పుస్తకాల అలమార వైపు నడుస్తూ ప్రశ్నించాడు.
చెప్పాడు మోహన్.
"ఎక్కడుంటున్నారు?" మరో ప్రశ్న, పుస్తకాలు వెతుకుతూ.
వివరించాడు మోహన్. గతుక్కుమన్నాడతను.
"సూర్యనారాయణమూర్తిగారింట్లోనా?"
"అవును!"
"అయితే ఈ పుస్తకం?" అనుమానంగా అడిగాడు.
అసలే విసుగ్గా వున్నాడేమో "వాళ్ళ అమ్మాయికి" కొట్టినట్టు సమాధానం చెప్పాడు మోహన్.
చేస్తున్న ప్రయత్నం విరమించుకుని బయటికి వచ్చేసాడు.
"వెళ్ళి రెండు కూల్ డ్రింకులు పట్రారా!" అని కుర్రాడికి ఆర్డర్ వేసి మోహన్ దగ్గరే కూర్చున్నాడు.
"భారతిగారి కోసం అని ముందే చెప్తే మీకూ నాకూ శ్రమ తెప్పేదిగా! అన్నాడు ఆదరంగా.
అయోమయంగా చూశాడు మోహన్.
సిగరెట్ వెలిగించి చిన్నగా నవ్వాడతను.
"చూడండి సార్! అసలు మిగిలిన అన్ని భాషల కంటే మన తెలుగు భాషలో వారపత్రికలు, నవలలు ఎంతో ఎక్కువ మన తెలుగు వాళ్ళలో ప్రతి పదిమందికీ నలుగురు రచయితలు ఉన్నారట.
మన రచయిత, రచయిత్రులు నిర్విరామంగా అహర్నిశలు బుర్రలు వేడెక్కిపోయేలా ఆలోచించి నడుం పీకేలా కూర్చుని చేతులు నెప్పెట్టేలా రాస్తూనే వున్నారు. పోటీలు పడి వాటిని ప్రచురిస్తున్నారు వుంఖానువుంఖాలుగా వెలువడే పత్రికల ఎడిటర్లు.
పత్రికల్లోని, నవల్స్ ని పుస్తకరూపంలో ప్రింటు చేయిస్తున్నారు పబ్లిషర్సు.
కానీ వారందరినీ ఓడించేస్తున్నారు కుమారి భారతిగారు యింతమంది యిన్నిరకాలుగా రాసిన రచనల్ని వేరు శనగ పప్పుల్లా నమిలేసి యింకాచాలక ఇబ్బంది పడిపోతున్నారు ఆవిడ.
ఆవిడకు ఆపకుండా సప్లయి చెయ్యాలంటే ఈ స్పీడ్ చాలదు. ప్రతి పదిమందికి తొమ్మిదిమంది రచయితలు బయలుదేరాలి మానపత్రిలు పక్షపత్రికలై, పక్షపత్రికలు వారపత్రికలై, వారపత్రికలు దినపత్రికలై వెలువడాలి. అప్పటికైనా భారతిగార్ని గెలవటం కష్టం.
నోరావలించి వింటున్న మోహన్ కుర్రాడు తెచ్చిన కూల్ డ్రింకులు ఎందుకు? ఏమిటి? అని మొహమాటపడకుండానే అందుకుని గడగడ తాగేసాడు.
కూల్ డ్రింక్ గుటకవేసి మళ్ళీ మొదలు పెట్టాడు షాపతను.
"మూడేళ్ళ క్రిందట నేనీషాపు ఓపెన్ చేశాను. మొదటిరోజే వచ్చింది భారతమ్మ "మంచిపని చేసేరు. దగ్గర్లో వెధవది యిలాంటి పుస్తకాల కొట్టేలేదు. చచ్చీ చెడీ సెంటరుదాకా వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడా అవస్ధ తప్పింది" అని మెచ్చుకుని పుస్తకం పట్టుకెళ్ళింది. "అద్దె ఎంతండీ?" అని అడిగింది వెళ్తూ."
"రోజుకి ముప్ఫై పైసలమ్మా!" అన్నాను.
"మరి పుస్తకం యివ్వళే యిచ్చేస్తే అని అడిగింది.
నాకు నవ్వొచ్చింది. "మీరు అంతస్పీడుగా చదవాలే గానీ, చదివితే పట్రండి రెండో బుక్ ఫ్రీగా ఇస్తాను" అన్నాను. అదుగో అదే నేను చేసిన తెలివితక్కువ పని, నాగోయ్యి నేనే తవ్వుకున్నాను.
ఫలితం! నాలుగురూపాయలు మాత్రం చెల్లించి పది రోజులు తిరక్కుండానే నా దగ్గరున్న నవలలన్నీ చదివేసింది ఆవిడ.
తెల్లారగానే సిద్దం, "కొత్త పుస్తకాలేమైనా వచ్చాయాండీ?" అంటూ నా కేడుపు వచ్చేది.
"ప్రతిరోజూ కట్లకొద్దీ కొత్త పుస్తకాలు ఎక్కడ నుంచి వస్తాయమ్మా? రాసేవాళ్ళు రాయాలి. ప్రంట్ చేసే వాళ్ళు చెయ్యాలి. అప్పుడు కదా అమ్మా మేం కొని అద్దెకి ఇచ్చేది, మీరు చదివేదీను" అన్నాను. అంతేకాదు. "కొత్తనవల రాగానే నేనే మీకు కబురు చేస్తాను. లేదా స్వయంగా వచ్చి అందచేస్తాను. యిలా రోజుకి పదిసార్లు తిరక్కండి మీకూ శ్రమ నాకూ శ్రమ" అన్నాను.
ఇంతకీ నేను చెప్పేది ఏమిటీ అంటే భారతమ్మ చదవని నవల నా కొట్లోనే కాదు ఈ ఊళ్ళోనే కాదు మొత్తం ఆంధ్రాలోనే దొరకదు కాబట్టి అనవసరంగా శ్రమ పడకండి" అంటూ దీర్ఘోపన్యాసం ఇచ్చాడు.
తల గిర్రున తిరిగింది మోహన్ కి. ఇప్పుడు ఇంటికి పోతే వాకిట్లోనే పట్టుకుని మరో షాపుకి పంపిస్తుందేమో భారతి అని భయం వేసింది. తిన్నగా సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోయాడు.
తిరిగి వచ్చేసరికి సూర్యంగారు మేలుకునే వున్నారు. తలుపు తట్టగానే తలుపుతీసి "ఎక్కడికి పోయావురా?" అని అడిగారు.
"బావ రాలేదు! బావరాలేదు అని కాలుగాలిన పిల్లిలా తిరిగి ఇప్పుడే పడుకుంది వెర్రితల్లి. సర్లే నువ్వు పద భోం చేద్దువుగాని" అని లోపలికి తీసుకెళ్ళాడు.
నాలుగు మెతుకులు తిని మేడమీదకి వెళ్ళి పడుకున్నాడు మోహన్. అమ్మయ్య! ఈ పూటకి గండం గడిచింది అనుకున్నాడు.
కానీ పూర్తిగా తెల్లారకుండానే లేపేశారు సూర్యంగారు. ఆసనాలు వెయ్యమన్నారు.
"నాకు అవేమీ రావు మామయ్యా!" ఆవలిస్తూ ఆన్సర్ చెప్పేసి మళ్ళీ పడుకోబోయాడు మోహన్.
కానీ ఆయన మానెయ్యలేదు. "అసలే మంచి హైట్ నీది. ఇప్పుడిలా వూరుకుంటే ముందు ముందు లావేక్కువయి నానా అవస్థాపడాలి. ఇప్పట్నుంచీ ఆసనాలువేసి వాయ్యామం చేస్తే శరీరం ఉక్కు ముక్కలా గట్టిపడుతుంది. లేలే" అని బలవంతంగా లేవదీశాడు.
పదింటికి నీర్సంగా ఇంట్లోంచి బయటపడ్డాడు మోహన్. నాలుగడుగులు వేసేసరికి దూరంగా చకచకా నడుస్తూ వెళ్ళుతున్న దీపిక కనిపించింది. మరింత నీరసం వేసింది అతనికి. గుండె కలుక్కుమంది. కాళ్ళీడ్చుకుంటూ బస్టాప్ కి వెళ్ళాడు.
మోహన్ ఆఫీసుకి వెళ్ళిన కాసేపటికి వచ్చాడు శ్యామ్ హుషారు హుషారుగా కూనిరాగం తీసుకుంటూ వచ్చినవాడల్లా మోహన్ ని చూసి పాటనాపేసి "హాయ్ గుడ్ మార్నింగ్!" విష్ చేసాడు.
"గుడ్ మార్నింగ్!" టైప్ రైటర్ లోకి పేపర్లు ఎక్కిస్తూ నీరసంగా సమాధానం చెప్పాడు మోహన్.
మధ్యాహ్నం హొటలుకి తీసుకుపోయాడు శ్యామ్ గలగల కబుర్లు చెప్పేస్తూ "నిన్న మీ గురించి చెప్పుతూ మిమ్మల్ని తెగ పొగిడేసారు చిట్టిబాబుగారు. మీరు చాలా స్మార్ట్ ఫెలోట. మేమయితే అంత డేరింగ్ గా పందెం కట్టలేమట ఆయనకి భలే టెన్షన్ గా వుందిట. ఎలా గడుస్తాయో ఈ రెండు నెలలు అన్నారు. మోహన్ గారూ! అదృష్టం బాగుండి మీరు గెలవాలేగానీ అందలం ఎక్కించేసేలా వున్నాడాయన" అన్నాడు.
ఆలోచనలో పడ్డాడు మోహన్. "నిజమే! బుద్దిపొరపాటై పందెం వేసాడు తను నోడౌట్ దీపిక తన కెంతో వచ్చింది. తొలిచూపులోనే మనసు దోచేసుకుంది. ఆ అమ్మాయి తను అనుకున్నట్లు, ఆశపడ్డట్లు మామయ్య కూతురుకాదు అయితే మాత్రం ఏం? అవివాహిత. కాబట్టి ప్రయత్నం చేస్తే తప్పులేదు. కానీ మార్గం? మరేం ఫర్వాలేదు. మానసంటూ వుండాలేకానీ మార్గం కనబడకపోదు. ప్రయత్నించాలి" ఒక నిర్ణయానికి వచ్చాక అతని మనస్సు తేలికపడింది. నీరసం పారిపోయింది దాని స్థానాన ఉత్సాహం చోటుచేసుకుంది.
సాయంత్రం ఇంటికి వెళ్ళుతూ దారిలో ఆగి లేటేస్టు వీక్లీ కొనుక్కొని మరీ వెళ్ళాడు. వెళ్ళగానే "భారతీ!" అని కేకవేసాడు. పరుగున వచ్చేసింది భారతి.
"నీ కోసం ఏం తెచ్చానో చూడు!" అందించాడు.
ఆత్రంగా అందుకుని "ఇదా!" అని తేల్చేసింది భారతి.
"మరి మార్కెట్లో ఇదే లేటెస్టు. పొద్దునే వచ్చిందిట" అన్నాడు.
"అవున్లే. నేను పొద్దున్నే చదివేసాను. ఫర్వాలేదులే నువ్వు కాఫీ తాగు" అనేసింది భారతి.
ఇద్దరికీ ఇచ్చేసాడు నారాయణమూర్తి.
కాఫీ తాగ్గానే చెప్పులేసుకొని వీక్లి తీసుకుని వచ్చేసింది భారతి. "పద అలా వెళ్ళివద్దాం" అని మోహన్ ని కూడా ప్రయాణం చేయించింది.
ఇద్దరూ రోడ్ మీదికి వచ్చారు. తిన్నగా ఆ వీధి చివరినున్న మాథవిగారింటికి వెళ్ళి తమ దగ్గరున్న మయూరి వాళ్ళకి ఇచ్చేసి ప్రభ తీసుకొని, పక్క నందులోకి వెళ్ళి పంకజంగారింట్లో ప్రభ ఇచ్చేసి జ్యోతి తీసుకుని, ఎదురింటి మేడమీది బ్యాంక్ ఆఫీసర్ గారింట్లో ఆ జ్యోతి ఇచ్చేసి అపరాధ పరిశోధన తీసుకుని 'ఇకపద! ఇంటికి పోదాం!" అంది.
"ఎందుకీ తిరుగుడు? అంత చదవాలంటే లక్షణంగా చందాకట్టేస్తే ఇంటికే వస్తాయికదా?" అని సలహా ఇచ్చాడు మోహన్.
"నా మొహంలా వుంది ఎన్నని కొంటాం? అరగంటలో చదివేస్తాం. ఇక ఆ తరువాత అవి దండగేగా! మేమందరం కలసి తలా ఓటీ కొనుక్కుని చదివేసుకుంటాం" అంది.
ఇంటికొచ్చేలోపల భారతి కబుర్లలో పెట్టేసి తనకు కావాల్సిన వివరాలు అన్నీ రాబట్టాడు మోహన్.
"అయితే ఆవిడకీ నీకూ పెద్ద ఫ్రెండ్ షిప్ లేదా?" ఇంటికి చేరుతుండగా అడిగాడు.
"ప్చ్. అసలు మొదటినుంచీ అతంతమాత్రమే. సరే నాన్నకీ మామయ్యకీ మాటలు పోయాక కొన్నాళ్ళదాకా ఆ ఇంటికాకి ఈ ఇంటిమీద వాల్లేదు. ఆ తరువాతయినా అమ్మపోయాక అత్తయ్య వస్తోంది అంతే" వాళ్ళెవరూ రారు.
"అసలు దానిది ఎవరితోటి కలిసే నేచర్ కాదు. ఇల్లో నారాయణమ్మా అన్నట్లు వుంటుంది కానీ ఈ మధ్య ఎవరో ప్రొఫెసర్ గారింటికి ప్రతిరోజూ వెళ్తుందిట ఆయనంటే దానికి బోల్డంత ఇష్టమట. అత్తయ్య చెప్పింది" అనేసి మేడమీదికి వెళ్ళిపోయింది.
రాత్రిభోజనం చేసి పడుకున్నాకకూడా దీపిక గురించే దీర్ఘంగా ఆలోచించాడు మోహన్. ఎలాగయినా పరిచయం చేసుకోవాలి. పరిచయం చేసుకోవాలంటే వాళ్ళింటిలో వీలుకాదు. తనని చూడగానే కర్ర పట్టుకుంటాడు. వాళ్ళ నాన్న.
"కాబట్టి ఇంటిబయటే గ్రంథం నడపాలి. ముందు అసలు ఆ ప్రొఫెసర్ గారు ఎవరో తెలుసుకోవాలి" అనుకున్నాడు.
తెల్లవారింది ఆసనాలు మొదలు.
"ఒరే అబ్బాయ్! ఇవాళ నీకు సూర్యనమస్కారాలు నేర్పుతాను. ఇందులో ఎనిమిది ఆసనాలున్నాయి. ప్రణామాసనం, హస్తఉద్దాన ఆసనం, పాద హస్తాసనం, అశ్వసంచాలనాసనం, పర్వతాసనం, అష్టాంగాననం, భుజంగాననం.
