చంచల్రావు తలుపుమీద మెల్లగా ముని వేళ్ళతో శబ్దం చేసి "లోపలికి రావొచ్చాండీ?...' అన్నాడు.
"రావచ్చు...." అందిందాక అరిచిన గొంతు గట్టిగా.
చంచల్రావు లోపలికి అడుగుపెట్టాడు.
లోపల మంచంమీద నలభై అయిదేళ్ళ వ్యక్తి కూర్చుని వున్నాడు. గది మూల నిలబడి ఓ పడుచుపిల్ల చీర కుచ్చెళ్లు సర్దుకుంటుంది.
ఈ బుద్ధి ముందే వుండక్కర్లేదయ్యా...? ఆ...? అడక్కుండా లోపలికి తొసుకోచ్చేయడమే...!" అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇంతకీ ఎవరు కావాలి?"
"భేతాళరావుగారు కావాలండీ... అన్నాడు చంచల్రావు పడుచుపిల్ల వంక చూస్తూ.
"నేనే భేతాళరావుని!" అమేమో నా సెగట్రీ... హిహి..." అన్నాడు భేతాళరావు సిగ్గుపడ్తూ.
"నేను రచయిత చంచల్రావునండీ... మీరు నన్ను కలవమంటూ ఉత్తరం రాశారు కదా.... అందుకని వచ్చాను...."మెల్లగా చెప్పాడు చంచల్రావు.
"ఓ.... అయితే తమరే నన్నమాట ఆ రచయిత .... తమర్నెప్పుడు సూళ్ళేదులే... కూసోండి... కూసోండి..." అన్నాడు భేతాళరావు మంచానికి ఎదురుగా వున్న కుర్చీని చూపిస్తూ.
"థాంక్సండీ..."
చంచల్రావు ఆ పడుచుపిల్ల వంక చూస్తూ కూర్చున్నాడు.
"ఏటలా సూత్తన్నావ్?.... సెగట్రీ అంటే నమ్మకం కుదర్డంలేదా? ఏ యగస్ట్రానో అనుకుంటున్నావా ఏంది కొంపదీసి?... నా సెగట్రీనే... పేరు లిల్లీ..." అన్నాడు భేతాళరావు పళ్ళికిలిస్తూ.
"అబ్బే... నేను నమ్మకపోవడం ఏటండీ... నమ్ముతున్నాలెండీ.... మీ సెక్రట్రీయేగా..." అన్నాడు చంచల్రావు అనుమానంగా లిల్లీవంక చూస్తూ.
.jpg)
లిల్లీ చీర సర్దుకోవడం పూర్తయింది.
"రా లిల్లీ...కూర్చో...." అన్నాడు భేతాళరావు.
లిల్లీ వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి భేతాళరావు ఒళ్ళో కూర్చుంది.
"ఏటిదీ పరపురుషుడి ఎదు
రుగా కూర్చోవడం.... లే... లేసి పక్కన కూర్చో ...విసుక్కున్నాడు భేతాళరావు.
"పోనీ ఆయనకి చిరాగ్గా ఉంటే మీరు నా ఒళ్ళో కూర్చోవచ్చు..." అన్నాడు చంచల్రావు మొగమాటంగా.
లిల్లీ చంచల్రావువైపు వయ్యారంగా రెండడుగులు వేసింది.
"ఏయ్...ఏటే అది?.... రమ్మనగానే ఎల్లిపోవడమే... అక్కడే కూర్చో.... ఏంటయ్యా నీ వాలకం సూత్తంటే నీకు సినిమాశాన్సు అక్కర్లేదులా వుంది..... కొరకొరా చూస్తూ అన్నాడు భేతాళరావు.
చంచల్రావు నాలుక కొరుక్కుని చెంపలేస్కున్నాడు.
"క్షమించండి... మీకు ఇబ్బంది లేకుండా చూద్దామనే అలా అన్నానుగానీ వేరే దురుద్దేశం ఏమీ లేదండీ..."
లిల్లీ భేతాళరావు పక్కన కూర్చుంది.
"చాలాకాలం నుంచీ నా దగ్గర సెగట్రీగా పంజేస్తుంది కదా... అందుకే కూసింత ననువొచ్చి అలా నా ఒళ్ళో కూర్చుంటా వుంటాది... హిహిహి... సంజాయిషీ ఇచ్చుకుంటూ అన్నాడు భేతాళరావు.
"చనువొస్తే అంటే కదండీ మరి?... ఈ వేళ నేను మీకు పరిచయం అయ్యానా....? రేపు మళ్ళీ కలిశామనుకోండి... ఆనక ఎల్లుండి ఇంకోసారి కలిశామనుకోండి... అలా మాటిమాటికి కలుస్తున్నామనుకోండి... అప్పుడు నాకూ చనువొస్తుంది..." అన్నాడు చంచల్రావు సంబరంగా.
"అంటే నువ్వు కూడా నా ఒళ్ళో కూర్చుందామనా?... ఏంటి నీ ఉద్దేశం?.... ఆ ?..." న్నాడు భేతాళరావు కోపంగా చూస్తూ.
ముందు చంచల్రావు ఆనందంగా అవునన్నట్టు తల ఊపి తరువాత భేతాళరావు ముఖం చూసి నాలుక్కొరుక్కుని చెంపలేస్కున్నాడు.
"క్షమించండి... ఏదో పొరబాట్న అన్నాను."
"ఊ... ఇంతకీ నిన్నెందుకు పిలిపించానో తెల్సా?... అన్నాడు విలాసంగా కాలుమీద కాలేసి ఊగిస్తూ భేతాళరావు.
"తెలుసండీ... మీరు తీయబోయే సినిమాకి కథ కావాలి! అంతే కదా"
అన్నాడు చంచల్రావు బ్యాగ్ జిప్ తెరుస్తూ.
.jpg)
"ఏంటది... అదెందుకు తెరుస్తున్నావ్?" కంగారుగా అడిగాడు భేతాళరావు.
"దీన్నిండా నే వ్రాసిన కథలు తెచ్చానండీ. మీకు వినిపిద్దామనీ" ఉత్సాహంగా చెప్పాడు చంచల్రావు.
భేతాళరావు ఘొల్లున నవ్వాడు. లిల్లీ కిచకిచా నవ్వింది.
చంచల్రావు తెల్లబోయి చూశాడు.
