కాటికాపరి బాగా తాగి ఓ మూలకు పడుకుండిపోయి గుర్రు పెడుతున్నాడు.
చిక్కటి ఆ చీకటిలో చితి తాలూకు వెలుగు స్మశానాన్ని పరుచుకుంది. పాడుబడిన సమాధులు చాలానే వున్నాయి. కాలుతోన్న చితికి వంద గజాల దూరంలో మట్టి ఇంకా తడి తడిగానే వుంది. క్రితం రోజే సన్నటి తుంపర పడింది. నేలంతా పచ్చిగా బురద బురదగావుంది.
రెండ్రోజుల క్రితం...అక్కడే వాకర్ శవం పాతిపెట్టబడింది.
ఆ ప్రాంతంలోని మట్టిలో చిన్న కదలిక వచ్చింది.
గుడ్లగూబ భయంకరంగా అరిచినట్టనిపించింది. తీతువు పిట్ట బెదిరి పోయినట్టుంది. కుక్కలు ఆ ప్రాంతానికి దూరంగా పారిపోయాయి.
మట్టి మెల్లిమెల్లిగా...
చె..ల్లా..చె..దు..ర..వు..తూ..వుం...ది...ఎవరో పారసాయంతో ఎత్తిపోస్తున్నట్టు...మట్టి దానంతట అదే పక్కకు తొలిగిపోతోంది. క్షణ్ణాల్లో మట్టి ఓ పక్కగా 'రాశి' గా పడిపోయింది. ముందు ఓ చేయి బయటకు వచ్చింది. తర్వాత రెండవ చేయి. అందులో వున్న వాకర్ శవం లేచి నిలబడింది ఓ రోబోలా..
తర్వాత కుడివైపు తిరిగింది. అలా..నడుచుకుంటూ వెళ్తోంది...
* * *
టక్...టక్...
టక్...టక్...
ట...క్..ట...క్...
క్షణక్షణానికి శబ్దం ఎక్కువవుతోంది.
ప్రభు వులిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు.
ఎవరో టక్ టక్ మంటూ శబ్దం చేస్తున్నారు. ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తోందో అర్ధం కాలేదు.
గోడ గడియారం వంక చూసేడు.
పన్నెండూ ఐదు నిమిషాలు.
ఇంత రాత్రి వేళ ఎవరొస్తారు?
నైట్ డ్రెస్ లో ఉన్న ప్రభు స్లిప్పర్స్ వేసుకొని బయటకు నడిచి మెల్లిగా తలుపు తీశాడు.
8
బయట ఎవరూ లేరు
ఒక్కక్షణం గుండె కుదుటపడింది...
"మైగాడ్...ఇదంతా తన భ్రమ..." అనుకుంటూ తలుపులు వేసి నాలుగడుగులు వేశాడో లేదో...కాలింగ్ బెల్ అదే పనిగా మోగసాగింది.
ఒక్కక్షణం అతని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది. వణుకుతున్న చేతులతో తలుపు తెరిచాడు గుండెలు చిక్కబట్టుకుని...
బయట అంతా నిర్మానుష్యం...
మళ్ళీ తలుపు తీసి, కాలింగ్ బెల్ స్విచ్చాప్ చేశాడు. కాలింగ్ బెల్ ఎవరు నొక్కారో అర్ధం కావడంలేదు. తన బెడ్రూమ్ లోకి వచ్చాడు.
తలుపులు బిగించాడు.
స్లిప్పర్స్ ఓ ప్రక్కగా విడిచి పడుకోబోతుండగా ఈసారి బెడ్రూమ్ ను ఆనుకొని ఉన్న కిటికీ మీద మునివేళ్లతో చేస్తున్నట్టు శబ్దం వినిపించింది.
"ఎవరు...ఎవరది..." భయంగా అంటూనే టార్చిలైట్ కుడిచేతిలోకి తీసుకొని...కిటికీ తలుపులు మెల్లిగా తెరిచాడు.
బయట్నుంచి చల్లటిగాలి రివ్వునవచ్చి మొహానికి తాకింది.
ఎవరూ కనిపించలేదు.
"ఏంటీ...ఇవ్వాళ తనకేమైంది? ఎందుకిలాంటి భ్రమ కలుగుతోంది?" అనుకుంటూ కిటికీ తలుపులు వేయబోతుండగా మళ్ళీ శబ్దం
తల బయటకు పెట్టి టార్చి లైట్ ఫోకస్ చేశాడు. ఆ టార్చిలైట్ ఫోకస్ లో ఓ మొహం భయానకంగా కనిపించింది.
"ఎవరూ...ఎవరది"
"వా...క...ర్..."
ఒక్కసారిగా వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది.
కిటికీ ఊచల మధ్య తలపెట్టి అంది వాకర్ శవం.
కిటికీకి అటువైపు నిలబడి వుంది శవం.
మొహమంతా బూడిదరంగు వర్ణంలోకి మారిపోయివుంది.
"వా...వా...వా...క...ర్..."
"యస్..వన్ వీక్ బ్యాక్ చనిపోయిన వాకర్ ని...నన్నింకా గుర్తుపట్టలేదా?" వాకర్ కళ్ళు తెరుచుకున్నాయి. పెదవులు కదులుతున్నాయి.
అతని శరీరంలో నుంచి కుళ్లిపోయిన శవం తాలూకూ వాసన వేస్తోంది.
"నువ్వు...నువ్విక్కడికి ఎలా వచ్చావు...నిన్ను నేను పాతిపెట్టాను కదూ..." ప్రభు గొంతు చించుకుని అన్నాడు.
వాకర్ చేతులు ప్రభు మొహాన్ని స్పశించాయి. ఒక్కసారిగా మంచు ముద్ద మొహాన్ని ముద్దాడిన పీలింగ్...
"నో...న్నో...న్నో..." ప్రభు ఆ చేతిని విసిరికొట్టి రెండడుగులు వెనక్కి వేశాడు.
వాకర్ కన్నులు గిరగిరా తిరుగుతూ వున్నాయి. కిటికీ తలుపులు వేసే ప్రయత్నం చేశాడు.
తలుపులు మూసుకోవడం లేదు.
డోంట్ షట్ ద డోర్స్...
"డోం..ట్..ష..ట్..ద..డో..ర్స్" వాకర్ పెదవులు కదులుతున్నాయి.
ప్రభు వెనక్కి వెనక్కి నడుస్తున్నాడు.
టేబుల్ తాకింది.
వాకర్ చేతులు కిటికీ ఊచల్లో నుంచి సాగుతూ ప్రభువైపు వస్తున్నాయి.
ప్రభు భయంతో వణికిపోతున్నాడు.
చేతికి ఏదైనా ఆయుధం దొరుకుతుందేమోనని చూస్తున్నాడు.
పళ్ళు కోసే కత్తి తగిలింది.
అప్పటికి వాకర్ చేయి ముందుకు సాగి ప్రభు మెడను చుట్టుకుంటోంది.
ప్రభు చేతికందిన కత్తిని తీసుకుని వాకర్ మణికట్టు మీద బలంగా పొడిచాడు.
ఆ మణికట్టు నుంచి ఒక్కో రక్తం చుక్కరాలి...టప్..టప్...టప్...మని శబ్దం చేస్తూ నేలమీద బొట్టు బొట్టుగా పడుతున్నాయి.
బలం కొద్దీ ఆ మణికట్టు మీద పొడుస్తూనే వున్నా వాకర్ చేయి సడలిపోవడం లేదు...రక్తం బొట్లు కింద పడుతున్నప్పుడు పెద్ద శబ్దం అవుతోంది.
క్షణంలో విచిత్రం జరిగింది.,
ఆ రక్తం బొట్లు గ్రాఫిక్స్ లా చెదిరి...అతని మణికట్టు దగ్గరికి వచ్చి చేరాయి. కిటికీకి అటువైపు వున్న వాకర్ మొహంలో నవ్వు...వికృతమైన నవ్వు. ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్ కలిగింది ప్రభుకు...సరిగ్గా అప్పుడుడే అతని చేతికి తగిలింది...?
* * *
భయంతో ప్రభు వళ్లంతా కంపించింది.
అయిపోయింది...తన చివరి శ్వాస ఓ ప్రేతాత్మ చేతిలో ముగిసిపోతోంది.
అతని కళ్లముందు చీకటి...
వెనక్కి పడబోతూ బ్యాలెన్స్ కోసం టేబుల్ కొసని పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతని కుడిచేతికి ఆంజనేయస్వామి తాయెత్తు. ఎడమ చేతికి 'క్రాస్' తగిలాయి.
చానాళ్ళ క్రితం బామ్మ ఇచ్చిన తాయెత్తు ఇల్లు సర్దుతుంటే దొరికింది. క్రితం రోజే టేబుల్ మీద పెట్టాడు. 'క్రాస్' విలియమ్స్ తన బర్త్ డేకు గిఫ్ట్ గా ఇచ్చాడు.
'ఇదేం గిఫ్ట్' అని అడిగితే ఇంతకన్నా విలువైన గిఫ్ట్ మరోటి ఉండదని చెప్పాడు.
అప్రయత్నంగా ఆ రెంటినీ రెండు చేతుల్లో బిగించి పట్టుకొని బలంగా వాకర్ చేతులను తోశాడు.
ఓ చేతిలో క్రాస్, మరో చేతిలో తాయెత్తు...ఆ రెండూ వాకర్ చేతుల్ని తాకిన మరుక్షణం వాకర్ చేతులు వెనక్కి వెళ్లాయి.
ప్రభు విచిత్రంగా చూసేడు.
వాకర్ శవం కోపంగా చూస్తోంది ప్రభువైపు.
ప్రభు తాయెత్తుని, క్రాస్ ని తన గుండెలకు హత్తుకున్నాడు.
వాకర్ శవం ఒక్కో అడుగు వెనక్కి వేస్త వెళ్లిపోతోంది. కిటికీ రెక్కలు టక్ మన్న శబ్దంతో మూసుకుపోయాయి.
* * *
ఉలిక్కిపడి లేచాడు ప్రభు.
తను మంచంమ్మీద వున్నాడు. అదీ పడుకుని వున్నాడు. తన గదివైపు పరిశీలనగా చూశాడు. ఏ మాత్రం తన గదిలోని వస్తువులు చెల్లా చెదురవ్వలేదు. నీట్ గా వున్నాయి. అంటే...ఇదంతా కలా? నిజంగా వాకర్ శవం రాలేదా? తను భయపడుతూ, వాకర్ శవం గురించి ఆలోచిస్తూ ఉండడంవల్ల అలాంటి కల వచ్చిందా? చాలా సేపు ఆలోచిస్తూ వుండిపోయి, సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు, టేబుల్ దగ్గరికి వెళ్లి చూసేడు.
అతని కళ్ళు విచిత్రంగా మెరిశాయి.
టేబుల్ మీద ఆంజనేయుడి తాయెత్తు, క్రాస్ వున్నాయి. అంటే కలలో తనకు కనిపించింది వూహే...కానీ, తనని కలలో రక్షించినవి ఈ తాయెత్తు, క్రాసే...
ప్రభు వెంటనే ఆంజనేయుడి తాయెత్తు చేతికి కట్టుకున్నాడు. క్రాస్ ని మెడలో వేసుకున్నాడు.
"దేవుడా...నువ్వే రూపంలో వుంటావో...ఏ విధంగా భక్తులను రక్షిస్తావో నాకు తెలియదు. కానీ నాలాంటి నిస్సహాయులను రక్షించడానికి నువ్వెప్పుడూ ముందు వుంటావు. నువ్వు ప్రభువు అయినా, హనుమంతుడివయినా నీ ఉనికి మాత్రం నిజం."
రెండు క్షణాలు కళ్ళుమూసుకుని ప్రార్ధించాడు. నిశ్చింతగా వుంది ఇప్పుడు ప్రభుకు.
తనకిక ఏ పీడకలలూ రావు అనుకున్నాడు ప్రభు.
నిజానికి ప్రభుకు వచ్చింది పీడకల కాదని, వాకర్ శవం ప్రభు పడగ్గది కిటికీ దగ్గర పొంచి వుందని, ప్రభు చేతికి ఉన్న తాయెత్తు, మెడలో క్రాస్...ప్రేతాత్మ ప్రయత్నాన్ని నిరోధించడంతో వాకర్ శవం వెనుదిరిగిందని తెలియదు.
