పది నిమిషాలకోసారి ఎవడో ఒకడు అడుగుతూనే ఉన్నాడు.
ఇంటికి వెళ్ళాక నాకోసం గుమ్మంలో చంచల్ర్రావు ఎదురుచూస్తూ కనబడ్డాడు.
నాకు చిర్రెత్తుకొచ్చింది.
"అడిగావంటే తంతా" అన్నాను రూమ్ తాళంతీస్తూ.
చంచల్రావు నవ్వాడు.
"ఎందుకురా అంతకోపం ... నేనేం డబ్బులు అప్పు ఇవ్వమని అడగడానికి రాలేదు...నీకు యాక్సిడెంటు అయ్యిందని ఎవరో చెప్తే చూద్దామని వచ్చాను... అవునూ ఎలా అయ్యింది?" అన్నాడు కట్లవంక జాలిగా చూస్తూ.
నేను స్పృహతో కుప్పకూలిపోయాను.
వారం రోజులపాటు ఇలా నరకయాతన అనుభవించాను అందరికీ చెప్పలేక.
వారం తరువాత నా కట్లు విప్పేశారు. నేను తేలికగా ఊపిరి పీల్చుకున్నాను.
ఇంక ఒంటిమీద కట్లు కనిపించవు కాబట్టి ఎవరూ యాక్సిడెంటు గురించి అడగరు. కట్లు విప్పేశారు కబతీ ఆ రోజు ఆఫీసుకి స్కూటర్ మీద వెళ్ళాను.
నా సెక్షనులో పని చేసుకుంటుండగా నా దగ్గరికి పక్క డిపార్టుమెంట్లోని విశ్వనాథం వచ్చాడు.
"నేను పదిరోజుల క్రితం ఊరెళ్ళాను. ఈ వేళే జాయిస్ అయ్యాను. రాగానే చెప్పారు... నీకు పోయినవారం యాక్సిడెంటయిందటగా? ఎలాగయింది?"
నేను కోపంతో, బాధతో భయంకరంగా అరిచాను.
"ఈ......."
.jpg)
విశ్వనాథం తెల్లబోయాడు.
"పాపం.... యాక్సిడెంటువల్ల మతి స్థిరం కాస్త తప్పినట్టుంది...." అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
ఇంక ఆ రోజంతా ఆఫీసులో వారం రోజులుగా రానివాళ్ళు "నీకు యాక్సిడెంట య్యిందటగా మేం ఆఫీసులో లేనప్పుడు. ఎలాగయింది" అని అడగడం మొదలు బెట్టారు. నాకు పిచ్చెక్కిపోయింది.
సాయంత్రం స్కూటర్ మీద ఇంటికెళ్తున్నాను.
వెధవలు... నాకు యాక్సిడెంటయితేనేం... ఛస్తేనేం వీళ్ళకెందుకు? ప్రతి ఒక్కడికి వివరాలు కావాలి. ఆఫీసులో ఇంతసేపూ చంపుకుతిన్నారు. తరవాత ఇంటికెళ్ళాక కాలనీలో చంపుకు తింటారు.... బజార్లో ఎక్కడ కనబడితే అక్కడ తెలిసిన వాళ్ళందరూ అడుగుతారు... ప్రాణాలు తీస్తారు.... ఛీ....
కోపంతో జుట్టుపీకున్నా స్కూటరు హాండిలు వదిలేసి... అలా రెండుక్షణాలే అంతే...
ఎదురుగుండా లారీ దూసుకువస్తోంది. మరో పక్కనుండి ఈసారి పంది అడ్డువచ్చింది. గబుక్కున హాండిలు పట్టుకున్నా.... బ్యాలెన్సు తప్పింది....
"క్రీ....ఈ...ష్...."
* * *
నేను మెల్లగా కళ్ళు తెరిచాను.
నేను ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాను, నా చుట్టూ...
నా పరిచయస్తులు, ఆఫీసుస్టాఫ్ నా ముఖంలోకి ఆతృతగా చూస్తున్నారు.
యాక్సిడెంటు ఎలాగయిందో తెలుసుకుందామని....
సినిమాకో కథకావాలి!
చంచల్రావు ద్వారకా హోటలు ముందు ఆటో దిగాడు. ఆటోవాడికి డబ్బులిచ్చి జేబులోంచి ప్రొడ్యుసరు భేతాళరావు రాసిన ఉత్తరం తీసి ఓ మారు దానివంక చూశాడు. రూమ్ నెంబరు నూట పదకొండులో శుక్రవారం రోజు తనని కలవవలసిందిగా భేతాళరావు రచయిత చంచల్రావుకు ఉత్తరం రాశాడు.
చంచల్రావు జిప్ చంకలో ఇరికించుకుని రూమ్ నెంబరు నూట పదకొండు ముందు ఆగాడు.
తలుపు దగ్గరగా వేసి వుంటే మెల్లగా తోశాడు.
"ఎవడ్రావాడు..." అంటూ భయంకరమైన కేక వినిపించడంతో కంగారుపడి వెనక్కి వచ్చేసి తలుపు దగ్గరికి మూసేసి డోరుమీద నెంబరు చూశాడు.
నూట పదకొండు అనే వుంది!
కొంపదీసి నూట ఒకటికానీ కాదు కదా?"
జేబులోంచి మళ్ళీ ప్రొడ్యూసరు భేతాళరావు రాసిన ఉత్తరం తీసి చూశాడు. అందులో రూమ్ నెంబరు నూటపద కొండులోనే వుంటున్నట్టు ఉంది.
అప్పుడు చంచల్రావుకి మరో గొప్ప సందేహం వచ్చింది.
కారిడార్లో వెళ్తున్న సర్వర్ని ఆపి "ఇది అసలు ద్వారకా హోటలేనా?" అని అడిగాడు.
"ద్వారకా హోటలు అవునో కాదో తెలుసుకోకుండా లోపలికెందుకు వచ్చారు? ద్వారకానే!!..." అన్నాడు సర్వరు అదో మాదిరిగా చూస్తూ.
