Previous Page Next Page 
యువత నవత పేజి 13

       

    "నాలుగయినా వరిమెతుకులు తింటారుకదా? మల్లెపువ్వుల్లా తెల్లగా వుంటే తప్ప నోటికి పోదుకదా? అసలు, వడ్లు మిల్లుకువేయడం లోనే విటమిన్స్ అన్నీ తవుడులోనే వుంటాయని చాలా మందికి తెలుయదు! డబుల్ పాలిష్ వేయించిన ఆ బియ్యాన్ని  రెండుసార్లు పిసికి  కడుగుతారు. అన్నం పువ్వులా వుండాలని గంజి వారుస్తారు. ఇంకేముంటుంది ఆ అన్నంలో? వట్టి పిసరు. అన్నన్ని డబ్బులుపోసి కొని తెచ్చుకొనే మీరు తినేదేమిటి? సారంలేని పిప్పి!"

    "గంజి వార్చకపోతే అన్నం సంకటి ముద్దయిపోతుందమ్మా! మెతుక్కు మెతుక్కు అంటకుండ వుంటేనే మా మామతింటడు!"

    "గంజివారిస్తే అందులో సారమంతా పోతుందని నచ్చజెప్పాలి మీ మామకు!"చాలా చిన్న చిన్న విషయాలను సైతం యెంతో శ్రద్దతో చెబుతూ వుంటుంది సుధ. "మీ పిల్లలకు బ్రెడ్డు, గుడ్లూ, - పాలు - ఇవన్నీ యివ్వలేకపోవచ్చు మీరు! ఇటువైపు పొలాల్లో రాగులు బోలెడన్ని పండుతాయి? మీకు కూలిక్రిందికి రాగుల్ని వేస్తుంటారుకదా? అవి రొట్టెలుచేసి పెట్టండి. అంబలికాచి త్రాగించండి.  గోధుమపిండి జల్లించి, పొట్టు పారబోస్తుంటారు! అలా పొట్టు పారబోయకండి. పొట్టులో చాలా విటమిన్స్ వుంటాయి!  ఆ పొట్టులో కొద్దిగా పిండి, చక్కెరా కలిపి అప్పలుచేసి యివ్వండి పిల్లలకి చిరుతిండి పెట్టినట్టూ వుంటుంది. బలవర్దకమైన ఆహారం ఇచ్చినట్టూ అవుతుంది."

    "అయన్నీ మాకేం ఎరిక? మీ సదూకున్నోళ్లకి ఎరిక!"

    "మాకు ఎరికున్నవి మీకు చెబితే వినరెందుకు?"

    "ఆయన్నీ చేసుకుంట కూకుంటే పనికిపోను మాకు పొద్దేడవుంటది?"

    "ఆ పనికి పోయేది జానెడు కడుపు నింపుకునేందుకే కదా? ఆ నింపుకునేది మీ ఆరోగ్యాన్ని పరిరక్షించేదిగా వుండాలని మీరెందుకు అనుకోరు! మీ ఇళ్లముందో, ఇళ్ల వెనుకో కాళీజాగా వుంటుంది. దాన్ని ఊరికే పోనివ్వకుండా, కంచె ఏర్పాటుచేసి, నాలుగు కూరపాదులు పెట్టారంటే, మీరు ఆ కారం మెతుకులకు బదులు రోజొక కూరగాయతో భోజనం చేయొచ్చు. కావలసిన కూరగాయల విత్తనాలు మా సమితి నుండి సప్లయిచేస్తాం!"  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS