Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 14


    "నేనొక ప్లాన్ వేసాను దీనికి. చాలా రిస్కుతో కూడిన పని అనుకో!!! కానీ ఈ పరిస్థితుల్లో అది తప్ప మరో మార్గం లేదు".

    "ఏమిటి దాదా అది?"

    వసంత్ దాదా చెప్పటం ప్రారంభించాడు. దాదాపు పదిహేను నిమిషాలు పట్టింది అతడి ప్లాన్ వివరించటానికి. సలీంశంకర్ చుట్ట చివరి వరకూ కాలిపోవటాన్ని కూడా గమనించలేదు.

    "నీ బదులు ఇంకో వ్యక్తి సలీం శంకర్ పేరు మీద జపాన్ వెళతాడు..... అతడిని మనం కొనుక్కొంటున్నాం..... అతడు అక్కడ ఉరితీయబడతాడు...... సలీం శంకర్ చరిత్ర అక్కడితో సమాప్తమవుతుంది. మొహంలో కాస్త మార్పుతో, కొత్త  పేరుతో నువ్వు తిరిగి నీ కార్యకలాపాలు మొదలు పెట్టుకోవచ్చు".

    ఇదీ ప్లాన్. సలీంశంకర్ లాటి వాడుకూడా ఈ ప్లాన్ విని నిశ్చేష్టుడయ్యేడు. అసలు ఇది సాధ్యమయ్యే ప్లానేనా అన్న అపనమ్మకం అతడి కళ్ళలో తొణికిస లాడుతూవుంది.

    "ఇంకో మార్గంలేదు శంకర్! నేను చాలా ఆలోచించాను..... కొద్ది రోజుల ముందుగానైనాసరే- ఈ విషయం తెలియటం మన అదృష్టం. కోర్టు బయటే జపాన్  పోలీసు అధికారి వుంటాడు. కోర్టులో నిన్ను విడుదల చేయగానే- ఆ నేరం క్రింద నువ్వు  అరెస్ట్  చేయబడతావు. ఆరోజే నిన్ను జపాను తీసుకు వెళ్ళటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన న్యాయ శాస్త్రం కంటే వాళ్ళది బాగా కఠినమైనది పైగా అయిపోతుంది. అప్పీళ్ళూ, క్షమాభిక్షలూ వుండవు. మరణానికి నువ్వు ఎంత దగ్గిరగా వున్నావో నీకు తెలియటంలేదు."

    సలీంశంకర్ కి తెలుసు.

    భారతదేశంలో నిర్వహించినంత సులభంగా ఇతర దేశాల్లో చేయటం కష్టం. ఏ క్షణమైతే జపాను వెళ్ళే విమానం ఎక్కించబడతాడో ఆ క్షణం నుంచీ ప్రాణం పోయినట్టు లెక్కే. వసంత్ దాదా అన్నట్టు ఇంకో మార్గం లేదు.

    "నా బదులు వెళ్ళేదెవరు?"

    "విష్ణుశర్మ అని...... ఒక నిరుద్యోగి. మీ హైద్రాబాద్ వాడే. అయిదులక్షలకి ఆశపడి ఒప్పుకున్నాడు. ఇక్కడే వున్నాడు. చూస్తావా! నీలాగే వుంటాడు ఎత్తూ పొడవూ".

    "కానీ ఎప్పుడో ఒకప్పుడు నేను బ్రతికి వున్నట్టు తెలిసిపోతుంది. దాచటం కష్టం".

    "తెలియనీ! తెలిసినా జపాన్ ప్రభుత్వం ఏమీ  చేయలేదు. నీ బదులు ఒక అమాయకుడి మరణానికి కారణభూతమయింది అని బయట ప్రపంచానికి తెలియటం ఆ దేశ ప్రతిష్టకి సంబంధించిన విషయం. కాబట్టి  దాన్ని గురించి అంత  శ్రద్ధ తీసుకోదు...... అదీ గాక, ఈ విషయం అంత దూరం తెలిసే వీలులేదు".

    "అక్కడ కాదు, మన దేశంలో....."

    "మన దేశానికి సంబంధించినంత వరకూ నీమీద  కేసులేమీ లేవు. అదీగాక ఇది మన  దేశానికి సంబంధించిన ప్రతిష్ట కూడా".

    చాలా సేపు శంకర్ మౌనంగా వుండి, చివరికి అన్నాడు. "ఈ విషయంలో ఇంతకన్నా ఏమీ చేయలేమని నాకూ అనిపిస్తూంది దాదా! మరోసారి నన్ను రక్షించాక నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోను?"

    "మరోసారి ఇలాటి ప్రమాదాల్లో ఇరుక్కొక పోవటం ద్వారా".

    శంకర్ నవ్వి వూరుకున్నాడు. అది అసాధ్యమని ఇద్దరికీ తెలుసు. ఒక స్టేజిదాటాక ప్రమాదాలు ఇచ్చిన ఆనందం మామూలు జీవితం ఇవ్వదు. సలీంశంకర్ కి బదులు  మరొక మనిషి ఈ దేశం నుంచి వెళ్ళాడూ అని తెలిసాక ఈ పోలీసు  అధికారుల మొహాలు ఎలా వుంటాయా అని ఆలోచించుకుంటే వాళ్ళిద్దరికీ నవ్వొస్తుంది. దాదాకి ఇలాటివి మరీ ఇష్టం. అప్పుడప్పుడు ఇలాటివి చేస్తూ వుంటాడు కూడా. ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులు ఒక రోజు తన ఇంట్లో "విందు" ఆరగిస్తూ చేసిన సంభాషణని ఇలాగే రికార్డుచేసి ఆ క్యాసెట్లు వివిధ పత్రికా విలేకరులకి పంపి, ఆ తరువాత జరిగిన పరిణామాల్ని చూసి గుంభనగా తనలో తనే ఆనందించే సాడిస్టు.....వసంత్ దాదా!

    శంకర్ లేచి, "వెళ్ళొస్తాను దాదా! హైద్రాబాద్ వెళ్ళాక ఫోన్ చేస్తాను. ఈ ప్లాను సవ్యంగా జరుగుతుందనే భావిస్తాను" అన్నాడు.

    "చివరి నిముషంలో ఆ విష్ణుశర్మ భయపడకపోతే"-

     "అవును, అదొకటుందిగదూ. వాడెలా దొరికాడు మనకి?"

    "పాతికేళ్ళుంటాయి వాడికి. అయిదు సంవత్సరాల క్రితం ఎదురింటి అమ్మాయిని ప్రేమించి లేవదీసుకొచ్చి పెళ్ళి చేసుకున్నాడు. ఉద్యోగం దొరకలేదు. ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రేమ తుప్పు వదిలిపోయింది. అది పిల్లల్ని వదిలేసి ఎవడితోనో లేచిపోయింది. ఇతగాడికి మాత్రం పిల్లలంటే అమితమైన ప్రేమ ఆ సెంటిమెంటు మీద వరకుచేసాను. వాళ్ళ పేరుమీద అప్పుడే డబ్బు జమ వేసేసాను".

    విష్ణుశర్మ చనిపోయాక ఏమవుతుందో ఇద్దరికీ తెలుసు. దాని గురించి తర్కించుకోలేదు.

    "వెళ్ళొస్తాను".

    "ఏమంటోంది నీ అనూష?"

    సలీం వెళ్ళబోయేవాడల్లా అగాడు. దాదా నవ్వేడు.

    "పోలీస్ స్టేషన్ వరకూ తీసుకెళ్ళాక ప్లాన్ పాడయిందటగా".

    సలీం విస్మయంగా, "నీకు తెలియనివిషయమంటూ లేదా" అని అడిగాడు తీసుకువెళ్తున్నావని చూసిన వాళ్ళు ఎవరో చెప్పారు. ఆ అమ్మాయే అనుకున్నాను" అన్నాడు. ఆ అమ్మాయి కట్టుకున్న చీరె రంగుతో సహా వివరాలు దాదా దగ్గరున్నాయని సలీంశంకర్ కి తెలుసు.

    "జానీ అని ఎవడో ఆఖరి నిమిషంలో వచ్చి ప్లాన్ పాడుచేసాడు".

    "ఆ అమ్మాయి చాలా తెలివైందటగా-"

    "ఏమో! నేను అంత లోతుగా ఎంక్వయిరీ చేయలేదు. ఇన్ స్పెక్టర్ అనగానె వచ్చి జీపు ఎక్కింది".

    "తెలివైన వాళ్ళని మానసికంగా రేప్ చేస్తేనే బావుంటుంది సలీం! మామూలు శరీరాలు నీకెక్కడైనా దొరుకుతాయి-"

    "నాకూ అలాటి కోర్కె వుంది గానీ ఎలా చెయ్యను?"
   
    "అంత చిన్న అమ్మాయి అంత పెద్ద స్థానంలో వుందంటే ఆమెకి ఆ ఆఫీసులోనే చాలామంది శత్రువులుండి వుంటారు. ఎవరన్నా వున్నారేమో కనుక్కో మిగతాది ఆలోచిద్దాం....."

    వసంత్ దాదా స్వయంగా రంగంలోకి దిగటం శంకర్ కి సంతోషమేసింది. అతడి కళ్ళముందు- జీప్ లో తన పక్క నిర్లక్ష్యంగా కూర్చున్న అమ్మాయి మొహం కదలాడింది. 'అరెస్ట్' అన్నా కూడా ఆ నిర్లక్ష్యం..... అటువంటి అమ్మాయిని వసంత్ దాదా ఆడించటం..... ఆ తరువాత తను.......


                                                     *    *    *

    తన ముందున్న ఫైలు ఒకసారి చూసి, సంతకం చేసి పంపేసింది. స్టాక్  హొం తాలూకు ముఖ్యమైన ఫైలు అది. ఏయే షేర్లు ఎంతలో కొనాలి - ఎంతలో అమ్మాలి అన్నా ఫైలు.

    దేశపు పెద్ద పెద్ద స్టాక్ బ్రోకర్లందరూ స్టాక్ హొంతో బ్యాక్-టు-బ్యాక్ కవర్ పెట్టుకుంటారు. ఈ ఒప్పందాలన్నీ లక్షలమీద వుంటాయి.

    ఆమె ఫైలు పంపిన అయిదు నిముషాలకి కుర్రాడు వచ్చి "మీకోసం ఎవరోవచ్చారు మాడమ్" అన్నాడు.

    "లోపలికి పంపించు"

    కుర్రాడు వెళ్ళిపోయాడు.

    "రావచ్చా" అని తియ్యటి కంఠం వినపడి తలెత్తి చూసింది. ఉత్పల చిరునవ్వు మొహంతో, చేతిలో చిన్న పాకెట్ తో గుమ్మం దగ్గిర నిలబడి వుంది. 'ఎప్పుడూ నిష్కల్మషంగా అమాయకమైన చిరునవ్వుతో వుండటం ఈ అమ్మాయికి దేవుడిచ్చిన వరం' అనుకుంది అనూష మనసులో.

    "రా......రా" అంది లేస్తూ.

    ఉత్పల వచ్చి కూర్చుంటూ "నాకు ఉద్యోగం వచ్చింది" అమె మొహం స్వర్గాన్ని గెలిచినట్టు వెలిగిపోతూవుంది.

    "స్వీట్లు తెచ్చావన్నమాట".

    "మీకు థాంక్స్ చెపుదామని వచ్చాను"

    అనూష స్వీట్ తీసుకుంటూ "ఎంతొస్తుంది జీతం" అని అడిగింది.

    "మీ జీతంలో చివరి సున్నా  కొట్టేస్తే వచ్చేటంత...."

    అనూష నవ్వుతూ "నేను ఉద్యోగంతో చేరినప్పుడు అంతకన్నా తక్కువకి చేరాను" అంది.

    "నేను మరో పదిజన్మలెత్తినా ఈ స్థాయికి రాలేను".

    "ఏం ఎందుకలా అనుకోవటం-" అని. "సర్లే దానికేంగానే ఇంకేమైనా చెప్పు, ఏమిటి విశేషాలు?"

    ఇద్దరూ అయిదు నిముషాలు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక ఉత్పల లేచి "నేను వెళ్ళొస్తాను" అంది.

    "నేనూ అటే, నిన్ను దింపుతాను-" అంటూ అనూష లేచింది.

    కార్లో ఉత్పల మౌనంగా వుండటం చూసి, "ఏమిటి ఆలోచిస్తున్నావ్?"

    "ఏ ....ఏమీ లేదు".

    "కాదు, ఏదో వుంది".

    ఉత్పల కాసింత సిగ్గుతో "రాత్రొక కళ వచ్చింది" అంది.

    అనూష చటుక్కున తలతిప్పి విస్మయంగా, "కలా? ఏమిటది" అని అడిగింది.

    ఉత్పల తటపటాయించి, నేను క్రింద వాటిని ఏరుకుంటూ పరుగెడుతున్నానట" అంది.

    అనూష మాట్లాడలేదు. ఆమె మాట్లాడకపోవడంతో, తనే ఇంకా చెప్పవలసి వున్నట్లు - "మిమ్మల్ని చూసినప్పటి నుంచీ నేనేమనుకుంటూ వున్నానో తెలుసా...... ఎలా చెప్పను? ఊ..... ఎలా చెప్పనబ్బా..... ఆ ...... నేనెలా వుండాలనుకుంటూ వుంటానో అచ్చం మీరలా వున్నారు" అంది గబగబా.

    "నేనూ అదే అనుకున్నాను" అనుకుంది అనూష మనసులో. టాపిక్ మార్చటానికి అన్నట్టు "ఏమంటున్నాడు నీ బోయ్ ఫ్రెండ్ " అని అడిగింది.

    ఉత్పల సిగ్గుపడలేదు. ఎందుకో అదోలాటి గిల్టీ కాన్షస్ తొ "ఏమీ లేదు" అంది.

    "మీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పావు కదూ".

    "అబ్బెబ్బె! ఇంకా అంతవరకూ అనుకోలేదు".

    "డిడ్ యు హావ్ సెక్స్ విత్ హిమ్"

    అడగ్గానే తను నోరు జారానని గ్రహించింది అనూష. అప్పటికే ఉత్పల మొహం జేవురించింది. కళ్ళలో నీళ్ళు నిండుకున్నాయి.

    ఆమె చేతిమీద చెయ్యివేసి "ఐ యామ్ సారీ" అంది. "ఎంతో చనువుతీసుకుని అడిగాను. ఇంగ్లీషు వాతావరణ ప్రభావం".

    ఉత్పల ఈలోపులో సర్దుకుంది. స్వభావం సిద్ధమైన చిరునవ్వు మొహం మీదకి తిరిగి రాగా, "ఫర్వాలేదు అటువంటిదేమీ లేదు" అంది.

    "ఎక్కడ ఆపను?"
   
    "పార్కు దగ్గిర"

    "అతని కోసమా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS