Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 13


    "నువ్వెప్పుడూ అంతే! చిన్నప్పుడు అక్కా నేనూ కొత్తబట్టలు కట్టుకుంటే, అందరూ అక్క సెలక్షన్ బాగుందంటే నువ్వు నా సెలక్షన్ బాగుందనేవాడివి. జ్ఞాపకం వుందా?" నవ్వింది భరణి.
    "అయితే నీకు జ్ఞాపకం వుందన్నమాట!"
    "ఊ......!"
    "కానీ నువ్వూరికే నన్ను ఊరడించాలని అనేవాడివనుకుంటా" అంది అతనికేసి పరీక్షగా చూస్తూ భరణి.
    "అందంగా వున్న డేలియాలని ఫ్లవర్ వాజులో అమర్చిపెడితే రంగు రంగులతో ఎంతో చక్కగా ఆకర్షణీయంగా వుండి ఆనందాన్నిస్తాయి! మల్లెపూవులు ఏ రంగూ లేకుండా, తెల్లగా వున్నా, వాటి సువాసనలతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వాటిని తమ దగ్గరే వుంచుకోవాలన్న కోర్కెని కలిగిస్తాయి. అందుకే ఆడవాళ్ళు ఎంతో ప్రీతితో తల్లో పెట్టుకుంటారు. మొగాళ్ళు కనీసం నాలుగుమొగ్గల్ని చేతిలో పట్టుకుని, ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తారు."
    "ఊ...... తెలుగుమాస్టార్ని మరచిపోకుండా..... అతని అడుగుజాడల్లో నడుస్తున్నావన్నమాట" గలగలా నవ్వింది.
    "మాస్టార్నే కాదు! మాస్టార్ గారి అమ్మాయిని కూడా మర్చిపోలేదు."
    "అవును భరణీ! నిన్నొక ప్రశ్న అడుగుతాను ఇష్టమయితే జవాబు చెప్పు లేకపోతే లేదు గాని, కోప్పడకు!"
    "ఏమిటది?"
    "నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా?" అన్నాడు.
    మరీ ఇంతసూటిగా అడిగేసరికి, వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు భరణికి.
    ".................."
    "ఇంత అర్జంటుగా అడిగేసరికి కంగారు పడుతున్నావా భరణీ! మా వాళ్ళు నాకు ఎన్నో సంబంధాలు చూసిపెట్టారు. రేపటి నుంచీ ఒక్కొక్కరినే చూసి, నచ్చని వాళ్ళ పేర్లు కొట్టేసి, నచ్చిన వాళ్ళ పేర్లు లిస్టు రాసుకుని ఇంట్లోచెప్పాలి. ఆ తర్వాత బాగోగులు లాభనష్టాలూ అంచనా వేసుకుని మావాళ్ళు నచ్చిన సంబంధాన్ని ఖాయం చేస్తారు. నేను పెళ్ళి చేసుకుని, భార్యతో సహా అమెరికా వెళ్ళాలి. నాకీ తతంగం అంతా ఇష్టంలేదు. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకిష్టం! నువ్వు కాదనవనే ధైర్యంతోనే నిన్నిలా అడుగుతున్నాను. నువ్వు సరేనంటే, మాస్టారుగారుకి, మాఇంట్లో వాళ్ళకి చెబుతాను. మా ఇంట్లో వాళ్ళకి కాస్త కులాల పట్టింపులున్నాయి. వద్దన్నా ఒప్పిస్తాను...... మాస్టారు గారి సంగతి తెలుసుకున్నాక! ఆలోచించుకుని రేపు సమాధానం చెప్పు. రేపు సాయంత్రం వస్తాను." అన్నాడు కాశ్యమ్.
    అనుకోని ఈ సంఘటనకీ, ఆశ్చర్యం, ఆనందం రెండూ ముంచుకొచ్చి మూగదానిలా తలూపింది సరే నన్నట్లుగా భరణి.
    "రేపొస్తాను!" అని చెప్పి బయలుదేరాడు కాశ్యప్ మేష్టారుగారి దగ్గర కబుర్లు చెప్పి!
    ఆ రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. పక్కమీద అటూ ఇటూ దొర్లి లైటు వేసుకుని డ్రాయింగ్ రూంలో కూర్చొంది. సరిగ్గా అదే సమయానికి రామానుజంగారు కూడా నిద్రపట్టక, లేచి కూర్చున్నారు. లైటు వేసుకుని పుస్తకం చదువుకుంటున్న భరణి దగ్గరకొచ్చి"ఏమ్మా! నిద్ర రావడం లేదా?" అన్నారు ఆప్యాయంగా.
    "లేదు నాన్నా?"
    "ఎందుకని?"
    భరణి ఒక్క నిముషం మౌనంగా ఉంది. తండ్రికేసి చూసింది. అతనిలో ఒక గొప్ప జ్ఞాని, ఒక మౌని కనిపించినట్టయింది.
    "నాన్నా మిమ్మల్నో మాటడగనా?" అంది ఆప్యాయంగా.
    భరణి నెమ్మదితనం, ఆలోచనాశక్తి రామానుజంగారికి భరణి అంటే ప్రత్యేకమైన అభిమానం వుంది."
    "ఏంటో చెప్పమ్మా?" అన్నారు.
    "కాశ్యప్ గురించి మీ అభిప్రాయం చెప్పండి!" అంది మెల్లగా.
    రామానుజంగారు నివ్వెరపోయారు. కాశ్యప్ వచ్చి వెళ్ళినప్పటినుంచీ ఆయన కాశ్యప్ గురించే ఆలోచిస్తున్నారు.
    "క్యాశప్ కేవమ్మా! బంగారంలాంటి మనిషి" అంటూ..... "ప్రత్యేకించి ఎందుకమ్మా అడుగుతున్నావ్?" అన్నారు భరణి మొహం చూసి చదవడానికి ప్రయత్నిస్తూ.
    భరణి తండ్రితో జరిగినది జరిగినట్టు చెప్పింది. అంతా విన్న రామానుజంగారికి, పట్టలేనంత ఆనందం కలిగింది.
    "అమ్మా...... నువ్వదృష్టవంతురాలివమ్మా కోటి రూపాయలు కురిపించినా దొరకనటువంటి కాశ్యప్ మన గడపలోకొచ్చి నిన్ను చేసుకొంటానని అనడం నీ పూర్వజన్మ సుకృతం. కులం, మతం అంతరాల బురద అంటని నాకు...... అతని గుణం ప్రధానం కానీ, అతని కులం కాదు తల్లీ! నాకు చాలా సంతోషంగా ఉంది.  రాగిణికి నేనే సలహా ఇవ్వలేకపోయాను. ఆమె జీవితం మీ అమ్మ కోరుకున్న విధంగా జరుగుతోంది. కానీ, నీ బ్రతుకు నేను కోరుకున్న విధంగా జరుగుతున్నందుకు, నాకెంతో ఆనందంగా ఉంది. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. రేపు కాశ్యప్ తో నేను మాట్లాడుతాను" అంటూ..... "ఇంక పోయి పడుకోమ్మా" అన్నారు. గుండెల్లోని భారమంతా తీసేసినట్టయి, తన గదిలోకెళ్ళి హాయిగా నిద్రపోయారు రామానుజంగారు. భరణి కూడా దీపం ఆర్పేసి వెళ్ళి సమస్య తీరిపోవడంతో వెళ్ళి నిద్రపోయింది.
                               *   *   *   *
    కాశ్యప్ తో భరణి పెళ్ళి జరిగిపోయింది. భరణి పెళ్ళికి రాగిణి షూటింగ్ లో కాశ్మీరులో వుండడం వలన రాలేకపోయింది. భరణి, కాశ్యప్ లు మద్రాసు వెళ్ళి భరణికోసం పాస్ పోర్టూ, వీసా అన్నీ అతి కష్టంమీద తెప్పించడం జరిగింది. హనీమూన్ కై నైనీటాల్ వెళ్ళారు. నెల తిరక్కుండానే భరణి కాశ్యప్ తో అమెరికా వెళ్ళిపోయింది.
    "రాగిణి అందంగా వుంటుంది. దీనికి అందం లేదూ, దీని పెళ్ళి ఎలా అవుతుందా? అని భయపడ్డాను. కానీ గొప్పింటి సంబంధం బుద్ధిమంతుడూ, కాశ్యప్ లాంటివాడు కోరిచేసుకోవడం నిజంగా మన అదృష్టం" అంది సరోజిని.
    "హూ......! నీ దృష్టిలో అందం అంటే ఎర్రతోలూ, వెర్రి వేషాలూనూ! కాని నా బిడ్డ భరణికి వున్న హృదయ సౌందర్యం ఇంకో జన్మెత్తినా నీకు అర్థంకాదు. నీ వెర్రి వ్యామోహంలో రాగిణి జీవితం పాడుచేస్తున్నావ్?"
    "రాగిణి జీవితం పాడు చేస్తున్నానా? ఎక్కడయినా కన్నతల్లి తన బిడ్డల జీవితాలని చేజేతులా పాడుచేస్తుందా? రాగిణికి డాన్సుకీ, సినిమాకీ కావలసిన పర్సనాలిటీ వుంది కాబట్టి ప్రోత్సహిస్తున్నాను. అది తప్పా?"
    "తప్పో, ఒప్పో నువ్వే తెలుసుకో!"
    సరోజిని మాట్లాడలేదు. రామానుజంగారు గట్టిగా మాట్లాడితే సరోజిని నోరెత్తలేదు. లేకపోతే ఆమె అతనిని నోరెత్తనివ్వదు.
    భరణి పెళ్ళయిపోయాక రామానుజంగారు ఎంతో హాయిగా వున్నారు. అందులోనూ ఆ గర్భ శ్రీమంతుడు, బుద్ధిమంతుడూ కోరి గడప తొక్కి తన బిడ్డను జీవిత భాగస్వామిగా కోరుకొనడం భరణి భవిష్యత్తు గురించి లోలోపల బెంగతో కుంగిపోతున్న అతనికి వెయ్యిసీసాల టానిక్కు తాగినంత బలం వచ్చింది. అస్వస్థతా, నీరసం అంతా మటుమాయమైపోయింది. భరణి నడిపిన మాంటిసరి స్కూల్ అతడు నడుపుతున్నాడు.
    రకరకాల దుస్తుల్లో, జీన్స్ లో, స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ లో మిడ్డిలో, నైట్ గౌన్ లో, చీరలో...... ఎన్నో ఫోటోలు, స్టిల్సు షూటింగ్ లో జరిగినవి పంపించింది రాగిణి.
    బొద్దుగా పెరిగి మోకాళ్ల వరకు వేళ్ళాడే జడని కత్తిరించి బాబ్ చేసుకుంది భుజాల వరకు జుట్టుని అట్టే పెట్టుకుని.
    ఆ ఫోటోలు చూసి కళ్ళు మూసుకున్నారు రామానుజంగారు బాధగా నిట్టూర్చి అక్కడినుంచి వెళ్ళిపోయారు. సరోజిని మాత్రం కూతురి అందాన్ని భిన్న భిన్న కోణాల్లోంచి చూసి మురిసిపోయింది. తన కూతురు తప్పకుండా భావిలో గొప్ప స్టారయిపోతుందని మురిసిపోయింది. వెళ్ళి రెండు మూడు నెలలు కావస్తున్నా రాగిణి ఒకసారి కూడా ఇంటికి రాలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS