ముసలివాణ్ణి
నాకు కలలో కనిపించును
డాక్టరు స్టెతస్కోపు
విరిగిన బాతుమెడ
దున్నపోతులు
నా భార్య శవం
ముసలివాణ్ణి నాయనలారా
ముసలివాణ్ణి
చివరకు చివరకు అక్కడికే అక్కడికే
అది జీవిత పరమసత్యం
అది నాగరికత గమ్యస్థానం
అది చరిత్రల సారాంశం
అక్కడి చీకటి లోతెరుగని చీకటి
దట్టపు చీకటి
సుడి తిరిగే చీకటి
పాములు బుసకొట్టే చీకటి
తుది ఊపిరి మసలే
అక్కడికే అక్కడికే వెళ్ళబోయే
ముసలివాణ్ణి నాయనలారా
ముసలివాణ్ణి నాయనలారా
ముసలివాణ్ణి
* * *
---1943
సైనికుడి ఉత్తరం
ఇక్కడ నేను క్షేమం - అక్కడ నువ్వు కూడా
ముసలి అమ్మా, పాత మంచంకోడూ
మన చిన్నబ్బాయి, చెరువులో కొంగా.......
ఇపుడు రాత్రి, అర్ధరాత్రి
నాకేం తోచదు నాలో ఒక భయం
తెల్లని దళసరి మంచు రాత్రి చీకటికి అంచు
దూరంగా పక్కడేరాలో కార్పొరల్ బూట్స్ చప్పుడు
ఎవరో గడ్డిమేటి మీదనుంచి పడ్డట్టు----
నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక
చచ్చిన జీవుల మొరలా వుంది.
అబ్బ చలి! నెత్తురు చల్లబడే చలి!
పొడుగాటి చుట్టకాల్చినా
లిండెల్ (రూపాయి దాని పాపం ఖరీదు)
లిండెల్ గుండెల్ హత్తుకున్నా
దాని సారానోరు నీరు తాగినా ఈ చలిపోదు.
పోదు నాలో భయం మళ్ళీ రేపు ఉదయం
ఎడార్లూ నదులూ అరణ్యాలూ దాటాలి.
ట్రెంచెస్ లో దాగాలి
పైన ఏరో ప్లేను, చేతిలో స్టెన్ గన్
కీ యిస్తే తిరిగే అట్టముక్క సైనికులం
మార్చ్!
వన్ టూ త్రీ షూట్ డెడ్ ఎవడ్
నువ్వా నేనా
కేబుల్ గ్రాం యిప్పించండి కేరాఫ్ సో అండ్ సో
(మీ వాడు డెడ్.)
స్పృహ తప్పిన ఎనేస్తిషియాలో
వెన్నెముక కర్రలా బిగిసింది
యుద్ధం యుద్ధం
లిబియాలో బెర్లిన్ తో స్టాలిన్ గ్రాడ్ లో
స్వార్ధం పిచ్చికుక్కలా పరుగెత్తింది.
