"రాత్రికి మాట్లాడుతాగా ఆ విషయం" అన్నాను.
"ఏమిటి మాట్లాడేది? బట్టలు సర్దుకొంటాను" అన్నది.
"పిల్లలూ?" అన్నాను నేను ఆదుర్దాగా. "పిల్లలూ వస్తారు. వాళ్ళకు మట్టుకు సరదాగా ఉండదా?" అనేసింది నిక్కచ్చిగా.
"అయితే ఇప్పుడు యావన్మందీ బయలు దేరాలిసిందే?"
" ఆ "
"ఈ సంసారాన్నంతా నేను హంపీ మోసుకెళ్ళాలి సిందే?"
"ఆఁ ఓ" పెద్ద సంసారం! మీరేమి మోయనక్కర లేదు. రైలుదాకా నడిచే వస్తాము. రైల్లో మేమంతట మేమే ఎక్కుతాము. రైల్లో కూర్చుంటే అదే మోసుకెడుతుందీ! సరేనా?" అన్నది విషయాన్ని అంతా తెగేసి, అందులో ఒక్క పిసరు బాధ అయినా నాకేమీ లేనట్లు తేలుస్తూ.
"అది కాదు కాంతం, మాట."
అని చటుక్కున అనేశాను. పొరపాటున నోరుజారి అన్నాను. "కాదు" అన్న ముక్క అనడమే తరువాయి వచ్చేసింది ఆమెకు బుస్సున కోపం,తాచుపాములాగా జుర్రున జారిపోయింది ఆవిడ తన వంట యింట్లోకి. వెధవ బుద్ధికి కట్టులేదు. నా ఉద్దేశాన్ని రాత్రి దాకా ఉండబట్ట లేకపోయింది. మాట జారింది.
రాత్రికి మామూలు వేళకు భోజనానికి వెళ్ళాను. ఆవిడ నాతో మాట్లాడదే? మూతి మూరెడు చేసుకొంది.
"నెయ్యి ?"
"అక్కడే ఉంది గిన్నెలో,"
"పిల్లలు నిద్ర పోయినారా?"
"పోరూ."
"పెద్దతల్లి సంగీతం సాధన చేసిందా?"
"ఆ"
"పులుసు వేస్తావా?"
"ఇవ్వాళ పులుసు లేదు."
"పోనీ మజ్జిగ పొయ్యి."
"మీ పక్కనే వుంది సత్తుతప్పాలె, పోసుకొండి."
ఇవీ ప్రశ్నోత్తరాలు ఆరోజు భోజనం దగ్గర, రోజూ ఏదో పిచ్చాపాటి మాట్లాడుకొంటూ సరససల్లాపాలతో అరగంట చేసే భోజనం ఆ రోజు అయిదు నిమిషాల్లో అయిపోయింది. బైట ఆకాశంలో మబ్బులు కమ్మినాయి, భయంకరంగా వుంది- తలుపు సందుల్లో నుంచి వచ్చే గాలికి దీపం ఎగిరి-ఎగిరి పడుతున్నది. మా ఆవిడ ముడిలోని ఎర్రని మందార పుష్పం ఒంటరిగా వుండి నావంక చురచుర చూస్తున్నది.
3
ఈ బిట్ కొశ్చెన్సు- అండ్ ఫిట్ ఆన్సర్సు- వ్యవహారం అయిపోవటంతోనే నేను బైటకొచ్చి సిగరెట్టు కాల్చుకుందామని నిప్పు పెట్టెకోసం వెదికాను, ఎక్కడా కనిపించ లేదు "కాంతం నిప్పు పెట్టె?" అన్నాను. వంట ఇంట్లో నుంచి విసిరి పారేసింది నా కాళ్ళముందు. మెదలకుండా సిగరెట్టు వెలిగించుకొని, రానీ మెల్లగా చెబుతాను. నేను తొందరపడటం ఎందుకూ? అనుకొని ఊరుకొన్నాను.
నేను అక్కడ నుంచి పోనేలేదూ, అప్పుడే రెండు నిమిషాల్లో పమిట చెంగుతో మూతి తుడుచుకొంటూ వచ్చేసింది గుండు చెంబుతో నీళ్ళు పట్టుకొని.
"అప్పుడే అయింది భోజనం ?"
'ఆ'
"ఏం తిన్నట్టూ?"
"ఏదో నా ఇష్టం."
సరే, పో అని నేనూ ఆమె వెంటనే నడిచాను. గది ముందు నడవలో పిల్లలు నిద్రపోతున్నారు. రోజూ, నా గదిలో వుండే ఆమె మంచం ఇవ్వాళ బైటకొచ్చింది!! ఆమెగారు నీళ్ళ చెంబు బల్లమీద పెట్టేసి, దీపం తగ్గించి చటుక్కున పడుకొని ఊరుకొంది. ముడుచుకొని మూడంకెలాగ. దగ్గరకు వస్తేనా ఏదైనా మాటామంతీ చెప్పుకోవటం ! బుసలు కొడుతుంటే!
"కాంతం?" జవాబు లేదు.
"అప్పుడే నిద్రా? ఇదిగో మాట."
"ఇప్పుడేం మాట పడుకోండి"
"అయితే చూడూ నాకు నిద్ర రావటం లేదు. చదువు కొంటాను, కళ్ళజోడు ఎక్కడ పెట్టావో చెప్పగలవా?"
'ఏమో'
ఏమో అంటే ఎల్లాగ? ఉత్తరమురాలైన భార్య ఇల్లాగనే ప్రవర్తించాలిసింది? నా వస్తువులన్నీ జాగ్రత్త పెట్టాలె. ఏవి...ఎక్కడ వున్నవీ తెలుసుకోవాలె"
"మీరు నా వస్తువులు ఏవి ఎక్కడ వున్నవో జాగ్రత్త పెట్టి చూస్తున్నారు? కాటిక్కాయ కనపడక ప్రొద్దున నేను ఘంట వెతుక్కున్నాను" అన్నది విసుగుతో.
"ప్రేమగా వుండాలె కాంతం__చూశావా ప్రేమా అంటే...."
"అంటే"
"అంటే...నా హృదయం నీవు అర్ధం చేసుకోవాలె. నాకు అన్ని విధాలా సాయపడాలె" అన్నాను. అంతకంటె ఎక్కువగా నిర్వచనం చేయలేక పోయినాను."
"నేను మీకు సాయపడనూ లేను. మీరు నాకు సాయపడనూ లేరు. ప్రొద్దున మీరు నిద్రలేచేసరికి ఇడ్డెన్లు వండి పెడదామని మినప్పిండి రుబ్బి, రుబ్బి చేతులు పడిపోయినాయి నాకెవరు సాయం చేశారూ? ఏమిటో! 'ఎవరికి వారే యమునా తీరే?' అన్నది. వేదాంత ఫక్కీలో మాటలు సాగదీస్తూ, ఆ ధోరణిలో దిగిందో ఆ ప్రవాహం ఇక మళ్ళదు.
"కాంతం" అని పెద్దగా పిలిచాను.
"చాల్లెద్దురూ!" అన్నది విసిరి కొట్టినట్టు.
"ఇప్పుడూ...ఇంతకూ...ప్రొద్దున నేను "కాదు"
అని అన్నమాటకేకాదూ ఈ కోపం అంతా. పోనీ నీవే చెప్పు, పిల్లలూ మనమూ హంపీ వెళ్ళటం అంటే ఎంత శ్రమా!! ఎంత ఖర్చూ! నిజమా అబద్ధమా? అంటూ చుబుకాన్ని స్పృశించాను.
"అయితే అయింది నేనూ వస్తాను" అన్నది. కంఠస్వరాన్ని బట్టి ఆమె కొంత శాంతించిందని తెలుస్తునేవుంది.
"నేనూ వస్తానూ, అని అంటానే కానీ ఈ సంసారం అంతా?"
"సంసారం, సంసారం, అనబోకండీ మాటిమాటికినీ, అదేదో పెద్ద బరువులాగ," అని విసుక్కుంది,
"అయితే రాక తప్పదన్నమాట?"
"మీరు వెళ్ళటం తప్పకపోతే!"
ఇక ఆవిడతో వాదించి లాభంలేదని తోచింది. పట్టుదల రానేరాదు ఆవిడకు, వచ్చిందో యమపట్టు. తీరిగ్గా ఏదో ఉపాయం ఆలోచించవచ్చునని అప్పటికి ఊరుకొన్నాను. ఆకాశంలో మబ్బులు విడిపోతున్నాయి. కొద్దిగా వెన్నెల వస్తున్నది. ఆమె పెదవులలో నుంచి చిరునవ్వు మెరుస్తున్నది. నాకూ కొంచెం ధైర్యం కలిగి ఆమె పక్కలో ఆనుకొని కూర్చుని ఆరంభించాను.
"ఒక్క సంగతి వింటావూ?"
"ఏమిటి వినేది?"
"చివరంటూ విను, తరువాత నీ ఇష్టం"
