇస్తానంటున్నాడు....అయితే ఒక్క షరతు పెడతాను .... ఆ కోతిపిల్లని తన కోసమే ఆడించాలి. ఎక్కడా తిప్పకూడదు. ఎవరింటికీ తీసికెళ్ళకూడదు .... నా డబ్బు .... నా కోతి.... వీరాసామి ఒప్పుకుంటాడు.... ఎవడికోసం ఒప్పుకుంటాడు డబ్బు! డబ్బు!! రాజారావు భోజనం చేయటానికి కిందికి దిగాడు.
వీరాసామి కోతిపిల్లని గుండెపై పడుకోబెట్టుకుని హాయిగా నిద్రపోయాడు ఓ అరగంట. ఠక్కున మెలకువ వచ్చింది.... ఇలా నిద్రపోతే ఎలా?! నాలుగు డబ్బులు సంపాదించుకుని సాయంత్రానికి ఇల్లు చేరితే కదా.... నాకు, నా ముసల్దానికి, ఈ నా చిన్న భీమునికి గంజినీళ్ళు.... అయినా ఈ గొప్పోళ్ళ ఇళ్ళు నాకొద్దు....ఎండ అయితేనేం....ఎండ నన్నేం చేస్తుందీ.... రేపట్నుంచీ ఈ యజమాని నన్ను ఇక్కడే వుండమంటే.... అమ్మ బాబోయ్! నాకది.... దానికి నేను.... చాలు, భగవంతుడి దయ చాలు.... వీరాసామి అలా అనుకుంటూ లేచేసరికి, పళ్ళికిలిస్తూ సంచీలోంచి జామపండు తీస్తోంది కోతిపిల్ల. వీరాసామి సంచీ భుజాన వేసుకున్నాడు. కోతిపిల్ల చేయిపట్టుకు, రోడ్డుమీద ఎండలో నడక సాగించాడు. ఏభై రూపాయలనోటు గూట్లోనే పెట్టాడు వీరాసామి!
రాజారావు నిశ్చయించుకున్నాడు, వీరాసామిని, కోతిని తన మెట్ల గదిలో వుంచేయాలని. కోతికి ఎర్రటి సాటిన్ బట్టతో చొక్కా కుట్టించాలని. రెండు చొక్కాలు, పంచలు వెంటనే వీరాసామికి కొనాలని. అయితే ఒక్క విషయం మొహమాటం లేకుండా చెప్పేయ్యాలని....అదే, కోతిపిల్ల ఎక్కడికీ వెళ్ళకూడదు, ఎక్కడా దాన్ని ఆడించకూడదు.... తను అడిగినప్పుడు ఆడించాలి. ఈ మాట వీరాసామికి ఇప్పుడే చెప్పేస్తా! రాజారావు అనుకుంటూ మెట్లగదిలో కొచ్చాడు. ఖాళీగావున్న మెట్లగదిని చూసి క్షణం విస్తుపోయాడు. "నువ్వు ఏదో ఆశించి యిచ్చే ఏ ఒక్కరూపాయికి ప్రతిఫలం వుంటుందని ఎప్పుడూ అనుకోకు.... ఆశించకుండా ఇస్తేనే ఆనందం వుంటుంది".... ఎప్పటి మాటలో ఇవి- ఆనాడు, వారాల అబ్బాయిగా భోజనం చేస్తుంటే, రామం మేష్టారన్న మాటలు గుండెల్లో ప్రతిధ్వనించాయి రాజారావుకి. గూట్లోంచి ఏభైరూపాయల నోటు గాలికి కొట్టుకొచ్చి రాజారావు పాదాల ముందు పడింది.
"అయ్యాగారికి దణ్ణం పెట్టు".... సందు చివర వీరాసామి గొంతు మారుమ్రోగుతుంటే, గబగబా మెట్లెక్కి బాల్కనీలో నిలబడి వీధి వంక చూస్తున్నాడు రాజారావు.*
