Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 13

    "అలా ఉన్నారేం?" అడిగింది కాఫీ ఇచ్చి.
    "ఏం లేదు...." అన్నాడు తేలిగ్గా నవ్వేసి కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెట్టాడు. కుర్చీలో వెనక్కి వాలి కాళ్ళు చాపుకుని అన్నాడు.
    "నన్ను బొంబాయి పంపుతున్నారు...."
    అర్చన మొహం పాలిపోయింది.
    "ఈ విషయం తెలిసి నేను దిగులు పడ్డాను. ఆలోచిస్తే ఇలా జరగడం మన మంచికేనని అనిపించింది...."
    కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు.
    "డిపార్ట్ మెంట్ లో నాకు మంచి పేరు ఉంది. శిల్పతో విడిపోయిన తరువాత నేను విచ్చలవిడిగా తిరిగాను. అందువల్ల డ్యూటీ మీద శ్రద్ద తగ్గి పోయింది. అందుచేత నన్ను బొంబాయి ట్రాన్స్ ఫర్ చేశారు...."
    "ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళడం మనకే మంచిది. అక్కడ మన గురించి తెలిసిన వాళ్ళు లేరు. అంతేకాదు ప్రత్యేకంగా మన గురించి తెలుసుకునే సమయం ఉండదు. నాలుగైదు సంవత్సరాల తరువాత ఇక్కడకు తిరిగొచ్చినా మన గురించి అంతా మర్చిపోతారు...." చెప్పాడు.
    నెలరోజుల్లో వచ్చి తీసుకెళతానని చెప్పాడు. రెండు రోజుల పాటు అతను ఇంటి నుంచి కదల్లేదు. స్నేహితులు పార్టీకి రమ్మని పిలిచినా వెళ్ళలేదు. మూడోరోజు బొంబాయి ప్రయాణమయ్యాడు అవినాష్.
    వారం రోజుల తరువాత అతని నుండి ఉత్తరం అందుకుంది అర్చన. ఇన్ లాండ్ కవరుపై జవాబు రాసి, ప్రక్కింటి పాపతో చిరునామా రాయించి పోస్ట్ బాక్స్ లో వేసి వచ్చింది. పది రోజుల తరువాత దానికి జవాబు రాసింది అర్చన.
    నేల తరువాత ఉత్తరంతో పాటు వెయ్యి రూపాయలు మనియార్డరు కూడా వచ్చింది. పదిరోజుల్లో వస్తానని సామాన్లు సర్ధమని రాసాడు.
    అర్చన సంతోషంతో ఆకాశంలో విహరించసాగింది.
    తను చచ్చిపోవాలని నిర్ణయించుకున్న రోజు రాత్రి అవినాష్ తో పరిచయం అయింది. అతను తెల్లవార్లూ మాట్లాడుతూ కూర్చోవడం వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ఆవకాశం చిక్కలేదు. అందుచేత మరునాటికి ఆ పనిని వాయిదా వేసుకుంది. రెండోరోజు ఏడు గంటలకే వచ్చాడు అతను. ఆ రోజు చాలా విషయాలు చర్చించాడు. తన గురించి వివరంగా అడిగి తెలుసుకున్నాడు.  పరిచయం పెరగడం వల్ల అతని గురించి ఎదురు చూసేది. అలా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం మరుగున పడిపోయింది. పూర్తిగా ఎండిపోయిన చెట్టు చిగురించినట్టు, జీవించాలనే కోరిక మనసులోకి ప్రవేశించింది. బొంబాయి వెళ్ళిన తరువాత క్రొత్త జీవితం మొదలవుతుంది. ఆమెకు తండ్రి, చెల్లెలు గుర్తొచ్చారు. వాళ్ళని చూసి రావాలనే కోరిక మనసులో ప్రవేశించింది. కాని తన గ్రామం వెళ్ళే సాహసం చెయ్యలేకపోయింది.
    ఇంటి అద్దె చెల్లించి తన కోసం కొద్దిగా సరుకులు తెచ్చుకుంది. చిన్న చిన్న సామాన్లు పేక్ చేసింది. రోజలు నెమ్మదిగా గడుస్తున్నాయి. అవినాష్ రాక కోసం చూస్తోంది. ప్రతిరోజూ ఇంటి గుమ్మంలో కూర్చొని ఎదురు చూడటం అలవాటయింది. ఆమె అలా కూర్చోవడం గమనించి, ఉత్తరం రాలేదని చెప్పి వెళుతున్నాడు పోస్ట్ మాన్.
    ఇరవై రోజులు గడిచాయి.
    అర్చనలో దిగులు చోటు చేసుకుంది. కనీసం ఉత్తరమన్నా రాకపోయేసరికి దిక్కుతోచలేదు. తనే రెండు ఉత్తరాలు రాసింది. వాటికి జవాబు రాలేదు. రోజులు మరింత భారంగా గడుస్తున్నాయి. రెండు నెలలు గడిచిన తరువాత మొదటిసారి అవినాష్ మీద అనుమానం కలిగింది. మరో నెల తరువాత ఇల్లు ఖాళీచేసి చిన్న గదిలోకి మారింది. ఆ గది చిరునామా ప్రక్కింటివాళ్ళకి, పోస్ట్ మాన్ కి ఇచ్చింది.
    క్రొత్తగా చేరిన ఇంటి యజమాని ఆమె గురించి తెలుసుకుని, కస్టమ్స్ ఆఫీస్ కి వెళ్ళి వివరాలు తెలుసుకోమని సలహా చెప్పాడు. పదిరోజులు చూసి గత్యంతరం లేక కస్టమ్స్ ఆఫీస్ కి వెళ్ళింది.
    ఆఫీస్ గదిలో ఒక అధికారి కూర్చుని ఉన్నాడు. అతన్ని చూడగానే ఆమెకు ధైర్యం వచ్చింది. అవినాష్ పార్టీ ఇచ్చినప్పుడు ఇంటికొచ్చాడతను.
    "ఏం కావాలి?" అడిగాడు.
    అతను తనని గుర్తుపట్టలేదని గ్రహించింది అర్చన.
    "అవినాష్ నుండి ఉత్తరాలు రాలేదు. మూడు నెలల క్రితం శెలవు తీసుకొని వస్తున్నట్టు రాశాడు..." చెప్పింది.
    మొహం అదోలా పెట్టాడతను.
    "అతని తల్లిదండ్రులను కలుసుకోలేకపోయారా?"
    "వాళ్ళతో నాకు పరిచయం లేదు. ఎక్కడా ఉంటున్నారో కూడా నాకు తెలియదు" చెప్పింది.
    అతను తనని గుర్తుపట్టాడని, ఎందుచేతనో తెలియనట్టు మాట్లాడుతున్నాడని గ్రహించింది అర్చన. పరిచయం లేకపోతే, "మీరెవరు?" అని అడిగేవాడు.
    "దినపత్రిక చదివే అలవాటుందా?"
    "లేదు."
    "అవినాష్ ఉత్తరం రాసి ఎంతకాలమయింది?"
    "మూడు నెలలు దాటింది...."
    "చివరి ఉత్తరం ఎప్పుడొచ్చిందో చెప్పగలరా?"
    అర్చన తల అడ్డంగా ఊపింది.
    అతను నిట్టూర్చి లోపలకు వెళ్ళాడు. పార్టీలో ఎంతో ఉత్సాహంగా ప్రవర్తించిన అతను దానికి భిన్నంగా ఉండడం అర్చనకి ఆశ్చర్యాన్ని కలిగించింది. కనీసం తనని కూర్చోమని కూడా చెప్పలేదు అతను.
    పది నిముషాల తరువాత వచ్చాడతను. అతని మొహం గంభీరంగా ఉంది.
    "ఫిబ్రవరి ఇరవై నాలుగు దినపత్రిక చూడండి..."
    "దేనికి? అవినాష్ ఎక్కడున్నాడో చెప్పండి..." అసహనంగా అడిగింది అర్చన. అతని మీద కోపం వచ్చింది. ఎంతో ఆందోళనతో అక్కడకు వస్తే తిక్క ప్రశ్నలతోను, తిక్క సలహాలతోను సమయం వృధా చేస్తున్నాడు.
    "ఈ వీధి చివర గ్రంధాలయం ఉంది. అక్కడా మీకు పాత దినపత్రికలు దొరుకుతాయి. ఆ పత్రిక చదివిన తరువాత మీకేమయినా అనుమానాలు ఉంటే నా దగ్గరకు రండి. ఈ లోపు నాకో ముఖ్యమైన పని ఉంది. చూసుకుని వస్తాను...." చెప్పి లోపలకు వెళ్ళిపోయాడు.
    చేసేది లేక అక్కడా నుంచి బయటకొచ్చింది అర్చన. అవినాష్ వివరాలు చెప్పడం ఇష్టంలేక తనని లైబ్రరీకి వెళ్ళమన్నాడని తేలిగ్గానే అర్ధమయింది. రోడ్డుపైకి వచ్చిన తరువాత ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఆలోచిస్తూ నడవసాగింది. ఆమె ప్రయత్నం లేకుండానే సందు చివరకి వెళ్ళిన తరువాత కళ్ళు లైబ్రరీ కోసం వెదికాయి. అది కనిపించిన మరుక్షణం లోపలికి నడిచింది.
    "ఏం కావాలండీ?" నిలబడి దిక్కులు చూస్తున్న ఆమెను గ్రంధాలయ ఉద్యోగి అడిగాడు.
    అతని ప్రశ్నకు ఆమె అవాస్తవ ప్రపంచంలోకి వచ్చింది.
    "ఫిబ్రవరి ఇరవై నాలుగు దినపత్రిక కావాలి...."
    "ఏ దినపత్రిక?"
    "ఫిబ్రవరి ఇరవై నాలుగు..."
    "అది కాదు, దినపత్రిక పేరు చెప్పండి...."
    కస్టమ్స్ ఆఫీసర్ పేరు చెప్పలేదు.
    "ఏదో పత్రిక ఇవ్వండి...."
    అతను రాక్ వైపు నడిచి ఓ పేపరు కట్ట అందుకున్నాడు. వెదికి ఆమె అడిగిన దినపత్రిక తీసిచ్చాడు. అది అందుకుని కుర్చీలో కూర్చుంది. రీడర్స్ కొంతమంది ఆమెను ఓ సారి చూసి తిరిగి తమ పనిలో మునిగిపోయారు. గోడకి వ్రేలాడుతున్న గడియారంలో సెకన్లు ముల్లు చురుగ్గా కదులుతోంది.
    అక్షరాలు కూడా బలుక్కుని వార్తలు చదవసాగింది అర్చన. దానిని ఎందుకోసం తను చదువుతున్నదో తెలియకపోయినా చదువుతోంది. గంటన్నర తరువాత మధ్య పేజీలో కనిపించిన చిన్న వార్త చూసి ముందుకి వంగింది.
    బొంబాయి, ఫిబ్రవరి 23 :- బొంబాయి రెడ్ గేట్ సమీపంలో ఒక కారు, మోటార్ సైకిల్ ఢీ కొనడంతో మోటార్ సైకిల్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హాస్పిటల్ కి తీసుకెళుతుండగా మరణించాడు. మరణించిన వ్యక్తి వద్ద దొరికిన వివరాలను బట్టి అవినాష్ అనే పేరు గల కస్టమ్స్....
    ఆ పైన ఆమె కళ్ళు అక్షరాలను గుర్తుపట్టడం మానేశాయి. అలాగే బల్లపైన తల వాల్చేసింది. లైబ్రరీలో ఉన్నవాళ్ళు ఆమె చుట్టూ మూగారు. ఒకతను నీళ్ళుతెచ్చి మొహం మీద జల్లాడు. అర్చన కళ్ళు తెరచి తనని ప్రశ్నిస్తున్న వాళ్ళవైపు కనీసం చూడకుండా బయటకు నడిచింది.
    ఇంటికి చేరి గుండెలు పగిలేలా ఏడ్చింది. తన పట్ల విధి ఎంత కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నదో తలుచుకునేసరికి ఆమె దుఃఖం రెట్టింపయింది. పలకరించడానికి వచ్చిన ఒకామె అర్చనని చాలాసేపు ఓదార్చింది. ఆమె తరచుగా వచ్చి అనునయ వాక్యాలు చెప్పడం వల్ల తొందరగా దుఃఖం నుండి తేరుకుంది. వంటరిగా పడుకుంటే పీడకలలు రాసాగాయి. పెద్దగా అరిచి నిద్రలోంచి లేచి కూర్చునేది. తరచుగా ఇంటి కొస్తున్న ఆ స్త్రీ విషయం తెలుసుకుని పడుకోవడానికి తన ఇంటికి తీసుకెళ్ళింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS