Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 13

 

                               తులసీ సౌరభం

    మీ కరకమలాలను అలంకరించిన గ్రంధం శ్రీ తులసీ రామాయణం. ఇది  హిందీ భాషలో శ్రీగోస్వామి తులసీదాస మహాకవి రచించిన "రామచరిత మానసం" అనే మహాగ్రందానికి తెలుగు అనువాదం. అనువాద కర్తలు శ్రీ మిట్టపల్లి ఆదినారాయణ గుప్త గారు. శ్రీ గుప్త గారు సంపన్నులు మాత్రమే కాక సదాచార సంపన్నులు. సౌజన్య మూర్తులు. శ్ర్రీరామ భక్తులు. నిరాడంబర జీవనులు . సహస్రచంద్ర సందర్శన సౌభాగ్య సమేతులు.

        'చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం
        ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతకనాశనమ్."
    శతకోటి శ్లోకాలలో విరాజిల్లే శ్రీరాముని చరిత్రం అంతటి పవిత్రమైనది. అందలి ఒక్కొక్క అక్షరమూ సమస్త పాపాలను పటాపంచలు చేస్తుంది.

        "వేదవేద్యే పరే పుంసి జాతే దశరాధాత్మజే
        వేదః ప్రాచేతసా దాసీత్ సాక్షాద్రామాయణాత్మనా."
    "వేదవేద్యుడైన ఆ పరంధాముడు శ్రీరాముడుగా భూమి మీద జన్మించాడు. పురుషోత్తముడు ఉత్తమ పురుషుడుగా ఉర్విపై ఉద్భవించే సరికి నాదాత్మకమైన వేదం ఆదికవి వాల్మీకి సువర్ణ లేఖిని నుండి రసాత్మకమైన రామాయణంగా ఆవిర్భవించింది. ఈ విధంగా ఆధ్యాత్మికమైన పరబ్రహ్మ స్వరూపం ఆదర్శమానవత్వాన్ని అంగీకరించి దివి నుండి భువికి దిగివచ్చింది. శ్రుతి రామాయణకృతితో క్షితి మీద అవతరించింది. వాల్మీకి మహాకవి అనంతరం అనంత కళ్యాణ గుణాభిరాముడైన శ్రీరాముణ్ణి నాయకుణ్ణిగా స్వీకరించి ఎందరో మహాకవులు తమతమ భాషల్లో రామయణాలను రచించారు. అయితే వాల్మీకి రామాయణం తర్వాత మళ్ళీ అంతటి ప్రతిష్ట సంపాదించిన మధురాతి మధురమైన మహాగ్రంధం తులసీ రామాయణమే. అనటంలో అతిశయోక్తి అణు'మాత్రమూ లేదు.
    తులసీరామాయణం సకలకలికల్మషహరం. సమస్త సౌభాగ్య సందాయకం. సహృదయ హృదయంగమం. భక్తీజ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమం. రసభరితమైన రఘుకుల తిలకుని రమణీయ  చరిత మది.
    తులసీదాసు రచించినందువల్ల రామచరిత మానసాన్ని "తులసీ రామాయణం" అని కూడా పిలుస్తారు. తెలుగువారికి బమ్మెర పోతన భాగవతం వలె, కన్నడులకు పంప భారతం వలె, తమిళులకు కంబరామాయణం వలె, హిందీ వారికి తులసీ రామాయణం అత్యంత ప్రియమైన నిత్య పారాయణ గ్రంధం.
    పార్వతీ పరమేశ్వర సంవాద రూపమైన తన రామాయణానికి తులసీ దాసు "రామచరిత మానసం" అని పేరు పెట్టాడు. పరమశివుడు భద్రంగా తన మానసంలో నిక్షేపించుకొన్న రామచరితం కనుక "రామ చరిత ,మానసం" అనే నామం ఉంచబదిందని తులసీదాసు వక్కాణించాడు.
    అంతేకాక తులసీదాసు దృష్టిలో తాను రచించిన రామ చరితం ఒక మానస సరోవరం. వేదపురాణాలు సముద్రాలు, సాధుపురుషులు మేఘాలు. రాముని సద్యశమే వర్షం. అటువంటి సజ్జనమేఘాలు సముద్రంలో నుంచి కొనివచ్చి వర్షించిన మంగళకరమధుర మనోహర జలాలతో ఈ మానస సరోవరం నిండి ఉన్నది. అలంకారాలే తరంగాలుగా, చౌపాయి దోహామొదలైన ఛందస్సులే రంగురంగుల కమలాలుగా ఈ సరోవరంలో విరాజిల్లుతున్నవి. ఈ విధంగా కూడా "రామచరిత మానసం" అనే నామం తన గ్రంధానికి సార్ధకం అని తులసీదాసు భావించాడు.
    తులసీదాసు మహాభక్తుడు. మహాతపస్వీ, మహాకవి. కారణ జన్ముడు. లోకజ్ఞుడు. ఆ మహానుభావుడు వాల్మీకి రామాయణం 'ఆధ్యాత్మరామాయణం" ఆనంద రామాయణం- అత్యాది మహాగ్రందాల నుండి హనుమన్నాటకం , అనర్ఘరాఘవం, ప్రసన్నరాఘవం మొదలైన సంస్కృత నాటకాల నుండీ రసవంతాలూ, రమణీయాలూ అయిన సన్నివేశాలను ఎన్నింటినో ఎన్నుకొని ఏర్చి కూర్చి తీర్చి దిద్ది తన రామచరిత మానసాన్ని రసజ్న మనోజ్ఞంగా రచించాడు. అందుకనే తులసీ రామాయణం ప్రసన్న మధురమై, పరమపవిత్రమై భక్తీరసాయనమై, బహుజన ప్రియమై భారతీయులకు పారాయణ గ్రంధమైంది. వాల్మీకి మహర్షి నారాయణునిలోని నరుణ్ణి దర్శిస్తే తులసీదాసు నరునిలోని నారాయణున్ని దర్శించారు.
    తులసీరామాయణం అనేక భాషలలోనికి అనువదించబడింది. సంస్కృతం, మరాఠీ, గుజరాతీ భాషలలో తులసీరామాయణానికి అనువాదాలు పెక్కులు వెలువడ్డాయి. ఒరియా భాషలో నాలుగు అనువాదాలూ బెంగాలీ బాషలో మూడు అనువాదాలూ అవతరించాయి. మన తెలుగు బాషలో ఏడెనిమిదివరకు గద్య పద్యానువాదాలు వెలసినాయి. భారతీయ భాషలలోనే కాకుండా ఇంగ్లీషు బాషలోకి కూడా ఈ మహాగ్రంధం అనూదితమైంది. ఇటీవల రష్యన్ భాషలోకి సైతం రూపాంతరం పొందిందంటే తులసీరామాయణం ఎంత గొప్ప గ్రంధమో , ఎంతటి ప్రజానురాగం చూరగొన్న మహాకావ్యమో మనం తెలుసుకోవచ్చు.
    తులసీరామయణాన్నీ భారతదేశీయులు పరదేశీయులు కూడా ఎన్నో విధాల ప్రశంసించారు.
    "పరమ పవిత్రమైన తులసీ రామాయణం భక్తుల పాలిటి పారిజాతం. ఇది హిందువులకు వేదం వంటిది. ముస్లిములకు పవిత్ర ఖురాను వంటిది" అన్నాడు మహాకవి రహీం.
    "తులసీరామాయణం పండిన పురుషార్ధ ఫలాలతో నిండిన కల్పవల్లి, కామధేనువు పొదుగులో నుండి పొంగి ప్రవహించే పాలవెల్లి. దీని మాధుర్యం చక్కెరను వెక్కిరిస్తుంది. కలకండను చూచి కిలకిల నవ్వుతుంది. ఇక్షురసాన్ని ఎగతాళి చేస్తుంది. అమృతాన్ని సైతం అపహసిస్తుంది అన్నాడు మహాకవి రసఖాన్.
    "పవిత్రమైన ప్రయాగలో త్రివేణీసంగమం వలె భక్తీ జ్ఞాన వైరాగ్యాల సమన్వయ వాహిని తులసీరామాయణం, కడచిన నాలుగు శతాబ్దాలుగా కోట్లాది ప్రజలకు పారాయణగ్రంధమైన ఈ మహాగ్రంధం ప్రపంచం ఉన్నంత వరకు కోటానుకోట్ల భారతీయులకు ఆరాధ్యం అవుతుందనడంలో అణుమాత్రం అనుమానింపవలసిన పనిలేదు" అన్నాడు. మదన మోహన మాలవ్యా.
    "తులసీరామాయణం హిందీ సాహిత్య సరస్వతికి కలికితురాయి వంటిది. తులసీదాసుగారి భక్తీ విశ్వాసాలు అనన్య సామాన్యమైనవి. ఆ భక్తీ విశ్వసాలే ఇంత గొప్ప గ్రంధాన్ని భారతీయులకు ప్రసాదించాయి. భగద్గీత, రామచరిత మానసం రెండూ మానవజాతికి సంప్రాప్తించిన సారస్వత వరప్రసాదాలు' అన్నాడు మహాత్మాగాంధీ.
    "తులసీదాసు మధురమైన శైలిలో , సరళమైన భాషలో పల్లె పల్లెనా , వీధి వీధినీ ఇంటింటా, ఏమీ తెలియని మూర్ఖుడు కూడా తెలుసుకొని తరించే లాగున అనేకమైన పరమార్ధ విషయాలను తన రామాయణం నిండా వెదజల్లాడు ." అన్నాడు బాబూ రాజేంద్రప్రసాద్.
    "సంస్కృతంలో వాల్మీకి మహాకవీ, హిందీలో తులసీదాసూ ఆచంద్రతారార్కం అమృతాన్ని చిందిస్తూ ఆనందాన్ని అందిస్తూ ఉండే మహా కావ్యాలను మనకు ప్రసాదించారు. అన్నాడు సి.వై చింతామణి.
    "సమకాలపు కవులందరిలో తులసీదాసుడే అగ్రతాంబూలం. అయన వంటి సారస్వతతపస్వీ నభూనభాష్యతి" అన్నాడు విన్సెంట్ స్మిత్.
    "రామచరిత మానసం తులసీదాసు గారి ఉత్తమోత్తమ సృష్టి, ఉత్తర భారత దేశంలోని హిందువులలో ప్రతి ఒక్కరికీ ఈ గ్రంధాన్ని గురించి తెలిసినంతగా ఆంగ్లేయులకు బైబిలును గురించి కూడా తెలియదు" అన్నాడు డాక్టర్ గ్రియర్ సన్.
    ఈ విధంగా ఎందరెందరో స్వదేశీయుల చేత, విదేశీయుల చేత విశేషంగా కొనియాడబడిన అమర కృతి తులసీరామాయణం.
    ఇటువంటి రామాయణాన్ని రచించిన తులసీదాస మహాకవిని మధుసూదన సవస్వతి అనే మహాపండితుడు ఈ విధంగా ప్రశంసించాడు.

        "ఆనంద కాననే హ్యస్మేన్ జంగమస్తులసీతరుః
        కవితా మంజరీ యస్య రామభ్రమర భూషితా."
    ఈ కాశీ మహాక్షేత్రంలో ఈ అనందవనంలో తులసీదాసు నడయాడుతూ ఉన్న తులసీ తరువు. ఈయన కవితా సుమగుచ్ఛము శ్రీరాముడనే భ్రమరముతో అలంకృతమైనది.
    ఈ మహగ్రంధాన్నిఇంతకూ ముందు శ్రీ భాగవతుల నరసింహశర్మగారు తెలుగులో పద్యకావ్యంగా అనువాదించారు. అలాగే శ్రీ మైలవరపు సూర్యనారాయణమూర్తిగారు కూడా పద్య రూపంగానే ఆంధ్రీకరించారు. శ్రీమతులు యేలురిపాటి లక్ష్మీసరస్వతి, నేలనూతల పార్వతీ కృష్ణమూర్తి శ్రీ శ్రీనివాస శర్మ గద్యంలోకి అనువదించారు. ఇటీవలనే శ్రీ కేశవతీర్ధస్వామి , శ్రీ పోటీలు తిమ్మారెడ్డి - ఉభయులూ కలిసి "శ్రీ రామచరిత మానసం" అనే నామంతో తులసీ రామాయణాన్ని సర్వాంగ సుందరమైన ద్విపద కావ్యంగా దిద్దితీర్చారు.
    ఇక ఇప్పుడు 'తులసీరామ" బిరుద విరాజుతులు, శ్రీరామ భక్తులు అయిన శ్రీ మిట్టపల్లి ఆదినారాయణ గుప్త గారు సరళ సుందరమైన భాషలో దీనిని తెనిగించి తమ జన్మను చరితార్ధం చేసుకొన్నారు. శ్రీ గుప్తగారు సేవాపరాయణులు , దీక్షా తత్పరులు  అనేక స్థలములలో , సభలలో , సమాజములలో , దైవ మందిరములలో , ఆశ్రమ వాటికలలో తులసీదాసు గారు రచించిన "శ్రీ రామచరిత మానసము" ను పురాణ ప్రవచనము చేసి వేలాది భక్తుల మన్ననలను పొందినవారు. మహాత్ముల, మహా విద్వంసుల ఆశీస్సులను అందుకొన్నవారు. వీరు పండిత, పామరులకు అర్ధమయ్యేటట్లు సరళ గ్రాంధికంలో ఆంధ్రికరించి ఈ విధంగా ఈ మహాకృతిని భక్త జనులకు బహూకృతిగా అందించటం అత్యంత ముదావహం.
    సకల జగజ్జననీ జనకులైన ఉమామహేశ్వరులు - విశ్వ కళ్యాణ దంపతులైన సీతారాములు ఏతత్ కృతి నిర్మాతలైన శ్రీ ఆదినారాయణ దంపతులకూ తులసీరామాయణ ప్రచారకులకూ పౌరాణికులకూ శ్రోతలకూ పాఠకులకూ సమస్త సౌభాగ్యములు కటాక్షింతురుగాక!

        పరమేశ్వరుడు మున్ను పార్వతీదేవికి
                     వినిపించినట్టి పావన చరిత్ర
        కాకభుశుండి లోగడ గరుత్మంతున
                      కెరిగించినట్టి సుందర చరిత్ర
        యాజ్జవల్క్య మహర్షి యల భరద్వాజున
                       కానతిచ్చిన మనోహర చరిత్ర
        మొదమ్ముమై తులసీదాస సుకవి భ
                        క్తులకు దేల్పిన మహోజ్జ్వల చరిత్ర
        త్రిభువన పవిత్రమగు రఘుప్రభు చరిత్ర
        వ్రాసే నేనుబది రెండేండ్ల వయసు వాడు
        మేలి గుణముల జాబిల్లి మిట్టపల్లి
        ఆదినారాయణఖ్యా మహోదయుండు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS