Previous Page Next Page 
నా కథవింటావా పేజి 13

    ప్రశాంతమైన  వాతావరణంలో  విశాలమైన గుడి  ప్రాంగణంలో కాలు పెడుతూంటేనే, మనస్సుకి కూడా ప్రశాంతత ఏర్పడింది సీతాదేవికి. కొబ్బరికయలూ, పసుపూ, కుంకం, అగరుబత్తులూ, పూలు తట్టల్లో పెట్టి అమ్ముతున్న వాళ్లని చూస్తే  ముచ్చటేసి  మూడుతట్టలుకొని, దేవాలయ గర్భగుడి దగ్గరికి  వెళ్లారు. నుంచుని  చిరునవ్వుతో పలుకరిస్తున్నట్టు  కళకళలాడుతూ  వున్న  దుర్గమ్మ మొహాన్ని చూస్తే భక్తి పారవశ్యంతో ఎవరికైనా  కన్నీరు చిమ్ముతుంది. కళ్ళల్లో! కనకదుర్గా, కాత్యాయినీ, మమ్మల్ని కాపాడు. నా బిడ్డల్ని  చల్లగా  చూడు' అని  వేయి దండాలు  పెట్టి  ప్రార్ధించింది, సీతాదేవి. క్రాంతి పేరిట అర్చన  చేయించింది. కావ్య పేరు మీద కుంకంపూజ  చేయించింది  ఆమెలోని  ఉత్సాహాన్నీ, తృప్తినీ చూసి, తల్లి ఏం చెయ్యమంటే  అది చేశారు క్రాంతీ, కావ్యా!
    అమ్మవారి దర్శనం తరువాత, కాస్సేపు అక్కడ కూర్చుని, మొత్తం గుడంతా చూసి, మెల్లగా బయలుదేరారు. ప్రకాశం బ్యారేజీ పైన నుంచుని, వయ్యారంగా పారేకృష్ణవేణమ్మ అందాలని చూస్తూ, ఆ పిల్లగాలులు పీల్చుకుంటూ, తనివి తీరేంత  వరకూ  నుంచున్నారు. క్రాంతి జేబులోంచి  చిల్లరతీసి తల్లికీ కావ్యకీ  ఇచ్చి  నీళ్ళలో  వెయ్యమన్నాడు! గంగమ్మ తల్లికి చల్లగా చూడమని  నమస్కరించింది  సీతాదేవి. ఆ తరువాత కాస్సేపు అటూ ఇటూ తిరిగి, రేడియో స్టేషనూ, మెయిన్ రోడ్డు, మార్కెటు వీధులూ అన్నీ చూసి హోటల్ చేరుకున్నారు. అప్పటికి విశ్వనాథంగారు  కూడా వచ్చేశారు. అందరూ  కలిసి  భోజనాలు చేసి, కాస్సేపు  ఆ మాటా ఈ మాటా  మాట్లాడుకుని  నిద్రకుపక్రమించారు.
    మర్నాడు పొద్దుటేలేచి తయారయ్యారు  అందరూ. కాఫీ, ఫలహారాలు ముగించుకుని అంతా కలిసి  బయలుదేరారు సత్యనారాయణపురానికి.
    సుబ్బారావుగారూ, సావిత్రమ్మగారూ సాదరంగా  ఆహ్వానించారు లోపలికి.
    పళ్ళూ, ఫలహారాలూ  పట్టుకొచ్చారు  పెళ్ళికొడుకు చెల్లెలు, పినతల్లి.
    "మా యింట్లో  జరగవలసిన  తతంగం, మీ యింట్లో  జరుగుతోంది" అంది కొంచెం  సిగ్గుపడుతూ సీతాదేవి! ఆమె మాటల్లో, ఈ బాధలన్నీ ఆడపిల్లవారివి. కానీ, మీ ఇంట్లో జరగడంవల్ల, మీరే  ఆడపిల్లవారి స్థానంలో ఉన్నారు అన్నట్టనిపించింది.       
    "ఫరవాలేదులెండి. ఎక్కడైతే ఏముంది ? మేమింతమందిమీ హైదరాబాద్  రావాలంటే  పెద్ద  గొడవ. మా బలగం  అంతా ఇక్కడే ఉన్నారు, ఒక్కవాడు  తప్ప. వాడికీ ఈ ఊరు ట్రాన్స్ ఫర్ కి ప్రయత్నాలు చేస్తున్నాం. మేమింతమందిమీ  ఇక్కడుంటే, వాడొక్కడూ  అక్కడుండడం మాకిష్టంలేదు  అంది సావిత్రమ్మ".
    ఇలా  వారి  సంభాషణ అనేక  విషయాలవైపు  మళ్ళీ ఏవేవో మాట్లాడుకున్నారు. మధ్య మధ్యలో కావ్యని చూస్తూనే ఉన్నారు. కావ్య కూడా, అప్పుడప్పుడూ  తలెత్తి వాళ్ళ మాటల్ని వింటూ  వాళ్ళకేసి చూసింది. ఓరగా  పెళ్ళికొడుకుని  కూడా చూసింది. బాగానే ఉన్నాడనుకుంది. "కామేశం! సరిగ్గా చూసుకో!" వేళాకోళం  చేసింది పినతల్లి. "కళ్ళు పెద్దవిచేసి చూడూ" అన్నాడు పెళ్ళికొడుకు  బాబాయిగారు. అందరూ నవ్వేశారు. కావ్యకి అదోలా అనిపించింది. ఏదో దోషిలా వాళ్ళముందు  తలొంచుకు కూర్చోవడం, వాళ్ళంతా తనని  ఒక వింత జంతువుని  చూసినట్టు చూడడం, వాళ్ళందరికళ్ళూ  తనమీదే  ఉన్నాయన్న భావం, వాళ్ళ చూపులు తనకి గుచ్చుకుంటూన్నట్టనిపించింది. "నువ్వు కూడా సరిగ్గా  చూడమ్మా" అందొకావిడ  కావ్య  భుజంతట్టి  ఊపుతూ.
    "చూడగానే ఏం తెలుస్తుంది. ఒకసారలా  చూసి, నచ్చిందీ నచ్చలేదూ, అని చెప్పటానికిదేమైనా  వస్తువా? వస్తువైనా, డబ్బు పెట్టి కొనేటప్పుడు. ఒకటికి  రెండుసార్లు  ఆలోచించి, బాగా పరిశీలించి కొంటాం. అంతకంటే చులకనైనదా  వివాహం? ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడానికీ, ఒకరి అభిరుచులు ఒకరు గ్రహించుకోవడానికీ  ఏ మాత్రం. అవకాశం లేదు. ఇరువైపులవాళ్ళూ  మాట్లాడుకోవడమే  గానీ, అసలు పెళ్ళి చేసుకుని, జీవితాంతం, కష్టసుఖాలు పంచుకుని, కలిసుండవలసిన వాళ్ళు ఒకరితో ఒకరు  మాట్లాడుకోవడానికి ఏమాత్రం, అవకాశం లేని వ్యవస్థ!" నవ్వుకుంది కావ్య.
    ఆ నవ్వుని అందరూ అంగీకారంగా  భావించారు.    
    మరికాస్సేపు వాళ్ళలాగే  కూర్చున్నారు. పెద్దవాళ్ళేదో మాట్లాడుకున్నారు లోకాభిరామాయణం.
    "మరి వెళదామా?" అన్నాడు విశ్వనాథంగారు.
    ఏదో చెప్పబోయింది  సీతాదేవి.
    "అబ్బాయి  అంగీకారం  తెలుసుకుని, సాయంత్రంలోగా, కబురు పెడతాంలెండి. ఆ తరువాత  మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అన్నారు, సావిత్రమ్మగారు.
    "అలాగే!" అంటూ  బయలుదేరారు.
                                     *    *     *
    "పిల్లాడికి పిల్ల నచ్చిందట ! సీతమ్మా మరి పిల్లకి పిల్లాడు నచ్చాడటనా?" అడిగారు విశ్వనాథంగారు.
    "దాని మొహం  దానికేం తెలుసు బాబాయిగారూ! మనం ఏదంటే అదే అంటుందది. నా మట్టుకు నాకు పిల్లాడూ, తల్లీ దండ్రీ  అంతా బాగానే వున్నారు. మీ అభిప్రాయం చెపితే...."
    "అదేమిటమ్మా? నాకు నచ్చేకదా  చెప్పింది  సంబంధం గురించి."
    "మరింకేం? మిగిలిన  విషయాలు  మాట్లాడుకుంటేసరి" అంది  సీతాదేవి.
    క్రాంతి మెల్లగా  అడిగాడు కావ్యని. 'నీకు పిల్లాడు నచ్చాడా' అని.
    "నీకు నచ్చాడా" అంది కావ్య.
    'నాకు నచ్చాడమేమిటి? పెళ్ళి చేసుకునేది నువ్వా  నేనా ?' నవ్వాడు క్రాంతి.
    "నా భర్త ఎలా ఉంటే  బాగుంటుందో నువ్వు చెప్పలేవా ? దాన్ని బట్టి నీ అభిప్రాయం  చెప్పు. పైగా అతనితో నువ్వేదో  మాట్లాడుతూ వున్నావుగా! నీకేమనిపించింది?" అడిగింది కావ్య.
    "పిల్లవాడు  మంచివాడులాగే ఉన్నాడు. చూడ్డానికి  కూడా  బాగానే ఉన్నాడు. వినోద్ ఖన్నా లాగా లేడనుకో!....వినోద్ మెహరాలాగా  ఉన్నాడేమో!"
    "నాకు తెలుసులే  వినోద్ ఖన్నా, వినోద్ మెహరా నాకిష్టమని  అలా అంటున్నావ్! సరే  చూస్తాగా నీకు, రేఖా లాంటిది వస్తుందో శ్రీదేవిలాంటి దొస్తుందో !" అంది కావ్య.
    ఇద్దరూ  నవ్వుకున్నారు.
    వీరి అభిప్రాయాలు  కూడా తెలుసుకున్న  సీతాదేవి, విశ్వనాథం గారితో చెప్పింది. కట్న  కానుకల విషయం  ప్రస్తావించమని."
    సరేనన్నారు విశ్వనాథంగారు !
    ఆ రోజంతా  ఆ విషయాలే! అక్కడ  ఒక్కొక్కరు  మాట్లాడిన మాటలూ, వారి తీరూ, ఒక్కొక్కటీ  తలుచుకుని చర్చించుకున్నారు  తల్లీ, పిల్లలూ! ఎంతో  మురిసిపోయారు !
    ఆ రాత్రి  ప్రశాంతంగా  నిద్రపోయింది  సీతాదేవి !
    గజిబిజి ఊహలతో, చిలిపి  తలపులతో, నిద్దరతో  పోట్లాడింది కావ్య ! ఈ ఝాము రాత్రికో  నిద్దరపోయింది!
    తృప్తిగా  పడుకున్నాడు క్రాంతి!
                                       9
    బేరర్ కాఫీ పట్టుకొచ్చాడు. అందరూ ఆలోచిస్తూ  మౌనంగానే, కాఫీ కప్పుల నందుకున్నారు.
    విశ్వనాథంగారు  కాఫీ కప్పు  కిందపెడుతూ  గడియారం చూసుకుని "మైగాడ్! టైము ఎనిమిది దాటింది. తొమ్మిదింటికి  మీటింగుంది. ఇవ్వాళ ఆఫీసులో! వస్తామరి! నువ్వూ బాబూ  బాగా ఆలోచించుకుని, మీ అభిప్రాయం సాయంకాలం నేనొచ్చేసరికి   చెబితే, వాళ్ళతో  మాట్లాడుతాను. ఒస్తానూ !" అంటూ హడావుడిగా  వెళ్ళిపోయారు విశ్వనాథంగారు.
    "నాన్నగారి  గ్రాట్యుయిటీ, ప్రావిడెంటు  ఫండూ  అంతా కలిపి డెబ్బై అయిదు వేలొచ్చినట్టుంది. ఇంతవరకూ  మనం  ఆ వొడ్డీ  డబ్బులు  వాడుకుంటూ  వొచ్చాంకానీ  అసలు  ముట్టుకోలేదుగా! యాభై  వేలు కట్నం పోను పాతికవేలల్లో  పెళ్ళి  చెయ్యాలి. సరిపోతాయా? అదీకాక....ఈ మొత్తం డబ్బు తీసేస్తే ఇకమీద  వడ్డీ  వొచ్చే అవకాశం  కూడా  వుండదు. నీకు ఉద్యోగం  ఒచ్చేంతవరకు  ఇల్లు గడవడం  ఎలా బాబూ? మునపటి  లాగా నాకు బట్టలు కూడా ఇవ్వడంలేదు  ఎవ్వరూ  కుట్టడానికి" అంది సీతాదేవి ఆలోచిస్తూ.
    "అమ్మా! మనం ఎలాగో అలాగ  బతకొచ్చమ్మా  నాకుద్యోగం  ఒచ్చేదాకా ! కానీ, ఈ సంబంధం పోతే  మరో  సంబంధం  దొరకడం కష్టం. వాళ్ళందరికీ  కావ్య నచ్చింది. మనకీ  వాళ్ళందరూ నచ్చారు. కేవలం కట్నం ఎక్కువని, ఈ సంబంధం  కాదనుకుంటే, మనమున్న  పరిస్థితిలో  మరో సంబంధం దొరకడం  కూడా  కష్టమే" పెద్ద  అనుభవజ్ఞుడిలా  చెప్పుకుపోతున్న  కొడుకుకేసి  ఆశ్చర్యంగా  చూసింది సీతాదేవి.
    "తెస్తాన్లే గానీ అమ్మా, ఒకవేళ  మామయ్య  లెవరూ  సహాయం చెయ్యకపోయినా, మనమీ పెళ్ళి  చేసే స్థితిలో  వుండాలి." అతని మాటలలోని  నిశ్చలత్వం  ఆమెని ముగ్దురాలిని  చేసింది.
    "క్రాంతి  చెబుతున్నదంతా  నిజమే. ఏ సంబంధం వొచ్చినా  పడనీయకుండా  చెడగొట్టి  పంపించేస్తున్నారు. ఇదొక్కటి  దేముడి పుణ్యమా  అని కుదిరింది. ఎలాగో  అలాగ  ఆ మూడుముళ్ళూ  పడిపోతే  చాలు. కలో గంజో  తాగి బతకొచ్చు" అనుకుంది  సీతాదేవి.
    "బాబూ! సాయంకాలం విశ్వనాథం  గారొస్తే మనం ఒప్పుకున్నామని  చెప్పి ముహూర్తాలు  పెట్టించెయ్యమని  చెబుదాం. ఆలస్యం  అమృతం విషం. ఏమంటావు ?" అడిగింది కొడుకుని.
    "అవును !" అన్నాడు క్రాంతి.
    తల్లీ కొడుకులు తన పెళ్ళికోసం  పడుతున్న  తాపత్రయం చూసి, నిస్సహాయంగా నిట్టూర్చింది కావ్య. ముఖ్యంగా  యాభైవేల కట్నం ఇవ్వడానికి  ఆమె మనసు ఒప్పుకోవడంలేదు. మగవాళ్ళు  కట్నం  అడగడమే కాదు, ఆడపిల్ల కట్నమిచ్చి  పెళ్ళి చేసుకోవడానికి  ఒప్పుకోవడం  కూడా నేరమే! అని తను కాలేజీ ఏకృత్వ పోటీలో  పాల్గొన్నప్పుడు  వాదించి బహుమతి నందుకుంది. ఆ రోజు  తన ఉపన్యాసం  విని అందరూ  బాగుందని  మెచ్చుకుంటూ  వుంటే, జీవితంలో తను చెప్పినది  చేస్తాననీ, కట్నం  అడిగే వాణ్ణి  పెళ్ళి చేసుకోననీ, అన్న మాటలు   జ్ఞాపకం వొచ్చి, కళ్ళు ఆశ్రుపూరితమయ్యాయి.             


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS